Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

గాడిద..ఎప్పటికీ గాడిదే!!

Panchatantram

అనగనగా ఒక గ్రామంలో ఒక మహా పిసినారి అయిన చాకలివాడు ఉండేవాడు. వాడి దగ్గర, ఉతకాల్సిన బట్టలు చాకిరేవుకు మోసుకుని వెళ్ళడానికీ, ఉతికిన బట్టలు చాకిరేవు నుంచి మళ్ళీ ఇంటికి తీసుకుని రావడానికీ, ఒక గాడిద ఉండేది.

ఎక్కడ తన డబ్బులు ఖర్చయిపోతాయోనని అంత చాకిరీచేస్తున్న గాడిదకు ఆహారం కూడా సరిగ్గా పెట్టడానికి మనస్కరించేది కాదు చాకలివాడికి. కానీ సరైన ఆహారం లేకపోతే గాడిద చాకిరీ చేయలేదని తెలుసు. అందుకని ఒక ఉపాయం ఆలోచించాడు.

ప్రక్కనే ఉన్న అడవి అంతా గాలించి ఒక చచ్చి పడి ఉన్న పులి చర్మం తీసుకొచ్చి గాడిదకు తొడిగి ఒక పంట చేనులో వదిలేసాడు. ఆ పొలం రైతు దాన్ని చూసి పులి వచ్చిందని భయపడి పారిపోవడంతో గాడిద యథేచ్ఛగా పంట కడుపారా ఆరగించసాగింది.

ప్రతి రోజూ ఇలాగే  జరుగుతుండడం, చేతికి వచ్చిన తన పంట నాశనమవుతుండడం చూస్తూ రైతు దుఃఖంలో మునిగిపోయాడు.

‘ఇంకా ఇలాగే చూస్తూ ఊరుకుంటే లాభంలేదు. ఎలాగైనా పులి బాధ వదిలించుకుని మిగిలిన పంటనైనా కాపాడుకోవాలి’ అని నిశ్చయించుకున్నాడు.

ఒకనాడు చీకటిపడే ముందే విల్లు, బాణం తీసుకుని, ఎవరికీ కనపడకుండా, పైన గాడిద ఒంటి రంగులాంటి గుడ్డ కప్పుకుని, పొలాన్ని ఆనుకుని ఉన్న గుబురు పొదలలో నక్కి కూర్చున్నాడు.

చీకటి పడగానే రోజూ లాగే చాకలివాడు గాడిదని తెచ్చి రైతు పంట చేనులో వదిలి వెళ్ళిపోయాడు. గాడిద చేను మేస్తూ మేస్తూ ముసుగు కప్పుకుని ఉన్న రైతుని చూసి తనలాంటి మరో గాడిద అనుకుని ఆనందంపట్టలేక తన సహజ నైజంతో గట్టిగా ఓండ్ర పెట్టింది.

‘ఓరి..ఓరీ! ఇది పులి కాదు, పులి తోలు కప్పుకున్న గాడిదన్నమాట. ఎంత మోసపోయానూ ఇన్నాళ్ళూ? అయినా ఎంత పులి తోలుకప్పుకున్నా గాడిద ఎప్పటికీ గాడిదే కానీ పులి కాలేదుగా!!

దీని సంగతి ఇప్పుడే తేలుస్తాను’ కోపంగా మనసులో అనుకున్నవాడై విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం సంధించి గాడిదను కుప్పకూల్చాడు.

నీతి: వేషం మార్చి మోసం చేయాలని చూసినా ఎప్పటికైనా అసలు నైజం వెల్లడై నిజం బయటపడక తప్పదు.

Posted in June 2019, బాల్యం

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!