Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

సంధ్య మావగారి రాక కోసం ఎదురుచూస్తోంది. అనిరుద్ నచ్చాడో, లేదో చెప్పలేదు స్మరణ. అసలు ఆ విషయం మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదు. తను మాట్లాడడం లేదు. ఏమి జరగనట్టు స్నేహితులో, పరిచయస్తులో ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్లినట్టు చాలా క్యాజువల్ గా తీసుకుంది.

ఆ రాత్రి దీపక్ ని అడిగింది సంధ్య “ఏమన్నా చెప్పిందా మీ కూతురు”

“దేని గురించి” అడిగాడు నిర్లిప్తంగా..

సంధ్యకి తిక్కరేగింది. “దేని గురించి ఏంటి? అన్నీ నేనే మాట్లాడాలా? ఆ అబ్బాయి నచ్చాడో, లేదో మీరు అడగచ్చుగా..” కస్సుమంది.

ఓ పక్కకి తిరిగి పడుకున్న దీపక్ వెల్లకిలా పడుకుని గిర, గిరా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ కేసి చూస్తూ “నీకు, నాకు అది ఏమి చెప్పదు.. వదిలేయ్ ...ఇంకా ఒక్క రోజు ఆగితే మా నాన్న వస్తాడు కదా! ఆయన మాట్లాడతాడు..నువ్వు మరీ అదే ధ్యాసగా ఉండకు.. ఆఫీస్ పని మీద అసలు ఏమన్నా ధ్యాస పెడుతున్నావా..”

నిప్పుల్లో వేసిన ఎండు మిరపకాయలా చుర, చురలాడుతుంది అనుకున్న భార్య మౌనంగా ఉండడంతో ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూసాడు.. సంధ్య నిశ్శబ్దంగా ఏడుస్తోంది.

దీపక్ హతాశుడైనాడు.. “ఏమైంది? ఎందుకేడుస్తున్నావు?” అడిగాడు.

సంధ్య వెక్కుతూ అంది...“మీకేం తెలుసు నా బాధ.. నేనే కాదు ప్రతి ఆడపిల్ల తల్లి ఈ వినాశ “కాలాన్ని” చూస్తూ ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచీ ఆ పిల్లని కాపలా కాస్తూ, టెన్షన్ గా, దిన, దిన గండం దీర్ఘాయుష్యంగా బతకాల్సి వస్తోంది. మా రోజుల్లో కొంత వయసు తరవాత పెళ్లి కాకపొతే ఈ పిల్ల గుండెల మీద కుంపటి అయింది అనుకునే వాళ్ళేమో! కానీ ఇప్పుడు ప్రతి క్షణం ఆడపిల్లలని గుండెల మీద కుంపట్ల లాగే భావించాల్సిన దౌర్భాగ్య స్థితి వచ్చింది. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అని భావించి అపురూపంగా పెంచుకుంటున్న తల్లులు బయటకి వెళ్తే ఏమవుతుందో అని మానసికంగా ఎంత నరకం అనుభవిస్తున్నామో ఎలా తెలుస్తుంది మీకు? తెల్లారి లేచిన దగ్గరనుంచీ ఎలాంటి వార్తలు వింటున్నాము. ఆడపిల్లలకి రక్షణ లేకపోవడం ఒక ఎత్తు అయితే, ప్రేమ వ్యవహారాలు ఒక ఎత్తు.. ప్రేమ గుడ్డిది అనే సామెత ఎంత నిజమో అర్థం కావడంలేదా.. ప్రేమించడం మా ప్రాధమిక హక్కు అని వ్యక్తిగతమైన, కుటుంబపరమైన వ్యవహారాన్ని సమాజపరం చేస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. కని పెంచిన తల్లి,తండ్రులకన్నా, ప్రేమించిన వాడే ఎక్కువ అయి, తల్లి, తండ్రులు కాదంటే వాళ్ళని చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు.. స్మరణ ప్రేమిస్తుందని నాకు భయం లేదు.. ఏ కులం వాడిని ప్రేమించినా అభ్యంతరం లేదు.. కానీ ప్రేమించిన వాడు మంచివాడు, సంస్కారవంతుడు, విద్యావంతుడు అయి ఉండాలి కదా! ఇవాళ ప్రేమించి, మొత్తం ప్రపంచంలో వాడే నాకు ముఖ్యం అని వెళ్ళిపోయి, ఆరునెలల్లో విడాకులు అంటూ మన దగ్గరకు వస్తే!”

దీపక్ కి ఆమె మనసు, ఆ మనసులో ఉన్న భయం అర్థమైంది. పిచ్చిది.. తల్లులకు మాత్రమేనా ఆందోళన... తండ్రులకీ ఉంటుంది... కానీ వీళ్ళు బయటపడతారు. తండ్రులు బయటపడితే బాగుండదు కాబట్టి బయటపడరు. ఆడవాళ్ళు కాబట్టి నలుగురు చేరితే, ఒక వయసు వాళ్ళయితే సినిమాలు, డ్రెస్ లు, బాయ్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. సంధ్య వయసు ఆడవాళ్ళు మాట్లాడుకోడానికి  కుటుంబ విషయాలు, పిల్లల విషయాలు తప్ప ఏముంటాయి? మగవాళ్ళ లాగా దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు, క్రికెట్ మ్యాచ్ లు కాదు.. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్ల రక్షణ అనేది బర్నింగ్ టాపిక్ అయింది కాబట్టి  తల్లులంతా ఇదే విషయాలు చర్చిస్తూ మనసులు పాడు చేసుకుంటున్నారు. తన కోలీగ్స్ లో కూడా ఆడపిల్లల తండ్రులున్నారు.. వాళ్ళు ఇలాంటి వార్తలు విన్నాక మరునాడు ఆ ప్రస్తావన తీసుకువచ్చి భయం వ్యక్తం చేస్తారు.. అదేపనిగా ఒకటే విషయం మాట్లాడుకోకపోవడం అనేది మగవాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్..

గాఢంగా నిట్టూర్చి సంధ్య మీద చేయి వేసి దగ్గరగా తీసుకుని ఓదార్పుగా అన్నాడు. “నువ్వు భయపడడంలో తప్పులేదు సంధ్యా! కానీ నీ భయాన్ని స్మరణలో ఇండ్యుస్ చేయకు. నీకు తెలియనిదేముంది చెప్పు.. నువ్వు చదువుకుని ఉద్యోగం చేయడం లేదూ.. అలాగే అందరాడపిల్లలు చదువుకోవాలి... ఉద్యోగాలు చేయాలి.. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడమే కాదు.. మరి కొందరికి అలా నిలబడగల ఆత్మవిశ్వాసం కలిగించాలి.. దుర్మార్గాల మీద తిరగబడే చైతన్యం వాళ్ళల్లో కలిగించడం తల్లి, తండ్రులుగా మన బాధ్యత... మన అమ్మాయి మీద మనకి నమ్మకం లేకపోతే ఎలా? స్మరణ ధైర్యస్తురాలు.. తెలివితేటలు, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ఉన్న అమ్మాయి. తన గురించి మనం భయపడనవసరం లేదు. ప్రమాదం రాకుండా జాగ్రత్త పడాలి... ఒకవేళ వస్తే ఏం చేయాలి? అనే విషయాలు నీకు తెలిసినవి చెప్పు.. అంతేకాని నువ్వు భయపడి, తనని భయపెట్టి, ఎక్కడికి వెళ్ళినా కాపలా కాస్తూ, నిఘా పెడుతూ ఉంటే ఈ కాలం అమ్మాయిలు ఊరుకోరు.. అయినా, పెళ్లి చేస్తే మాత్రం సెక్యూరిటీ ఉంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా! ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండడం నేర్పాలి.. అంతే కానీ వెనకాల సెక్యూరిటీ గార్డ్ ని నియమించి, తన కదలికలు నియంత్రణ చేయలేవు..”

భర్త మాటలు మండుతున్న గుండెల మీద వెన్న రాస్తున్నట్టు చల్లగా అనిపిస్తోంటే కళ్ళు మూసుకుంది సంధ్య. దీపక్ ఆమె నుదుటి మీద కదులుతున్న ముంగురులు సవరిస్తూ ఆలోచనలో పడ్డాడు. సంధ్య అలా ఆలోచించడంలో అసంగతం ఏమి లేదు.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలు చూస్తుంటే ఈ ప్రపంచం ఎటు పోతోందో తెలియడం లేదు.. విశృంఖలత్వం, మత్తు మందుల ప్రభావం, మాఫియా ... నీతి, నియమాలు అంగట్లో సరుకులు అవుతున్నాయి. పదిహేనేళ్ళ క్రితం లంచగొండితనం అరికట్టడానికి అడ్మినిస్ట్రేషన్లో పారదర్శకత ఉండాలి అని ప్రభుత్వం ఒక రూల్ పాస్ చేసింది.. కానీ ఇప్పుడు ఆ పారదర్శకత జీవితాల్లోకి ప్రవేశించింది.. దీన్నే transparency అంటున్నారు. ఇది ఇలా సమాజంలో పెరగాడానికి కారణం నూటికి నూరుపాళ్ళు మీడియా.. ఒకప్పుడు ఎంతో గొప్పవాళ్ళు, ఉన్నతులు అయిన వాళ్ళను మాత్రమే మీడియా పరిచయ కార్యక్రమాలు చేసేది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని తీసుకుని వచ్చి స్టూడియో లో సింహాసనం వేసి కూర్చోబెట్టి, వాళ్ళని పొద్దుటి నుంచీ సాయంత్రం వరకూ అడ్డంగా మేపి, వాళ్ళ చేత నానా ఛండాలం వాగించి, మా ఛానెల్ టి ఆర్ పి రేట్ ఒక్కసారిగా ఆకాశం అంత ఎత్తున పెరిగాయి అని ప్రచారం చేసుకోడం, తద్వారా వాణిజ్య ప్రకటనలు సంపాదించి కోట్లు గడించడం సామాన్యం అయిపొయింది. సంపాదనకు హద్దులు లేవు.. పద్దతులు అసలు లేవు. నాగరిక సమాజంలోకి రాకూడని మనుషులు కూడా టివి ల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తోంటే ఔన్నత్యం అనే పదానికి నిర్వచనం లభించడంలేదు.

ఎందుకిలా జరుగుతోంది? ఇది ఒక సమాధానం లేని ప్రశ్న. మారుతున్న జీవన విధానమా! మితిమీరిన స్వేచ్చా! ఏది మంచి? ఏది చెడు? తెలియని సందిగ్ధావస్థలో యువత ఉంటే, తమ ఉన్నతికి అడ్డురాకుండా ఆ యువతని మత్తుమందులు ఇచ్చి జోకొట్టే వయసుడిగిన వ్యవస్థ... స్వదేశంలో స్థానం లేని యువత బతకడానికి కేవలం, జిల్లాలను, రాష్ట్రాలనే కాదు, దేశాన్నే వదిలివెళ్ళిపోడానికి తన ప్రయత్నాలు తను చేసుకుంటోంది.. అందుకే చదివే చదువులు కేవలం ఉద్యోగాల కోసం పొందే  సర్టిఫికేట్స్ గా తప్ప, వివేకం, విచక్షణ, విజ్ఞానం కూడా చదువులో భాగం అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ తెలివితేటలన్నీ సాంకేతిక విప్లవం చుట్టూ తిరుగుతున్నాయి.. ఈ సాంకేతిక విజ్ఞానం విదేశీ సంస్కృతీ, సంప్రదాయాలను చూపిస్తోంది కానీ, భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలను, గౌరవ మర్యాదలను చూపించడం లేదు... కనీసం పెద్దవాళ్ళకు కూడా ప్రాచీన, సంస్కృతీ, సంప్రదాయాలు పిల్లలకు తెలియచేసే తీరిక, ఓపికా శ్రద్ధా కూడా లేదు. కార్పొరేట్ చదువులు, కార్పోరేట్ ఉద్యోగాలు, అవసరాలకు మించిన డబ్బు చేతుల్లో ఆడుతోంటే విలాసాలకు, విశృంఖలత్వానికి బానిసలై, ఇదే నాగరికత అనుకుంటూ ఆటవిక జీవనశైలికి అలవాటు పడుతున్నారు. ఏదైనా గుప్పిట్లో మూసి ఉంచినంత వరకే అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆరాటం ఉంటుంది..తెలుసుకున్నాక ఏముంది? జీవితం కూడా తెరల వెనక రంగస్థలమేగా!

ఒకదాని నుంచి ఒకటిగా అనేక రకాల ఆలోచనలు దుష్టశక్తుల్లా మూకుమ్మడిగా దాడి చేస్తుంటే తల విదిలించి ఆ ఆలోచనల నుంచి తనని తాను బయటపడేసుకోడానికి విఫలప్రయత్నం చేస్తూ సంధ్యవైపు చూసాడు.. కన్నీటితో అలసిన కళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నాయి. చెంపల మీద కన్నీటి చారికలు మమతకీ, బాధ్యతకీ మధ్య జరుగుతున్న అంత:సంఘర్షణకి చెరిగిపోని గీతల్లా... బెడ్ లైట్ వెలుగులో అస్పష్టంగా కనిపిస్తుంటే కుడిచేత్తో నెమ్మదిగా తడి ఆరని ఆ గీతలు చెరిపేస్తూ అనుకున్నాడు “భయపడకు సంధ్యా! మన పెంపకంలో లోపం లేదు.. మనమ్మాయి అలాంటి పనులు చేయదు.. ఒకవేళ చేస్తే అది దాని తప్పు కాదు.. మన తప్పు అవుతుంది.. మనం ఎప్పటికీ నేరస్తుల్లా తల వంచుకునే స్థితి రాకూడదనే ఆశిస్తున్నాను” కళ్ళు మూసుకున్నాడు.

*****

స్మరణ టీం మానేజర్ పేరు మీనన్. తమిళియన్. చామనచాయగా ఉన్నాడు. ఆరడుగుల పొడుగు, పొడుక్కి తగ్గ లావుతో మనిషిని చూడగానే పెద్ద ఆర్మీ ఆఫీసర్ లా ఉన్నాడు. దానికి తోడూ అతని గంభీరమైన స్వరం, మవిచుల్లు తిని, తినీ మత్తెక్కిన గండుకోయిల స్వరంలా అదో రకమైన మత్తుతో మాట్లాడతాడు. అతని పర్సనాలిటీ, స్వరం అతనికి ఎసెట్స్. సౌరభ్ అతన్ని పరిచయం చేసాడు. అతని దగ్గరే స్మరణ, బదరీ, ప్రసేన్ అనే మరో కుర్రాడు కూడా ప్రాజెక్ట్ చేయాలి. ఇటీవలే అతి ప్రయత్నం మీద ఆ ప్రాజెక్ట్ సంపాదించాడు వాళ్ళ సి.ఇ.వో. ఆయన బెంగుళూరు లో ఉంటాడు. బెంగుళూరు మెయిన్ ఆఫీస్.

స్మరణకి సౌరభ్ ఎంత నచ్చాడో, అంతకు మించి మీనన్ నచ్చాడు. ముఖ్యంగా అతని స్వరం చెవిలో నాదస్వరం ఊడుతున్నట్టుగా అనిపిస్తుంది ఆమెకి. ప్రాజెక్ట్ గురించి అతను వివరిస్తుంటే, తనేం వింటోందో మర్చిపోయి అతని స్వరంలోని నాదాన్ని ఎంజాయ్ చేయసాగింది. మొదట్లో ఆర్ యూ ఫాలోయింగ్ అని రెండు సార్లు హెచ్చరిస్తుంటే ఉలిక్కిపడి అతను చెప్పే విషయం మీద దృష్టి పెట్టి వినడం మొదలుపెట్టింది. తరవాత, తరవాత చెప్పే విధానం కూడా చక్కగా, ఉత్సాహం రేకెత్తేలా ఉండడంతో పని మీద కూడా ఉత్సాహం కలిగింది. యు ఎస్ లో ఎం ఎస్ చేసి వచ్చాడు.. అతని ఇంగ్లిష్ చాలా మధురంగా అనిపిస్తుంది. పని చేస్తున్నంత సేపూ అధికారిలా ఉంటాడు.. లంచ్ బ్రేక్, టీ బ్రేక్ వచ్చినపుడు మంచి స్నేహితుడిలా జోక్స్ వేస్తూ సరదాగా ఉంటాడు. త్వరలోనే స్మరణ అతనికి పెద్ద అభిమాని అయిపొయింది.

బదరీకి కూడా అతను బాగా నచ్చినా, అతను ఎంత స్నేహంగా ఉన్నా అతని పక్కన నిల్చున్నప్పుడు తనకి తానూ మరుగుజ్జుగా కుంచించుకుపోసాగాడు. అతని సమక్షంలో ఉన్నప్పుడు  స్మరణ కళ్ళల్లో అతని పట్ల కనిపించే ఆరాధనా భావం చూస్తుంటే చాలా దిగులుగా అనిపించసాగింది. స్మరణ పట్ల మొదటిరోజే అతనికి ఆకర్షణ ఏర్పడింది.. కలిసి పని చేస్తుంటే ఆ ఆకర్షణ మరింతగా బలపడుతూ ప్రేమగా రూపాంతరం చెందడానికి ప్రయత్నిస్తోంది. ఆమె చురుకుదనం, మధ్య, మధ్యలో తనతో ప్రవర్తించే విధానం, కొంటె మాటలు.. ఆమె పట్ల ప్రేమా, వ్యామోహమా తెలియని భావం .. పెళ్ళంటూ చేసుకుంటే స్మరణ నే చేసుకోవాలి అని నిర్ణయించుకోడానికి ఎక్కువ రోజులు పట్టలేదు బదరీకి.

పదిహేను రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. తన ప్రేమ అలా గుండెల్లో దాచుకుంటే స్మరణ ఈ లోగా మీనన్ ని ప్రేమిస్తుందేమో అని గాభరాగా అనిపించింది బదరీకి. ఇవాళ ఎలా అయినా స్మరణతో ఏకాంతంగా మాట్లాడి తన మనసులో మాట చెప్పాలని అనుకున్నాడు. కానీ భయం వేసింది నేరుగా ప్రేమిస్తున్నా అని చెబితే ఆమె ఎలా స్పందిస్తోంది తెలియదు.. అందుకే ముందు మనసు విప్పి, పర్సనల్ విషయాలు మాట్లాడుకుని పెళ్లి పట్ల, ప్రేమ పట్ల ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి.. ఆ తరవాత ప్రపోజ్ చేయాలి.

లంచ్ టైం లో కూడా ఓ పట్టాన లేవదు స్మరణ పని రాక్షసిలా అస్తమానం కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ కి అతికించుకుని పని చేస్తూనే ఉంటుంది. ఇవాళ కూడా అలాగే కంప్యూటర్ దగ్గరే కూర్చుంది. సౌరభ్ ఆఫీస్ కి రాలేదు.. మీనన్ కూడా రాలేదు.. శుక్రవారం అందరూ వీకెండ్ మూడ్ లోకి వెళ్ళిపోతారు.. ఇంకో గంటలో అందరూ వెళ్ళిపోతారు.. ఈమె మాత్రం కొంపలంటుకు పోతున్నట్టు ఎందుకు పని చేస్తోందో అర్ధం కాలేదు. అతను సీట్ లోంచి లేచి నిలబడి కాళ్ళు కొంచెం ఎత్తి ఆమె కాబిన్ వైపు చూసాడు. కంప్యూటర్లోకే చూస్తోంది. ఇంటర్ కం లో ఆమె నెంబర్ నొక్కాడు. రెండు, మూడు రింగ్స్ తరవాత తీసి హలో అంది.

“ఏం చేస్తున్నావు?” అడిగాడు. వాళ్ళ మధ్య అతి త్వరగా ఏకవచన సంబోధన మొదలైంది. ఆధునిక ఆఫీస్ వాతావరణంలో అది కూడా ఒకటి. అమెరికాలో లాగా అందరినీ పేరు పెట్టి పిలవడం మామూలు.. సౌరభ్ ని, మీనన్ కూడా అందరూ పేరు పెట్టె పిలుస్తారు.

“ఆఫీసులో చేయడానికి ఏం ఉంటుంది? పని చేస్తున్నాను” అంది స్మరణ.

“విసుగుపుట్టదా అస్తమానం అలా కంప్యూటర్ లో లీనమైపోయి ఉంటావు. కాసేపు రిలాక్స్ అవచ్చుకదా ! రేపు వీకెండ్ కూడా..”

“మనం రిలాక్స్ అవడానికి ఆఫీస్ కెందుకోయ్ రావడం ఇంకెటన్నా వెళ్ళచ్చు”

“అయితే వెళ్దాం పద...”

“ఎక్కడికి”

“కాంటీన్ కి”

“ఎందుకు”

“ఎందుకేంటి? కాఫీ తాగుదాం.. లేదంటే బర్గర్ తిందాం... లేదంటే జ్యూస్ తాగుదాం”

“అబ్బో పదేహేను రోజులకే కార్పోరేట్ కల్చర్ వచ్చేసిందే చద్దన్నం బడుద్ధాయికి” అని ఫక్కున నవ్వి. “సారీ, సారీ..  నాకు పని ఉంది... నువ్వు వెళ్ళు..” అంది.

“అబ్బా! నాకు తోడు రావచ్చు కదా..” ఆమె మాటలు అలవాటు అయిపోయిన బదరీ ఆ మాటల్లోని వేళాకోళం పట్టించుకోకుండా ప్రాధేయ పూర్వకంగా అన్నాడు.

“ఏడవకు వస్తున్నా...” నవ్వుకుంటూ సిస్టం షట్ డౌన్ చేసింది.

మరో పది నిమిషాల్లో ఇద్దరూ కాంటీన్ లో ఉన్నారు.. “ఏం తింటావు?” అడిగాడు.

“చెప్పావుగా బర్గర్ తిందామని..”

“ఒకే.. తెస్తాను నువ్వు కూర్చో” అంటూ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు.

స్మరణ ఒక టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని చుట్టూ చూసింది... ఓ పదిమంది దాకా ఉన్నారు. అందరూ సంతోషం అంతా మాదే అన్నట్టు ఉన్నారు. అమ్మాయిలూ జుట్టు విరబోసుకుని, షార్ట్స్ వేసుకుని అబ్బాయిల భుజాల మీద వాలిపోయి కబుర్లు చెబుతూ, పగలబడి నవ్వుతూ, అబ్బాయిలు కుళ్ళు జోక్స్ వేస్తూ.. స్మరణ పెదాల మీద చిన్న చిరునవ్వు విరిసింది. అమ్మ ఈ వాతావరణం చూస్తే! అనుకుంది.

బదరీ బర్గర్ తీసుకుని వచ్చి ట్రే టేబుల్ మీద పెట్టి కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు.

“అదిసరే.. ఇవాళ ఎందుకు నీకు సడెన్ గా బర్గర్ మూడ్ వచ్చింది ...” టిష్యు పేపర్తో బర్గర్ పట్టుకుని అడిగింది.

బదరీ మాట్లాడలేదు... స్మరణ వైపు చూసాడు.. ఆ కళ్ళల్లో కొంటె నవ్వు కదులుతోంది..

“నీతో మాట్లాడాలని...” అన్నాడు తల కొంచెం వంచుకుని.

“ఏం మాట్లాడతావు? ఐ లవ్ యు అని చెప్తావా?”

“ఎందుకలా అనుకుంటున్నావు?”

“ఒక అబ్బాయి, అమ్మాయితో నీతో మాట్లాడాలి అలా బయటకి రా అంటే అర్థం ఐ లవ్ యు అని చెప్పడానికి అని పదేళ్ళ పిల్లని అడిగినా చెప్తుంది.”

“పోనీ అదే అనుకో ...”

“ఛీ....” మొహం వికారంగా పెట్టింది స్మరణ..

“ఏమైంది? బర్గర్ బాలేదా..” కంగారుగా అడిగాడు.

“బర్గర్ కాదు... నీ ఐడియా బాలేదు..”

అతని మొహం ఎర్రగా అయింది ... “ఏం ఏమైంది?” అన్నాడు అలిగినట్టు..

“ఇలా బర్గర్ వాసనలు, చికెన్ మంచూరియా కంపులు మధ్య ఎవరన్నా ఐ లవ్ యు అని చెప్తారా...”

“అయ్యో .... ఛీ నాకు బుద్దిలేదు” అనుకున్నాడు.. “పోనీ ఎక్కడ చెబితే బాగుంటుందో చెప్పచ్చుగా” అన్నాడు కినుకగా.

స్మరణ పెదాల మధ్య నవ్వు బిగపట్టుకుని అంది “పచ్చని పచ్చిక మైదానంలో, విశాలమైన ఆకాశం లో తెల్లని మబ్బులు మన మాటలు వినడానికి మన వెనకే పరుగులు పెడుతుంటే, చల్లగాలి వాటిని వెనక్కి తోస్తూ మనల్ని కాపు కాస్తుంటే, మన్మధుడు మల్లెపూల బాణం మన మీదికి ఎక్కు పెట్టగా...”

ఆమె మాటలు ఆశ్చర్యంగా వింటున్న బదరీ ఉత్సాహంగా అడిగాడు.. “అప్పుడు చెబితే ఓ కే చేస్తావా..”

“ఆ విషయం ఇప్పుడెలా చెప్తాను... అప్పుడు మన్మధుడు నా మీద కూడా వేయాలిగా బాణం..”

“అంటే !” ఆమె ఆట పట్టిస్తోంది అన్న విషయం అర్థమైంది..

అయినా పంతంగా అన్నాడు. “నువ్వు  చెప్పినట్టు చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుందో..అలా అయితే మనం ఏ కాశ్మీరో వెళ్ళాలి..”

“వెళదాం” అదే కొంటెతనంతో అంది.

బదరీకి కొంచెం కోపం వచ్చింది.. మరీ టూ మచ్ చేస్తోంది స్మరణ.. అవన్నీ సాధ్యమేనా! ఈ లోగా మీనన్ కానీ, సౌరభ్ కానీ ఆమెని ఎగరేసుకు వెళ్ళిపోతే! అమ్మో! బదరీ గుండె దడ, దడలాడింది. గబుక్కున అన్నాడు. “నీ మాటలు నాకు అర్థం కావడం లేదు స్మరణా.. ప్లీజ్ చెప్పు... నేను ఇప్పుడు ఈ క్షణం చెప్తున్నాను... ఐ లవ్ యు ... నువ్వు సమాధానం చెప్పు..” ఎగ్జయిటింగ్ గా చూస్తున్న బదరీ ని చూస్తుంటే తెరలు, తెరలుగా నవ్వొస్తోంది స్మరణకి... ఓ పక్క జాలి కూడా వేస్తోంది.. “చెప్తాలే” అంది.

“ఎప్పుడు” ఆత్రంగా అడిగాడు.

“నాకు చెప్పాలనిపించినపుడు.” అల్లరిగా నవ్వింది.

ఆ నవ్వు చూడగానే బదరీ హృదయం ఒక్కసారి కెరటాల మీద డాల్ఫిన్ లా ఎగిరింది... పెదాలు చిరునవ్వు పులుముకుని కెంపుల్లా మారాయి.. మనసు ఓ మబ్బుతునకలా మారి, ఆమె ఊహల వైపు ప్రయాణం సాగించింది.

****సశేషం****

Posted in September 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!