Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

“సాయంత్రం వాళ్ళు వస్తారుట...” మాట్లాడడం పూర్తిచేసి మొబైల్ షర్టు జేబులో పెట్టుకుంటూ అన్నాడు దీపక్.

ఆ మాట వింటూనే  ఆత్రంగా అడిగింది సంధ్య..” “ఎవరు? ఆదినారాయణ గారా!”

దీపక్ ఆలోచిస్తూ అన్నాడు...” అవును... ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి, ఆంజనేయులు గారు చెప్పారు.. అమ్మాయిని చూడ్డానికి వస్తాము అని చెబుతుంటే సమాధానం ఏం చెప్పాలో కూడా తోచలేదు నాకు.”

“మంచిదేగా వచ్చి చూసి వెళతారు.. అంత ఆలోచించడానికి ఏముంది?” తేలిగ్గా అంది సంధ్య.

“నాన్న ఎలాగూ శనివారం వస్తున్నారుగా.. అప్పుడే వస్తే బాగుండేది.. ఇప్పటికిప్పుడు అంటే ఎలా?” గేటు మూస్తూ అన్నాడు.

“మీరేం టెన్షన్ పడకండి. కావాల్సిన ఏర్పాట్లు నేను చూసుకుంటాను.. మీరు వెళ్లి మీ కూతురుకి చెప్పండి ఎలా చెబుతారో, ఏం చెబుతారో అంటూ సంధ్య హుషారుగా లోపలికి వెళ్ళిపోయింది.

దీపక్ మాట్లాడలేదు.. కాసేపు అక్కడే గేటు పక్కన ఉన్న మొక్కలు చూస్తూ అటూ, ఇటూ తిరగసాగాడు. ఇప్పుడు ఈ పిల్ల ఏం గోల చేస్తుందో! ఏడాది నుంచీ తల్లి,కూతుళ్ళ మధ్య ఈ విషయంలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఎవరికీ మద్దతు పలకాలో అతనికి అర్థం కాక, ఎవరికీ పలికితే రెండోవాళ్ళు తన మీద ఎలాంటి దాడి చేస్తారో అని గోడమీద పిల్లిలా దాటేస్తూ వస్తున్నాడు.

నిజానికి స్మరణ తప్పేం కనిపించడం లేదు అతనికి. ఈ రోజుల్లో ఆడపిల్లలు పాతకాలం పెళ్లి చూపుల తతంగాన్ని ఏ మాత్రం ఒప్పుకోవడంలేదు. పరస్పరం వివరాలు వాట్స్ అప్ లో పంపించుకుని ఏ కాఫీ షాప్ లోనో, మాల్ లోనో కలుసుకుని పిచ్చాపాటీ మాట్లాడుకుని ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకుని, వారి, వారి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? వగైరా విషయాలు మాట్లాడుకుని నచ్చారో, లేదో పెద్ద వాళ్లకి చెప్పేయడం. ఇరువైపులా పెద్దవాళ్ళకు ఇష్టం అయితే, మిగతా విషయాలు మాట్లాడుకోడం, పెళ్లి పిల్లల అభిరుచుల మేరకు ఆడంబరంగానో, సింపుల్ గానో, చేయడం. పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే గుళ్ళోనో, రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. కాలం మారింది. ఆ మధ్య తన ఆఫీస్ లోనే కొత్తగా అప్పాయింట్ అయిన ఒక జంట ఫేస్ బుక్ సాక్షిగా పెళ్లి చేసుకున్నామని చెప్పడం గుర్తొచ్చింది దీపక్ కి.  ఆ విషయం వాళ్ళు చెప్పగానే గుండె ఆగినట్టు అనిపించింది. ఫేస్బుక్ సాక్షి ఏంటి? ఎలా అని అడిగాడు బోలెడంత ఆశ్చర్యపోయి.

“అవును సార్..మా ఫ్రెండ్స్ ఉంటారు కదా.. మా ఇద్దరికీ కలిపి రెండు వేలమంది ఉన్నారు ఫాలోయర్స్. వాళ్ళంతా మేము ఆన్ లైన్ లో దండలు మార్చుకుంటుంటే లైన్ లోకి వచ్చి మాకు అభినందనలు చెప్పారు.

“నేనిలా అనకూడదు.. కానీ, కీడెంచి మేలెంచమన్నారు కదా! రేపెదన్న మీ ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు వస్తే ఏం చేస్తారు?” కుతూహలంగా అడిగాడు.

“మేము అందరి అభినందనలు సేవ్ చేసుకుని పెట్టుకున్నాము. వాళ్ళంతా సాక్ష్యం ఉంటారు. మామూలుగా సంప్రదాయం ప్రకారం చేసుకుంటే ఇంతమంది వస్తారా! రారు కదా! దానికన్నా మా పద్ధతే సేఫ్ కదా సర్ ...:”

ఈ విషయం సంధ్యకి చెప్పలేదు. చెప్పి ఉంటే గుండెలు బాదేసుకుని ఆడపిల్లలకి భయం, భక్తీ ఉండడంలేదు.. చెడిపోతున్నారు అని స్మరణ ఫేస్ బుక్ ఎకౌంటు తీసేసిందాకా, నిప్పు తొక్కిన కోతిలా చిందులు వేసేది.

ఇది సైబర్ యుగం. తరాలు మారిపోతున్నాయి. నేటి యువతని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు.. వాళ్ళు చదువుకున్న చదువులు, వాళ్ళకున్న పరిధి, వాళ్ళ విజన్ వీటిముందు తనలాంటి, సంధ్యలాంటిని ఛాందసులుగా భావించడంలో తప్పులేదు. యువతీ, యువకుల అభిరుచుల్లో ఊహించనంత మార్పులు వస్తున్నాయి. స్మరణ పెళ్లి పట్ల విముఖంగా ఉందో, పెళ్లి చూపులు అనే తతంగం పట్ల విముఖంగా ఉందో అర్థం కావడంలేదు. దాని మనసులో ఏముందో, తల్లిగా సంధ్య కాస్త సానుకూలంగా మాట్లాడి తెలుసుకోవచ్చు కదా!  సంధ్య అర్థం చేసుకోదు. తన గోల తనది. ఈవిడకి పూర్తి  వత్తాసు నాన్న. దీపక్ మెదడంతా గందరగోళంగా తయారైంది.

సంధ్యలాంటి స్త్రీలు మధ్య తరంవాళ్ళు. వాళ్ళు అటు పూర్తిగా సనాతనులు కారు, ఇటు పూర్తిగా ఆధునికతనూ ఆహ్వానించలేరు. సంధ్య కొంచెం సనాతన కుటుంబంలో పుట్టి, పెరిగింది. ముగ్గురు అక్కల తరవాత సంధ్య. తల్లి బాగా సనాతనురాలు. ఆడపిల్లలు బయట తిరగడం అంటే పెద్ద నేరం చేసినట్టు భావించేది. పెద్ద పిల్లలని అందుకే కాలేజి మొహం కూడా చూడకుండా అత్తగారిళ్ళకు పంపించింది. సంధ్య దగ్గరకు వచ్చేసరికి తండ్రి కాలం మారుతోంది.. ఆడపిల్లలు చదువుకోకపోతే ఎందుకూ పనికిరారు.. మరీ దాన్ని పంజరంలో చిలుకలా పెంచకు అంటూ కాలేజ్ లో చేర్పించాడు. ఆయన దయవల్ల డిగ్రీ దాకా చదివినా, తల్లి చిన్నప్పటి నుంచీ నూరిపోసిన భావాలు సంధ్యలో జీర్ణించుకుపోయాయి. దానికి తోడు టివి, సీరియల్స్,  ప్రతి సంఘటనని క్రైమ్ స్టొరీ లా చెప్పే వార్తలు చూడడంతో సంధ్యకి ప్రపంచం అంటే భయం పట్టుకుంది. ఉన్నది ఒక్కతే  ఆడపిల్ల అవడంతో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా కూతురి మీదే ఆమె ధ్యాస. ప్రతిక్షణం కూతురు మీద ఒక కన్ను వేసి ఉంచడం మొదటి నుంచీ అలవాటు చేసుకుంది. ఆఫీస్ లో ఉన్నా పని మీద కన్నా కూతురు మీదే ఆవిడ ధ్యాస. సాయంత్రం నాలుగు అయేసరికి ఇంటికి ఫోన్ చేయడం, స్మరణ ఫోన్ తీయకపోతే కంగారు పడిపోయి, “ఏవండి! ఇది ఇంకా ఇంటికి వెళ్ళలేదు.. ఫోన్ తీయడంలేదు.. నేను పర్మిషన్ తీసుకుని వాళ్ళ స్కూల్ కి వెళ్తున్నాను” అని దీపక్ కి ఫోన్ చేసేది. “వస్తుందిలే సంధ్యా.. కంగారెందుకు అన్నా” వినేది కాదు. ఆ బాధ పడలేక స్మరణ టెన్త్ లో ఉన్నప్పుడే మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. “నువ్వు ఎక్కడ ఉన్నా మీ అమ్మకి ప్రతి అరగంటకి ఫోన్ చేసి చెబుతూ ఉండు అని హెచ్చరించాడు కూడా. దానికి కూడా గోల పెట్టేసింది సంధ్య. “దానికి మొబైల్ ఎందుకండీ.. అందులో నానా ఛండాలం ఉంటుంది.. పిల్ల చెడిపోతుంది అని. ఆ విషయంలో ఆమెకి నచ్చచెప్పేసరికి తాతలు దిగివచ్చారు.

బి.టెక్ అయిన దగ్గర నుంచీ పెళ్లి చేద్దాం, చేద్దాం అని నస మొదలు పెట్టింది. ఇప్పుడే పెళ్ళేంటి అంటే “ఆలస్యం అయితే అది ఎవరినన్నా ప్రేమిస్తే! వాడే కులమో.. ఏంటో! తెల్లారి లేస్తే ఎన్ని వినడం లేదు.. మనకి వాడు నచ్చకపోతే ఒద్దు అంటే వింటుందా! చూస్తున్నారుగా ఆ పిల్ల ఏం చేసిందో.. దానికి కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రి కన్నా ప్రియుడే ఎక్కువైనాడు.. నాన్న అని పిలవడానికి కూడా దానికి నోరు రాలేదు.. పైగా తెల్లారే సరికి దానికి పెద్ద సెలబ్రిటీ హోదా ఇచ్చింది మీడియా.. వద్దండి అలాంటి దౌర్భాగ్యాలు మన ఇంట్లో జరక్కూడదు.. పెళ్లి చేద్దాం.. ఆ తరవాత వాళ్ళు, వాళ్ళు చూసుకుంటారు” అని జోరీగలా ఒకటే పోరు.

తను పట్టించుకోవడం లేదని మావగారిని శరణు కోరింది. ఆయనకీ కోడలి మాట అంటే అమితమైన గౌరవం.. ఆమె అంటే ఇంట్లో దేవత.. ఆవిడ అలా చెవిలో శంఖం ఊదగానే ఇలా సంబంధం చూసేసి, వాళ్లకి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీపక్ నిట్టూర్చాడు. నిజంగా ఇప్పుడు తనకిది విషమ సమస్య.. వాళ్ళు సాయంత్రం వస్తున్నారని స్మరణకి చెబితే ఇప్పుడు ఇంట్లో తుపానే రేగుతుందో, సుడిగాలే వీస్తుందో..

టి వి చూస్తున్న స్మరణకి వంట గదిలో నుంచి శెనగపిండి నేతిలో వేగుతున్న కమ్మటి వాసన వచ్చింది. బయట మొక్కల మధ్య పచార్లు చేసి తన పక్కన కూర్చున్న తండ్రి వైపు చూసి కనుబొమలేగరేస్తూ "అప్పుడే అమ్మ తాతయ్య కోసం పిండి వంటలు మొదలు పెట్టింది” అంది.

నవ్వేసి ఊరుకున్నాడు దీపక్.

ఆ నవ్వుకి స్మరణ సందేహంగా అడిగింది...”ఏంటి డాడీ! సడన్ గా సిగ్నల్ పోయిన కేబుల్ టి వి లాగా సైలెంట్ అయావు”.

“ఏం లేదులే గానీ, నువ్వు ఫ్రెష్ అయి డ్రెస్ మార్చుకో... ఇంటికి గెస్ట్స్ వస్తున్నారు.”

“గెస్ట్స్? ఎవరు వాళ్ళు? ఎందుకోస్తున్నారు? నేనెందుకు రెడీ అవాలి”

స్మరణ స్వరంలో వినిపించిన పదును అర్థమైంది దీపక్ కి.. సమాధానం చెప్పలేని వాడిలా నిస్సహాయంగా పిలిచాడు “సంధ్యా! టీ ఇస్తావా!”

తండ్రి వాలకం గమనించింది స్మరణ. తన వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోంది.. మొగుడు, పెళ్ళాం కలిసి ఏదో డ్రామా సీన్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటూ గబుక్కున సోఫాలోంచి లేచి వంటగది వైపు వెళ్ళింది. సంధ్య కూనిరాగం తీస్తూ పంచదార పాకం పడుతోంది. స్మరణ ఆవిడ పక్కకి వెళ్లి ఆవిడ చేతిలో నుంచి గరిట తీసుకుని పాకం తిప్పుతూ అడిగింది.

“ఏంటమ్మా సడన్ గా నీ మొహంలో ఫ్లాష్ వెలుగుతోంది.”

కూతురివైపు చురుగ్గా చూసి అంది. “నా మొహం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నీ మొహమే వేయించిన ఆవాల్లా చిట పట లాడుతూ ఉంటుంది.. ఇప్పుడా మొహం కడుక్కుని కడిగిన ముత్యంలా తయారవు.. వెళ్ళు..నీ హెల్ప్ నాకు అవసరం లేదు.”

“ఎందుకు? ఎక్కడికన్నా వెళ్తున్నామా?”

“వేషాలేయకు... మీ నాన్న చెప్పలేదా! నీకిప్పుడు పెళ్లి చూపులు..”

స్మరణ గరిట గిన్నెలో వదిలేసి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది.

అప్పుడే గేటు బయట కారు ఆగిన శబ్దం వినిపించి సంధ్య గుండె దడ, దడలాడింది. అయ్యయ్యో వచ్చేశారు.. తను మొహం కడుక్కోలేదు.. వంటగది క్లీన్ చేయలేదు..టెన్షన్ పడింది.

“హలో! హలో! రండి... రండి ..” అంటూ దీపక్ స్వరం వినిపించడంతో స్టవ్ ఆఫ్ చేసి, చీర కుచ్చిళ్ళు సరిచేసుకుని, చెంగుతో మొహం తుడుచుకుని చిరునవ్వు పులుముకుని హాల్లోకి వచ్చింది. కంచి పట్టు చీర కట్టుకున్న పెళ్ళికొడుకు తల్లి, సూట్ లో తండ్రి.. జీన్స్ పాంట్, క్రీం కలర్ టీ షర్టు లో యువకుడు.. వాళ్ళని చూడగానే బాగా ఉన్నవాళ్ళు అని స్పష్టంగా తెలుస్తోంది. సంధ్యని చూడగానే ఆవిడ స్నేహంగా నవ్వింది.

“సారీ...! మేము మిమ్మల్ని తొందరపెట్టినట్టున్నాము.. మా పరిస్థితి అది.. అబ్బాయి ఇంకో రెండు గంటల్లో ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాలి.. మీరేం హడావుడి పడకండి.. జస్ట్ కాజువల్ గా కలిసి వెళ్ళడానికి వచ్చాము”.

భార్య మాటలని ధృవ పరుస్తూ దీపక్ చేయి పట్టుకుని ఊపుతూ.. ఎస్.. అసలు మేము ఈ లాంచనాలు ఫాలో అవద్దనే అనుకున్నాం.. అమ్మాయి, అబ్బాయి ఏదన్నా రెస్టారెంట్ లో కలుసుకునే ఏర్పాటు చేయాలి అనుకున్నాం ... కానీ, పెద్దవాళ్ళం, కాబోయే బంధువులం మనం ఒకరికొకరు పరిచయం అవకపోతే ఎలా అని వచ్చాము. మీరేం ఫీల్ అవకండి.. బీ ఫ్రీ” అన్నాడు.

తెల్లగా, పొడుగ్గా, అమెరికన్ నీళ్ళు బాగా ఒంటపట్టిన వాడిలా ఆధునికంగా, అందంగా ఉన్న పెళ్లికొడుకు మొహంలో ఉషోదయం చిరు వెలుగులా ఒక నవ్వు వెలుగుతోంది. బహుశా అమెరికన్ నవ్వు అయి ఉండచ్చు అనుకున్నాడు దీపక్.

అందరికీ నమస్కరించి, “కూర్చోండి..” అంటూ మర్యాదగా సోఫాలు చూపించింది సంధ్య.

వకుళా దేవి నవ్వుతూ “మీరు టెన్షన్ గా ఉన్నారు ముందు మీరు కూర్చోండి” అంది సంధ్యని.

సంధ్య నవ్వి...” అదేం లేదండి... మీకు మంచినీళ్ళు ఇస్తాను” అని లోపలికి వెళ్లబోతుంటే ఆవిడ వారిస్తూ “ఏమి వద్దు... మీ తృప్తి కోసం మా అందరికీ కూడా విత్ అవుట్ షుగర్ టీ ఇవ్వండి చాలు.. అమ్మాయిని పిలవండి.. కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు” అంది కొడుకువైపు చూస్తూ. అతను “యా” అని భుజాలేగరేస్తూ నవ్వాడు.

“అలాగే ...” సంధ్య హమ్మయ్య అనుకుంటూ ముందు అక్కడి నుంచి వేగంగా స్మరణ రూమ్ లోకి వెళ్ళింది. స్మరణ మంచం మీద కానీ, కంప్యూటర్ ముందు కుర్చీలో కానీ, బాల్కనీలో కానీ కనిపించలేదు. బాత్రూమ్ డోర్ కొట్టింది. చేయి తగలగానే డోర్ తెరుచుకుంది. స్మరణ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది ఇంతలోకే.. సంధ్య చప్పున తన గదిలో, గెస్ట్ రూమ్ లో చూసింది. స్మరణ ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళింది..కంగారుగా హాల్లోకి వచ్చి దీపక్ వైపు చూసింది. అతను ఆదినారాయణ తో మాట్లాడుతున్నాడు. సంధ్య మౌనంగా బెడ్ రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉండడం చూసి కళ్ళతో సైగ చేశాడు ఏంటి అన్నట్టు...

“ఇటు రండి” అన్నట్టు సైగ చేసింది సంధ్య.

దీపక్ “ఎక్స్ క్యుజ్ మీ” అంటూ లేచి సంధ్య వైపు నడిచాడు. సంధ్య గదిలోకి నడిచింది. ఆమెని అనుసరిస్తూ వెళ్ళిన దీపక్ అడిగాడు.. “ఏమైంది?"

“స్మరణ గదిలో లేదు.. ఇంతకు ముందేగా వంటగదిలోకి వస్తే రెడీ అవమన్నాను ... నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోకి ఎక్కడికి వెళ్ళింది?” గాభరాగా అడిగింది.

దీపక్ కి అర్థమైంది.. స్మరణ అవాయిడ్ చేయడానికి దాక్కుంది.. “సరే నువ్వెళ్ళి టీ ఏర్పాట్లు చూడు.. నేను మేడమీద చూస్తాను” అంటూ మేడమీదకి వెళ్ళాడు.

సంధ్య వంటగదిలోకి వెళ్ళింది.

డాబామీద పిట్టగోడ దగ్గరగా కింద కూర్చుని ఉంది స్మరణ. ఎంత తెలివిగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు వీళ్ళు? చూద్దాం తనకేనా తెలివితేటలు లేనిది.. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకి కనపడను.. ఏం జరుగుతుంది మహా అంటే.. గోళ్ళు కొరుకుతూ కోపం కంట్రోల్ చేసుకోడానికి ప్రయత్నిస్తూ వస్తున్న కన్నీళ్లు ఆపుకోసాగింది.

“స్మరణా!” దీపక్ స్వరం వినిపించి కళ్ళు తుడుచుకుని తలెత్తింది.

“ఏంటి ఇక్కడ కూర్చున్నావు. వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ“

స్మరణ మాట్లాడలేదు. దీపక్ స్వరం గంభీరంగా వినిపించింది. “మాట్లాడకుండా లోపలికి రా.. చదువుకుని ఉద్యోగం చేస్తున్నదానివి. ఇంటికి ఎవరన్నా వచ్చినపుడు ఎలా బిహేవ్ చేయాలో నేను నేర్పించనవసరం లేదుగా”

తండ్రి స్వరంలో ఎన్నడూ వినని గాంభీర్యం వినగానే స్మరణకి ఒక్కసారిగా వెన్ను మీద భయం పాకింది. మౌనంగా లేచి నిలబడింది.

దీపక్ పిట్టగోడ మీద ఉన్న కుండీలో ఉన్న గులాబీ మొక్కతో పాటు ఊయల ఊగుతున్న గులాబీ పువ్వు తెంపి స్మరణ చేతికి ఇచ్చాడు. “పద” అన్నాడు మెట్లవైపు నడుస్తూ .. స్మరణ అనుసరించింది.

దీపక్ వెనకాలే చేతిలో పువ్వుతో వస్తున్న స్మరణని చూసి వకుళా దేవి... “మీ అమ్మాయా.. రామ్మా!” అంటూ తన పక్కన చోటు చూపించింది.

“మీకోసం పువ్వు కోసి తెచ్చింది” అన్నాడు దీపక్ నవ్వి.

స్మరణ బలవంతంగా చిరునవ్వు మొహంలోకి తెచ్చుకుని పూవు ఆవిడకి ఇచ్చి ఆవిడ పక్కన కూర్చుంది.

“మా అబ్బాయి అనిరుధ్” ఆవిడ పరిచయం చేసింది.

స్మరణ అతని వైపు చూసింది... “హాయ్” అన్నాడు అనిరుధ్.

“హాయ్” అంది స్మరణ.

టీ కప్పులున్న ట్రే తో వస్తున్న సంధ్య మొహంలో మరోసారి ఫ్లాష్ వెలిగింది.

“అమ్మాయితో ఏదన్నా మాట్లాడరా” అంది ఆవిడ కొడుకుతో.

“ఇట్స్ ఓ కె” అన్నాడు అనిరుధ్ మొహమాటంగా.

“ఫర్వాలేదు.. మాట్లాడుకోండి స్మరణా! నీ గదిలోకి వెళ్ళండి ఇద్దరు” అన్నాడు దీపక్.

స్మరణ, అనిరుధ్ ఇద్దరూ ఒకేసారి లేచారు. వెళ్ళారే కానీ ఇద్దరికీ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. “మీరెక్కడ వర్క్ చేస్తున్నారు” ముందు స్మరణే చొరవ చేసుకుని అడిగింది.

“ఆమెజాన్” చెప్పాడు.

“ఓ ... విచ్ స్టేట్ ....”

“కాలిఫోర్నియా” ఆ తరవాత ఇద్దరిలో ఎవరికీ ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇదే విచిత్రమైన పరిస్థితి.. ఏ కాలేజ్ లోనో, ఆఫీస్ లోనో, క్లబ్ లోనో, పబ్ లోనో పరిచయం అయి, అవగానే హాయ్ అంటూ త్వరగా కబుర్లలో పడే అమ్మాయి, అబ్బాయి పెళ్లి చూపులు అనగానే కుంచించుకుపోవడం చాలా కామన్. ఎంత బోల్డ్ గా ఉండే అమ్మాయి అయినా అప్రయత్నంగానే నిశ్శబ్దం అయిపోతుంది. ఎంత గట్టిగా మాట్లాడే అబ్బాయి అయినా ఇంట్రోవెర్ట్ అయిపోతాడు ఆ కాసేపు. ఇప్పుడు స్మరణ, అనిరుథ్ పరిస్థితి కూడా అలాగే అయింది. పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళలో ఇలాంటి సందర్భాల్లో అబ్బాయి, అమ్మాయి ఏం మాట్లాడుకోవాలి, ఎలా ప్రారంభించాలి అని సైకాలజిస్ట్ లు ఒక క్వశ్చనైర్ లాగా తయారు చేసారట.

మీరు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు... మీ పార్టనర్ కి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనుకుంటున్నారు? మీరు పాజిటివ్ గా ఆలోచిస్తారా!  నేగటివా!  మీరు ఇంట్రా వర్టా .... ఎక్ష్త్రావర్టా ! మీరు స్వతంత్రంగా ఉండాలనుకుంటారా... ఆధారపడి ఉంటారా... మీ ఇష్టాలు... అయిష్టాలు.. మీ అభిరుచులు... అలవాట్లు... మీలో సృజనాత్మకత ఉందా! మీరెప్పుడన్నా జీవితంలో అడ్వెంచర్ చేసారా... చేయడం ఇష్టమేనా... ఇలా చాలా ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు ఒకరినొకరు సంధించిన తరవాత వచ్చే జవాబులను బట్టి అవతలి వాళ్ళతో మేము సుఖంగా ఉంటామా...లేదా అనేది నిశ్చయించుకోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం.

అయితే ఎంత మంది అమ్మాయిలూ, అబ్బాయిలు ఈ సూచన అనుసరిస్తున్నారు.. అనుసరించకపోవడం వల్ల నష్టపోతున్నారా... లాభపడుతున్నారా.. ప్రేమ పెళ్ళిళ్ళలోనే కాక పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో ఇలా మాట్లాడుకోడం వలన అన్యోన్యంగా ఉంటున్నారా. ఇవన్నీ ఏ సైకాలజిస్ట్ పరిశోధించి తెలుసుకున్న దాఖలా ఇంతవరకు గూగుల్ లో కూడా లభించలేదు. అదే జరిగిఉంటే బహుశా ప్రతి, తల్లి, తండ్రి తమ పిల్లలకు పెళ్ళిచూపుల ముందు ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేసేవారేమో!

గల, గలా మాట్లాడే స్మరణ కూడా నిశబ్దంగా ఉండడంతో అమెరికాలో చిన్నప్పటి నుంచీ కూడా సోషల్ లైఫ్ అనేది లేకుండా ఒంటరిగా పెరుగుతూ, ఒంటరిగా ఉండడానికి అలవాటు పడిన అనిరుధ్ కి ఏం మాట్లాడాలో అసలే తోచలేదు.

ఇద్దరూ హాల్లోకి రాగానే పెద్దవాళ్ళు వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళేదో చెప్తారని ఆశించలేదు. “ఓకే.. లేట్ అయింది... మేమింక బయలుదేరతాము... బై... సీ యూ” అంటూ లేచారు.

తల్లి, తండ్రితో పాటు స్మరణ కూడా చిరునవ్వుతో సెలవు తీసుకుంది.

ఆ తరవాత స్మరణ తల్లి, తండ్రులతో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది.

అది చూసిన సంధ్య పళ్ళు కొరుక్కుంటూ దీనికి బాగా పొగరు ఎక్కువైంది అనుకుంది. సరేలే ఎలాగా పెద్దాయన వస్తారుగా ఆయనే అణుస్తారులే అని మనసుకి సర్ది చెప్పుకుంది తాత్కాలికంగా.

మరో వారం గడిచింది.

****సశేషం****

Posted in August 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!