Menu Close
దేవత
-- ఆదూరి హైమావతి --

తలుపు తీసిన శబ్దమైంది. అంటే అమ్మ లేచిందన్నమాట. నాలుగైందని గుర్తు అమ్మలేస్తే. గడియారం చూడక్కర లేదు. గడియారమే అమ్మను చూసి సమయం సరిచేసుకోవాలేమో! అమ్మ అంతసరిగ్గా సమయపాలన చేస్తుంది.

ఆమెకు విధినిర్వహణే ప్రాణం. వాకిలి చిమ్మి ముగ్గేసి, మాఇంటి మహాలక్ష్ములైన ఐదు గోవులకూ, త్రిమాతల్లాంటి మూడు గేదెలకూ కుడితి తాపి, గడ్డి వేసి ఇంట్లోకి వస్తుంది. ఇల్లంతా చిమ్మి గిన్నెలుతోముకుని అది వేసవికానీ, చలికాలంకానీ ఏకాలమైనాసరే నూతివద్ద పది బకెట్ల నీరు తోడుకుని తలారా స్నానం చేసి, ఆ నీరంతా తన పూలమొక్కలకూ, కూరమొక్కలకూ సరిగా పారుతున్నదో లేదో చూసుకుని తలార్చుకుంటూ వచ్చి దేవునివద్ద దీపం పెట్టి నమస్కారం చేసుకుంటుంది. అప్పటికి సమయం సరిగ్గా ఐదున్నరై ఉంటుంది. గడియారంతో పనిలేదు. మా అమ్మే పెద్ద గడియారం.

తోమి బోర్లించుకున్న స్టీలుబిందె తీసుకుని పశువులశాల కెళుతుంది. ఒక్కో ఆవునూ తాను పెట్టుకున్న ముద్దుపేర్లతో పిలుస్తూ తన చిన్నతనంలో ఆమె అమ్మమ్మ నేర్పిన, మేలుకొలుపు పాటలు పాడుతూ మా అష్టలక్ష్ముల పాలుపితికి ఆ బిందె నింపుతుంది. ఒక లీటర్ ఆవుపాలు వేరే తీసి దాలిమీద పెట్టి వీధిగుమ్మం ముందున్న అరుగుమీద కూర్చుంటుంది.

ఆ పాటికి సమయం ఆరున్నర. నోటికి వచ్చిన కీర్తనలన్నీ పాడుతూ, వచ్చిన వారందరినీ పలకరిస్తూ ఒక్కోరికీ పాలు కొలిచిపోసి, సొమ్ము తీసుకుంటుంది. అర్థగంటలో ఆపనయ్యాక లేచి లోపలికి వచ్చి నా గదిలోకి తొంగిచూస్తుంది. అమ్మ ఎక్కడున్నా ఏంచేస్తున్నా నా గది కిటికీల్లోంచి కనిపించేలా ఏర్పాటుచేసింది నా గదిని.

"బంగారూ! లేరాతల్లీ! పాలుకాగాయి. టీ చేస్తాను." అని హెచ్చరించి వెళ్ళి టీ చేసుకుని వచ్చి, చేసాయం ఇచ్చి నన్ను లేపుతుంది. మా అమ్మ ఇతరులకు ఎవరో కానీ నాకు జన్మనిచ్చిన మాతృమూర్తే కాక, నాదైవం, నా సర్వస్వం. అమ్మ లేకపోతే నేను లేనట్లే. అవ్యక్తురాలినైన నాకు అసహ్యించుకోకుండా, ఆప్యాయంగా సర్వం చేస్తున్న అమ్మ నాదేవత.

అసలు నేనిలా ఎందుకయ్యానో తెలిస్తే మీ కళ్ళకూ నీరు వస్తుంది. అమ్మ చూస్తే భరించలేదని, నేను కళ్ళ నీరు రాకుండా జాగ్రత్త పడతాను.

మా తాతకు ఆర్గురు ఆడపిల్లలు. అమ్మ పెద్దది, మంచి తెలివిగలది కూడా, పదోక్లాసు ఫస్టులో పాసైందని నగరం నుండి కాలేజీవాళ్ళు వచ్చి తమ కళాశాల్లో ఉచితంగా ఇంటర్ చదివిస్తామన్నా, మాతాత తన అక్కకొడుకు కార్ఖానాలో పని చేస్తున్నాడనీ, ఒకపిల్ల భారం వదులుతుందనీ భావించి, పదహారేళ్ళ  అమ్మను అడక్కుండానే పెళ్ళి నిశ్చయించి చేసేశాట్ట.

అమ్మకు చదువుకోవాలని ఎంత ఆశ వున్నా తండ్రికి ఎదురు చెప్పలేక, తలవంచి తాళి కట్టించుకుందిట. పోనీ అక్కడైనా సుఖంగా ఉందా అంటే, ఏడోక్లాసు ఫెయిలైన మా నాన్న అనే ఒక మగ అహంకారి అడుగడుగునా అమ్మను అనుమానంతోనూ, తనకంటే కాస్తంత ఎక్కువ చదువూ, తెలివీ, అందం ఉన్నాయన్న అసూయా, ద్వేషాలతోనూ పురుషాహంకారంతో నరకం చూపేవాట్ట.

అప్పుడప్పుడూ అమ్మ తన గురించి నాకు చెప్పడం వలన అన్నీ తెలిశాయి.

మరోదారిలేక అనుభవిస్తూ తన కర్మని తిట్టుకుంటూ భారంగా జీవనం నెట్టుకొస్తున్న సమయాన నేను కడుపున పడ్డానుట. నా కోసం కోటిఆశలతో ఎదురుచూస్తూ ఉండగా నేను పుట్టాను. నన్ను చూసి మా అమ్మ సంతోషిస్తే మానాన్న మగబిడ్డను కనలేదని అమ్మను నానామాటలూ అని ఏడిపించాట్ట. అలా నాన్న ద్వేషంతో, అమ్మప్రేమను బ్యాలెన్స్ చేసుకుంటూ నేను పెరగసాగాను.

నన్ను చూసినప్పుడల్లా అమ్మకు దెబ్బలు కూడా నాన్న చేతులో పడసాగాయి, నేను అది చూసి పెద్దగా ఏడ్చేదాన్ని. ఒకరోజు ఏమైందో నాకు తెలీదు. బయట ఆడుకుంటుండగా పెద్దగా అమ్మ ఏడ్పు వినిపించి లోపలికొచ్చాను.

పచ్చి తాగుబోతుగా మారిన నాన్న కర్రతో అమ్మను కొట్టసాగాడు. నాలుగేళ్ళ నేను లోపలికి వచ్చి అమ్మకు అడ్డంపోయాను, నాకు బాగా గుర్తుంది. నాన్నఅనే కరుడుగట్టిన హంతకుడు, నా రెండు రెక్కలూ పట్టుకుని ఇంటి గుమ్మానికేసి బట్టలుతికినట్లు పదేపదే బాదాడు. నడుమునుంచీ నా కాళ్ళు ఆ చెక్క దర్వాజాకు ఠపాఠపా తగిలి విరిగిపోయాయి. గుక్కపెట్టి ఏడుస్తున్ననన్ను ఇంట్లోకీ విసిరేసి విసవిసా నడుచుకుంటూ బయటి కెళ్ళిపోయాడా రాక్షసుడు.

స్పహతప్పి పడివున్న నన్ను మా అమ్మ అక్కున చేర్చుకుని ఊరిలోకల్లా పెద్ద ప్రేవేట్ హాస్పెటల్ కెళ్ళింది. వారు డబ్బు అడగ్గా మెడలో మంగళ సూత్రం తీసి వచ్చినంత సొమ్ము తీసుకోమని బ్రతిమాలి ప్రాధమిక చికిత్సచేయించింది.

అమృతమూర్తి ఐన అమ్మ ఏ నిర్ణయం తీసుకుందో ఏమో గానీ నన్ను భుజానవేసుకుని ఇంటికి వచ్చి ఒక సంచిలో గుడ్డలు సర్దుకుని రైలెక్కింది. అది దిగాక బస్సెక్కింది. బస్ దిగాక అక్కడ వున్న రెండెద్దుల బండిలో ఒక గ్రామానికి తెచ్చి, నన్ను బయట మంచమ్మీద పడుకోబెట్టింది. బయటికొచ్చిన మాఅమ్మ తాతా, అవ్వా అమ్మను చూసి పెద్దగా ఏడ్వసాగారు. అమ్మ విషయం కర్ణాకర్ణిగా విన్న వారు అమ్మ కష్టానికి కరిగిపోయారు.

వారు ముసలివారు సరిగా నడవలేరుకూడా. తమ ఇద్దరు కొడుకులూ చదువుకుని నగరాలకెళ్ళిపోగా ఒంటరిగా ఆస్థి ఉన్న అనాధల్లా ఉన్నారు. అమ్మను చూసి తమను ఆదుకోను వచ్చిన దేవతగా భావించారు. అమ్మ వారికి ధైర్యం చెప్పి, తనపరిస్థితీ చెప్పి, తనకు ఆశ్రయం ఇవ్వమని కోరింది. వారు సంతోషంగా అంగీకరించి ఆహ్వానించారు. అమ్మ స్థితి తెలిసి వారూ బాధపడ్దా చేసేదేమీ లేక మాఇద్దరికీ ఆశ్రయమిచ్చారు. ప్రేమ పంచారు. తాము అక్కడ కొచ్చిన విషయం గోప్యంగా ఉంచమని అమ్మ కోరగా అంగీకరించారు.

వారు ఊర్లో వారికంతా నోట్లోనాలికలా ఉండేవారు కావటాన, ఊరి వారంతా అమ్మనూ, నన్నూ ఎంతో అప్యాయంగా చూసేవారు. అమ్మస్థితి, నేనెందుకిలా మంచం పాలయ్యానో తెల్సి, ఆరాక్షసుడు ఊర్లోకి వస్తే తరిమి కొడతామని ముసలివాళ్ళకు మాటిచ్చారు. ఆస్థి తమ స్వార్జితం కావటాన పొలం, ఇల్లూ అంతా నాపేర వ్రాశారు, అవిటిదాన్ననీ బతకను పనికొస్తుందనీను. అమ్మ సంరక్షణలో సుఖంగా జీవిస్తూ, కొద్ది కాలానికి వారు స్వర్గస్తులయ్యారు.

అమ్మ ఆవులనూ, గేదెలనూ ఆ పాటికే కొని పాడిచేయసాగింది. ధర్మంగా నీరు కలపక చిక్కనిపాలు పెద్దగా లాభం లేకుండా అమ్మటాన త్వరలోనే అమ్మకు ‘పాలలక్ష్మమ్మ’ అనే పేరు వచ్చింది. అన్నట్లు మీకు చెప్పనేలేదుకదూ! అమ్మపేరు లక్ష్మి.

పొలం కౌలికిచ్చి, పాడి చేసుకుంటూ నన్ను చూసుకుంటూ జీవితం వెళ్లదీస్తున్నది అమ్మ. ముసలివారు పోయినపుడు అంతా వచ్చి ‘అమ్మ భర్తను వదిలేసి వచ్చి’ అక్కడున్నదని  తెల్సుకున్నారు. అమ్మ తల్లిదండ్రులు తిరిగి పంపాలని ప్రయత్నించి విఫలురయ్యారు. నాకప్పటికి పన్నెండేళ్ళు.

అమ్మ నాకు ఎక్కడైనా శస్త్ర చికిత్స చేయించాలని సొమ్ము కూడ పెడుతూ, వైద్యం కోసం విషయ సేకరణ కూడా చేస్తున్నది. నాకు ఇంట్లోనే చదువు నేర్పుతున్నది. అమ్మే నాగురువు, దైవం, మిత్రుడు, సన్నిహితురాలు అన్నీనీ.

నాకు దేవునిపై నమ్మకం లేదు ఎందుకంటే, ఆయన అమ్మకు అలాంటి రాక్షసునితో పెళ్ళి చేయించి ఇంత బాధ పెడతాడా! అని కోపంకూడా. దైవం లాంటి అమ్మ ఉండగా నాకు వేరే దైవమేల? అమ్మ అసలు అమ్మగా, అమ్మణ్ణిగా, శక్తి స్వరూపిణిగా, నవదుర్గగా, మహిషాసురమర్ధనిగా నాకు తెలిసొచ్చిన రోజది.

ఆ రోజు ఉదయం పన్నెండైంది. అమ్మ అన్ని పనులూ చేసుకుని నాకు భోజనం పెట్టను పళ్ళెంలో వడ్డించుకుని వచ్చి నాముందున్న ఎత్తు బల్లమీద పెట్టి నన్ను లేపి కూర్చోబెట్టింది.

"నా బంగారు తల్లీ! నీకు వైద్యం చేయించి, లేచి తిరిగేలా చేయడం నా ధర్మం తప్పక చేస్తాను. లేచి తిరుగుతావు. దాని కోసమే డబ్బుదాస్తున్నాను. నేను చదవలేకపోయిన చదువు నీవు చదివేలా చేస్తాను, నా కోరిక తీర్చుకుంటాను, నా బంగారు తల్లి, చదువుల రాణి అవుతుంది." అంటూ నాకు అన్నం పెడుతూ మాట్లాడుతున్నది.

ఇంతలో బయటి నుంచి "లక్ష్మీ! లక్ష్మీ!" అనే పిలుపు వినిపించింది. ఆమె కొద్ది సేపు ఆలకించి స్వరం గుర్తు పట్టింది.

"వచ్చాడు పిశాచి, అనుకున్నాను ఏదో ఒకరోజు వస్తాడని. బంగారూ! నీవు ధైర్యంగా ఉండు, ఆ లక్ష్మీ కాదు ఈ నాటి మీ అమ్మ. ఆ పిశాచాన్ని తరిమి వస్తాను. మళ్ళా రాకుండా చేస్తాను." అని చెప్పింది.

అనాధ ఐన రామయ్యతాతను, తాతగారు ఉన్నప్పటినుంచే ఇంట్లో పశువులను కాయను పనిలో పెట్టారు. ఆ తాత ఇంట్లోనే ఉంటాడు. అమ్మ రామయ్య తాతకేం చెప్పిందో కానీ ఒక్క పదినిముషాల్లో ఊరు ఊరంతా ఆడామగా కర్రలు తీసుకుని 'హేహే' అని అరుస్తూ మా ఇంటి ముందుకొచ్చారు. గ్రామస్తుల ఐక్యత, అప్యాయతా అలా ఉంటుందని నాకప్పుడే తెలిసింది.

అమ్మ వాకిట్లోకి వెళ్ళింది.

"లక్ష్మీ! నీకోసం ఎంతోకాలంగా ఎక్కడెక్కడో తిరిగి వెతికి పిచ్చివాడి నయ్యాను. ఏదీ నాతల్లి, నాకూతురు, నా ముద్దులబిడ్డ" అంటూ చుట్టూతా చూస్తున్నాడు, నాకు గదిలోంచి ఆతను కనిపిస్తూనే ఉన్నాడు.

అమ్మ పశువులను అదిలించే ములుగర్ర చేత పట్టుకుని, "ఎవర్రా! నీవు, పరాయింట్లోకి వచ్చి మాట్లాడుతున్నావ్! మర్యాదగా వెళ్ళు. కాళ్ళు విరుగుతాయి." అంది కఠిన స్వరంతో.

" నేను లక్ష్మీ! నీ భర్త నాగేశాన్ని, గుర్తు పట్టలేదా! ఔను మీ కోసం విచారించి గుర్తుపట్టలేనంతగా పాడైపోయాను." అన్నాడాయన.

"నా భర్త ఎప్పుడో పోయాడు. వెళ్ళు బయటకు మర్యాదగా లేకపోతే..."

"లక్ష్మీ! నా లక్ష్మీ! నాబిడ్డ, నాకూతురు, ముద్దులబిడ్డ ఒకమారు చూసి వెళతాను" అంటూ ఇంట్లోకి రాబోయాడు.

అమ్మ కర్ర అడ్డుపెట్టి , "దాటావా! కాళ్ళు విరుగుతాయ్!" అని హెచ్చరించింది.

"ఒక్కమారు నా బిడ్డను చూపు" అంటున్న అతడిని కర్రతో ఆపి, వెనక్కు నెట్టి,

"ఛట్! వెళ్తావా లేదా! పిశాచీ! అందరినీ పిలిచి కాళ్ళిరగ్గొట్టి వెళ్ళగొట్టాలా! ఎవర్రా ! నీభార్య!  కబడ్దార్. నడూ బయటికి, పసిబిడ్డ అని కూడా చూడక గుమ్మానికేసి కొట్టినపుడు నీ బిడ్డకాదా! ప్రాణం పోయేలాగా కర్రతో కొట్టినపుడు నీ భార్య కాదా! ఇప్పుడు కోట్లకు అధికారి అని తెల్సి నీబిడ్డ అనివస్తావురా! ఆస్థికోసం నాటకాలాడకు నడూ! బయటికి" అని గర్జించింది ఆడపులిలా.

కర్రతో దారిచూపింది బయటకు. ఊరివారంతా రావడం చూసి, వారి అరుపులు విని ఆ దుష్ట పిశాచి గొడవవుతుందని బయటికి నడిచాడు. ఊరివారంతా "మళ్ళా ఇటువచ్చావో చచ్చావే" అంటూ వెనుకనుండి పెద్దగా అరుస్తుండగా గబగబా నడుస్తూ వెళ్ళిపోయాడు.

మా జీవితాల్లోంచి ఒక దుష్టగ్రహం వదిలిపోయింది. అమ్మ బాగా ఆలోచించి మరెన్నడూ మాజోలికి రాకుండా అస్థిపాస్థులు ఐనకాడికి అమ్మేసి ‘నా శస్త్రచికిత్సకోసం, నా చదువుకోసం’, అని చెప్పి ఎక్కడికెళ్ళేదీ ఎవ్వరికీ చెప్పక, నన్ను తీసుకుని మరో దూరపు నగరానికి వలస వచ్చేసింది. అమ్మ, నా అమ్మ, నా దేవత.

(సమాప్తం)

Posted in May 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!