Menu Close
chitra-padyam

॥ శ్రీలక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్॥

చిత్రపద్యము
చం.
పదములు పద్యముల్ మధుర
        భావజభాసురభక్తిభావనల్
పదములు వాక్యముల్ పరమ
        పావనమఞ్జులగీతజాలమున్
పదములు చేరగానొసగు
          భవ్యపు భాగవతంపు తేనె ష
ట్పదముల రీతిలో తెలిసి
          పానము జేయవె డెందెమా యిటన్
చిత్రపద్యము
ఉ.
నే లసదాత్మ, వే కరుల
        నేతను భూవిభునంచు ప్రేలి పా
పాలను జేసినా సునగ
         పాలుఁ గృపాలుడు “పాహిమాం ప్రభో!
కాలజభీతిజంప సరి
        కాలము” యంచును మ్రోకరిల్ల పా
పాలనొనర్చె ముక్కలుగ
         బల్లిదుడై జనులెల్ల మెచ్చగన్
చిత్రపద్యము
చం.
పసగల యొజ్జయే గలుగ
      వ్యర్థుడునయ్యెను గాంచగా మహా
రసఫల కావ్యకర్త మరి
      ప్రాభవమందెను కుంభినిన్ గనన్
ప్రసవము జేసెనే గురువు
      పామర జీవిని విద్యనెట్లనన్
ముసలము మోసులెత్తి నును మొగ్గలు
      పూసె మనోహరంబుగా
చిత్రపద్యము
శా.
శ్రీసత్యాత్మిక దీప్తిపుఞ్జములతోన్
        శ్రీమాత ప్రేమమ్ముతో
నేసత్సాంద్ర శుభస్థితిన్ తపముగా
         నేనాట నీవేదవి
ద్యాసంస్థాళి యనే తలంపునిడిరో
         యాసాంతముత్ఫుల్లమై
భాషాగీత మహాసుధామమగుచున్
         భాసిల్లె “వేదమ్ము”గా
చిత్రపద్యము

గీ.
అతిశయించిన వినయము పతనమిచ్చె
మేరమీరిన ప్రేమలు ఘోరమయ్యె
మించి యలదగా సొబగులు కంటజేరి
కలువకంటికి కుంకుమ గరళమయ్యె

Posted in August 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!