Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
చింతాకంత సహాయానికి అరిటాకంత ప్రతిఫలం

అమర్ ఒక అనాధ. వాడికి ఆ పేరు ఎవరు పెట్టారో కూడా వానికి తెలీదు. ఎవరో ఆ పేరుతో పిలిచి ఉండటాన అంతా అలానే పిలవసాగారు. అమర్ విజయవాడ ఫ్లాట్ ఫాం మీద ఉండే షాపులవారందరికీ ప్రీతిపాత్రుడు. ఎవరేపని చెప్పినా అణకువగా చేసే వాడంటే అందరికీ ఇష్టమే. వేళకు ఎవరో ఒకరు ఇంత తిండి కడుపునిండా పెట్టేవారు. కాస్త పెద్దై పన్నెండేళ్ళ వాడయ్యాక వానికి ఒక మంచినీళ్ళ సీసాలు అమ్మే షాపు యజమాని రైల్లో అవి అమ్ముకోను అనుమతి రైల్వే అధికారుల నుండి ఇప్పించి తన మంచి నీళ్ళ సీసాలు అరటి పళ్ళూ అమ్మే వెండర్ గా మార్చాడు అమర్ ను. తిరుపతి వైపు వెళ్ళే రైల్ ఎక్కడం, మంచినీళ్ళ సీసాలు అమ్ముకుని తిరుగు రైల్లో వెనక్కు రావడం. తిరుపతి రైల్వే ఫ్లాట్ ఫాం మీది షాపులవాళ్ళు సైతం అమర్ మంచితనం గుర్తించి క్రమంగా వారూ అమర్ కు మంచినీళ్ళ సీసాలు తిరుగు ప్రయాణం విజయవాడకు వెళ్ళేప్పుడు అమ్ముకోను ఇవ్వసాగారు. ఎవరి సొమ్ము వారికి న్యాయంగా తిరిగి ఇచ్చేవాడు అమర్. అలా వాడు నిజాయితీపరుడనే పేరు తెచ్చుకున్నాడు. వారు ఇచ్చే సొమ్ముతో తన అవసరాలు తీర్చుకుంటూ వారు వేళకు పెట్టే తిండి తింటూ జీవనం సాగించసాగాడు.

ఒక రోజున తిరుపతి నుంచి వచ్చే రైల్లో మంచినీళ్ల బాటిల్స్ అమ్ముకుంటూ ఒక జనరల్ బోగీ లోకి వచ్చాడు అమర్. బోగీ అంతా తిరిగి అమ్ముకున్నాక అక్కడ ఒక మూల సింగిల్ సీటుమీద కూర్చునున్న ఒక వ్యక్తిమీద అతడి దృష్టి పడింది. బాగా ధనికునిలా ఉన్నాడు, ఎందుకో దిగాలుగా ఉన్నాడు. తన వద్ద మంచినీళ్ల సీసాలు ఐపోయాయి ఒక్కటే మిగిలి ఉంది. అరటి పళ్ళూ రెండే ఉన్నాయి. అతడి ఎదురుగా వున్న సీటు ఖాళీగా ఉండటాన దాని మీద కూర్చుని అతనికేసి చూడసాగాడు. ఎందుకో అతడిని పల్కరించాలనిపించింది అమర్ కు.

"బాబుగారూ! ఎక్కడిదాకా అండీ! బాగా అలసి పోయినట్లున్నారు అలాగే ఎందుకో ఆందోళనగా కూడా ఉన్నట్లున్నారు" అనడిగాడు. అమర్ పిలుపులోని ఆత్మీయతకు ఆయనకు కళ్లనీరు వచ్చింది.

వెంటనే అమర్ "బాబుగారూ మిమ్మల్ని చూస్తుంటే గొప్పవారులా ఉన్నారు. ఈ జనరల్ బోగీలో ప్రయాణించే వారిలా లేరు. దాహంగా వున్నట్లున్నారు. ఈ నీరు త్రాగండి." అంటూ ఇచ్చాడు.

ఆ మనిషి "బాబూ! నా బ్యాగ్, పర్స్ టికెట్ తో సహా ఎవరో కొట్టేసారు. సెకండ్ ఏసీ టికెట్ కొని బాత్ రూంకెళ్ళి వచ్చేసరికి నా బ్యాగ్ లేదు. జేబులో మిగిలి వున్న సొమ్ముతో ఈ జనరల్ టికెట్ మళ్ళా కొని ఎక్కాను. విజయవాడలో దిగాలి." అని చెప్పాడు.

"బాబుగారూ! నీళ్ళు త్రాగండి బాగా దాహంగా ఉన్నట్లున్నారు. ఈ అరటి పళ్ళు తినండి, ఆకలిగ ఉన్నారు" అంటూ ఇచ్చాడు.

"బాబూ! నీవు వీటిని అమ్ముకోడం చూసాను. ప్రస్తుతం నా దగ్గర నీకివ్వను సొమ్ము లేదు. నేను గుండె జబ్బు మనిషిని. ఏదైనా తిని మందు వేసుకోవాలి. చాలా జరూరు పనిమీద ఒంటరిగా వచ్చాను." అన్నాడు.

"బాబుగారూ ! ఏమీ ఫరవాలేదు. నేను కూడా విజయవాడలోనే దిగుతాను. దయచేసి పెద్దవారు ముందు తిని మందు వేసుకోండి" అంటూ బలవంతాన అరటి పళ్ళు, నీళ్ల సీసా మూత తీసి ఇచ్చాడు.

ఆ పెద్దాయన వెంటనే పండ్లు రెండూ తినేసి, నీరు త్రాగి, జేబులో వుంచుకున్న మందు బిళ్ళ వేసుకుని స్థిమిత పడ్డాడు. పది నిముషాలకు తేరుకున్నాడు.

"బాబూ! నీ మంచితనం చెప్పలేను ఆ వెంకటేశ్వర స్వామివారే నీ రూపంలో వచ్చారేమో! ఈ మందు పడక పోతే నా గుండె ఏమవుతుందో తెలీదు. నీవు ఈ రోజు నా ప్రాణం కాచావు. ఎక్కడ ఉంటావు బాబూ! నీ సొమ్ము నీకు తిరిగి ఇవ్వాలికదా! నీ పేరేంటి బాబూ?" అని ఆయన అన్నదానికి,"బాబుగారూ! ఈ కాస్త ఈ సొమ్ము నాకివ్వాలని అనుకోకండి. మీకు సమయానికి సేవ చేయగలగడం నా అదృష్టంగా భావిస్తాను. నా బతుకు కేరాఫ్ ప్లాట్ ఫారం బాబూ. అనాథను. నాపేరు అమర్!" అంటూ స్టేషన్ దగ్గర పడటాన "వస్తాను బాబుగారూ!" అంటూ దిగి వెళ్ళాడు అమర్.

తర్వాత సరిగ్గా వారానికి అమర్ నీళ్ళ సీసాలున్న బుట్టతో తిరుపతి వెళ్ళే రైల్ ఎక్కబోతుండగా "బాబూ! అమర్ ! ఆగు ఆగు" అనే పిలుపు వినిపించి వెనక్కు చూశాడు అమర్.

ఎవరో మంచి దుస్తుల్లో అమర్  కేసి రావడం చూశాడు. అమర్ ఆగి ఆయన దగ్గర కొచ్చాక గుర్తు చేసుకున్నాడు. వారం క్రితం తాను మంచి నీళ్ల సీసా ఇచ్చిన వ్యక్తి గా గుర్తుకు వచ్చాడు.

"బాబుగారూ! మీరా! ఆ పదిరూపాయలివ్వను నన్ను వెతుక్కుంటూ వచ్చారా! వద్దన్నానుకదా! బాబుగారూ! " అన్నాడు అమర్ నొచ్చుకుంటూ.

“బాబు! అమర్! ఆనీళ్ళ సీసాల బుట్ట ఎక్కడైనా పెట్టి నాతో రావాలి. నీకోసం ఆ మరునాటి నుంచీ చూస్తూనే ఉన్నాను. ఫ్లాట్ ఫాం మీద అందరినీ 'అమర్ తెలుసా!' అని అడుగుతూనే ఉన్నాను. చివరకు ఆ నీళ్ళ సీసాల షాపు అతను చెప్పాడు, 'ఉదయం తిరుపతి వెళ్ళి సాయంకాలానికి వస్తావని'. అందుకే ఈ రోజు ఉదయాన్నే వచ్చాను" అంటూ తొందరచేసి అమర్ బుట్ట నీళ్ళ సీసా షాపు వానికి ఇచ్చాక ఆ వ్యక్తి అమర్ చేయిపట్టుకుని తనతో రైల్వేస్టేషన్ బయటికి తీసుకెళ్ళి అక్కడ వున్న ఒక పెద్ద కార్లో ఎక్కమన్నాడు.

అమర్ "బాబుగారూ! మీరెవరో నాకు తెలియదు. నేనెవ్వరినీ మోసం చేయలేదు. చిన్న దొంగతనమైనా చేయలేదు. నన్నెక్కడికి తీసుకెళతారు? ఎందుకు కారు ఎక్కమంటున్నారు? తెలియని చోటికి ఎలా రాగలను?" అని అడిగాడు.

దానికా వ్యక్తి "బాబూ! నిన్ను నేను ఏ ఇబ్బందికరమైన చోటికీ తీసుకెళ్లడంలేదు. మా ఇంటికి. అంత మేలు చేసి నా ప్రాణం కాచిన నిన్ను చూడాలని మా ఇంటామె కోరుతున్నది. అందుకే నిన్ను తీసుకెళుతున్నాను. రా నాయనా! నీకే ఇబ్బందీ కలుగదు" అని చెప్పాక కాస్త పెద్దవాడూ శారీరకంగా బలమైనవాడూ ఐన అమర్ ఏదైనా ఇబ్బంది కలిగితే తనను తాను రక్షించుకోగలడనే ఆత్మ విశ్వాసంతో కారెక్కాడు.

అలా ఆయనతో కలసి అమర్ కార్లో వెళ్ళి, కారు ఒక పెద్ద బంగళా ఇంటిముందు ఆగాక, ఆయన దిగి అమరునూ దిగమన్నాడు. అమర్ ఆ ఇంటికేసి ఎగాదిగా చూస్తూ ఆయనతో కలసి ఇంటి లోపలికి వెళ్ళాడు.

అక్కడ హాల్లో వీరికోసమే ఎదురుచూస్తున్నదా! అన్నట్లు ఒక మహిళ వీల్ ఛైర్లో కూర్చుని ఉంది.

ఆ పెద్దాయన "చూడు లక్ష్మీ! నా ప్రాణ రక్షకుడ్ని తెచ్చాను. నీవు చూడాలనుకున్నావు కదా!" అంటూ అమర్ చెయ్యి పట్టుకుని ఆమె ముందు నిలిపాడు.

ఆమె అప్యాయంగా అమర్ ను దగ్గరికి తీసుకుని నుదురు ముద్దాడింది. అందంగా ఉంగరాల జుత్తుతో ఒద్దికగా, చూడగానే వినయంగా ఉన్నాడనిపించే అమర్ ఆమె కెంతగానో  నచ్చాడు. "అయ్యా! మనం ఎవరికోసమో వెతుక్కోడ మెందుకూ ఈ రక్షకుడినే మన భవిష్యత్ రక్షకునిగా మన బిడ్డగా పెంచేసుకుందాం" అంది.

"నిజం లక్ష్మీ! అలాగే చేద్దాం. నాకీ ఆలోచేనే రాలేదు. సుమా! ఎంతైనా నీవు నాకంటే చాలా తెలివైన దానవు." అంటూ "అమర్ బాబూ! మాకు దేవుడు కావలసినంత ఆస్థి ఇచ్చాడు. సంతానాన్ని మాత్రం ఇవ్వలేదు. ఈమె నా భార్య. మేం రైతులం. కావాల్సినంత పొలం పళ్ళతోటలూ ఉన్నాయి. నేను పెద్దగా చదువుకో లేదు. ఈమెకు ఏదో జబ్బు చేసి నడువలేకుండా పోయింది. వీల్ ఛైర్లోనే ఉంటుంది. ఎంతో వైద్యం చేయించాను ఐనా ఫలితం కలుగలేదు నాయనా! నేను తిరుపతిలో ఒక బిడ్డ దత్తుకు ఉన్నాడని తెలిసి వెళ్ళి వస్తూ నా పర్స్ మొబైల్ ఫోను అన్నీ ఉన్న బ్యాగ్ పోగొట్టుకుని, ఇంత ఆస్థి ఉన్నా కనీసం త్రాగను నీరులేని నన్ను నీవు కాపాడావు. ఇహనుంచీ నీవే మా బిడ్డవు. కాదనక మమ్మల్ని అమ్మానాన్నలను చేయి, మాతో ఉండు. పధ్ధతి ప్రకారం నిన్ను దత్తత తీసుకుంటాం. రిజస్ట్రేషన్ చేయిస్తాను. మాకు పెద్ద వయస్సు లో దిక్కుగా ఉండు. బాగా చదువుకో. మా తదనంతరం మేము నడిపే వ్యాపారాలన్నీ చూస్తూ సమాజ సేవచేయి నాయనా!" అన్నాడు.

"బాబు గారూ! మీరెవరో నేనేవరో! నాకులం గోత్రం తెలీకుండా నన్ను దత్తత తీసుకుంటారా! నా గుణగణాలు ప్రవర్తనా తెలుసుకోవద్దా!" అన్నాడు.

"అమర్! ముఖం తెలీని వానికి నీరిచ్చి కాపాడటంలోనే నీ గుణ గణాలు ప్రవర్తనా తెలిసాయి. ఇహ కులమంటావా! మానవకులం. గోత్రం కూడా దైవగోత్రం. ప్లీజ్ కాదనకు" అంటూ అమర్ చేతులు పట్టుకున్నాడా పెద్దాయన.

అలా అమర్ వారి దత్తు బిడ్డగా మారి, బాగా చదువుకుని వారికి కంటిని రెప్పలా చూసుకుంటూ వారిద్దరిపేర 'లక్ష్మీవాస' నిలయం అనే ఒక అనాధశరణాలయం నెలకొల్పి, సమాజ సేవచేస్తూ నిజాయితీగా జీవించాడు.

చూశారా! అమర్ చేసిన 'చింతాకంత సాయానికి అరటాకంత ప్రతిఫలం లభించింది. అందుకే మానవసేవే మాధవసేవ అన్నారు. అవసరానికి చేసే సేవే నిజమైన సేవ, ప్రతిఫలం ఆశించని సేవే గొప్పసేవ. అదే మనలను కాపాడుతుంది.

Posted in October 2021, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!