Menu Close
కేసు క్లోజయిపోయింది
-- గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం --

“ఏమండీ, పేరయ్యశాస్త్రి గారితో మాట్లాడేరా.” భర్త రామాంజనేయులు గారిని ఉద్దేశించి, అడిగింది సీతాలక్ష్మి.

"ఆ, పొద్దున్న ఆయనతో మాట్లాడేను. సాయంత్రం అయిదు గంటలకు వస్తానన్నారు. ఇప్పుడే కదా...అయిదయింది. వస్తారు సీతాలూ... దారిలో ఉండి ఉంటారు."

శాస్త్రిగారు రావడానికి, ఈజీగా మరో అరగంట పడుతుందని, ఆ దంపతులకు తెలీదండి. కారణం ఏమిటి, అంటారా. దారిలో, అతని స్కూటీ, మరి ముందుకు పోను, అని మొండికెత్తిందండి. శాస్త్రిగారు దానిని దారిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. సరేలెండి; ఆ దంపతుల్ని అలా వెయిటింగులో ఉండనివ్వండి. శాస్త్రిగారు వచ్చేలోగా, మనం కొంత ఫ్లాష్ బ్యాక్ చేద్దాం.

రామాంజనేయులు గారు, విశాఖపట్నంలో పేరున్న పురోహితులు. భార్య సీతాలక్ష్మి, ఆయనకు దగ్గర బంధువే. ఆ దంపతులకు ఇద్దరు సంతానం; పార్వతి, శేఖరం. మొదటి సంతానం పార్వతికి పెళ్లయింది. ఆవిడ భర్త, గోపాలరావు, L.I.C. ఏజెంటు. రెండవ సంతానం శేఖరం, B.Sc. పాసయ్యేడు. కాలక్షేపానికి, లా కాలేజీలో చేరేడు గాని, అతగాడు ఉద్యోగపర్వం ప్రారంభించే ప్రయత్నాలలో ఉన్నాడు. బ్యాంకుల్లో ఆఫీసర్లు, క్లర్కులు ఉద్యోగాలికి, ఇంకా మరేవో, ఇతరత్రా ఉద్యగాలకు, పరీక్షలు రాసేడు. వాటిలో ఓ మూడింటిని, ఇంటర్వూలు వరకూ లాగించేడు. L.I.C. లో అసిస్టెంటు ఉద్యోగాలకు, తగు ప్రయత్నం చేసేడు. మూడు వారాల క్రిందటే వాటి ఫలితాలు వచ్చి, శేఖరు మూడు పాడు చేసేయి. కాని, మనవాడు నిరాశ చెందలేదు. ఏమంటారా; ఇంకా కొన్నింటి ఫలితాలు రావలసి ఉండేది. అది దృష్టిలో పెట్టుకొని, వాటిలో, ఏదయినా ఒకటి తగలాలని, రోజూ, పూజామందిరంలోని దేముళ్ళకు పెట్టుకొనే నమస్కారాల సంఖ్య పెంచేడు. అవి పని చేసాయండోయ్. మనవాడు, అంటే శేఖరు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్లర్కు ఉద్యోగానికి ఎంపికయ్యేడు. మనవాడికి, ఇంజినీరింగు కాలేజీల్లో సీటు రాని రోజుల్లో అందరూ వాడిని 'బిలో ఏవరేజ్' అనేవారు. వాళ్ళే ఇప్పుడు, ‘శేఖరు తెలివయినవాడు...ఏదో మామూలు ఉద్యోగమా...బ్యాంకులో ఉద్యోగం...అందులోను, దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో రెండోది.’ అని ప్రశంసల వర్షం కురిపించసాగేరు.

కొడుకు బ్యాంకు ఉద్యోగి కాబోతున్నాడని తెలిసి, పురోహితులుగారు, సీతాలక్ష్మి ఉబ్బి తబ్బిబ్బయ్యేరు. ఎందుకు అవ్వరండి…బ్యాంకులో ఉద్యోగమా…మజాకానా…ఎంత స్టేటస్సు.

పురోహితులుగారికి, పి.ఎన్.బి. లో పనిచేస్తున్న స్వామిగారనే ఆఫీసరుతో ఈ మధ్యనే పరిచయమయింది. ఎలా అంటారా? ఆ ఆఫీసరు ఇంట్లో ఆయన సత్యనారాయణ వ్రతం చేయించేరు. విశాఖపట్నంలోని ఏ బ్రాంచీలలో ఖాళీలు ఉన్నాయో కనుక్కోడానికి, పురోహితులుగారు ఆ ఆఫీసరును కలిసేరు. ఆయన, “ఈ ఊళ్ళో ఉన్న ఖాళీలతో, మీ వాడి పోస్టింగుకు సంబంధం లేదండీ.” అని కబురు చల్లగా చెప్పేడు. ఖంగు తిన్న ముఖంతో, “ఎంచేత” అని ఆఫీసరు కళ్ళలోనికి చూస్తూ అడిగేరు పురోహితులుగారు.

ఆ విషయంలో వారి బ్యాంకు నియమావళి పురోహితులుగారికి ఆఫీసరు ఇలా బోధపరిచేరు.

పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొత్తగా చేరిన క్లర్కులు ముందుగా పల్లెవాసం చేయాలి. అనగా...ఏదయినా ఒక పల్లెటూరి బ్రాంచిలో మూడు, నాలుగు సంవత్సరాలవరకు పని చెయ్యాలి. ఆ తరువాత ఆనాటికి కొత్తగా చేరిన క్లర్కులు వారిని పల్లెవిముక్తులను చేస్తారు. అలా విముక్తి చెందిన వారు ఏదో చిన్నో, పెద్దో పట్టణం బ్రాంచిలో నియమితులవుతారు.

ఆఫీసరు అందిచ్చిన గ్లాసుడు చల్లటి నీళ్లు త్రాగి పురోహితులుగారు ఇల్లు చేరుకొన్నారు. ఇల్లు చేరేక, రామాంజనేయులు గారు ఉద్యోగంలో తమ కుమారుడు చేయవలసిన పల్లెవాసం వివరాలు భార్య చెవిలో వేసేరు. పుత్రరత్నానికి బ్యాంకులో ఉద్యోగం దొరికిందని ఆ దంపతులు పొందిన సంతోషంలో సగభాగం ఆవిరయిపోయింది. ఫరవాలేదు. కొద్దిసేపటికి ఆ షాకునుండి బయటపడ్డారు. రాములవారికి కూడా అరణ్యవాసం తరువాతేగా పట్టాభిషేకం జరిగింది. చూస్తూ ఉంటే ఇట్టే అయిపోతాయి మూడునాలుగేళ్ళు. అని, ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకొన్నారు. కానీ, అంతలోనే వారికో సమస్య ఎదురయింది. అది కొద్దిగా పెద్ద సమస్యేనండోయ్. మన హీరో భోజనప్రియుడు. తినడానికి నవరుచులూ కావాలి. కాని, చేసుకోడానికి కాఫీ కలుపుకోవడం కూడా రాదు. పల్లెటూళ్లలో మనవాడికి రుచికరంగా ముద్దపప్పు, ముక్కలపులుసు, చేసి వడ్డించే హోటళ్లు ఎక్కడుంటాయ్. అలాగని బ్యాంకు ఉద్యోగం మానుకోలేడుగా. మళ్ళీ దంపతులిద్దరూ ఆ రాములవారినే తలచుకొన్నారు. ఆనాడు అయోధ్యరాముడు, సీతాసమేతంగా వెళ్ళేడుగా అరణ్యవాసానికి. అవ్విధంబున, తమ కొమరుని కూడా పల్లెవాసానికి సతీసమేతముగా పంపడమే ఉచితమని తలచేరు. సరే, సమస్యకు సమాధానం దొరికింది. కాని, సమయం అట్టే లేదు. రాములవారు తెరమీదకు వచ్చేరు. కైకేయి కోరికమేరకు శ్రీరాముడు తక్షణమే అరణ్యవాసానికి బయలుదేరినట్లే బ్యాంకునుండి ఆర్డరు రాగానే శేఖరుడు కూడా పల్లెవాసానికి, వెనువెంటనే ప్రయాణమవ్వాలి. అయితే కిం కర్తవ్యమ్. మరేమీ లేదు. వీలయినంత తొందరలో మనవాడికి జోడీ చూడాలి.

ఆ ఊరిలో పెళ్ళిసంబంధాలు చూడాలి అంటే, పేరయ్యశాస్త్రిగారినే సంప్రదించాలండి. వెంటనే పేరయ్యశాస్త్రిగారిని రంగంలోకి దింపాలి అని దంపతులిద్దరూ ఆలోచించుకొన్నారు. అయితే, ఆ ప్రణాళికలో ఒక చిన్న వ్యూహాన్ని ఇమిడ్చేరు. పేరయ్యశాస్త్రిగారికి పెళ్ళికొడుకు వివరాలు బ్యాంకు వివరాలు మాత్రమే తెలియజేయాలి. కాని పొరబాటున కూడా అబ్బాయి పల్లెవాసం ఊసు ఎత్తకూడదు. అంతే కాదండోయ్. అబ్బాయికి విశాఖపట్నంలో పోస్టింగుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని జంకు లేక బొంక దలచుకొన్నారు. అది తప్పు కాదండోయ్. ఎలా అంటారా. పెళ్ళివంటి కొన్ని అత్యవసర సందర్భాలలో బొంకడం తప్పు కాదు… అని, ఒకానొక సందర్భంలో, బలిచక్రవర్తికి శుక్రాచార్యులవారు హితవు పలికేరు. ఆ విషయం పోతనగారు తమ భాగవతంలో రాసేరు. అందుచేత, సీతారామాంజనేయ దంపతులు తలచినది సందర్భోచితమే.

అదండి, ఫీడ్ బ్యాకు. సరే, అటు పేరయ్యశాస్త్రిగారు వచ్చేరు. వాళ్ళు అప్పుడే ఏదో మాట్లాడేసుకొంటున్నారండి. మన దృష్టి అటు సారిద్దామా.

పేరయ్యశాస్త్రిగారు వేంచేసేరు. సీతారామాంజనేయ దంపతులు తమ కొమరుని వివాహ విషయానికి నాంది పలికేరు.

“మా అబ్బాయి శేఖరం, పంజాబు నేషనలు బ్యాంకులో క్లర్కు ఉద్యోగానికి సెలెక్టయ్యేడు శాస్త్రిగారూ.” పురోహితులుగారు, కథ ప్రారంభించేరు.

“శుభం, ఏ ఊళ్ళో వేసేరు” శాస్త్రిగారి ప్రశ్న.

“అది ఇంకా తెలీదండి. సెలెక్టు అయ్యేడు అనే తెలిసింది. రెండుమూడు వారాల్లో ఆర్డరు రాగానే ఏ ఊళ్ళోవేసింది తెలుస్తుంది.” పురోహితులుగారి ఉవాచ.

“మన ఊళ్ళో వెయ్యడానికే...ప్రయత్నాలు చేస్తున్నాం. భగవంతుని దయ మీవంటి పెద్దల ఆశీర్వచనం ఉంటే అనుకొన్నట్టూ అవుతుంది.” సీతాలక్ష్మిగారు, అల్లిన వ్యూహాన్ని అమలులో పెట్టేరు.

“ఆ బ్యాంకులో స్వామిగారనే ఆఫీసరు నాకు బాగా తెలుసమ్మా. ఆయన మేనల్లుడు పెళ్లి విషయంలో నాలుగయిదు మార్లు నన్ను కలిసేరు. ఆయన చెవిలో మీ అబ్బాయి విషయం వేస్తాను. వీలయితే ఏదయినా సాయం చెయ్యమంటాను.” శాస్త్రిగారు ఆ ప్రయత్నాలలో తనూ ఒక చెయ్యి వేస్తానన్నారు.

ఆమ్మో, కొంప మునిగిందనుకొన్నారు దంపతులు. ఎంచేతనంటారా. ఆ స్వామిగారేనండి పురోహితులవారికి శేఖరు పల్లెవాసం విషయం చెప్పేరు. వెంటనే డేమేజ్ కంట్రోల్ చెయ్యాలి, అనుకొన్నారు పురోహితులు.

“శాస్త్రిగారూ, ఆ స్వామిగారు, నాకూ...పరిచయమే. నిన్ననే, ఆయనతో మాట్లాడేను. అదే విషయం మీరు కూడా ఆయనతో మాట్లాడితే నేను ఆయనమీద ఒత్తిడి తెస్తున్నానేమో అని, ఆయన అపోహ పడవచ్చు.” పురోహితులవారు కథ అడ్డం తిరగకుండా ఆపేరు.

“అవును. మీరన్నది నిజమే. ఆయన చేయగలిగినది తప్పక చేస్తారు. మళ్ళీ మళ్ళీ చెప్పఖ్ఖర్లేదు.” శాస్త్రిగారు పురోహితులవారి దారిలోకి వచ్చేరు.

“మా వాడికి మా ప్రయత్నాల వల్ల మన ఊళ్ళోనే వేస్తే ఏ సమస్యా ఉండదు. కాని, శాస్త్రిగారూ అదే ఏ గుంటూరో విజయవాడో వేసేరనుకోండి భోజనానికి నానా ఇబ్బందీ పడతాడు. అదీ మా భయం. (ఆ ప్రసక్తే లేదని తెలిసి అన్న మాటలవి. ఎంచేతంటే అవి పల్లెవాసాలు కావు.) మన ఇంట్లోనే పొరపాటున ఓ అరమిరపకాయ ఎక్కువ పడితే ముచ్చెమటలూ పోసేసుకొంటాడు. ఆ ప్రాంతాల్లో కారాలు మరీ ఎక్కువగా తింటారుట.” అని, సీతాలక్ష్మిగారు, తన అభిప్రాయం చెప్పేరు.

“తింటారు...ట ఏమిటమ్మా. సందేహం ఏమీ...లేదు. ఖచ్చితంగా తింటారు. నాకు అనుభవమయింది.” శాస్త్రిగారు కారాల మాట ధృవీకరించేరు.

“అక్కడి హోటళ్లలో రోజూ భోజనం చేస్తే మా వాడు మంచం పట్టేస్తాడేమో అని మా భయం.” పురోహితులవారి చింత.

“అందులో సందేహం లేదండీ.” శాస్త్రిగారు అదీ ధృవీకరించేరు.

“ఇవన్నీ ఆలోచించి, వాడికి వెంటనే, ఆర్డర్లు వచ్చే లోపల పెళ్లి చేసేస్తే ఏ ఊళ్ళో వేసినా ఫరవాలేదు అని అనుకొంటున్నాం.” కథా వస్తువు బయట పెట్టేరు సీతాలక్ష్మి గారు.

“ఒక మారు జాయినయితే ఏడాది రెండేళ్ల దాకా శెలవు దొరకదట. అందుకని…తొందర పడుతున్నాం శాస్త్రిగారూ.” పురోహితులవారు మరో పాయింటు చెప్పేరు.

“అన్ని విధాలా అబ్బాయికి వెంటనే వివాహం చేయడం అత్యుత్తమం.” శాస్త్రిగారు కూడా ఏకీభవించేరు.

“ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రమ తీసుకొని వీలయినంత త్వరలో మా వాడిని ఓ ఇంటివాడిని చేయాలండి.” పురోహితులవారి నివేదన.

“ఇందులో శ్రమ ఏముందండి. మీ అబ్బాయి బయోడేటా జాతకం కాపీలు తయారుగా ఉన్నాయా.”

“ఇదిగో ఈ కవరులో ఆ వివరాలతోబాటు వాడి ఫోటో కూడా ఉంది.” పురోహితులవారు ఆ కవరును వినయంగా శాస్త్రిగారికి అందజేసేరు.

“నేను ఇంటికి వెళ్ళగానే నా కంప్యూటరులో ఈ వివరాలన్నీ ఎక్కిస్తాను. నా కంప్యూటరులో ఉన్న పెళ్లికూతుళ్ల వివరాలు చూసి మీ వాడికి సరయిన జోడీ చూస్తాను. రెండుమూడు రోజుల్లొ, తప్పక ఏదయినా తగు సంబంధం కుదురుతుంది. నిశ్చింతగా ఉండండి.” శాస్త్రిగారు దంపతులకు హామీ ఇచ్చేరు.

“చాలా చాలా థేంక్సండి. మరేవయినా వివరాలు కావాలంటే ఫోను చెయ్యండి.” దంపతులిద్దరూ వినయంగా ధన్యవాదాలు చెప్పుకొన్నారు.

“మరి, ఇచ్చి పుచ్చుకోడాల సంగతి కూడా తెలిస్తె, ఆవతలవారితో అన్ని విషయాలు ఒకేమారు మాట్లాడవచ్చు.” నర్మగర్భంగా అడిగేరు, శాస్త్రిగారు.

“ఇందులో మీకు తెలియనిది ఏముందండి. ఈ మధ్యనే మన కాశీపతిగారి మూడోవాడు ఏదో చిన్న కోపరేటూ బ్యాంకులో, ఎదుగూ బొదుగూ లేని గుమస్తా ఉద్యోగంలో చేరేడట. వాడికి మూడు లక్షలు పుచ్చుకొన్నారట. మా వాడిది పెద్ద... గవర్నమెంటు బ్యాంకులో ఉద్యోగం. ఆ బ్యాంకులో ప్రొమోషనులు కూడా తొందరగా వస్తాయట. ఆ లెఖ్ఖన, ఓ అయిదు దాకా అయితే ఎక్కువ ఏమీ కాదనుకొంటాం.” సీతాలక్ష్మిగారు ఈక్వేషను విడమరచి చెప్పేరు.

“నిజమే అనుకోండి కాని, ప్రస్తుత పరిస్థితులలో కొద్దిగా ఇటూ అటూ అయినా ఫరవా లేదనుకొంటాను.” శాస్త్రిగారు వివరణ కోరేరు.

“మీరే ఆలోచించి ఎలా అంటే అలా చేద్దాం.” పురోహితులవారి స్పందన.

“శలవా మరి.” పయనమయ్యే సూచన ఇచ్చి శాస్త్రిగారు నిష్క్రమించేరు.

పేరయ్యశాస్త్రిగారి ఆఫీసు వర్కు అంతా హైటెక్కండి. ఇంటికి వెళ్ళగానే మన శేఖరు బయోడేటా, ఫోటోతో సహా కంప్యూటరులోనికి ఎక్కించేరండి. ఇహ వాడికి తగిన వధువు చూడాలికదా. శాస్త్రిగారి వేళ్ళు కీబోర్డు మీద చక చకా నడిచేయండి. మరేం; ఓ అమ్మాయి ఫోటోతోబాటు వివరాలు తెరని అలంకరించేయి. వెంటనే, శాస్త్రిగారు సెల్ ఫోను తీసుకొని దానిలో ఓ పది అంకెలని వేలితో నొక్కేరు. అటునుండి పద్మావతిగారు లైనులోకి వచ్చేరు.

“అమ్మా, నేను, పేరయ్యశాస్త్రిని మాట్లాడుతున్నాను.”

“నమస్కారం, శాస్త్రిగారూ. ఏమిటి విశేషాలు.”

“మీ అమ్మాయి కోసం, ఓ మంచి, సంబంధం చూసేనమ్మా.” అని, శేఖరు వివరాలు, మిగిలిన విషయాలు, తను విన్నవాటిని, అవసరమయినచోట హైలైటు చేసి శాస్త్రిగారు చెప్పేరు.

“సంబంధం బాగానే ఉన్నట్టుందండి. ఆయన ఆఫీసు నుండి రాగానే చెప్తాను. అమ్మాయితోకూడా మాట్లాడాలికదా.”

“ఇప్పుడే, మీ ID కి పెళ్ళికొడుకు వివరాలు, ఫోటో పంపిస్తున్నాను. బ్యాంకు సంబంధం…ఆలస్యం చెయ్యకుండా ఏ విషయము రేపు ఉదయం పదిలోపల చెపితే సరిపోతుంది. ఉంటానమ్మా. నమస్కారం.”

శాస్త్రిగారు మళ్ళీ కంప్యూటరు పనిలో పడ్డారు. కంప్యూటరు తెరమీదకి మరో వధువు, వివరాలతో ప్రత్యక్షమయింది. శాస్త్రిగారు వెంటనే సెల్ ఫోనుకు పని చెప్పేరు. అది దాని విధి నిర్వహించింది.

“పేరయ్యశాస్త్రిగారా, నమస్కారం. నేను, కమలమ్మని మాట్లాడుతున్నాను. ఏదయినా విశేషమా.”

“మీ అమ్మాయి కోసం ఓ మంచి సంబంధం చూసేనమ్మా. ఆ విషయం చెబుదామనే ఫోను చేసేను.” అని, మన శేఖరు వివరాలు పద్మావతిగారికి వినిపించిన గ్రామఫోను రికార్డు, రి ప్లే చేసేరు.

"సంబంధం బాగానె, ఉన్నట్టుంది. ఆయన వాకింగుకు వెళ్ళేరు; రాగానే ఆయనతో మాట్లాడతాను."

“మీ ID కి, వరుని వివరాలు, ఫోటో పంపిస్తున్నాను. బ్యాంకు సంబంధం; ఆలస్యం చెయ్యకుండా ఏ విషయము రేపు ఉదయం పదిలోపల చెబితే సరిపోతుంది. ఉంటానమ్మా. నమస్కారం.”

సమయం, మరునాడు ఉదయం. గడియారంలో చిన్నముల్లు పదకొండో నంబరుకు చేరువవుతోంది. పద్మావతి, కమలమ్మల ఫోనుకోసం, శాస్త్రిగారు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదని ఆయనే ముందుగా పద్మావతిగారికి ఫోను చేసేరు.

“అమ్మా, పేరయ్యశాస్త్రిని మాట్లాడుతున్నాను. నిన్న నేను చెప్పిన విషయం ఏమిటి ఆలోచించేరో తెలుసుకోడానికి ఫోను చేసేను.”

“శాస్త్రిగారూ, మీరు చెప్పిన సంబంధం బాగానే ఉందండీ. నేనూ, మా వారూ, అమ్మాయితో మాట్లాడేము. పెళ్ళికొడుకు క్లర్కు కాకుండా ఓ ఇన్స్పెక్టరు అయినా అయితే ఫ్రెండ్సు మధ్య చెప్పుకోడానికి బాగుంటుంది అంటోంది. బ్యాంకు సంబంధం అని ఇద్దరం అన్ని విధాలా బోధపరిచేం. పెద్ద ఇన్స్పెక్టరు కాకపోయినా చిన్న ఇన్స్పెక్టరు అయినా ఫరవాలేదు అంటోంది. ఈ కాలం పిల్లలు; ఏమిటి చెయ్యగలం. ఎవరికి ఎవరు ప్రాప్తమో. మరేమీ అనుకోకండి.”

“ఇందులో అనుకోడానికి ఏముందమ్మా. పిల్లలూ, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. ఉంటానమ్మా. నమస్కారం.”

అలా మొదటి కేసు ఫెయిలు అయిందండి. శాస్త్రిగారు, రెండో కేసుకు ఫోను చేసేరు.

“అమ్మా, కమలమ్మగారా, నేనూ, పేరయ్యశాస్త్రిని మాట్లాడుతున్నాను. నిన్నటి విషయం, ఏమిటి ఆలోచించేరో, తెలుసుకోడానికి ఫోను చేసేను.”

“శాస్త్రిగారూ, మా ఆయనతో మాట్లాడేనండి. గుమస్తా ఉద్యోగానికి అయిదు లక్షల కట్నం చాలా ఎక్కువ అన్నారండి. అదీగాక, ఎప్పుడో ఏ అయిదు, పదేళ్లకో ఆఫీసరు అవుతాడో లేదో గాని ప్రస్థుతం అంత గుమ్మరించడం అనవసరం అన్నారండి. మరో అయిదు ఆరు లక్షలు ఎక్కువయినా ఫరవా లేదు గాని ఆఫీసరు పెళ్లికొడుకునే చూడమని చెప్పమన్నారు.”

"బ్యాంకు సంబంధం కదా అని చెప్పేనమ్మా. సరే, మీరు కోరినట్లే చూద్దాం. ఉంటానమ్మా. నమస్కారం."

అలా, రెండో కేసు కూడా…ఫెయిలు అయిందండి. అంతలో, శాస్త్రిగారికి ఫోను వచ్చింది.

“పేరయ్యశాస్త్రిగారా, నమస్కారం. నా పేరు నారాయణరావు. రైల్వేలో టి. సి. గా ఉన్నాను. మీతో ఓ విషయం మాట్లాడాలి. మీరు ఫ్రీగా ఉన్నారా.”

“దానికేమిటి; ఏవో పనులు ఎప్పుడూ ఉంటాయి. ఫరవాలేదు. విషయం ఏమిటో చెప్పండి.”

“మరేమీ లేదు. మా నాన్నగారికి జాతకాల మీద నమ్మకం ఎక్కువండి. నిన్న ఎవరో జ్యోతిష్కుడు నెలరోజుల్లో ఆయనకు ఏదో పెద్ద గండం ఉందని చెప్పేడట. అది గట్టెక్కడానికి ఆలోగా కుటుంబంలోని వారెవరయినా కన్యాదానం చేయాలి అని సలహా ఇచ్చేడట. అందుచేత, మా అమ్మాయి లలితకు వెంటనే పెళ్లి చెయ్యమని మా అమ్మగారు, నాన్నగారు పట్టుబట్టి కూర్చున్నారు. సరే, ఇప్పుడు కాకపోయినా మరో రెండేళ్లకయినా చెయ్యాలి కదా అని సరే అన్నాను. ఆ విషయంలోనే, మీ సహాయం కావాలి.”

“శుభం; మీ అమ్మాయి వివరాలు.”

ఆపద్భాంధవుడిలాగ ఉన్నాడు, ఆ జ్యోతిష్కుడు అని మనసులో అతడికి ధన్యవాదాలు చెప్పుకొన్నారు శాస్త్రిగారు.

నారాయణరావు గారు వివరాలు చెప్పి వీలయినంత త్వరలో తగిన సంబంధం చూడమని అభ్యర్థించేరు.

“రావుగారూ మీరు లక్కీ అండీ. ఓ అరగంట క్రిందటే మంచి బ్యాంకు సంబంధం రిజిస్టరు అయింది. వధువుల కోసం కంప్యూటరులో సెర్చి చేస్తున్నాను. ఒకరిద్దరికి ఫోను చేద్దాం అనుకొంటున్నాను; ఇంతలో మీ ఫోను వచ్చింది.”

“దయచేసి అవి వెనక్కి పెట్టి మా అమ్మాయి విషయం ఆలోచించండి శాస్త్రిగారూ. దయచేసి పెళ్ళికొడుకు వివరాలు  చెప్పగలరా.”

శాస్త్రిగారు, శేఖరు వివరాలు తగిన విధంగా తెలియబరుస్తూ మళ్ళీ గ్రామఫోను రికార్డు రీప్లే చేసేరు.

నారాయణరావు గారు దానికి స్పందిస్తూ, “శాస్త్రిగారూ, సంబంధం అన్నివిధాలా బాగుందండీ. కానీ...(కొద్దిగా నసుగుతూ) కట్నమే... అయిదంటే... ఎక్కువ కాకపోవచ్చు... కాని, నేనంతవరకూ తూగలేనండి. దయచేసి మీరు ఆ విషయం మాట్లాడి సాయం చెయ్యాలి. రెండు...కాదూ పోదూ అంటె, మరో యాభైవేలుదాకా...సాగగలను.”

“సరే, మాట్లాడి చూస్తాను. వెంటనే, మీ అమ్మాయి బయోడేటా, ఫోటో, నా ID కి పంపండి.” అని తన ID ఇచ్చేరు శాస్త్రిగారు. తనదయిన ఫక్కీలో, కథను చకచకా ముందుకు నడిపించేరు. కట్నం ముల్లు మూడు దగ్గర ఆగింది. వివాహ విషయంలో ఇరుపక్షాలవారికీ తొందరే. మరేం; ఆ రోజు సాయంత్రమే పెళ్ళిచూపులూ, వధూవరులు ఒకరికొకరు నచ్చడం అన్నీ, ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో జరిగిపోయేయి. శాస్త్రిగారు చొరవ తీసుకొని సీను తెరపడకుండా నిశ్చయ తాంబూలాల ఘట్టం కూడా జరిపించేసారు.

మరునాడు ఉదయం; శేఖరుకు శుభోదయం. మనవాడు బూర్లగంపమీద పడ్డాడండి. ఎలా పడ్డాడు… అంటారా. స్టేటు బ్యాంకువారు వారి బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్లుగా ఎంపికయినవారి నంబర్లు నెట్ లో పెట్టేరండి. అందులో పడ్డాది మనవాడి నంబరు. ఇంకేముంది; అది చూడగానే, మన హీరో నైంతు క్లౌడు లోకి వెళ్లి పోయేడు. ఆ శుభవార్త, అరమైలు దూరంలో ఉన్నవారికి కూడా వినిపించేటట్లు ఎనౌన్సు చేసేడు. అది విని సీతాలక్ష్మీ, రామాంజనేయులవారు ఊహకందని ఆనందాన్ని విందుగా చేసుకొన్నారు.

పై ఆకస్మిక పరిణామం సీతాలక్ష్మిగారి మదిలో ఒక కొత్త ఆశను రేకెత్తించింది.

“ఏమండీ, మనవాడు ఇప్పుడు ఏకంగా ఆఫీసరు అయిపోయేడు కదా. దానికి తగ్గట్టు, కట్నం కొంత పెంచమని అడగొచ్చేమో.”

“ఇచ్చిన మాటకి విలువ ఉండాలి. లేకపోతే మనకి విలువ ఉండదు సీతాలూ. అంచేత ఆ విషయం మళ్ళీ ఎత్తకూడదు. కాబోయే కోడలి అదృష్టం మనవాడికి కలిసొచ్చింది అనుకోవాలి. వచ్చే వారంలోనే పెళ్లి ముహూర్తాలు ఉన్నాయన్నారు. మనం ఆ ప్రయత్నాలలో ఉండాలి.” విలువయిన సలహా ఇచ్చేరు పురోహితులవారు.

నిమిషాలమీద మనవాడి వార్త ఊరెల్లా ప్రాకిందండి.

శాస్త్రిగారికి తప్పిపోయిన మొదటి కేసు, పద్మావతి గారి ఫోను, “శాస్త్రిగారూ, నిన్న చెప్పేరు ఆ బ్యాంకు పెళ్ళికొడుకు విషయం మాట్లాడదామని చేసేను.” అని ఇంకా మాట్లాడబోతూ ఉంటే,

“అమ్మా, ఆ కేసు క్లోజయిపోయింది. మరేదయినా కేసు తెలియగానే మీకు చెప్తాను. ఉంటానమ్మా.” వినయంగా చెప్పేరు శాస్త్రిగారు.

వెనువెంటనే, మరో ఫోను. తప్పిపోయిన రెండో కేసు కమలమ్మగారు.

“శాస్త్రిగారూ, నిన్న మాట్లాడేం ఆ బ్యాంకు పెళ్ళికొడుకు విషయం మాట్లాడదామని...” అని సంభాషణ పొడిగిస్తూ ఉండగా.

“అమ్మా, ఆ కేసు క్లోజయిపోయింది.” అని వినయంగా చెబుతూ ఉండగానే ఫోను మూగబోయింది.

(సమాప్తం)

Posted in October 2021, కథలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!