Menu Close
బ్రతుకుబండి
- వెంపటి హేమ

రాజు వాళ్ళ ఇంటిముందు కొత్తకారు ఆగి ఉంది. టమోటా పండు రంగులో ఉన్న మారుతీ కారు! ఎండ దానిమీద పడి అది ఎర్రగా అగ్నిశిఖలా మెరుస్తోంది. కొత్తకారు అన్నదానికి గురుతుగా దానికి అందమైన రిబ్బన్లు చుట్టి, కుచ్చులు పెట్టి ఉన్నాయి. రాజు అక్కడే ఉన్నాడు. కారు చుట్టూ తిరుగుతూ, దానిని చేత్తో నిమురుతూ మహదానందాన్ని అనుభవిస్తున్నాడు. రాజు నా ఫ్రెండ్ మాత్రమే కాదు, నా క్లాస్ మేట్ కూడా. కలిసి బడికి వెళ్ళేవాళ్ళమ్. వాడు నిన్ననే మాకందరికీ చెప్పాడు, వాళ్ళ నాన్న కారు కొన్నారనీ అది రేపు వాళ్ళ ఇంటికి వస్తుందనీను. నేను బయటికిరావడం చూసి, రాజు చెయ్యూపి కేకపెట్టాడు తన దగ్గరకి రమ్మని. నేను "సరే" అన్నట్లుగా తల ఊపి వెళ్ళబోతుండగా అమ్మ పిలుపు వినిపించిది. వెంటనే మనసు మార్చుకుని ఇంట్లోకి పరుగెత్తా...

"నీ కిది తెలుసా, అమ్మా? రాజూ వాళ్ళు కొత్తకారు కొనుక్కున్నారు, మరి మనం ఎప్పుడు కొంటాము?"

అమ్మ చిన్నగా నవ్వి అంది, "మాకు నువ్వున్నావు, చెల్లాయి ఉంది, ఈ ఇల్లు ఉంది, మీ నాన్నకి సైకిల్ ఉంది! ఇవి చాలురా మనకి" అంది.

అప్పట్లో నాకు అమ్మ మాటలను అర్థం చేసుకునేటంత వయసు లేదు. ఏం మాట్లాడడానికీ తోచక, అసలేం మాటాడకుండా ఖాళీ గ్లాసు గట్టుమీద పెట్టేసి అక్కడనుండి వెళ్లిపోయా.

ఆ మరునాటినుండి రాజు కారుమీద బడికి రావడం మొదలుపెట్టాడు. వాడు నన్నుకూడా వచ్చి ఆ కారెక్కమన్నాడు కాని అమ్మ ఒప్పుకోలేదు...

"రవీ! మనకు ఏం కావాలనిపించినా దాన్ని మనమే కష్టపడి సంపాదించుకోవాలి గాని, ఇతరులు అమర్చుకున్నదాన్ని తేరగా అనుభవించాలని అనుకోడం మంచిపద్ధతి కాదురా, అర్థంచేసుకో" అంది. రాజుకి రానని చెప్పేశా. అప్పుడు నా వయసు ఎనిమిదేళ్ళని జ్ఞాపకం.

ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక, ఒకరోజు నన్నూ, ఒకరోజు చెల్లాయినీ సైకిల్ మీద ఎక్కించుకుని షికారు తీసుకెళ్ళేవాడు నాన్న. నాన్న నడుముచుట్టూ చేతులుచుట్టి పట్టుకుని, "రయ్యి, రయ్యి"న జనం తక్కువ ఉండే పక్కరోడ్లవెంట వెడుతుంటే మాకు "రోలర్కోస్టర్ రైడ్" చేస్తున్నంత థ్రిల్లింగుగా ఉండేది. ఆపై పార్కుకి తీసుకెళ్ళి కొంతసేపు ఆడించి, మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చే వాడు.

** **

చూస్తూండగా కాలం గడిచిపోయింది. మా ఇంట్లో మరో చెల్లాయి పుట్టింది. మా కుటుంబం పెరిగింది. ధరలు పెరిగాయి. నేనూ పెరిగి పెద్దవాడినయ్యాను. నాలో జ్ఞానం పెరిగింది. కుటుంబ పరిస్తితులు నెమ్మదిగా నాకు అర్థమవుతున్నాయి. చదువుమీద శ్రద్ధ పెరిగింది. స్కూల్ ఫష్టు రావాలనీ, స్కాలర్ షిప్ గెలుచుకుని కాలేజీలో చేరాలనీ దృష్టి పెట్టి శ్రద్ధగా చదవసాగాను. విజయుడనై కాలేజిలో చేరాను.

* * *

అలవాటుగా తెల్లవారేసరికి లేచి, వీధి గుమ్మాలు కడిగి ముగ్గు వెయ్యాలని వెళ్ళిన అమ్మకు రోజూలా, స్టాండ్ వేసి ఉన్న సైకిల్ ఆ రోజు గుమ్మం పక్కన కనిపించ లేదు. ఎవడో నిర్భాగ్యుడైన దొంగ దాన్ని ఎత్తుకు పోయాడు - అన్నది స్ఫురించగానే అమ్మ "కెవ్వు"మంది. అమ్మకేకకు మేమందరం లేచి పరుగెత్తుకుని వచ్చాము. గుమ్మాల్లో చతికిలబడి అమ్మ ఏడుస్తోంది. విషయమేమిటో తెలిసి, అందరం నిర్ఘాంతపోయాము. అందరిలోకీ ముందుగా నాన్నే కోలుకున్నారు. అమ్మ ఆపకుండా ఏడుస్తోంది మేము బిక్కమొహాలతో అమ్మని నాన్ననీ మార్చి మార్చి చూస్తూ నిలబడి ఉన్నాము.

ఏడుస్తున్న అమ్మని నాన్న ఓదార్చవలసివచ్చింది. "ఇందులో నువ్వు ఏడవవలసింది ఏమీ లేదు. ఇటు చూడు సుమిత్రా! దేవుడు ఏం చేసినా అది మనమేలుకే! మనమే అర్థం చేసుకోలేక బాధపడతాం. మొన్న నువ్వే అన్నావుకదా, ఈ మధ్య నాకు బాగా ఒళ్ళొచ్చిందని. ఇక రేపటినుండి నా బద్ధకం వదలిపోతుంది, బొజ్జ కరిగిపోతుంది. ఇక కావాలనుకున్నా ఒళ్ళు రాదు. సంతోషించక ఏడుస్తావేమిటి? సిగ్గుచేటు! ఇకలే పండుగ చేసుకుందాం పద" అన్నాడు.

నాన్న మాట తీరుకి మాకు నవ్వొచ్చింది. అమ్మ కూడా ఆ తడికళ్ళతోనే పకపకా నవ్వేసింది.

అమ్మని ఓదార్చడానికి నాన్న అలా ఆ విషయాన్ని తేలికచేసి మట్లాడాడేకాని ఆయన దాన్నంత తేలికగా తీసుకోలేకపోతున్నాడన్నది నేను స్పష్టంగా గుర్తించా. అది పొరుగూరు వెళ్లి చదువుకోడానికి వీలుగా ఉంటుందని మా నాన్నకు వాళ్ళ నాన్న కొనిచ్సినది ఆ సైకిల్! నాన్న ఆ సైకిల్ని చాలా చాలా "మిస్" అవ్వుతూ ఉన్నారనడానికి అప్పుడప్పుడు ఆయన కళ్ళలో బయటపడే శూన్యదృక్కులే నిదర్శనం. అవసరం, ఎంత ఉన్నాకాని నాన్న కొత్త సైకిల్ కొనే యత్నం చెయ్యలేదు. దానికి కారణం - మళ్ళీ మరో సైకిల్ కొనడానికి చాలినంత డబ్బు నాన్న దగ్గర నిలవ లేకపోవడమే కావచ్చు. ఆ పరిస్థితే నాకు చాలా బాధ కలిగించింది. కాని నేను ఇంకా విద్యార్ధినే కదా!

అది మొదలు మేము, రెండుమూడు కిలోమీటర్ల లోపులో, ఎవ్వరం ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు నడకే శరణ్యం! అంతకు మించిన దూరం ఐతే, అమ్మా చెల్లెళ్ళు ఆటో ఎక్కేవారు. నాన్నకీ నాకూ సిటీ బస్సు ఉండనే ఉంది. అదృష్టం కొద్దీ మా ఇంటికి దగ్గరలోనే అన్నీ అమరి ఉన్నాయి. మా స్కూలు, కాలేజి, బ్యాంకు, మార్కెట్, బస్ స్టాపు - ఇలా మాకు కావలసినవన్నీ చాలావరకు అందుబాటులోనే ఉన్నాయి.

కానీ, పండుగలకీ, పుట్టినరోజులకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలంటే మాత్రం ఏ గుడి కూడా దగ్గరలో లేదు. ఒక్క గుడి మాత్రం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. దానిలో శివపార్వతులు సపరివారంగా కొలువై ఉన్నారు. కొద్దిగా దూరమయినా అక్కడికి కూడా నడిచే వెళ్ళే వాళ్ళం. దారి పొడుగునా రోడ్డుకి అటూ, ఇటూ ఉన్న షాపుల్నీ, ఇళ్ళనీ, దారిన పోయే జనాల్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూంటే శ్రమ తెలిసేది కాదు. అమ్మా, నాన్నా చెరోపక్కనా ఉండి, మధ్యలో మమ్మల్ని ఉంచి, ఏ యాక్సిడెంటూ జరగకుండా జాగ్రత్తగా నడిపించేవారు. కొంచెం పెద్దయ్యాక మేమలా గుంఫుగా రోడ్డువెంట నడవడం ఎరుగున్నవాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో - అన్న భావం మనసులోకి వచ్చి, సిగ్గుగా ఉండేది. పెద్ద చెల్లాయి మరీను, రోడ్డుమీద అది అలా నడుస్తూండగా దాని క్లాస్మేట్సు ఎవరైనా ఎదురు పడతారేమోనని ఎప్పుడూ భయపడుతూ ఉండేది.

నాకది చాలా బాధ కలిగించేది. ఒకరోజు నేను, కౌమారప్రాయపు దుడుకుతనంతో మా నాన్నను నిలదీశా, "ఇలా ఎన్నాళ్ళు నాన్నా! మనం కూడా ఒక కారు కొనుక్కుంటే, ఇలా రోడ్లవెంట గుంపుగా నడవడం తప్పుతుంది కదా! ఎంతదూరం వెళ్ళాలన్నా అందరం కలిసి శ్రమలేకుండా, గౌరవంగా ఇట్టే వెళ్ళిరావచ్చు కదా.

"నాన్న చిరునవ్వు నవ్వి, నా వైపు తిరిగి అన్నారు, "ఇది శ్రమ అనుకోకూడదురా అబ్బాయీ! మనం దైవ దర్శనానికి ఎంత కష్టపడి వెడితే మనకంత గొప్ప ఫలితం ఇస్తాడు ఆ భగవంతుడు. నువ్వు పడుతున్న ఈ శ్రమను గుర్తించి, భగవంతుడు భవిష్యత్తులో నీకొక స్వంతకారు ప్రసాదించవచ్చు. నీ శ్రమకు తగిన ఫలితం నీకు త్వరలోనే ముడుతుందిలే" అన్నాడు. ఇక నానోట మాటరాలేదు.

* * *

మా చదువుల విషయంలో మా నాన్న మాకు ఏ లోటూ చెయ్యలేదు. ఫీజులు కట్టాలన్నా, పుస్తకాలు కొనాలన్నా ఏనాడూ వాయిదా వెయ్యలేదు. వెంటనే డబ్బులిచ్చేవాడు. పరీక్షలు వచ్చాయంటే మాతోపాటుగా వాళ్ళూ మెలకువగా ఉండి, మమ్మల్ని బుజ్జగించి, దగ్గర కూర్చుని చదివించేవారు. కానీ, విద్యేతర విషయాల్లో మాత్రం చాలా పొదుపుగా ఉండేవారు. చెల్లెళ్ళిద్దరూ కాలేజీకి వచ్చారు. నేను నా స్కాలర్షిప్ నాతో పాటుగా నేను చదువుకున్నన్నినాళ్ళూ ఉండేలా జాగ్రత్తపడ్డా.

MCA పరీక్షలు ముగిశాయి. పరీక్ష బాగా రాశాను. ఇక పై చదువు చదవాలని కోరిక లేదు. నాన్నకు కూడా రిటైర్మెంట్ సమయం దగ్గరపడింది. ఇక నేను జాబ్ లో చేరి నాన్నకు కొంతైనా బరువు తగ్గించాలనిపించింది. చెల్లెళ్ళకు కూడా త్వరలోనే చదువు పూర్తవుతుంది, డిగ్రీ చేతికి వస్తుంది. ఒక రోజు మాటలమధ్య నాన్ననడిగా. "నాన్నా! చెల్లాయిలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకు పెళ్ళి చేయ్యాల్సిన సమయం దగ్గరపడింది. పెళ్ళంటే బోలెడు ఖర్చు కదా, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం నువ్వు ఏపాటి సొమ్ములు కూడబెట్టావు?

ఒక్కసారిగా నాన్న ముఖం తెల్లగా పాలిపోయింది. ఆపై తల వాల్చి మాటాడకుండా ఉండిపోయారు, అంతే!

కానీ, నాకు అంతా అర్థమయ్యింది. తాడుని రెండు కొసలు కలిపి ముడి వెయ్యాలంటే, దానికి చాలినంత పొడవున్న తాడు ఉండాలి కదా! నాన్న డిగ్రీ వరకు చదివారు. చేస్తున్నది చిన్న ఉద్యోగం. జీతం కూడా అంతంత మాత్రమే. ఆ ఉద్యోగం, బంగారు గుడ్లు పెట్టె బాటులాంటిదైనా, నిజాయితీపరుడైన నాన్న ఎవరి ఎదుట లంచం కోసం చెయ్యి చాపలేదు. వచ్చిన జీతాన్నే జాగ్రత్తగా వాడుతూ అమ్మా నాన్నా మమ్మల్ని పై చదువులు చదివించి, మాకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని తాపత్రయపడ్డారు. మా కోసమని వాళ్ళు ఎన్ని కోరికలను అణుచుకున్నారో, ఎన్ని ఆశలను తుంచుకున్నరో వారికే తెలియాలి! అప్పుడే అనిపించింది నాకు, చెల్లాయిల పెళ్ళి నా బాధ్యత - అని గట్టిగా అనుకున్నా.

మేమున్న టౌన్ బాగా అభివృద్ధి చెందింది. మెట్రో రైల్ వచ్చింది. సిటీ బస్సుల సంఖ్య కూడా బాగా పెరిగింది. పరిస్థితులు మెరుగయ్యాయి. ఊళ్ళో ఎటు వెళ్ళాలన్నా చాలా సౌకర్యంగా ఉంది. పెట్రోల్ ధర బాగా పెరిగిందంటూ చాలామంది కార్లను అమ్మేశారు.

రిజల్ట్సు వచ్చాయి, మంచి మార్కులతో పాసయ్యా. కేంపస్ ఇంటర్వూలో ఎంపికవ్వడంతో, వెంటనే ఉద్యోగం వచ్చింది. జాబు కూడా అదే ఊర్లో రావడం అదృష్టం. అప్పుడే ఉద్యోగంలో చేరి నెల గడిచింది. తొలి జీతం అందుకున్నా.

టెంపో లోంచి కొత్త సైకిల్ దింపుతున్న నన్ను చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. "చిన్నప్పుడు కారు, కారని ముచ్చటపడే వాడివి కదా, ఏకంగా కారు కొనుక్కుంటే సరిపోయేది కదా, మధ్యలో ఇదెందుకు కొన్నావురా" అంది.

నా చిన్నప్పుడు, నేను కారు కావాలని అడిగితే అమ్మ నాతో అన్న మాటలు ఆ క్షణంలో నాకు గుర్తొచ్చి నవ్వొచ్చింది, "అమ్మా! నాకు నువ్వూ, నాన్నా ఉన్నారు; చక్కని చుక్కలు ఇద్దరు చెల్లెళ్ళున్నారు, నెలనెలా బంగారు గుడ్లుపెట్టే బాతులాంటి ఉద్యోగం ఉంది - ఇవి చాలు మనకు, మమతానురాగాలతో మన బ్రతుకు బండి హాయిగా సాగిపోడానికి! ఇది నాన్నకోసo!" అన్నా.

Posted in September 2018, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *