Menu Close
Adarshamoorthulu
-- మధు బుడమగుంట --
డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య
bhogaraju-pattabhi-sitaramayya

సర్వతోముఖంగా ప్రజాభ్యున్నతికి కృషి చేయాలంటే సామాజిక హోదా, పదవి అవసరం లేదు. సత్సంకల్పంతో నీ ఆశయాలకు ఊపిరిని అందించి, నీ ఆలోచనలను అందరికీ పంచి సంఘటితం చేసి సామాజిక చైతన్యానికి నాంది పలకాలి. వివేకంతో నీ సామర్ధ్యాన్ని అంచనా వేసుకొని తదనుగుణంగా నీ కార్యాచరణ ఉండాలి. నీవు పదిమందికి మంచి చేయాలనుకుంటే అందుకు నీవు నిజాయితీగా పనిచేయాలి. నీ కృషిని గుర్తించి నీకు స్థైర్యాన్ని, శక్తిని అందించే సహాయకులు నీ దరికి చేరాలి. అప్పుడే నీవు అనుకున్న ఫలితాలను పొందగలవు. ఈ సూత్రాలను అక్షరాల పాటించి, ఎటువంటి పదవులు హోదాలు ఆశించకుండా తనవంతు బాధ్యతగా ప్రజాభ్యున్నతికై నిరంతరం శ్రమించి ఎంతో నిరాడంబర జీవితాన్ని గడిపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ గాంధేయవాది, సమాజసేవకుడు, వ్యాపారవేత్త డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య, నేటి మన ఆదర్శమూర్తి.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుకొలను గ్రామంలో 1880, నవంబర్ 24, పట్టాభి సీతారామయ్య గారు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం బందరులో పూర్తిచేసి, బి.ఏ. డిగ్రీ, మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి పొందిన పిమ్మట నాటి ఎం.బి.సి.ఎం. పట్టాను పొంది వైద్యవృత్తిని చేపట్టారు. స్వతహాగా గాంధేయవాదిగా మహాత్మాగాంధీ ఆశయాలను సూత్రీకరిస్తూ ఉండేవారు. ఆ కాలంలో భారత దేశాన్ని పాలిస్తున్న ఆంగ్లేయుల నుండి విముక్తికై జరుగుతున్న స్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొనేందుకు తన వృత్తి అడ్డుగా నిలుస్తుందని భావించి మంచిగా సంపాదనను అందిస్తున్న వైద్య వృత్తిని వదిలిపెట్టి ఉద్యమంలో గాంధీజీకి సహాయకుడిగా చేరారు. ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదురైననూ వెరవక గాంధీజీ అడుగుజాడలలో నడిచి ఉద్యమానికి చేయూతనిచ్చారు.

క్విట్ ఇండియా ఉద్యమ ప్రారంభంలోనే పట్టాభి గారిని నిర్భందించి ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టారు. కారణం ఆయన ఆ ఉద్యమ సారధ్య సమూహంలో ఉండి ఉద్యమ వ్యూహ కర్త కావడమే. అయిననూ ఆత్మస్థైర్యాన్ని విడవక ఆ సమయంలో జరిగిన యదార్థ విషయాలను ఒక మంచి రచనా వ్యాసంగా feathers and Stones అనే పుస్తక రూపంలో ప్రపంచానికి పరిచయం చేశారు. చివరి వరకు తన గాంధేయ వాదాన్ని వదలకుండా ఉద్యమ నిర్వహణలో గాంధీజీకి సహాయకుడిగా ఉండేవారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసి ఎన్నో సంస్కరణలకు, దేశాభివృద్ధికి తనవంతు కృషిని అందించారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు.

bhogaraju-pattabhi-sitaramayya-stampఒక ప్రక్క సమాజసేవ చేస్తున్ననూ, వ్యాపారపరంగా కూడా బడుగు వర్గాల ప్రజలకు చేయూతనిచ్చేందుకు ఎన్నో వ్యాపారాలు చేశారు. ఈ మధ్యనే యూనియన్ బ్యాంకు లో విలీనమైన ప్రముఖ తెలుగు బ్యాంకు ‘ఆంధ్రా బ్యాంకు’ మన పట్టాభిరామయ్య గారు స్థాపించినదే. ఆ సంస్థను 1923 లో నాటి పేద రైతులకు సహాయం చేయాలనే మంచి సంకల్పంతో స్థాపించారు. అలాగే అనేకవిధములైన భీమా పధకాలను ఆచరణలోకి తెచ్చుటకై ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా స్థాపించారు. తను ఎదుగుతూ బడుగు ప్రజల జీవితాలలో కూడా అభ్యున్నతిని ఆకాంక్షించారు.

జాతీయ స్థాయిలో మంచి పలుకుబడిని సంపాదించిన నాయకుడైననూ తన మాతృభాష మీది మమకారం ఆయనలో ఎప్పుడూ ఉండేది. ఉద్యమంలో పాల్గొనడానికి ముందే తెలుగు జాతికి ఒక గుర్తింపు రావాలని స్థానిక నాయకులందరితో మంతనాలు జరిపి ఆంధ్ర రాష్ట్రోద్యమానికి అంకురార్పణ 1908లోనే జరిపారు. అప్పుడే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆవశ్యకతను గురించి చర్చించడం జరిగింది. అంతేకాదు తను చేస్తున్న అన్ని వ్యాపారాలలో తెలుగు యొక్క ప్రాభవాన్ని తగ్గకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ తెలుగులోనే ఉండేటట్లు చేశారు.

సమాజ సేవకుడు, గాంధేయవాది, మంచి వ్యాపారవేత్త, తెలుగు భాషాభిమానిగా రాణించిన పట్టాభిరామయ్య గారు తన అనుభవసారంతో పొందిన పరిజ్ఞానానికి అక్షరరూపం కల్పించి ఎన్నో పుస్తకాలను వ్రాశారు. మచ్చుకి; ‘అఖిల భారత కాంగ్రెస్ చరిత్ర’, ‘గాంధి మరియు గాంధేయవాదం-ఒక పరిశీలన’ ‘congress ke saath saal’ ‘some fundamentals of the Indian problem’ ఇలా ఎన్నో అమూల్యమైన సమాచారపూరిత రచనలను చేశారు. వారి రచనలు చాలా వరకు పునర్ముద్రణకు కూడా నోచుకొని నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గ్రంధాలయాలలో నిక్షిప్తమై ఉన్నాయి.

డిసెంబర్ 17, 1959 లో శ్రీ పట్టాభి సీతారామయ్య గారు పరమపదించారు. కానీ వారు చేసిన సేవలు, వారి అనుభవాలు పుస్తకాల రూపంలో మనందరికీ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.

Posted in July 2021, వ్యాసాలు

1 Comment

  1. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా.పట్టాభి గురించి మంచి వివరణాత్మకంగా
    మీ వ్యాసం లో తెలియజేసారు.ఆయన పేరు వినగానే నా లాంటి వారికి చటుక్కున గుర్తు కు
    వచ్చేది ‘ ఆంధ్రా బ్యాంకు ‘.తెలుగు తనం ఉట్టి పడేలా పనిచేసిన సంస్థ. ఇప్పుడు పేరు మార్చబడింది. పట్టాభి లాంటి మహోన్నత వ్యక్తి మన తెలుగువాడు కావడం మన అదృష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *