Menu Close
Page Title

గద్య తిక్కన, స్త్రీ జనోద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు

KandukuriVeereshalingamఅనాదిగా ఒక జనకూటమి ఒక సంఘముగా పరిగణింపబడుతోంది. తరువాతి కాలంలో ఆ సంఘం లోని కొందరు  ప్రభావ వంతులైన వ్యక్తుల విపరీత ప్రవృత్తులు, ఆచారాలు, నమ్మకాలు అందులోని బలహీనులు, సున్నిత మనస్కులకి బాధాకరముగా కనిపించి వాటి మార్పుకి అలజడి పెరిగి కాలానుగుణంగా సంస్కరణలకు దారి తీసింది. శతాబ్దాలుగా వాడుకలోఉన్న అలవాట్లు, పద్ధతులు, ఆచారాలు సాధారణముగా వేరే మార్గం తోచక వాటిని భరిస్తున్న జనం కోరికపై కొందరు ప్రతిభావంతుల ఉద్యమంతో ఆ బలవంతుల అభిప్రాయాల్ని తోసిరాజని కొంగ్రొత్త మార్పుల అవసరాలని ప్రస్పుటిస్తూ సంస్కరణలకు పురిగొల్పాయి. ఒకప్పుడు సతీసహగమనం అనే మూఢ దురాచారం రూపుమాపడానికి సంస్కరణ అవసరమైతే, స్త్రీ విద్యకు అనర్హురాలనే కొందరి విపరీత వాదనకి కూడా తదుపరి కాలంలో సంస్కరణ అవసరమైంది. ఒకప్పుడు మడి ఆచారాలకు విపరీత ప్రాముఖ్యం లభిస్తే, ఇప్పుడు సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని శుచి శుభ్రతల వినియోగం అనుకోని విధంగా ఆచరణలోకి వచ్చి పట్టణ ప్రాంతాలలో ఆ ఆచారాలు మచ్చుకైనా కనబడకుండా పోయాయి. పురాణ కాలం నుంచి సంఘములోని నీతినియమాల కట్టుబడికి, వంశ సౌచం కోసమై స్త్రీ పాతివ్రత్యము నిర్దేశించబడితే నేడు పాశ్చాత్య ప్రాభవం పెరిగి అది ఏసంస్కరణోద్యమం లేకుండానే దాని ఔన్నత్యం దిగజారింది. ఆ విధంగా కొందరు మహాపురుషుల అసమాన ప్రయత్న ఫలంగా కొన్ని సంస్కరణలు ఆవిష్కరించ బడితే మరికొన్ని పెద్ద కృషిలేకుండానే వాడుకలోకి వచ్చాయి.

వేద కాలం నుంచి స్త్రీ విద్య పురుషుని తో సమోన్నతం గానే సాగేది. నిజానికి వేదాలలో దాదాపు 50 మంది స్త్రీలు మంత్ర ద్రష్టలుగా నిలిచారు. గార్గి, మైత్రేయి, లీలావతి, లోపాముద్ర, ఊర్వశి, సులభ, క్షణ మొదలైన ఎందరో స్త్రీలు సంస్కృతములో తమ పాండిత్యాన్ని, సభలలో వేదాంత విశ్లేషణ ని తమ బుద్ధికుశలతతో వాదనా పటిమను మహిమాన్వితంగా ప్రదర్శించేవారు. నిజానికి మైత్రేయి తన భర్త యాజ్ఞవల్కునితో చేసిన వేదాంతచర్చ జగత్ప్రసిద్ధం. అటులనే గార్గి  ఒక సుప్రసిద్ధ వేదాంతినిగా పేరుగాంచినది. కానీ తరువాతి కాలంలో ఎక్కడో పురుష అహంకారానికి స్త్రీ విద్యాభివృద్ధి బలైపోయి క్రమంగా పురుషుడు ఆమెను ఇంటిపనులకే నియంత్రించడం జరిగింది. పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభం వరకు ఆస్థితి కొనసాగినా, ఎటువంటి ప్రతి వాదన లేకుండా స్త్రీ విద్యోన్నతిని పురుష సమాజం నియంత్రిచినా, తరువాతి కాలంలో ఇంట్లోనే ఉండి చదువుకుంటున్న స్త్రీల ఆలోచనా తీరు మారి, స్వతంత్ర భావోత్ప్రేక్ష, వాదనాబలం చిరు చిచ్చుగా ఆరంభమై రాజుకొని నెమ్మదిగా కార్చిచ్చయ్యింది.  కానీ అప్పటికే స్త్రీ -విద్యకు అనర్హురాలనే మూఢ భావాలు సమాజంలో మూల మూలల వేళ్ళు పాతుకుపోయి, కొందరు స్థిరభావాలు గల స్త్రీల ప్రోద్బలంతో కూడా వాటిని పీకడం కష్ట సాధ్యమే అయ్యింది. ఆ సమయంలోనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్త్రీ విద్యోద్యమాన్ని ఉధృతం చేసి సమాజంలో సమాజానికి ఎదురుతిరిగి, వెలివేయబడి కూడా అనూహ్య కదలికని సాధించారు. సమాజంలో సమాన బాధ్యతలని మోస్తూ, సమాజోన్నతి కారకురాలైన స్త్రీకి సమాజములో సముచిత స్థానాన్ని ఇవ్వాలని, పురుషునితో సమానంగా విద్యాభ్యాసానికి వీలు కలిపించాలని వాదించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో 1848 ఏప్రిల్ నెల పదహారవ తేదీన ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో శ్రీ కందుకూరి సుబ్బారాయుడు, శ్రీమతి పూర్ణమ్మ లకు శ్రీ కందుకూరి వీరేశలింగం గారు జన్మించారు. ఆయన ఆరునెలల ప్రాయంలోనే మసూచి వ్యాధి సోకి చావు బ్రతుకులమధ్య కొట్టుమిట్టాడాడు. నాల్గవయేటనే దురదృష్టవశాత్తు తండ్రి మరణం మరొక విద్యుద్ఘాతమైంది. అయనకి 13 వ ఏటనే (బాపమ్మ) రాజ్యలక్ష్మి తో వివాహం జరిగింది. అయన చిన్నాన్న వెంకటరత్నం గారు దత్తత చేసుకుని చదువు సంధ్యలు నేర్పించారు. మొదట వీధి బడిలోనూ, తరువాత ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోను చదివి 1869 లో మెట్రిక్ పాసయ్యారు. అయన తేలితేటలు, శ్రద్ధాసక్తులు ఆ స్కూల్ లో అతడిని అత్యుత్తమ విద్యార్థిగా నిలబెట్టాయి. మొదటి తూర్పుగోదావరి జిల్లా కోరంగి లో ఉపాధ్యాయునిగా జేరి తరువాత అక్కడే ప్రధానోపాధ్యాయునిగా చేసి రాజమహేంద్రవరం మారారు. స్వయంకృషితోనే తన తెలుగు, సంస్కృతము, హిందీ భాషలలో పాండిత్య వైభవాలని పెంచుకున్నారు. అప్పటి పరిస్థితులలో సాహిత్య విన్యాసం ద్వారానే తన సంస్కరణ భావాలు ప్రభావితం చెయ్యడము సాధ్యమౌతుందని, ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యాన్ని సాధించవచ్చునని నమ్మి, ఆ దిశలో దృష్టి సారించి తన రచనా వ్యాసాంగానికి తెరదించారు. ఆ క్రమంలోనే 'ఆలివర్ గోల్డ్స్మిత్' -"వికార్ అఫ్ వేక్ఫీల్డ్" నవల స్పూర్తితో 1878 నుంచి 'వివేక చంద్రిక' పత్రికలో 'సత్యవతి చరిత్రము' అనే మొదటి నవలని వ్రాసి (తదుపరి దానినే 'రాజశేఖర చరిత్ర' అనే పేరు తో తెలుగులోనే మొదటి సంస్కరణాత్మక నవలని సీరియల్ గా ప్రచురించారు. బహుశా అదే మొదటి సీరియల్ కూడా అయిఉండొచ్చు. ఆయన తెలుగు భాషలో మొట్టమొదటిగా జీవితచరిత్ర, నవల, నాటక ఆవిష్కరణ చేసి ఆద్యుడయ్యాడు. 1874 లో ప్రత్యేకంగా బాలికల కోసం ఒక పాఠశాలని ధవళేశ్వరంలో ప్రారంభించారు.

ఆ రోజులలో విధవా వివాహానికి యువకులెవ్వరు ఒప్పుకోకపోవడంతో ఒక ఉద్యమం ప్రారంభించి వారిని సమాజోద్ధరణకు పురిగొల్పి పట్టికలు తయారు చేశారట. మొదటి విధవా వివాహం 11 డిసెంబర్ 1881 న జరిపించారు. మూడవ విధవా వివాహానికి శ్రీ ఈశ్వరచంద్ర విద్యా సాగర్ ఒక ప్రశంసా పత్రాన్ని పంపుతూ వీరేశలింగం గారి స్త్రీ జనోద్ధరణ కృషిని ఎంతగానో మెచ్చుకున్నారు.

KandukuriVeereshalingam-Houseఇదే కాకుండా తెలుగు భాషలో అయన అనేక ప్రక్రియలకి ఆద్యుడై నిలిచారు. వ్యాసరచయితగా, నాటక గా, నవలా రచయితగా, అసహాయ స్త్రీ ఉద్ధరణ సంక్షేమ కర్తగా, స్త్రీల కోసం ప్రత్యేక పత్రిక నడుపుట ద్వారా ఆంధ్ర కవుల చరిత్ర కారునిగా, బాలికలకు ప్రత్యేక పాఠశాల స్థాపకుడిగా, విధవా వివాహాల ను జరిపించడము ద్వారా ఎన్నో సంఘ సంస్కరణలకు పునాది వేశారు. ఆ క్రమంలోనే 'వ్యావహారిక ధర్మ బోధిని' (1880) 'బ్రహ్మ వివాహం' (1880) 'వివేక దీపిక (1880), అధికారంలో ఉంటూ ద్వంద రీతుల వ్యవహారం నడిపే వ్యక్తుల తీరు తెన్నులు వివరిస్తూ 'ప్రహ్లాద' (1885), 'సత్యహరిశ్చంద్ర' (1186), 'తిర్యగ్ విద్వాన్ మహాసభ' (1889), 'మహాహారణ్య పురాధిపత్యం' (1889) మొదలుగాగల నాటికలు వ్రాసారు. అయన 'మాళవికాగ్నిమిత్రం' (1885), 'ప్రబోధ చంద్రోదయం' (1885 -91), సంస్కృతం నుంచి: 'రత్నావళి' (1880); 'రాగమంజరి' (1885), కల్యాణ కల్పవల్లి (1894) ఆంగ్లంనుచి అనువదించి చాల ఖ్యాతి గడించారు. అయన సాహిత్య ప్రచురణాలన్నీ మొదట్లో మదరాసులో జరిగినా తరువాత అయన గృహంలోని ప్రింటింగ్ ప్రెస్ లోనే అచ్చువేయడం జరిగింది. కేశబ్ చంద్ర సేన్ స్ఫూర్తి తో రాజమహేంద్రవరం బ్రహ్మసమాజాన్ని, 'హితకారిణి సమాజాన్ని' స్థాపించి బాలిక, స్త్రీ సంక్షేమాలకై తన యావదాస్తిని సమర్పించ్చారు. ఆయన సంఘసేవాతత్పరతకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం 1893 లో "రావుబహద్దర్" బిరుదు ప్రదానం చేసింది.

KandukuriVeereshalingam-Schoolఆయన రాజమహేంద్రవరం 1908 లో హితకారిణీ సమాజాన్ని స్థాపించినారు. ధవిళేశ్వరంలో ప్రారంభించిన బాలికా పాఠశాల ఇన్నీసుపేటకి మార్చి సహవిద్యా (కో-ఎడ్యుకేషన్) పాఠశాలగా తీర్చి దిద్దారు. అది నేటికీ వీరేశలింగం ఆస్థికోన్నత పాఠశాలగా రాజమహేంద్రవరం లో ఉన్నత ప్రమాణ విద్య నందించే సంస్థగా నిలిచి వుంది. అందులోనే నా విద్యార్జన జరగడం అదృష్టంగా భావిస్తాను. అందులోనే భమిడిపాటి కామేశ్వర రావు గారి వంటి ప్రముఖులు ప్రధానోధ్యాపకులుగా చేశారు.

KandukuriVeereshalingam-Wifeఎనిమిదవయేటనే వీరేశలింగంగారి భార్య గా వారి జీవితం లో అడుగుపెట్టిన రాజ్యలక్ష్మి గారు, చివరి క్షణం వరకు సహధర్మచారిణి గా, సలహా దారుగా చేదోడువాదోడు గా ఆయన జీవితం లో ప్రముఖ పాత్రవహిస్తూ ఆమె తుది శ్వాస వరకు సంఘ సేవాకార్యక్రమాలలోను, వారి పుస్తక ప్రచురణలోనూ (ప్రత్యేకం గా 'వివేక వర్ధని'), భర్త సేవలోను అద్వితీయురాలనిపించుకుంది. అందుకే ఆమె మరణం ఆయన మిగులు జీవితాన్ని దుర్భరం చేసి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఆయన మకాం రాజమహేంద్రవరం నుంచి మదరాసు మార్చేటట్లు చేసింది. అక్కడ ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ కూడా 'ఆంధ్ర కవుల చరిత్ర' పూర్తి చెయ్యాలనే దీక్షతో చివరి క్షణంవరకు శ్రమించి, సాధించి 1919 మే 27 వ తారీఖున ఆయన 71 వ యేట మదరాసులోనే తుది శ్వాస విడిచారు. శ్రీ చిలకర్తి లక్ష్మి నరసింహము గారు శ్రీ వీరేశలింగము గారి గురించి వ్రాసిన పద్యం వారి ఫోటో పైన ....

కందుకూరి వీరేశలింగం పంతులు గారి కొన్ని ప్రముఖ ఉల్లేఖనాలు (quotations):

"చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం మాత్రం కొనుక్కో"
"వందమాటలు చెప్పేకంటే ఒక్క మంచి పని చేసి చూపడమే మేలు."

-o0o-

Posted in October 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!