Menu Close
Page Title

బిల్వమంగళుని కవితలో మాధుర్యాన్ని చిందించిన బాలకృష్ణుడు

అఙ్గనా మఙ్గనా మన్తరే మాధవో
మాధవం మాధవం చాన్తరేణాఙ్గనా|
ఇత్థమాకల్పితే మణ్డలే మధ్యగః.
సఞ్జగౌ వేణునా దేవకీనందనః|| 2-35

'ఇరువురు స్త్రీలమధ్య మాధవుడు, ఇరు మాధవ రూపులమధ్య ఒక్కొక్క స్త్రీ గుంపులుగా విడి వారందరినడుమ దేవకీనందనుడు వేరొకడుగా నిలిచి మధురముగా వేణు గానముచేసెను.'

ముగ్ధం స్నిగ్ధం మధుర మురళీ మాధురీ ధీరనాదైః
కారం కారం కరణవివశం గోకులవ్యాకులత్వం|
శ్యామం కామం యువజనమనోమోహనం మోహనాఙ్గమ్
చిత్తే నిత్యం నివసతు మహో వల్లవీవల్లభం నః || 2-50

“మనోజ్ఞమైన, స్నేహశీలియైన ఆ మనోహర మురళీనాదం గాంభీర్యంతో వ్రేపల్లె ప్రజలందరినీ పరవశులని, వ్యాకులంతో వివశుల్నిచేసి, నల్లనైయుండి కూడా తనయీడువాండ్రందరిని వలపించునంతటి సౌందర్యముతో భాసించేటువంటిన్ని, గొల్లచెలియలందరికి ప్రీతి పాత్రమైన ఆ కృష్ణ తేజము మా హృదయమందెప్పుడు వెలుగుచుండునుగాక.’

ఆనన్దేన యశోదయా సమదనం గోపాఙ్గ నాభిశ్చిరం
సాశఙ్కమ్ బలవిద్విషా సకుసుమైః సిద్ధైః పృథివ్యాకులమ్|.
సేర్ష్యంగోపకుమార కైస్సకరుణం పౌరైర్జనైః సస్మితం
యోదృష్టః స పునాతు నో మురరిపుః ప్రోత్క్షిప్త గోవర్ధనః || 2-54

'శ్రీకృష్ణుడు గోవర్ధనగిరినెత్తగా ఆనందంతో యశోద, మన్మథవికారంతో గోపికలు, వీడు సామాన్య మానవ మాత్రుడుకాదేమోనని ఇంద్రుడు, మెప్పుతో పువ్వులుజల్లుతూ సిద్ధులు, కొండెత్తునప్పుడు కదిలి భూమి, మనలోనే ఉంటూ మనకంటే మించినవాడయ్యెరా అని అసూయతో గొల్లపిల్లవాండ్రు, అయ్యో పసివానికి ఎత్తిపట్టుకొనుటెంత కష్టమోనని పురజనులు వేర్వేరు విధాల యోచించుచుంటిరి. అట్లు యోచింప చేసిన శ్రీకృష్ణుడు మమ్ములను పవిత్రులను చేయుగాక.'

విక్రేతు కామా కిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తిః|
దద్యాధికం మోహవశాదవోచద్గోవింద దామోదర మాధవేతి|| 2-56

'ఒక గోపకన్య వ్రేపల్లెలో పెరుగు వంటి వాటిని అమ్ముతూ కృష్ణుని పాదాలపైనే మనసు పెనవేసుకున్నదై మోహము అతిశయిల్లగా "పెరుగు, పెరుగోయమ్మ పెరుగు" అనుటకు బదులుగా "గోవిందా, దామోదరా, మాధవా" అంటూ అరుస్తూ తిరిగినదట.'

కరారవిందేన పదారవిందం, ముఖారవిందే వినివేశయంతమ్
వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి|| 2-58

Peacock Feather and Flute'కరకమలములందు పాదకమలములుంచి అవేళ్ళు నోటిలోనికి జొప్పుతూ, వటపత్రముపై బవ్వళించు బాలముకుందుని మనసారా స్మరిస్తున్నాను.'

మాతః కిమ్ యదునాధ, దేహి చషకం, కిమ్ తేన పాతుం పయ
స్తన్నాస్తద్య, కదాసి వా, నిశి, నిశా కా వాంధకారోదయః|
ఆమీల్యాక్షియుగం నిశాప్యుపగతా దేహీతి మాతుర్ముహు
రవక్షోజామ్శుకకర్షణో ధ్యతకరః కృష్ణస్య పుష్ణాతు నః|| 2-60

'"అమ్మా!", "ఏమిటి యదునాధా?" "గెన్నె కావాలి", "అదెందుకు?"  "పాలు త్రాగడానికి", "పాలిప్పుడుకాదు", "మరెప్పుడు?" "రాత్రి", "రాత్రి అంటే", "చీకటి పడ్డతరువాత" అని తల్లి చెప్పగానే రెండుకళ్ళూ మూసుకుని "రాత్రి అయిపొయింది పాలగిన్నె ఇయ్యి." అని తల్లి పైట చెరగును చేతబట్టి లాగే శ్రీ కృష్ణుడు మమ్ములను రక్షించు గాక.'

కస్త్వం బాల, బలానుజః కిమిహ తే మన్మందిరాశఙ్కయా
యుక్తం తన్నవనీత పాత్రవివరే హస్తం కిమర్థం న్యసేః|
మాతః కఞ్జన వత్సకం మృగయితుం మాగా విషాదం క్షణా
దిత్యేవం వరవల్లవీ ప్రతివచః కృష్ణస్య పుష్ణాతు నః|| 2-82

'ఒక గోపిక తన ఇంట వెన్నకుండలో కృష్ణుడు చెయ్యిపెట్టుతుండడం చూచి "ఓ పిల్లడా నీవెవ్వడవు?" అని అడిగిన, "బలరాముని తమ్ముడిని", "నాయింట నీకేమిపని?" "మాయిల్లేననుకొని వచ్చాను" "అది సరే, కానీ కుండలో ఏమిటి వెదుకుతున్నావు?" "ఒకదూడకోసం వెదుకుతున్నాను, క్షణమైనా విచారించకు" అని సమాధానాలు చెప్పిన కృష్ణుడు మమ్ముల కాపాడుగాక.'

గోపాలా ऽ జిరకర్దమే విహరసే విప్రా ऽ ధ్వరే లజ్జసే
బ్రూషే గోకులహ్జ్కరుతై స్తుతి శతైర్మౌనం విధత్సే విదామ్|
దాస్యం గోకుల పుంశ్చలీషు కురుషే స్వామ్యం న దాన్తా ऽ త్మసు
జ్ణాతం కృష్ణ తవాంఘ్రి పంకజయుగం ప్రేమ్ణా ऽ చలం మంజులమ్|| 2-83

'కృష్ణా, గొల్లవాండ్ర ఇళ్లయందు దోగాడెదవుగాని యజ్ఞశాలలయందు తొంగిచూచుట కైన యిచ్చగించవు. గోవుల ఘృమ్కారమునకు మారు పలికెదవుగాని తత్వవిదులు చేసే స్తోత్ర సేవలకి సమాధానమైన యివ్వవు. గొల్లవిటకత్తియలకు దాసుడవుదువుగాని ఇంద్రియనిగ్రహులైన మహాత్ములనేలుకోవు. ఈకారణాలు చూస్తుంటే ఆయా వస్తువుల యోగ్యతాయోగ్యతలను బట్టి కాక వారిపైగల నీ ప్రేమయే నిన్ను వారివైపు నడిపిస్తోందనిపిస్తోంది.'   ఆవిధంగా రెండవ అధ్యాయంలో మురళీరవం వింటూ ఒకసారి ఒక శ్లోకం వివరిస్తూ అనుకోకుండా ఆ బాలుని చెయ్యి పట్టుకున్న బిల్వమంగళుడికి విద్యుదాఘాతం తగిలినట్లై విచలితుడైయ్యాడు; మనోనేత్రం విప్పారి కృష్ణుని తేజం విస్పష్టమై, తెలియని ఆనందముతో అతడి మనస్సు నాట్యం చెయ్యసాగింది. ఆవిధంగా నాట్యం చేస్తుండగా మూడవ అధ్యాయంలో అడుగుపెడితే ...

అరుణాధరామృతవిశేషితస్మితం, వరుణాలయానుగతవర్ణవైభవమ్|
తరుణారవిందదళదీర్ఘలోచనం, కరుణామయంకమసి బాలమాశ్రయే|| 3-17

Baby Krishna'ఎర్రగా అమృత తుల్యమౌ ఆధారాలు చిందించు చిరునవ్వు తో సొగసు మీరిన వాడును, సముద్రమునకుదీటుగా నీలశరీరకాంతి గలవాడును, లేత తామర రేకులవంటి కన్నులు గలవాడును అగు బాలకృష్ణుని ఆశ్రయిస్తున్నాను.'

లావణ్య వీచీర చితాంగ భూషాం, భూషాపదారోపిత పుణ్య బర్హామ్|
కారుణ్య ధారాళకటాక్షమాలమ్, బాలం భజే వల్లభవంశ లక్ష్మీమ్|| 3-18

'ముత్యపుతేటవలె సర్వ అవయవాలలో శరీర కాంతితో వెలుగువాడును, నెమలి ఈకను ఆభరణంగా సిగలో ధరించినవాడును, కరుణామయమైన కడగంటి చూపులు విదజల్లుతూ గోకులముందు సకల భాగ్యసంపదలు కలిగించు లక్ష్మి దేవి వలే విరాజిల్లుచున్న బాలుడైన శ్రీకృష్ణుని భజించు చున్నాను.'

వత్సపాలచరః కో ऽ పి వత్స శ్శ్రీవత్స లాంచనః
ఉత్సవాయ కదా భావీత్యుత్సు కే మామ లోచనే || 3 -26

'గొల్లపిల్లలతో దూడలని మేపుచు శ్రీవత్సమను పుట్టుమచ్చతో ఒప్పుచూ, ఇటువంటి వాడని చెప్పుటకును వీలులేని ప్రియబాలుని చూచుటకై నాకన్నులు తహతహ లాడుచున్నవి.'

ముఖారవిందే మకరంద బిందు, నిష్ఫన్ద లీలా మురళీ నినాదే|
వ్రజాఙ్గనాపాంగ తరంగ భృంగ, సంగ్రామభూమౌ తవ లాలసాః స్మః || 3 - 28

'పూదేనె బొట్లు కారునట్లు, సరళముగా జాలువారే మురళీరవంతో గోపికల కదులుతున్న కన్నుగవల నల్లని చూడ్కుల అలల వంటి తుమ్మెదలగుంపు కి యుద్దభూమి ఐన నీ మోతామరయందు ఆసక్తులమౌతున్నాము.'

జిహానం జిహానం సుజానేన మౌగ్ధ్యం
దుహానం దుహానం సుధాంవేణునాదైః|
లిహానం లిహానం సుదీర్ఘై రపాంగై
ర్మహానందసర్వస్వమేతన్న మే తమ్|| 3-69

'వయసు పెరుగుతున్నా కొలది యవ్వనము పైపైకి వస్తూ అందం సొంపులు పెంపై, గొల్ల కాంతల సేవలనొందుతూ ఆనందించువాడును, నందునికి సర్వస్వమైనవాడునైన వానికి మ్రొక్కుతున్నాను.'

ప్రాతః స్మరామి దదిఘోష వినీతనిద్రం
నిద్రావసాన రమణీయ ముఖారవిందమ్|
హృద్యానవద్యవపుషం నయనాభిరామ
మున్నిద్రపద్మనయనం నవనీతచోరమ్||   3 - 89

'పెరుగుచిలుకుతున్న శబ్దంతో నిదురలేచి, ఆ అసంపూర్తి నిద్రలోకూడా అకుంఠిత సౌందర్యంతో, వికసించిన పద్మాలవంటి నేత్రాలతోను విరాజిల్లే వెన్నదొంగని తెలతెల్లవారే సమయాన స్మరిస్తున్నాను.'

హస్త మాక్షిప్య యాతోऽసి, బలాత్కృష్ణ కిమద్భుతమ్
హృదయాద్యది నిర్యాసి, పౌరుషం గణయామి తే || 3 - 97

'కృష్ణా! నీవు నాచెయ్యి విదుల్చుకుని పోవుట అద్భుత మేమి కాదు, నా హృదయంనుంచి తొలగిపోగలితేనే నీ పౌరుషాన్ని గుర్తిస్తాను,'

రాధా మోహనమందిరా దుపగత శ్చంద్రావాళీ మూచివాన్
రాధే క్షేమమయే స్తి తస్య వచనం శ్రుత్వా హ చంద్రావళీ |
కంస క్షేమమయే విముగ్ధ హృదయే కంసః క్వదృష్టస్త్వయా
రాధా క్వేతి విలజ్జితో నతముఖః స్మేరో హరిః పాతు వః|| 3 - 107

'రమణీయమైన రాధ గృహం నుండి వస్తూన్న కృష్ణుడు ఎదురొచ్చిన చంద్రావళిని చూచి చంద్రావళిని గుర్తించక "రాధా క్షేమమా?" అని అడుగగా, రాధ అంతగా కిట్టని చంద్రావళి కోపంతో "కంసా క్షేమమేనా?' అని బదులివ్వగా, "నీకు కంసుడెక్కడ కనబడ్డా"డని అడిగి వెంటనే అడిగింది చంద్రావళి అని గుర్తించి నవ్వుతూ సిగ్గుతో తలని దించుకున్న కృష్ణుడు మమల్ని రక్షించుగాక.'

ఆమూన్యధన్యాని దినాంతరాణి
హరే త్వదాలోకన మన్తరేణ|
అనాధబంధో కరుణైకసింధో
హా హన్త  హా హన్త కథం నయామి||. 1-41

'ఓ అనాధబంధో, కరుణైక సింధో నీ దర్శనం లభించక దీనుడనై రోజులు వ్యర్ధంగా గడుపుతున్నా గదయ్యా?' అని ఆర్తితో వేడుకొంటున్నాడు, భగవంతుని కృపాకటాక్ష వీక్షణాలకై.

ఏషు ప్రవాహేషు న ఏవ మన్యే
క్షణో పి గణ్యః పురుషాయు షేషు|
ఆస్వాద్యతే యత్ర కయా  పి భక్త్యా
నీలస్య బాలస్య నిజం చరిత్రమ్|| 3 - 34

'ఎడతెగక ప్రవాహము వలె సాగుతున్న మానవ జీవిత కాలంలో నీలమేఘశ్యాముని చరిత్రము భక్తితో స్మరించి ఆనందించు క్షణమొక్కటే సార్ధకముగాని, తక్కిన కాలమంతయు వ్యర్ధమే అవుతుంది.'

తరువాత నేను విన్న కథ - బిల్వమంగళుడి ప్రేమాయుత భక్తికి మెచ్చి కృష్ణుడు తన చేతులతో అతడి కనులపై వ్రాసి అతడికి పూర్వ దృష్టిని ప్రసాదించి ధన్యుడని చేసాడట. అప్పుడతడు తన నిజనేత్రాలతో ఆ మందస్మిత నీలమేఘశ్యాముడిని, సుగుణధాముడిని, దీనజనోద్ధారుణ్ణి, గాంచి తరించి అమితానందాన్ని అనుభవించాడట.

నేను బెంగళూరులో చదువుకునే రోజుల్లో మా కాలేజీ లైబ్రరీలో అనుకోకుండా తెలుగులో కనిపించిన ఈ 'శ్రీకృష్ణకర్ణామృతమ్' కనిపించి చదవాలనిపించి కాగితాలు అటునిటు తిరగవేస్తుండగా జాలువారిన మకరంద బిందువులు ఒడిసిపట్టుకుని గ్రోలాలని అనిపించి ఆద్యంతం చదివి ముగ్ధుణ్ణయ్యాను. ఆవిధంగా ముగిసిన మధురకావ్యం లోని కొన్ని మచ్చుతునకలు మీ అందరి హృదయ భాండాలని కూడా మధువుతో నింపి ఉంటుందని ఆశిస్తూ...

సమాప్తం

-o0o-

Note: Most the information is obtained from internet and some also from the book “The man who knew Infinity” by Robert Kanigel, published by Washington Square Press

Posted in September 2021, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *