Menu Close
Page Title

'నానృషిర్కురుతే కావ్యం'

Mahakavi Kalidasuఋషి కానివాడు స్వయం ప్రతిభతో సాహితీ ప్రవీణుల మెప్పు పొందగలిగే ఉత్తమ కావ్యాన్ని వ్రాయలేడనేది ఋగ్వేదోక్తి. ఋషులందరు కవులు కారు. ద్రష్ట లందరిలో చాలామంది కవులే కావచ్చు. భారత సాహిత్యము చాలామంది కవులనే మనకి వివిధ భాషలలో అర్పించింది. వారిలో వివిధ తరగతులు, కోవలకి చెందిన కవులు, రచయితలు చాలామందే ఉన్నా మన స్మృతి పథంలో శాశ్వతంగా నిలిచే వారిలో వాల్మీకి మహర్షి, వ్యాస భగవానుడు, మహాకవి కాళిదాసు ఆకోవకి చెందినవారిలో ఆద్యులు. ఇప్పటివరకు మనకు తెలిసిన చరిత్ర ప్రకారం పామరునిగా జీవనయానం ప్రారంభించి, పరమేశ్వరుని మరియు కాళీమాతల కృపాకటాక్ష వీక్షణాలతో ‘కాళిదాసు'గా రచనా వ్యవసాయమారంభించి అసమాన ప్రతిభతో పండితులని మెప్పించి మహాకవిగా పరిణతి చెంది కావ్య, నాటక, ఖండకావ్య, శ్లోక పూరణ విభాగాలలో వివిధ పోటీలను గెలిచి, తన ప్రతిభని అనూహ్యంగా ప్రదర్శించి 'సాహిత్య సామ్రాట్'గా పండితులచే 'శభాష్' అనిపించుకుని, కవికుల గురువుగా ఖ్యాతి నార్జించి “ఉపమా కాళిదాసస్య" అనే నానుడికి సార్ధకత చేకూర్చిన శారదా స్వరూపుడు కాళిదాసు. స్ఫురద్రూపి, అసమాన కవితా సామర్ధ్యం గల కాళిదాసు తనదైన ప్రత్యేక స్థానాన్ని ప్రపంచ సాహిత్య సీమలోనే సంపాదించుకున్నాడు.

'పురాకవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికా కాళిదాసా|'

చిరకాలం నుంచి ఉన్న కవిశ్రేష్ఠులలో అప్పటికి ఆఖరివానిగా కాళిదాసుని చిటికిన వేలుతో లెక్కపెట్టడము ఆరంభిస్తే...'అథాపి తత్తుల్య కవేః అభావాత్ అనామికా సార్ధవతీ బభూవా||'

ఈనాటికీ అతడిని మించిన లేదా అతనితో సమానుడైన కవి దొరకక దాని ముందున్న వేలు 'అనామిక' గానే మిగిలి పోయిందన్నది ఒకానొక కవి భావోత్ప్రేక్ష, కాళిదాసుకి నీరాజనం…

నేను ఎనిమిది, తొమ్మిదేళ్ల వయస్సులో రాజమహేంద్రవరం లో స్కూల్ అయిన తరువాత మా మేనత్త గారింటికి అప్పుడప్పుడు వెళుతుండేవాడిని. నేను వెళ్లే సమయాన అక్కడ వారి పిల్లలకి పంచకావ్యాలు బోధించే కార్యక్రమంలో పండితులు శ్రీ ముక్కవిల్లి అన్నప్పదీక్షితులు గారు సంస్కృత పాఠాలు చెబుతుండేవారు. నేను వెళ్ళినప్పుడు మహాకవి కాళిదాసు 'కుమారసంభవం' చెప్పుతుండడం జరిగింది. ఒకానొక రోజున అయన చెబుతున్న కాళిదాసు శ్లోకం- దాని యొక్క ప్రతిభో, అయన చెప్పేన తీరో, దాని అర్ధమో, ఆ ఉపమానము యొక్క గొప్పతనమో స్పష్టంగా తెలియదుగాని, నన్ను బాగా ఆకట్టుకుంది. అది జరిగి 70 ఏళ్ళు పైనే అయినా అది ఇంకా నా మనో ఫలకంపైన చెరగని ముద్రగా నిలిచిపోయింది.

ఆ శ్లోకం:

'లాంగూల విక్షేప విసర్పిశోభయ్- రితస్తత చంద్రమరీచి గౌరైః
యస్యార్ధయుక్తం గిరిరాజ శబ్దం కుర్వన్తివాలవ్యజనైశ్చమర్యః'

అందంగా చమరీ మృగాలు హిమాలయ పర్వతాలపై తమ తెల్లని వెన్నెలవంటి కుచ్చు తోకలు ఊపుకుంటూ తిరుగుతుంటే, అవి పర్వతరాజైన హిమవంతునికి వింజామరలు వీస్తూ రాజుకు తమ గౌరవాన్ని తెలియజేస్తున్నాయా అన్నట్లు ఉన్నదని చమత్కరించాడు కాళిదాసు. మంచు కొండల పైనున్న సాధారణ దృశ్యానికి ఎంత ఉన్నత భావావలోకన, ఎంత గొప్ప ఉపమానం! ఇది ఆ కవి ఉత్ప్రేక్ష కు మచ్చుతునక.

ఎటువంటి నమ్మదగిన చరిత్రాధారాలు లభించక పోవడంతో ప్రస్తుతము చలామణి లో నున్న కధలు, దొరికిన కొన్ని చరిత్రాధారాలను సాధనంగా అతని జీవిత చరిత్రని ప్రునర్నిర్మింప చాలామంది ప్రయత్నించారు అందులోనివి కొన్ని:

ఆరోజుల్లో, అంటే మూడవ శతాబ్దం అంతిమ భాగంలో, భీమశుక్ల మహారాజు కాశీ రాజ్యాన్ని ఏలుతుండేవాడు. ఆయనకి అందమైన తెలివైన విద్యాధరి (వాసంతి?) అనే కుమార్తె ఉండేది. ఆమెను రాజు ఆస్థాన పండితుడు, శాస్త్ర జ్ఞానంలో పేరుగల 'వరరుచి' ని ఆమెకు శాస్త్రాధ్యయనానికై గురువుగా నియమించాడు. వరరుచి విద్యాభ్యాసానంతరం ఆమె సౌందర్యానికి, పాండిత్యానికి ముగ్ధుడై ఆమెని వివాహం చేసుకోవాలని తలంచి ఆమెకు తెలియచేయగా, తాను అతనికంటే గొప్ప పండితురాలని ఆమె నిరాకరించింది. అదే కాకుండా ఆమె ఎవరైతే తనని శాస్త్రార్థ పాండిత్య పటిమతో గెలుస్తారో అతనినే వివాహమాడుతానని కూడా ప్రతిజ్ఞచేస్తుంది. తన కూతురు విధించిన నియమంతో దారిన పోయే వాళ్ళందరూ ఆ పోటీలో పాల్గొనకుండా ఉండేందుకు గాను ఓడినవారిని, తల గొరిగించి గాడిదపై ఊరేగించి దేశ బహిష్కరణ గావిస్తానని రాజు ప్రకటిస్తాడు. పండిత వివాదంలో ఓడి కొంతమంది పరాభవాన్ని, తదుపరి శిక్షగా శీర్ష ముండనాన్ని, దేశ బహిష్కారాన్ని ఎదుర్కొని ఆమెపై కక్ష పెంచుకొన్నారట. దానితో అక్కడి పండిత జనం ముఖ్యంగా వరరుచి, ఆమె గర్వాన్ని అణచి ఆమెపై కక్ష తీర్చుకునే ఉద్దేశ్యంతో - దగ్గర అడవిలో తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుంటూ కనబడ్డ ఒక మూర్ఖ గొర్రెల కాపరిని (ఒక కధనం ప్రకారం బ్రాహ్మణ అనాథ బాలుడు, తలిదండ్రులు విధివశాత్తు మరణిస్తే, ఆతడిని పశువుల కాపరి పెంచి పెద్దచేశాడట) స్ఫురద్రూపి కావడంవల్ల పండిత వేషంవేసి, ఆయన నెల్లాళ్ళ పాటు మౌన వ్రత దీక్షలో ఉన్న అసమాన ప్రతిభాశాలి అయిన పండితుడని రాజపరివారాన్ని, అక్కడి పండితులని నమ్మించి రాకుమారిముందు నిలబెడతారు. విద్వత్ పరీక్షలో భాగంగా రాకుమార్తె- ‘ఆ పరమేశ్వరుడొక్కడే కదా’ -అని సూచిస్తూ చూపుడు వేలు చూపిస్తే, దానిని తన కళ్ళల్లో పొడుస్తానని ఆమె చేస్తున్న బెదిరింపుగా అర్ధం చేసుకున్న ఆ పశులకాపరి రెండు వేళ్ళు చూపి 'అయితే నీ రెండుకళ్ళూ పొడుస్తానని' సంజ్ఞలతో సమాధాన మిచ్చాడు. దానిని రాకుమార్తె 'ఆ పరమాత్మే జీవునిలోకూడా ఉన్నాడుకదా' అని వాదిస్తున్నట్టుగా ప్రక్కనున్న వరరుచి మిత్రులైన పండితుల సహాయంతో అర్ధంచేసుకుని చర్చ సాగిస్తూ ఆమె చేతిని విప్పి ఐదువేళ్ళు చూపించి, ఈ శరీరం పంచభూతమయమేనా అని ప్రశ్నిస్తే, అతగాడు ఆమె చాచి లెంపాకాయ కొడతానని బెదిరిస్తోందని భావించి, పిడికిలి ముడిచి ఒక్క గుద్దు గుద్దు తానని సంజ్ఞ చేసాడు. దానిని ఆమె 'అన్నీ కలిస్తేనే కదా ఈ శరీరం' అని సమాధానము చెబుతున్నాడనుకొని సరైన సమాధానంగా తీసుకున్నదట. ఆ విధంగా జరిగిన మూగ సంకేత భాషణలలో విపరీతార్ధాలని ప్రక్కనున్న వరరుచి కక్షలో భాగస్తులైన పండితుల సహాయంతో రాకుమారి సరైనవిగా అన్వయించు కుని అతనిని గెలుపొందించి అతనిని వివాహం చేసుకుంటుంది. వివాహానంతరం, అతడొక మూర్ఖుడని తాను మోసగింపబడ్డదని తెలుసుకున్న రాకుమార్తె, అతడిని కోపంతో బయటకు పొమ్మని, తదుపరి ఆమెస్థితికి కారణం అతడొక్కడే కాదని చింతించి అతనిపై జనించిన జాలితో కాళీమాత పాదాలు పట్టుకుని ఆమె కటాక్షాన్ని సంపాదించుకుని విద్యను కోరుకొమ్మని ఆజ్ఞాపిస్తుంది. శివ భక్తుడైన అతడు దగ్గరలోఉన్న కాళికాలయంలో మొండిగా విద్య కావాలని కోరుతూ నాలుక కోసుకునే ప్రయత్నం చెయ్యగా, కాళికాదేవి అతడి అమాయకతకు మెచ్చి నాలుకపై బీజాక్షరాలు వ్రాసినదట. ఆవిధంగా ఆ పశువుల కాపరి పాండిత్య ప్రకర్షని సాధించాడట. కాళికాదేవి ఆశీర్వాదాన్ని పొందిన వెంటనే అతడు భక్తి పరవశుడై ప్రార్ధించిన 'మాణిక్య వీణాం ఉపలాలయంతీమ్' తో ఆరంభించిన 'శ్యామలాదండకం' సుప్రసిద్ధం. తదుపరి

'చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వన వాటీషు నాకపటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంజిత పదా |
పాటీర గంధి కుచ శాటీ కవిత్వ పరిపాటీ మగాధి పశుతామ్
ఘోటీ కులాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్||'

అంటూ అశ్వధాటీ వృత్తంలో పది శ్లోకాలలో దేవిని స్తుతించి ఆమె మెప్పునిపొందిన ఘనుడు. పండితుడై తిరిగివచ్చాడని తెలుసుకున్న రాకుమార్తె భర్తని చూసి 'అస్తి కశ్చిత్ వాగ్విశేషః' 'నీ తెలివిని పదర్శించే ముఖ్య మైనదేదైనా చెప్పగలవా?' అని ప్రశ్నిస్తే ఆమె గర్వోన్నతికి భంగపడి అతడు సమాధాన మివ్వకుండా వెళ్ళిపోయి తరువాత 'అస్తి ఉత్తరాస్యం దిసి'' తో ప్రారంభించి ‘కుమారసంభవం’, ‘కశ్చిత్ కాంతా’ తో ‘మేఘ దూతం', ‘వాగర్ధా వివ సంపృక్తౌ’ తో ప్రారంభించి ‘రఘువంశం అనే ఉత్తమ గ్రంధాలని వ్రాసాడనేది ఒక కల్పనా విశేషం కావచ్చు.

వేరొక కధనమేమనగా రాకుమారిచే తృణీకరించబడ్డ పశువుల కాపరి సరైన గురువుకై వెదుకుతూ చివరికి కాళీమాత దయవల్ల ఒక సాధుని గురువుగా పొంది దీక్షాపరురుడై సంస్కృతాన్ని, వ్యాకరణ, మీమాంసలని అధ్యయనం చేసి పండితుడై రాకుమారి వద్దకు తిరిగి వచ్చి ఆమె మెప్పునిపొందాడట. అప్పుడు ఆమె తనని భార్యగా స్వీకరించమని కోరగా, తనకు మార్గదర్శకురాలైన ఆమె గురువుతో సమానురాలని, తల్లిగా పరిగణిస్తానని చెప్పి అతడు నిరాకరించాడట. ఆ రాకుమారి శాస్త్రోక్తంగా వివాహమాడిన తనని నిరాకరించినందుకు ఫలితంగా ఒక స్త్రీ చేతనే అతని జీవితము ముగుస్తుందని శపించినదట.

పిమ్మట తన పాండిత్య ప్రతిభను ప్రదర్శిస్తూ అనేక రాజ్యాలు తిరిగి చివరకు విక్రమాదిత్యుని (ధారా నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించే భోజరాజు- అని ఒక కథనం; 380 - 415 క్రీ.శకం లో పరిపాలించిన రెండవ చంద్రగుప్తుడని కూడా ఒక వాదన) ఆస్థానంలో ఉండే నవరత్నాలలో ఒకడిగా భాసిస్తుండే వాడు.

Gold Coins from Vikramaditya Eraఅక్కడి తక్కిన రత్నాలు:

  1. అమర సింహ- అమరకోశ వ్యాకరణ రచయిత
  2. ధన్వంతరి - ఆయుర్వేద సస్త్ర రచయిత, పండితుడు
  3. ఘటకార్పర: సంస్కృత కావ్య రచయిత
  4. క్షపణక; జ్యోతిషశాస్ర నిపుణుడు.
  5. శంకు: వ్యవసాయ నిపుణుడు
  6. వరాహమిహిర- బహుముఖ ప్రజ్ఞాశాలి, బృహత్ సంహిత-పంచసిద్ధాంతిక, బృహత్ జాతక రచయిత; గ్రహ సంచార వివరణ, గ్రహణ గణిత, ఆలయ, గృహ వాస్తు, జ్యోతిష గ్రంథ, దేవాలయ నిర్మాణ శిల్పశాస్త్ర, రత్న పరిశీలనా శాస్త్రముల రచయిత
  7. వరరుచి- వ్యాకరణ గ్రంథ రచయిత, పండితుడు,
  8. బేతాళ-భట్ట; సంస్కృత పండితుడు 'నీతి ప్రదీప' రచయిత

ఆకాలంలో సంస్కృత కావ్య రచనలలో సుప్రసిద్దులు: అశ్వఘోషుడు (క్రి.శ 80 -150: రచనలు :బుద్ధచరిత్ర, సుందరనందనం), కాళిదాసు-రచనల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి, దండి(క్రి.శ 680 -720 రచనలు: దశకుమారచరిత్ర- వచన రచన, అవంతి సుందరి- కావ్యం , కావ్య దర్శి), బాణభట్టుడు (క్రి.శ 606 -649: రచనలు: హర్ష చరిత్ర, కాదంబరి), భారవి (ఆరవ శతాబ్దపు కవి, రచనలు: మహా కావ్యం: కిరాతార్జునీయం). మాఘ (ఏడవ శతాబ్దం; రచనలు: శిశుపాల వధ), మరియు భవభూతి- (ఎనిమిదవ శతాబ్దపు కవి, రచనలు: మాలతి మాధవం, మహావీరచరిత్ర, ఉత్తర రామచరిత్ర).

ఆ కాలంనుంచి నేటి వరకు వాడుకలోనున్న సుప్రసిద్ధ కవిచంద్రుల నైపుణ్యాన్ని వర్ణిస్తూ వాడుకలోనున్న శ్లోకం:

'ఉపమా కాళిదాసస్య భారవేనర్థగౌరవం|
దండినః పదలాలిత్యం - మాఘేసన్తి త్రయో గుణః||'

భావం: కాళిదాసు ఉపమానంలోనూ, భారవి అర్ధానికి గౌరవం ఆపాదించడంలోనూ, దండి పదలాలిత్యాన్ని పొందుపరచడంలోనూ, మాఘుడు ఆ మూడింటికి సమౌన్నత్యాన్ని సాధించడములోను అఖండులు.

కాళిదాసు వ్రాసిన వాటిలో సుప్రసిద్ధ గ్రంధాలు;
నాటకాలు: అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్నిమిత్రం
కావ్యాలు: రఘువంశం, కుమారసంభవం
గీత కావ్యాలు: మేఘదూతం, ఋతుసంహారం

సంస్కృత భాషలో పంచ మహాకావ్యాలు గా గౌరవింపడుతున్న గ్రంధాలు:
కాళిదాసు- ‘కుమారసంభవం’, కాళిదాసు- ‘రఘువంశం’
భారవి- ‘కిరాతార్జునీయం’, శ్రీ హర్ష- ‘నైషధ చరిత్ర’, మాఘ- ‘శిశుపాల వధ’.

కాళిదాసు కవిత్వాన్ని కాళిదాసు తరువాత మళ్ళీ అంతటి వాడుగా ప్రసిద్దుడైన బాణభట్టుడు మెచ్చుకుంటూ:

'నిర్గతాస్తు న వా కస్య కాళిదాశేషు సూక్తిషు |
ప్రీతిర్మధురసాంద్రాసు మంజరీష్వివజయతే||'

'మధుర మకరందాలతో సుగంధభరిత పుష్ప వనం లో విహరిస్తున్నట్టు అనుభూతిని కలిగించే కాళిదాసు రచనల మాధుర్యాన్ని గ్రోలుతూ ఆనందించని వారెవరైనా ఉంటారా?' అని అంటాడు.

మల్లినాథ సూరి అనే గొప్ప సాహితీ విమర్శకుడు, మహాకావ్యలపై ప్రసిద్ధ వ్యాఖ్యానకర్త, ఈ శ్లోకం ద్వారా కాళిదాసుపై తన గౌరవోన్నత్వాన్ని ప్రకటించాడు:

'కాళిదాసగిరాం సారం కాళిదాసః సరస్వతి|
చతుర్మఖో s సాక్షాద్-విదుర్నాన్యే తు మాద్రుశాః||'

"కాళిదాసు కృతుల ఔన్నత్యం కాళిదాసుకే తెలియాలి, లేదా సరస్వతికి గాని చతుర్ముఖ బ్రహ్మ గాని తెలియాలి, కానీ నాలాంటి సామాన్య మానవులకి ఏవిధంగా తెలుస్తుంది?"

ఇంక అటువంటి కాళిదాసు కవితా విపంచి పలికించిన ఉన్నత భావరాగాలని పరిశీలిస్తే :-
కాళిదాసు 'రఘువంశ' కావ్య ఆరంభంలో జగత్పితరులని స్తుతిస్తూ

'వాగర్దా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే|
జగతః పితరోవందే పార్వతీ పరమేశ్వరౌ ||'

- అంటాడు.

'మనం ఉచ్ఛరించే మాటలో దాని యొక్క అర్ధము ఎల్లా విడదీయలేమో అలాగే భాసిస్తున్న అర్ధనారీశ్వరులైన జగత్పితరులకి నమస్కారం.' ఎంతటి ఉదాత్త ఉపమానము.

మహోన్నతమైన ‘రఘువంశమ్’ కావ్య రచన విషయంలో తన అల్పత్వాన్ని ఏవిధంగా సవినయంగా తెలియచేశాడో చూడండి.

'క్వ సూర్య ప్రభవో వంశః క్వచ అల్ప విశేషయా మతిః' – ‘ఎక్కడ ప్రభావాన్వితమైన సూర్యవంశము, అల్పమతినైన నేనెక్కడ?’

మానవ జీవిత శైలి ఏవిధంగా ఉండాలో విశదీకరిస్తూ-

'శైశవ్యో s భ్యాస్త విద్యానాం యౌవనే విషయేషీణాం| వార్ధక్యే మునివృత్తినాం యోగేనాంతే తనుత్యజామ్|'

సమస్త విద్యాభ్యాసం జీవిత ఆరంభదశలోను, భోగలాలసత యౌవనంలోను, వార్ధక్యంలో మునివలె విచారణా వ్యాపకం తోనూ, అంతిమ దశలో యోగివలె ఉంటూ తను త్యాగం చెయ్యాలి అంటాడు కాళిదాస కవీంద్రుడు.

అజ మహారాజు భార్య ఇందుమతి అకాల మరణ వేదన సహించలేక విలపిస్తూ అంటాడు -

'గృహిణి సచివః సఖీ మిధ్యః ప్రియశిష్యా లలితే కళావిధౌ |
కరుణా విముఖేన మృత్యునా హరతా త్వాం వద కిమ్ న మే హృతమ్||'

- నా గృహిణివి, నా కార్యదర్శివి, స్నేహితురాలివి, ప్రియురాలివి, లలితకళా భ్యాసంలో ఇష్ట శిష్యురాలివి అయిన నిన్ను దుష్ట మృత్యువు నానుంచి ఎందుకు లాక్కుని పోయిందో చెప్పుఅంటూ విలపించిన నాయకుని విప్రలభ్ద శృంగార రస భావుకతలోను, వాటిని సున్నితంగా, లలితంగా చేసిన భావ విస్ఫురణములోను కాళిదాసుని మించిన కవి లేడంటే అతిశయోక్తి కాదు.

రామ కుంభకర్ణ యుద్ధ సన్నివేశాన్ని వివరిస్తూ.

'అకాలే బోధితో భ్రాతా ప్రియస్వప్నో వృధా భవన్|
రామేషు భిరితీ వాసౌవ్ దీర్ఘనిద్రాం ప్రవేశితః||'

రాముని బాణాలు శక్తివంతుడైన కుంభకర్ణుని అనంత నిద్రలోకి జారుస్తూ- "ఓ నిద్రా ప్రియుడైన కుంభకర్ణా, నువ్వు నిద్ర మధ్యలో అకారణంగా నీ అన్నచే లేపబడ్డావు" ఇక నిద్ర కొనసాగించమన్నట్లు ఉన్నాయట.

'కుమారసంభవం' లో మహా శివుని తపః స్థితిని వర్ణిస్తూ,

'ఆవృష్టి సంరంభమివామ్బువాహం అపామివాధారమనుత్తరంగమ్|
అంతశ్చరాణాం మరుతాం నిరోధాన్నివాపనిష్కంపమివ ప్రదీపమ్||'

నీటితో నిండి వర్ష సన్నిద్ధమైన ఉన్నతావరణ మేఘములాగా, అలలు లేని గంభీర సముద్రములాగా, గాలి వీయనప్పుడు స్థిరముగా జ్వలించే దీప శిఖలాగానూ, ఉన్నదట ఆ దేవదేవుని సమాధి తీరు. ఇది కాళిదాసు ఉత్కృష్ట వర్ణనకి ఒక ఉదాహరణ.

'కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్య శాకుంతల
తత్రాపి చతుర్ధ అంకా తత్ర శ్లోక చతుష్టయం'

'కావ్యాలలో నాటకం రమ్యమైనదైతే, శాకుంతలం అతి రమ్యమైనది. దానిలో నాలుగవ అంకం, అందులో నాలుగవశ్లోకము అత్యంత రమ్యమైనవి' అన్నది నానుడి గా మిగిలిపోయింది. మహాకవి కాళిదాసు తన కావ్యాలలో సౌందర్య, శృంగార (సంభోగ: కుమారసంభవం, అభిజ్ఞాన శాకుంతలం; విప్రలబ్ధ: మేఘదూతం) రసోస్పాదనలో అద్వితీయుడు. హాస్య కరుణ రస స్ఫూర్తిని ప్రభవించడంలో కూడా అసామాన్యుడని కవిశేఖరుల ఏకాభిప్రాయం. శబ్ద, అర్ధ అలంకార వైభవాన్ని తన కవితా విపంచిపై పలికించాడని విజ్ఞుల అభిప్రాయము. కాళిదాసు యొక్క ప్రకృతి పరీశీలన, సౌందర్యారాధన, భావ స్పష్టత, వ్యక్తీకరణ, మానవుని ఆంతరంగిక బాహ్యప్రపంచాల రూప దర్శనా విన్నాణము, అతడి కవితా ప్రతిభలో కొట్టొచ్చినట్లు కనబడి సహజత్వాన్ని ఉట్టిపడేలా చేస్తూ పాఠకులని ఆకట్టుకుని అతడి మహా కవిని చేశాయి.

అతని సామాజిక స్పృహ, వాతావరణ సమ్యక్దృష్టి 'ఋతుసంహారం' లో స్పష్టంగా కనిపిస్తుంది. 'ఆషాఢస్య ప్రధమదివసే' అంటూ ప్రారంభించిన కాళిదాసు "మేఘదూతం" కావ్యమంతా 'మందాక్రాంత' ఛందస్సులోనే నడిపించాడు. అందులో శాపగ్రస్తుడైన యక్షుడు తాను బందీగా ఉన్న రామగిరి నుండి అతని భార్య నివసిస్తున్న అలకానగరి వైపు పయనిస్తున్న మేఘ సమూహాన్ని మానవ దూతగా ఊహించి సందేశాన్ని పంపుతూ దారిలోఉన్న భౌతిక స్థలాకృతిని, వాతావరణ పరిస్థితిని చేసిన వివరణని చూస్తే అతడి సంపూర్ణ అవగాహనా పరిస్థితి అర్ధమౌతుంది. దానిని సమర్ధిస్తూ డా. రంజాన్ కేల్కర్, విశ్రాన్త ఇండియన్ మెటీరియోలాజికల్ శాఖామాత్యులుగా' మేఘదూతం'ని నిశిత పరిశీలనా దృష్టితో పరీక్షించి ఎటువంటి సాంకేతిక మద్దతు లేని ఆ రోజుల్లో కాళిదాసు చేసిన ఆదారిలోని భూ విహంగ వీక్షణ వాతావరణ వివరాలు ఈనాటి పరికర సహాయంతో సరిచూస్తే ఎంత సరిగా సరి తూగుతున్నాయోనని ఆశ్చర్య చకితులయ్యారు. డా. వీ. ఆర్ భావే అనే సాహసికుడు తన స్వంత చిన్న విమానంలో 'మేఘదూతం'లో వివరించిన దారిలో విహంగము లా ప్రయాణం చేసి ఆ కావ్యంలో వివరించినట్లుగానే ఉండడం అవి అతనికి అంత క్షుణ్ణంగా ఎలా తెలుసునని చాలా ఆశ్చర్య పోయాడట. అతడి వివిధ రచనలని పరిశీలిస్తే, కాళిదాసు భారత దేశం నలుమూలలు తిరిగి ప్రకృతి సౌందర్యాన్ని, సుభిక్షతని, వైభవాన్ని, వృక్ష, జంతు సంపదల్ని తనదైన శైలిలో మధుర శ్లోకాలలో వివిధ ఛందోబంధాలతో కావ్యాలని ప్రకాశింప చేసాడని తెలుస్తుంది.

"ఋతుసంహారమ్" బహుశా అతడి కవి జీవితపు ఆరంభ దశలో వ్రాసినది కావచ్చు- ఆరు ఋతువులని అతిసుందరంగా, మనోహరంగా శృంగార మిళితంగా వర్ణిస్తూ చూపించాడు కాళిదాసు. శబ్ద, అర్ధ అలంకారాలతో కావ్యాలని అతి సుందరంగా పొందుపరచడంలో అతనిని మించిన వారు బహుశః ఉండరు. అతడి రచనలలో శబ్ద, అర్ధ, ఉత్ప్రేక్ష, అర్ధాంతరన్యాస, అనుప్రాస, యమక, శ్లేషల వాడుక ఏంతో ఉదాత్తమై ఎందరో కవులచే అనుకరింపబడుతున్నాయి. ఉదాహరణకి పార్వతి శివునితో తన వివాహం నిశ్చయమైన తరువాత తమ వివాహాము వరకు పద్మరేకలు లెక్కిస్తూ రోజులు వెళ్లబుచ్చుతుంది. భావం ఎంత సుందరంగా ఉంది!

కవిత్వానికి సార్ధకత మనోల్లాసం, సౌందర్య ఆరాధన, ఆనంద ప్రదీపన. ఇవి కాళిదాసు కావ్యాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి, అయన ప్రతి అధ్యాయానికి చేసిన సందర్భానుసార శ్లోకవృత్త మార్పు, భావస్వచ్ఛత, పద ఎంపికలో గంభీరత విస్పష్టత చదువరుల్ని సంభ్రమానికి లోనుచేస్తుంది. చిరకాలం ఉండే కవితకి ఉండవలసిన ప్రధాన లక్షణమైన పాఠకులచే మళ్ళీ మళ్ళీ చదివింపజేసి ఆనందింప చెయ్యాలనే ప్రయత్నం, తపన అతని కావ్యాలలో పుష్కలంగా లభిస్తుంది.

కాళిదాసు కవితా వైభవాన్ని గురించి పశ్చిమ దేశాల ద్వారా బాహ్యప్రపంచానికి తెలిసింది. మొదట్లో 1813 లో హోరేస్ హేమన్ విల్సన్ 'మేఘదూతం' ని ఆంగ్లం లో అనువదించిన తరువాతనే. క్రమముగా ఇతర దేశ భాషల లోకి కూడా అవి అనువదింపబడి ప్రపంచ వ్యాప్తంగా అతని ప్రతిభ విభవింపచేశాయి.

కాళిదాసు చేసిన వివిధ ప్రాంతాల పర్యటనలో భాగంగా ప్రస్తుతపు శ్రీలంకలో ఉన్న సమయంలో ఒక వేశ్యాగృహంలో బస చేస్తూ (ఆ రోజుల్లో వసతి గృహాలు ఉండేవికాదు) వారి కోరికపై తాను వ్రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం' చదివినిపిస్తూ అతడి భార్య విద్యాధరి శాపాన్ని నిజం చేస్తున్నాయా అన్నట్లు అక్కడి వారి అసూయ ముప్పిరిగొనగా ఆమె చేత నియమింపబడ్డ వారిచే హత్య చేయ బడ్డాడట. అమితమైన ప్రేమను పంచిన వ్యక్తియొక్క జీవితం ఈర్ష్య అసూయలవల్లనే విషాదాంతమైందన్న విషయం నిజమే అయితే అతని సుందర అమోఘ జీవిత నాటకానికి విధి హఠాత్తుగా మధ్యలోనే తెరదించింది.

-o0o-

Posted in May 2021, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!