Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

స్థానము తప్పివచ్చునెడఁ | దానెటువంటి బాలాఢ్యుడున్ నిజ
స్థానికుఁడైన యల్పుని క  తంబుననైనను మోసపోవుగా
కానలలోపలన్ వెడలి | గంధగజం బొకనాఁడు నీటిలోఁ
గానక చొచ్చినన్ మొసలికాటున లోఁబడదోటు భాస్కరా!

తాత్పర్యముభాస్కరా! మదించిన ఏనుగు అడవిని వదలి నీటి యందు ప్రవేశించిన తోడనే మొసలికి లోకువైనది గదా! అట్లే మానవుడెంత బలము గల వాడైననూ తన స్థానమును విడిచి, వేరు స్థానమును చేరినచో బలము తగ్గి పరాభవములు పొందును.

సౌరవివేకవర్తనల | సన్నుతికెక్కిన వారిలోపలం
జేరినయంత మూఢులకుఁ | జేపడ దానడ; యెట్టులన్నఁగా
సారములోన హంసముల | సంగతి నుండెడి కొంగపిట్ట కే
తీరునగల్గ నేర్చును ద | దీయగతుల్ దలపోయ భాస్కరా!

తాత్పర్యముభాస్కరా! కొంగ హంసలతో కూడి కొలను యందున్న మాత్రమున ఆ హంసల నడకలు కొంగకు ఏవిధముగా రావో అట్లే మూఢాత్ముడు యుక్తాయుక్త జ్ఞానము కలవారితో స్నేహముతో సంచరించిననూ, మంచి వారి నడవడికలు పట్టుపడవు.

వానికి విద్య చేత సిరి | వచ్చెనటంచును విద్య నేర్వఁగాఁ
బూనినఁ బూనుఁగాక తన | పుణ్యము చాలక భాగ్యరేఖకుం
బూనఁగ నేవ్వఁడోపు; సరి | పో చెవి పెంచునుగా కదృష్టతా
హీనుఁడు కర్ణ భూషణము | లెట్లు గడింపఁగనోపు? భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! అదృష్టము లేని మానవుడు చెవికి రంధ్రమును చేసి పెద్దదిగా దానిని పెంచిననూ కర్ణ కుండలములను సంపాదించలేడు. అట్లే విద్య నేర్చి దాని వలన సంపద పొందవచ్చునేమో కాని, పూర్వపుణ్య సుకృతము లేనిదే భాగ్యరేఖ తనకు లేకుండిన దానిని తెచ్చుటకు ఏ ప్రయత్నము చేయజాలడని భావము.

సంతత పుణ్యశాలి నొక | జాడను సంపద వాసిపోయి తా
నంతటఁబోక నెట్టుకొని | యప్పటియట్ల వసించియుండు; మా
సాంతము నందుఁ జందురుని | నన్నికళల్ పెడఁబాసి పోయినం
గాంతి వహింపఁడోటు? తిరు | గంబడి దేహము నిండు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! చంద్రుడు దేవతలకు నొక్కక్కరోజు నొక్కక్క కళను దాతృత్వముగా నిచ్చుచు నెల చివరకు పూర్తిగా కళలన్నింటినీ పోగొట్టుకొనును. మరల పూర్ణబింబము దాల్చుచుండును గదా! అట్లే సంపద కల్గినవాడు దాతృత్వముతో ధనమును ఇచ్చిననూ మరల పూర్వపుణ్య వశమున అతడికి ధనము లభించునని భావము.

వలనుగఁకానలందు బ్రతి | వర్షమునం బులి నాలుగైదు పి
ల్లఁగను దూడ నొక్కటి ని | లంగను ధేనువు రెండు మూడు నేఁ
డుల కటులైన బెబ్బులి కు | టుంబము లల్పములాయె నాలమం
దల గడువృద్ధిఁ జెందవె య | ధర్మము ధర్మము దెల్ప భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! అన్యాయప్రవర్తన గల పెద్ద పులులు సంవత్సరమునకు ఒకసారి నాలుగైదు పిల్లలను కనుచుండును. కాని వాటి వంశము వృద్ధి పొందుట లేదు. ఎందుకనగా ధర్మ మార్గములతో గోవులు రెండు మూడేండ్లకు నొక దూడను కనుచున్నది. వంశము వృద్ధి అగుచున్నది గదా! అట్లే అధర్మ బుద్ధితో వంశము వృద్ధి పొందదు. ధర్మ బుద్ధితోనే వంశము వృద్ధి అగునని భావము.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in November 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!