Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

మాటలకోర్వజాలఁ డభి | మానసమగ్రుడు ప్రాణహానియౌ
చోటులనైనఁదానెదురు | చూచుచునుండుఁ గొలంకు లోపల
న్నీట మునింగినప్పుడతి | నీచములాడిన రాజరాజు పో
రాట మొనర్చి నేలఁబడఁ | డాయెనె భీమునిచేత భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! అభిమానము గలవాడు ప్రాణములనైనా వదలును గాని మానవ హానికరములగు మాటలను భరించలేడు. ఎట్లనగా కౌరవ పాండవులకు యుద్ధము జరిగిన తర్వాత దుర్యోధనుడు శత్రుభయముతో సరస్సునందు దాగినప్పుడు పాండవులు పల్కిన అవమానకరములైన పదజాలమును భరించలేక మరల యుద్ధమునకు పూని భీముని గదచే తొడలు విరిగి పోగా భూమి మీద పడి మరణించెను.

మానవనాధుఁడాత్మరిపు | మర్మ మెరింగినవాని నేలినం
గాని జయింపలేఁడరుల | గార్ముకదక్షుడు రామభద్రుఁడా
దానవ నాయకుస్ గెలువఁ | దానెటులోపుఁదదీయ నాభికా
స్థానసుధ న్విభీషణుఁడు | తార్కొని చెప్పకయున్న భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! రాజు విరోధి యొక్క మర్మము తెలిసి వానిని చేరదీయకున్నచో పగవారిని జయింపజాలడు. అది ఎట్లనగా రావణ మరణ రహస్యమును విభీషణుని ద్వారా రాముడు తెలుసుకున్నాక రావణుని సంహరించగలిగెను. రాముడు ధనుర్విద్యానేర్పరియైననూ రావణుని నాభి యందు అమృతముందన్న రహస్యము తెలిసిన తర్వాతనే చంపగల్గినాడని భావము.

లోనుదృఢంబుగాని పెను | లోభిని నమ్మి యసాధ్యకార్యముల్
కానక పూనునేనతడు | గ్రక్కునఁగూలును నోటిపుట్టిపై
మానవుఁడెక్కడిపోవ నొక | మాటు బుటుక్కున ముంపకుండునే
తానొక లోఁతునం గెడపి | దానిఁదరింపఁగ లేక భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! లోకంలో ప్రయాణ సందర్భమున పాతదై చిల్లిపడిన ‘పుట్టి’ అనే నీటి ప్రయాణ సాధనం పైన మనుష్యుడు ఎక్కి చాలా లోతుగల ప్రవాహమును దాటడానికి ప్రయత్నం చేస్తే, ఆ ప్రవాహమునకు పుట్టి తట్టుకొనలేక తటాలున మునిగిపోవును. అట్లే మానవుడు మనస్సు స్థిరత్వం లేని వారిని నమ్మి ఒక గొప్ప కార్యమునకు పూనినచో, ఆ కార్యము పుట్టివలె తటాలున మునుగును. కార్యము చెడునని భావము.

సన్నుతకార్యదక్షుఁడొక | చాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు | నొండొక మేలొనరించు సత్వసం
పన్నుఁడు బీముఁడా ద్విజుల | ప్రాణము కావఁడె యేక చక్రమం
దెన్నికగా బకాసురుని | నేపున రూపడఁగించి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! భీముడు క్షాత్ర ధర్మమును వదలి బ్రాహ్మణ వేషమును ధరించి భిక్ష మెత్తుకొనుచుండగా, బకాసురుడను రాక్షసుడు ఏక చక్రపురమునందు బ్రాహ్మణులను ప్రజలను హింసించుచుండగా, భిక్షాటన చేయుచున్న భీముడు రాక్షసుని వధించెను. అట్లే కార్యదక్షుడు ఒకానొక సమయమున తన స్థితి అధ్వాన్నముగా ఉన్ననూ తనకు గల ప్రకాశము నశించియున్ననూ లోకోపకారము చేయును.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in September 2018, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *