Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

భూపతి కాత్మ బుద్ధి మది | బుట్టనిచోటఁబ్రధాను లెంత ప్ర
జ్ఞాపరిపూర్ణులైనఁ గొన | సాగదు కార్యము; కార్యదక్షులై
యోపిన ద్రోణ భీష్మ కృప | యోధు లనేకులు కూడి కౌరవ
క్ష్మాపతి కార్యమేమయిన | జాలిరె చేయఁగ వారు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! కార్యాలోచనలేని దుర్యోధనుని పనులను కార్యదక్షులైన ద్రోణ, భీష్మ, కృపాచార్యాది, మహావీరులు నెరవేర్చ లేకపోయిరి. అట్లే రాజునకు సరియైన ఆలోచన పుట్టనప్పుడు మంత్రులెంత తెలివిగల వారైననూ కార్యము నేరవేర్చలేరని భావము.

భూరిబలాఢ్యుడైనఁ దల | పోయక విక్రమ శక్తిచే నహం
కారము నొందుటల్ తగవు | గాదతఁ డొక్కెడ మోసపోవుఁగా
వీరవరేణ్యుఁ డర్జునుఁడు | వింటికి నేనధికుండ నంచుఁ దా
నూరక వింటి నెక్కిడఁగ | నోపఁడు కృష్ణుఁడు లేమి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా!ముల్లోకములందు నేనే అధికుడనను భావముతో అర్జునుడు సంచరించగా శ్రీ కృష్ణ నిర్యాణానంతరమున ధనుస్సును ఎక్కుపెట్టుటకైననూ సమర్థుడు కాకపోయెను గదా! అట్లే మనుష్యుడు, తానెంత బలము కలవాడైననూ గర్వముతో సంచరించరాదని భావము.

భ్రష్టున కర్థవంతులగు | బాంధువు లెందఱు గల్గినన్ నిజా
దృష్టము లేదు గావున ద | రిద్రతఁ బాపఁగలేరు ; సత్కృపా
దృష్టిని నిల్పి లోకుల క | తి సిరి సంపదలిచ్చు లక్ష్మి యా
జ్యేష్ఠ కదేటికిం గలుగఁ | జేయదు తోడనె పుట్టి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! జ్యేష్ఠాదేవికి చెల్లెలై పుట్టిన లక్ష్మీ దేవి ప్రజలందరినీ సత్కృపాదృష్టితో చూచి శాశ్వతమైన భాగ్యముల నిచ్చును. కాని అక్కయగు జ్యేష్ఠాదేవికి సహాయము చేయలేక పోయెను గదా! అట్లే అదృష్టము లేని వానికి భాగ్యవంతులగు చుట్టములు ఎందరు ఉన్ననూ, వానికి భాగ్యరేఖ లేనందున వారెవరు అతడి బీదతనమును పోగొట్టలేరు.

మునుపొనరించు పాతక మ | మోఘము జీవులకెల్ల బూని యా
వెనుకటి జన్మమం దనుభ | వింపక తీఱదు, రాఘవుండు వా
లిని బడవేసి తామగుడ | లీల యదూద్భవుఁడై కిరాతుచే
వినిశిత బాణపాతమున | వీడ్కొనఁడే తన మేను భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! శ్రీరాముడు వాలిని అన్యాయంగా చంపుటచే ఆ పాప ఫలము చేత కృష్ణావతారము నందు ఎరుకల వాని బాణము దెబ్బకు శరీరము విడిచెను గదా! అట్లే ఎంతటి వానికైనా పూర్వజన్మ పాపము వృధాగా పోక తర్వాత జన్మ యందు తప్పక అనుభవించ వలసిందేనని భావము.

మానవుఁడాత్మ కిష్టమగు | మంచి ప్రయోజన మాచరించుచోఁ,
గానఁక యల్పుఁడొక్కడది | గాదని పల్కిన వాని పల్కుకై
మాసఁగ జూడఁడా పని స | మంచిత భోజన వేళ నీగఁకా
లూనిన వంటకంబు దిన | కుండఁగ నేర్పగునోటు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మనుష్యుడు తనకు ఇష్టమైన పనిని చేయుటకు ప్రయత్నించుచున్న సమయములో ఒక హీనుడు అది ‘కాదు’ అని అనిన ఎడల వాడి మాటలతోనే మాని వేయడం జరగదు. ఎందుకంటే మంచి భోజనం తయారు చేసిన తరువాత దానిమీద ఈగ వాలిందని చెప్పి ఆ వంటకాన్ని తినకుండా వదిలివేయడం తెలివి అయిన పని కాదు గదా.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in August 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!