Menu Close
భగవద్విభూతి
-- ఆర్. శర్మ దంతుర్తి

విశ్వరూప సందర్శనం

భౌతిక, రసాయన శాస్త్రాలలో అణువు అనే దాన్ని గురించి మొదట చూద్దాం. ఏదైనా పదార్ధం తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటూపోతే చివరకి ఒక అతి చిన్న ముక్క దగ్గిరకి వస్తాం. దాన్ని సూక్ష్మదర్శినిలోంచి చూసి మరిన్ని ముక్కలుగా చేయొచ్చు. అలా కొట్టుకుంటూ పోతే చివరకి ఇంక ముక్కలు చేయలేనంత చిన్నది తయారౌతుంది. ఆ చిన్న ముక్కనే అణువు అంటున్నాం. కొంతమంది దీన్ని పరమాణువనీ, రెండు పరమాణువులు కలిపితే అణువనీ అంటారు కూడా. ఆ అణువులోనే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేవి ఉంటాయని అందరం చదువుకున్నదే. అయితే ఇక్కడ గమనించవల్సినది ఏమిటంటే అతి చిన్నదైన ఈ అణువే అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైనది.  ఈ అణువుని విడగొట్టి (ఫిషన్), కలిపీ (ప్యూజన్) శక్తివంతమైన బాంబులు తయారు చేయడం మనకి తెల్సినదే. ఇది చాలనట్టూ ఈ మధ్యనే హిగ్స్ బోసాన్ అనీ, మ్యూయాన్స్ అనీ కొత్త కొత్తవి బయటకి వస్తున్నాయి ఏరోజుకారోజు. వీటిని కనుక్కున్న వాళ్ళని అడిగితే, “ఇప్పటికి ఇవి తెలిసాయి, ఇంకా వాటిలో ఏమున్నాయో ఎవరికెరుక?” అనడం గమనిస్తే మనకి తెలిసేది ఏమిటంటే, మనకేమీ తెలియదు. అయితే అన్నింటికీ కారణమైనదేదో ఒకటుంది. అది కనుక్కోవడానికే మానవ ప్రయత్నం అవిశ్రాంతంగా జరుగుతూ ఉంది. అయితే ఈ పదార్ధాలకి, స్థారవజంగమాలకి అన్నింటికీ ఓ మూల పదార్ధం ఉంది కదా? అదేమిటి? అదెలా ఉంటుంది? దాని భావస్వరూపాలేమిటి?

ఇక్కడ మరో విషయం చూద్దాం. మనం అందరం చదువుకున్నదే.  థర్మోడైనమిక్స్ అనే శాస్త్రం ప్రకారం “విశ్వంలో ఉన్న మొత్తం శక్తి (ఎనర్జీ) గానీ పదార్ధం (మేటర్) గానీ ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. దాన్ని ఒక రూపులోంచి మరోరూపులోకి మార్చగలం, అది మారుతుంది కానీ దాన్ని నాశనం చేయడం గానీ, సృష్టించడం గానీ కుదరదు.” ఇందులో వాడిన మొదటి పదం గమనించారా? “విశ్వంలో.” మన తెల్సిన ప్రపంచంలో మాత్రమే కాదు, ఈ మొత్తం విశ్వంలో – అంటే మన గ్రహగతులు దాటినా సరే, ఇదే సిద్ధాంతం అన్వయించుకుంటున్నాం. కనీసం ప్రస్తుతానికి తెల్సిన శాస్త్రీయత ద్వారా. ఈ విశ్వం అంతా అణువులు తప్ప మరేమీ కాదనుకుంటే, ఉన్న శక్తి, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులోంచి వస్తోంది అని నమ్మినట్టైతే, ఈ అణువూ, అందులో ఉన్న శక్తీ మాత్రమే ఈ విశ్వం ఇలా పుట్టి ప్రభవించడనిక్కారణం అని అర్ధమౌతోంది కదా? అలాగైతే ఈ అణువులెక్కడున్నాయి? స్థావరజంగమాలలో అణువులేనిదెక్కడైనా ఉందా? అలా ఆలోచిస్తూ మరో సారి భగవద్గీత విభూతియోగం లోకి వెళ్దాం.

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్          [10-39]

సర్వ భూతాలలో ఉండే మూలకారణమైన చైతన్యం ఏదైతే ఉందో అది నేనే. స్థావర జంగమాత్మకాలలో నేను, నా శక్తి లేకుండా నిలబడగలిగేది ఏ ఒక్కటీ లేదు.  అంటే భగవంతుడెక్కడున్నాడు అనేదానికి సమాధానం చెప్పడం మరో ప్రశ్నతో చూడవచ్చు: ఎక్కడ లేడు? సరే భగవంతుడు ప్రతీచోటా ఉన్నాడు; ఆయన్ని తెలుసుకోవాలి కానీ మొదలు పెట్టేదెక్కడ? దానికి సమాధానం మనకి అనేక మంది ముముక్షువులు చెప్పినదే – మన దగ్గిరే, మన మనసులోనే మొదలుపెట్టాలి. ఎందుకనేదానికి, రమణ మహర్షి చెప్పినదానితో సరిపోయే మరో వింత చూద్దాం. రమణులు చెప్పేదేమిటంటే - నేనెవర్ని అనే ప్రశ్నతో, ఆత్మావలోకనం మొదలుపెట్టాలి.

ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, నేనెవరిని అనేదానితో. ఈ అవయవాలు నేనా? “నాకాళ్ళు నెప్పెడుతున్నాయి, ‘నా’ చేతులు నెప్పి, ‘నా’ వంట్లో బాగాలేదు, ‘ఆయన’ గుండెలో స్టెంట్ వేశారు, ‘ఫలానా ఆయనకి’ లివర్ పాడైంది” అనే మాటలు వింటే మనకేం తెలుస్తోంది? నేను వేరు, నా కాళ్ళు వేరు, చేతులు వేరు అని మనమే చెప్తున్నాం కదా? పోనీ మనం ఈ మనస్సా అంటే, ఒక్కోసారి, “ఈ రోజు ‘నా’ మనస్సు ఏం బాగాలేదు” అని చెప్పుకోవటం లేదా? పోనీ మనం ఈ మనసు, అవయవాలు అన్నీ కలిపా అని ఆలోచిస్తే, “ఫలానా రోజున నా మనసు, శరీరం నా అధీనం లేవు” అంటున్నామే? అంటే మనం ఇంతకీ ఎవరం? మనకి తెలియకుండానే మనం ఈ శరీరం కాదనీ, మనసు కాదనీ వీటన్నింటికీ అతీతమైనది ఏదో ఒకటి ఉందనీ ఆ అతీతంగా ఉన్నది మాత్రమే మనం అనీ మనమే చెప్పుకుంటున్నాం కదా? అదే చైతన్యం, ఆత్మ, జీవం. ఆ చైతన్యం – ఎందువల్లనైతే మనం జీవించగలుగుతున్నామో, మాట్లాడగలుగుతున్నామో ఆ చైతన్యం తెలుసుకోమనే రమణులు చెప్పే - నేనెవరిని అనేది తెలుసుకోవడం. సరే ఇంతకీ ఈ ‘నేను’ అనేదెక్కడుంది? కొంచెం ముందుకి వెళ్తే అణువులకీ పరమాణువులకీ కూడా ఆధారమైన చైతన్యం ఏమిటి? దానికి మంత్రపుష్పంలో చెప్పిన విషయం సరిపోతుంది చూడండి.

నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం
నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః
నారయణం పరంబ్రహ్మ తత్వం నారాయణ పరః
నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః

ఇక్కడ నారాయణ అనే పదం భగవంతుడు, నీటికి ఆధారమైనవాడు, విశ్వంలో ఉన్న చైతన్యం అని అర్ధం చెప్పుకోవచ్చు. ప్రపంచం అంతా ఆవరించి ఉన్నదేమిటి? అణువులూ వాటిలో ఉన్న చైతన్యమే కదా? అదే మొదట చెప్పేది – విశ్వాత్మానం పరాయణం. ఇంతా చేసి మనం ‘నేనెవరిని’ అని శోధించేటప్పుడు ధ్యాత అయిన మనం ధ్యానించే, దేనినైతే వెతకబోతున్నామో ఆ ధ్యానానికి చివర్న అందుకోబోయేదీ ఇవన్నీ కూడా భగవంతుడే. ఇదే మనలోనే ఈ భగవంతుడున్నాడనేదానికి పరమార్ధం. మరో కోణంలోంచి చూద్దాం. గుండెకాయని ఆపి దానికేదో మరమ్మత్తులు చేసి మళ్ళీ శరీరంతో పనిచేయడానికి కలుపుతున్నారు ఈరోజుల్లో. శ్వాస ఆపి ఊపిరితుత్తులకీ ఏదో మరమ్మత్తు చేయవచ్చు. అలాగే ఒక అవయవం పాడైతే తీసి మరొకరిది అమర్చడానికి కూడా కుదురుతోంది. అయినా బతికే ఉంటున్నాం. తలలో కురుపులొచ్చినా, రక్తం గడ్డకట్టినా దాన్ని బాగుచేస్తున్నాం. అసలు రక్తం కూడా పోతే ఎలాగో ఒకలాగ మరొకరి రక్తం ఎక్కించినా మనిషి ప్రాణం మాత్రం పోవడం లేదు. అయితే ఒకటి గమనించండి. అన్ని అవయవాలు సరిగ్గా, ధృఢంగా ఉన్నా, ఎప్పుడైతే మన ప్రాణం పోతోందో అప్పుడు దాన్ని తిరిగి ప్రవేశపెట్టలేం. ఈ ప్రాణమే, పైన చెప్పుకున్న “నేను” అని చెప్పుకునే, అణువణువులోనూ ఉండే, స్థావరజంగమాలలో ఉండే చైతన్యం. ఆ చైతన్యం గురించే పైన చెప్పిన ‘నారాణపరోధ్యాతా’ అనేది. మంత్రపుష్పంలో ఇంకా ముందుకి వెళ్తే ఆ ప్రాణం, చైతన్యం ఎక్కడ ఉందో, అది మనలోనే శరీరంలో ఎక్కడ ఎలా ఉంటుందనేది చూడవచ్చు.

యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే உ పివా
అన్తర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః

ఈ సర్వ జగత్తులో కనిపించే వినిపించేవి (దృశ్యతే శ్రూయతే உ పివా) ఏవైతే ఉన్నాయో లోపల బయట (అన్తర్బహిశ్చ తత్సర్వం) వ్యాపించి ఉన్నది భగవంతుడు తప్ప మరొకటి కాదు. అయితే ఇది మన శరీరంలో ఎక్కడుంది? దానిక్కూడా సమాధానం చెప్తున్నారిప్పుడు.

పద్మకోశం ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం
అధోనిష్టా వితస్త్యాంతే నాభ్యాముపరితిష్టతి
జ్వాలమాలాకులం భాతీ విశ్వస్త్యాయతనం మహత్
సన్తతగుం శిలాభిస్తులంబత్యాకోశసన్నిభం

హృదయానికి కింద, నాభికి పైన ఉండే భాగంలో పరమాత్మ వ్యవస్థితుడై ఉన్నాడు. ఆ హృదయకమలాన్ని ఆశ్రయించి జ్వాలాసమూహంతో వెలుగుతూ జీవుడికి ప్రధానస్థానమై నాడీ సమూహాలకి ఆలంబనయై, వికసించిన తామరపూవులా ఉండే హృదయాగ్ర భాగాన సూక్ష్మమైన పద్మం ఉంది.

తస్యాన్తే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్త్సర్వం ప్రతిష్టితమ్
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః

సోஉగ్రభుగ్విభజన్తిష్ఠన్నాహారమజరః కవిః
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రస్మయస్తస్య సన్తతా

సన్తాపయతిస్వం దేహమాపాదతలమస్తకః
తస్యమధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్తితః

నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా
నీవారసూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా
తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః
సబ్రహ్మ సశివస్సహరిస్సేన్ద్రస్సోஉక్షరః పరమస్స్వరాట్

సర్వమూ ప్రతిష్టమై ఉన్న ఆ పద్మం మధ్యలోనే ఉన్న జఠరాగ్ని జ్వాలలు పాదాది పర్యంతమూ వ్యాపిస్తున్నాయి. ఆ జఠరాగ్ని మధ్యలో నల్లని మేఘంలో మెరుపులా ప్రకాశించే అగ్నిశిఖ ధాన్యపు ముల్లులా పచ్చని ఛాయతో వెలుగొందుతోంది. ఆ శిఖ మధ్యలో ఉన్నదే పరమాత్మ పీఠం. అతడే నాశనము లేని కూటస్థుడు, ములారకారణమైన స్వయం ప్రకాశకుడు. అతడే బ్రహ్మ, శివ, విష్ణు, ఇంద్ర స్వరూపుడు.

మళ్ళీ వెనక్కి వెళ్ళి అణువుతో పోలుద్దాం. ధాన్యం గింజ చివర్లో ఉండే ములుకు ఎంత చిన్నది? అందులో ఉన్నదే పరమాత్మ పీఠంట. అంటే ఈ ఆత్మ ఎంత అనేది ఊహకి కూడా అందేది కాదు. మన శరీరం అంతటికీ చైతన్యం కలగడానిక్కారణం ఆ ఆత్మ స్వరూపమే. ఇదే పైన ధర్మోడైనమిక్స్ లో చెప్పిన నాశనం లేని శక్తి. అయితే ఇది ఇలా మన శరీరంలో ఉంటుందనేది, ఇదే ప్రపంచం అంతా వ్యాపించి ఉందనేది నమ్మడం ఎలా? ఎవరో కనుక్కుని చెప్పారా మనకి? ఈ మంత్రం ఎక్కడిది అసలు? దీనికి సమాధానం కూడా సులభంగా చెప్పవచ్చు. మొదటి వ్యాసంలో చూసినట్టూ ముముక్షువులు దారి కనుక్కోవడానికి సన్యసించడం మొదలుపెట్టినప్పుడు వాళ్లకి కలిగే అనుభవాలు ఇలా చెప్పి ఉంచారన్నమాట.  వాళ్ళ అనుభవంతో రాసి ఇతరులకి దారి చూపించారు కనక అవి మంత్రాలయ్యాయి.  ‘దారి ఇదీ, నేను ఇలా వెళ్తే నాకు ఈ అనుభవం వచ్చింది, నీకు కూడా వస్తుంది’ అని చెప్పగలిగారు. బుద్ధుడు చెప్పినట్టూ ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక పని చేయగలుగుతున్నారంటే మరొకరు కూడా చేయగలరు అదేపనిని. అందువల్ల వాళ్ళు నడిచిన దారిలో ఇవిగో సూత్రాలు అని ఒక మర్గాన్ని చూపించారు. బుద్ధుడిది ఒకదారి, రామకృష్ణులది మరొకటి, రమణులది ఇంకొకటి. కానీ చివరకి అందరూ కన్నుక్కున్నది ఒకటే. బుద్ధుడు దాన్ని ధర్మం అంటే మరొకరు దానినే ఆత్మ అని బ్రహ్మం అనీ అంటున్నారు.

మొత్తానికి తేలేదేమంటే మన కంటికి కనిపించని ఆ చైతన్యాన్ని కనుక్కోవడం కోసమే మొత్తం సతాన్వేషణ. మనలో ఉన్న ఈ ప్రాణం, విశ్వంలో అణువణువునా ఉండే చైతన్యమే భగవంతుడు. దానికి మనం ఏమి పేరు పెట్టుకున్నా అది మాత్రం ఏ మార్పు లేనిది. ఇదే కృష్ణుడు చెప్తున్న తెలిసిన స్థావర జంగమాలన్నింటికీ మూలాధారమైనది. దీన్ని రామకృష్ణులు కాళి అంటే, మరొకరు ఆత్మ అనీ, బుద్ధుడు ధర్మం అనీ, రమణులు “నేనెవరిని” అనీ చెప్పేది. మనం దీన్ని ఏ విధంగా – శాస్త్రీయంగా కానీ మత పరంగా కానీ, చూసినా ప్రతీదీ మార్పు చెందుతుంది కానీ ఈ మార్పులన్నింటికీ అతీతమైనదేదో ఉంది. అదే వీళ్ళు కనుక్కున్నది. అందరూ కనుక్కున్నది ఒకే విషయం అయితే వేరు వేరు పేర్లు ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే “ఏకం సత్, విప్రా బహుధా వదంతి.” సత్యం ఎప్పుడూ ఒకలాగే ఉంది (ఏకం సత్). అయితే దాన్ని చూసినవాళ్లు (విప్రా) దాన్ని వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు (బహుధా వదంతి). ముందు వ్యాసాల్లో రామకృష్ణుల కధలో చెప్పినట్టూ ఈ సత్యం చెరువులో నీళ్లవంటిది. మీరు ఏ దారిలో వెళ్ళి దాన్ని ఏ పాత్రలో తెచ్చుకుని ఏ పేరుతో పిలిచినా అది మాత్రం నీరే కదా?

మరోసారి అవలోకిద్దాం. భగవంతుడెక్కడున్నాడు? ఎదురుగా ఉన్న మనిషిలో, మీలో, నాలో, కూర్చున్న కుర్చీ అణువణువునా, ఎదురుగా ఉన్న మానిటర్ అణువుల్లో, గోడమీద ఉన్న గడియారం అణువుల్లో అలా చుట్టూ ఎక్కడ చూసినా భగవంతుడు తప్ప మరొకటి లేదు. ఇదే పోతన చెప్పిన పద్యం – హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పనిలేదా…” అనేది. కానీ ప్రస్తుతం ఉన్న దృష్టితో ఆ అణువులు కనబడడం లేదు కనక మనం చేయాల్సిందల్లా దృష్టి మార్చుకోవడమే. ఎప్పుడైతే ఆ అంతర్దృష్టి అలవడుతుందో అప్పుడు మనకి కనిపించేది భగవంతుడొక్కడే. ఓ సారి గమనించండి ఈ విషయం, మౌనంగా స్థిరం గా కూర్చుని. మన చుట్టూ, లోపల, బయట అంతా భగవంతుడు/చైతన్యమే తప్ప ఇంకేమీ లేదు.  ఆ కనపడడం మొదలైతే మీరేం చూస్తారు? రూపాలు పేర్లు అన్నీ మాయం అయి ఒకే ఒక చైతన్యం విశ్వం అంతా కనిపించడం మొదలౌతుంది. ఇదే అర్జునుడు చూసిన విశ్వరూపం.

భగవంతుడి విశ్వరూపం అంటే వెయ్యి చేతులతో ఉండే ఒకే ఒక మనిషి కాదు. ఆ వెయ్యి చేతులు చూపించడం ఎందుకంటే మనం వేలకొద్దీ ఎంతమందిని, ఎటువంటివారిని చూసినా మనకి కనిపించేది ఆ చైతన్యమే కదా, ఒకసారి అంతర్దృష్టి వచ్చాక? అప్పుడు ఈ విశ్వం పుట్టడానికి ప్రభవించడానికీ, నాశనానికీ ఉన్న ఒకే ఒక కారణం అవగతమౌతుంది. దీనినే శివానందులు అంటున్నారు చూడండి – “ఏది తెలిస్తే ఈ ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోనక్కర్లలేదో, అదే బ్రహ్మం.” ఎంత సులభంగా చెప్పారో చూడండి. అణువులో ఉండే చైతన్యమే బ్రహ్మం అనుకుంటే, మీరు అది కనుక్కున్నారు. మీరు కనుక్కున్న ఆ బ్రహ్మం ఎక్కడుంది? అది లేని ప్రదేశమే లేదని కదా “హరి మయము విశ్వమంతయు…” అని చెప్తున్నారు? అది కనుక్కున్నాక ఇంక వేరే ఏమీ లేదు తెలుసుకోవడానికి. అదే శివానందులు చెప్పినది. ఇది తెలిస్తే ఏమౌతుంది? “వేరు,” అన్యము” అనేవి అంతరిస్తాయి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక చైతన్యం, అది ఏ రూపంలో ఉన్నా. ఇంక మనకన్నా వేరుగా ఉన్నదీ, అన్యమైనదీ ఏదీ లేదు. అప్పుడు ఎదుటివారంటే భయం శంక అనేవి కలిగే పనే లేదు. ఆ యూనివర్సల్ విజన్ వస్తే కనిపించేదే విశ్వరూపం. ఇదే కృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం. నిజానికి కృష్ణుడు చేసినదేమిటంటే అర్జునుడి దృష్టి లోపలకి తిప్పి ఆత్మ దర్శనం చేయించాడు. అది తనలో మొదట కనపడగానే పరాయివాళ్ళలో కనిపించేది ఏమిటి? అదే ఆత్మ కానీ పర+ఆత్మ = పరమాత్మ. విశ్వంలో అణువణువునా ఉండే ఈ చైతన్యాన్ని అర్జునుడు ఒక్కసారి చూడగలిగాడు. వళ్ళు జలదరించింది. ఏమీ అర్ధంకాక అడుగుతాడప్పుడు – ఇలా విశ్వం అంతా ఆవరించి ఉన్న నువ్వు ఎవరివి? నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, మళ్ళీ నాకు కృష్ణుడిలాగానే కనిపించు అని. అప్పుడు మరోసారి అంతర్దృష్టి అంతమై మామూలుగా కనిపిస్తుంది ప్రపంచం. అయితే ఇలా అంతర్దృష్టి అంతరించడానిక్కారణం మాయ అంటారు. ఈ మాయని అధిగమించడం అతి కష్టమైన కార్యం కనక ఒకసారి ఆత్మదర్శనం అయ్యాక కూడా ప్రతీదినం (అర్జునుడి లాగానే) మాయలో పడకుండా ఉండడానికి సాధన చేస్తూనే ఉండాలి.

ఇదీ భగవద్విభూతి అంటే. భగవంతుడి విస్తారణ/విభూతి ఎక్కడుంది అంటే మరోసారి మనం చూడాల్సినది ఇదే. చరాచర ప్రపంచంలో, స్థావర జంగమాలలో హరి కాని ద్రవ్యము, పరమాణువు కూడా ఏదీ లేదు.

క.  హరిమయము విశ్వమంతయు
     హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
     హరిమయముగాని ద్రవ్యము
     పరమాణువు లేదు వంశపావన వింటే     [2-17]

చివరిగా ఒకమాట. ఈ వ్యాస పరంపర రాయడానికి నాకు సహాయం చేసినవి అనేక పుస్తకాలు. అందులో పోతన భాగవతం, రామకృష్ణామఠం వారు ప్రచురించిన భగవద్గీత అనేవి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇదంతా నాకు చేతనైనంతలో అర్థమైనట్టూ రాసాను. ఎవరైనా భగవంతుడంటే ఇలా, అలా, ఇలా కాదు, అలా కాదు అనేటట్టైతే హరి మయము విశ్వమంతయు అని కదా వప్పుకున్నది? ఆ ‘హరి’ అనేది ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఏ పేరుతో అనేవి మన ఇష్టాయిష్టాలతో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉన్నది ఒకటే, ఏ పేరుతో పిలిచినా ఆ ఒక్కటే ‘సత్’ అనేది. అందువల్ల దానికోసం ఉత్తినే వ్యర్ధ ప్రసంగాలు అనవసరం అనుకుంటున్నాను. ఈ వ్యాసాలలో తప్పులుంటే ఏమీ సిగ్గుపడడం లేదు ఒప్పుకోవడానికి. ‘యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చయద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే’ అని చెప్పుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.

****సమాప్తం****

Posted in May 2021, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!