Menu Close

bandham page title

రాత్రి పది అయ్యింది. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. వసంతకూడా ఇల్లు సర్దుకుని, భర్తవున్నగదిలోకి వచ్చింది. ప్రదీప్, ఎదో ఇంగ్లీష్ మ్యాగజైన్  చూస్తున్నాడు.

“పిల్లలు పడుకున్నారా” అడిగాడు ప్రదీప్.

“పడుకున్నారండి. మీకో విషయం చెప్పాలి.” మెల్లగా అంది వసంత. “ఏమిటి.” అడిగాడు ప్రదీప్.

“మధ్యాహ్నం కిరాణా సరుకుల పనిమీద, బజారుకి వెళ్లాను. మన వసు కనిపించిందండి.” ఆనందంగా చెప్పింది వసంత. “ఏమిటి మన వసూనా. ఎలావుందీ. మాట్లాడించావా?” ఆతృతగా అడిగాడు ప్రదీప్.

“లేదండి. తను చాలా దూరంగా వుంది. తనతో పాటు హరి కూడా వున్నాడు. నేను పిలిచేటప్పటికే, వాళ్ళు కారెక్కి వెళ్లిపోయారు.” చెప్పింది వసంత.

“వసును చూసి చాలా రోజులయింది. అది ప్రేమించి పెళ్ళిచేసుకుని, వెళ్ళిపోయినప్పటినుంచి, ఒకటి రెండు సార్లు మాత్రమే, మాట్లాడాను. తరువాత బంధాలు, సంబంధాలు తెగిపోయాయి.” అన్నాడు ప్రదీప్.

“అవునండి చాలా బాధాకరం.” అంది వసంత.

కామేశం, సుజాతలకు ఇద్దరు పిల్లలు. కొడుకు ప్రదీప్, కూతురు వసుంధర. కామేశం ఉన్నత పాఠశాలలో, ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. కామేశానికి ఆవేశం ఎక్కువేగాని, మనసు వెన్నపూసే. ఎలాగూ  ఉపాధ్యాయుడే కాబట్టి, పిల్లల పెంపకంలో కూడా, తగిన  జాగ్రత్తలు తీసుకునేవాడు. ఉమ్మడి కుటుంబం. కామేశం తల్లితండ్రులు కూడా, కామేశం దగ్గరే ఉండేవారు. సొంత ఇల్లు. అందరూ కలిసివుండటానికి వసతిగానే ఉంటుంది. ఆ కుటుంబంలో అందరూ, కలివిడి మనుషులే. కామేశానికి చిన్నప్పటినుంచి, పాఠశాల విషయంలోనైనా, పిల్లల పెంపకంలోనైనా, ఇంటివిషయాలలోనైనా, కొన్ని ధృడమైన  అభిప్రాయాలు ఉండేవి. వాటితో రాజీపడేవాడు కాదు. పిల్లలు బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగాలు రావాలి. జీవితంలో, బాగా స్థిరపడాలి అనుకునేవాడు. అందుకు తగ్గట్టే, తగిన శ్రద్ధ  తీసుకునేవాడు. ప్రదీప్, వసుంధరలు కూడా, బాగా చదువుకునేవారు. చదువులో అన్నింటా ప్రధమశ్రేణి వచ్చేది. బహుమతులు కూడా వచ్చేవి. అలా అని కామేశం, కఠినంగా మాత్రం ఉండేవాడు కాదు. పిల్లలకు కావాల్సినవన్నీ, కొనిచ్చేవాడు. వాళ్లకి, తగిన స్వాతంత్ర్యం ఇచ్చేవాడు.  పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. ఇద్దరినీ, మంచి కాలేజీలో చేర్పించాడు కామేశం. ప్రదీప్, వసుంధర ఇద్దరూ బిటెక్ చదవటానికి ఇష్టపడ్డారు. ఏ చదువు చదవాలి అన్న విషయంలో, కామేశం కల్పించుకునే వాడు కాదు. ఏ చదువైనా, మంచి మార్కులు రావాలి అనేవాడు. కొంత కాలం గడిచింది.

ప్రదీప్ చదువు ఐపోయింది. క్యాంపస్ సెలక్షన్ కూడా రావటంతో, ఉద్యోగంలో చేరిపోయాడు. వసుంధర, బిటెక్ నాలుగో సంవత్సరానికి వచ్చింది. అప్పుడే ఒక సంఘటన జరిగింది. తన కాలేజీలో చదివే హరితో, వసుంధర ప్రేమలో పడింది. హరిది కూడా, ఉన్నత కుటుంబమే. హరికి కూడా, కాలేజీలో మంచి మార్కులే వచ్చేవి. వసుంధర, హరి బయట తిరుగుతుండేవారు. అది ఒకసారి, కామేశం బంధువుల కంటపడింది. ఆ విషయాన్ని మెల్లగా కామేశానికి చేరవేశారు. విషయం విన్న కామేశం, చాలా బాధ పడ్డాడు.

ఈ విషయం వసుంధర ద్వారా కాకుండా, బంధువులద్వారా తెలుసుకోవటం, ఇంకా బాధనిపించింది. వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన రోజు, కామేశం తట్టుకోలేకపోయాడు. రాత్రి పది అయింది. భర్త ఆ రోజంతా మాట్లాడకుండా ఉండేసరికి, సుజాతకు అనుమానం వచ్చింది.

“ఏవయిందండి” మెల్లగా అడిగింది సుజాత. కామేశం తాను విన్న విషయం, సుజాతకు చెప్పాడు. “వసును ఎంత అల్లారుముద్దుగా పెంచాము. ఏ విషయంలో కూడా లోటు చేయలేదు. ఐదేళ్లదాకా చేతులమీదే, ఎత్తుకుని పెంచాను. దాని ప్రతి పుట్టినరోజు, బాగానే చేశాను. దానికి ఏం కావాలన్నా, వద్దనకుండా కొనిచ్చేవాణ్ణి. చిన్నప్పటినుంచి ఒక్క దెబ్బకూడా కొట్టలేదు. అలాంటిది, ఈ రోజు, మనకు తెలియకుండా, ఎవరినో ప్రేమించింది. కనీసం తల్లితండ్రులమైన మనతో కూడా చెప్పలేదు. నాకు ఈ ప్రేమల మీద ఎక్కువ నమ్మకం లేదు. పిల్లలిద్దరి జీవితాలు సుఖంగా ఉంటే, దైవచింతనతో మిగతాకాలం గడుపుదామనుకొనేవాణ్ణి. ఇప్పుడు ఇలా, క్షోభ అనుభవించాల్సి వస్తున్నది.” కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు కామేశం.

భర్త అంత బాధపడటం సుజాత ఎప్పుడు చూడలేదు. సుజాతకు కూడా బాధనిపించింది. వసుంధర చేసిన పని మంచిదా కాదా అని నిర్ణయించుకోలేకపోయింది.

“పోనీ ఒక పనిచేద్దామండి. వసుంధరను అడిగి, ఆ అబ్బాయి వివరాలు తీసుకుందాము. ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళిచేయడానికి, మీకేమీ అభ్యంతరం లేదుగా? అడిగింది సుజాత.

“నువ్వు చాలా అమాయకురాలివి సుజాతా! మన ఇష్టాయిష్టాల ప్రమేయం, అసలు ఉందా? ఇష్టం వున్నా, లేకున్నా, అది చెప్పినట్లే జరగాలికదా! వసుంధర అసలు ఇంతవరకు, మనకు ఈ విషయం చెప్పిందా? మనం దానిమీద కొండంత ప్రేమ చూపిస్తుంటే, అది మనమీద ఆవగింజంత గౌరవం కూడా చూపించడంలేదు. కడుపు చించుకుంటే, కాళ్ళ మీద పడుతుందంటారు. ఇదేనేమో!” వాపోయాడు కామేశం.

“ఉదయం నేను నిలదీసి అడుగుతాను. అప్పుడైనా నిజం చెపుతుందేమో.” అంది సుజాత.

“ఎంతైనా అది మన కూతురు సుజాతా! విషయం మెల్లగా అడుగు. అంతే గాని దెబ్బలాడకు. దానివల్ల ఫలితంలేదు.” సౌమ్యంగా చెప్పాడు కామేశం. కానీ విచిత్రంగా ఉదయం వసుంధర, రాత్రి కామేశం వాళ్ళ సంభాషణ విందేమో, తల్లితండ్రుల కాళ్ల మీదపడి క్షమాపణ కోరింది. “నేను మీకు చెపుదామనుకునే లోపలే, మీకు ఈ విషయం తెలిసింది. హరి వాళ్ళు, బాగా వున్నవాళ్లు. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు నాన్నా. తనుకూడా ఇంట్లో చెపుతానంటున్నాడు. హరి చెప్పినతరువాత, మీకు అభ్యంతరం లేకపోతె వాళ్ళతో ఒకసారి మాట్లాడండి.” ప్రార్ధిస్తున్నట్లుగా చెప్పింది వసుంధర.

మరుసటిరోజు హరిని, తమ ప్రేమ విషయం వాళ్ళ పెద్దవాళ్లకు చెప్పమని అడిగింది వసుంధర. సరేనని హరి తన ప్రేమ విషయం, తల్లితండ్రులకు చెప్పాడు. హరి తండ్రి ఒక వ్యాపారవేత్త. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తి. బడిపంతులు కూతురిని, కోడలుగా అంగీకరించేందుకు ఒప్పుకోలేదు. ఈ విషయమై ఇంట్లో చాలా రోజులు, తర్జనభర్జనలు జరిగాయి. ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి. వాటిని కాదనుకొని, ఇలాంటి సంబంధం చేసుకుంటే బంధువుల దృష్టిలో, మన పరువు పోతుంది, అనేవారు హరి తల్లితండ్రులు. అయినాసరే వసుంధరనే చేసుకుంటానని హరి పట్టుబట్టి కూర్చున్నాడు.

కొడుకు ప్రవర్తన హరి తల్లితండ్రులకు, ససేమిరా నచ్చలేదు.

“ఒకసారి వసుంధర తల్లితండ్రులతో మాట్లాడండి నాన్నా. మీకు, వాళ్ళ కుటుంబం గురించి ఒక అవగాహన వస్తుంది” చెప్పాడు హరి.

“సరే పిలిపించు. చూద్దాం”. అన్నాడు హరి తండ్రి.

ఒక ఆదివారం వసుంధర తల్లితండ్రులు, హరి వాళ్ళ ఇంటికి వెళ్లారు. సంభాషణలు చాలాసేపు జరిగాయి. కామేశం వాళ్ళ స్థితిగతుల గురించి, చాలామటుకు ఆరా తీశారు హరి తల్లితండ్రులు. కామేశానికి, హరి తల్లితండ్రులలో, తాము గొప్పవాళ్ళమన్న అభిప్రాయం కనిపించింది. తమ కొడుకుకి కామేశం వాళ్ళ సంబంధం, సరితూగదనే అభిప్రాయానికి వచ్చారు హరి తల్లితండ్రులు. చివరకు హరి తండ్రి కామేశాన్ని, వాళ్ళ తాహతుకు తగిన సంబంధం కాదని, పంపించేశాడు.

కామేశం, సుజాత ఆ రాత్రి చాలా బాధ పడ్డారు. పిల్లల మూలంగా, తాము అవమానాల పాలవుతున్నారు. వసుంధరకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేక పోయింది. హరినే చేసుకుంటానని, మంకుపట్టు పట్టుకుని కూర్చుంది.

ఇది జరిగిన కొన్నాళ్ళకు హరి, వసుంధర పెద్దవాళ్లకు తెలియకుండా, గుళ్లో పెళ్లిచేసుకున్నారు. ఆవిషయం తెలుసుకున్న కామేశం, సుజాత అవాక్కయిపోయారు. హరి, వసుంధర ఆవూళ్ళోనే, వేరే కాపురం పెట్టారు. ఒక వైపు హరి తల్లితండ్రులు అవమానించారన్న బాధ, ఇంకోపక్క తమకు తెలియకుండా, వసుంధర పెళ్లిచేసుకుందన్న విషయం, కామేశాన్ని తీవ్రంగా బాధించాయి. ఆ దిగులుతోనే ఒకనాడు గుండెనెప్పి వచ్చి కామేశం చనిపోయాడు.

కామేశం చనిపోయిన రెండు సంవత్సరాలకు, సుజాత కూడా చనిపోయింది. తల్లితండ్రులు చనిపోయిన తరువాత, ప్రదీప్ వసుంధర గురించి మరచిపోయాడు.

“ఏమండీ! ఏవిటి ఆలోచిస్తున్నారు.” అన్న వసంత మాటలకు, గతస్మృతులనుండి బయటకు వచ్చాడు ప్రదీప్. కళ్ళు చెమర్చాయి. వసుంధరతో సంబంధాలు తెగిపోయి, సుమారు ఏడెనిమిది సంవత్సరాలయి ఉంటుంది. మళ్ళీ, ఇన్నాళ్లకు వసుంధర కనిపించింది.

“ఎలాగైనా రేపటినుండి, వసుంధర గురించి తెలుసుకోండి.” ప్రాధేయపడుతూ అడిగింది వసంత.

“తప్పకుండా తెలుసుకుంటాను. నాకు దానిమీద కోపం ఏమీ లేదు.” అన్నాడు ప్రదీప్.

వసుంధర పెళ్లయిన సంవత్సరానికి, ముంబైకి వెళ్లినట్లు తెలిసింది. ఆ తరువాత ఇప్పుడు వసంత చెప్పేదాకా, వాళ్ళ ఆచూకీ తెలియలేదు. తెలియలేదు అనేదానికన్నా, ప్రదీప్ వాళ్ళ గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నించలేదు అంటే బాగుంటుంది.

ఇప్పుడు వసుంధర గురించి తెలుసుకోవటం ఎలా? వాళ్ళ పాత ఫోన్ నంబర్లు మారిపోయాయి. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా లేవు. ఆలోచిస్తున్నాడు ప్రదీప్.

“పోనీ ఫేసుబుక్కులో చూస్తే, ఏమైనా వివరాలు తెలుస్తాయేమో చూడండి” అంది వసంత.

“అలాగే” అన్నాడు ప్రదీప్.

మరుసటి రోజు ఉదయం, మామూలుగా ఆఫీసుకి వచ్చాడు ప్రదీప్. షుమారు పది గంటల ప్రాంతంలో ప్రదీప్ మొబైల్ కు, ఒక కొత్త నెంబర్ నుంచి ఫోను వచ్చింది. ఎవరా అనుకుంటూ, ఫోన్ ఎత్తాడు ప్రదీప్. “ప్రదీప్ బాగున్నావా? నేను హరిని మాట్లాడుతున్నాను. చాలా రోజుల తరువాత, నీకిలా ఫోను చేయాల్సివస్తుందని ఊహించలేదు. ఉదయం వసుంధరకు గుండెనెప్పి వచ్చింది. హాస్పిటల్ లో చేర్పించాము. నీగురించి, ఒకటే కలవరిస్తున్నది. నువ్వు ఒకసారి త్వరగా రావాలి ప్లీజ్” అభ్యర్ధిస్తున్నట్లుగా అడిగాడు హరి. ప్రదీప్ కి ఒక్కసారి భూమి గిర్రున తిరిగినట్లయింది. నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి, వసంత పిల్లలతో సహా, హరి చెప్పిన హాస్పిటల్ కు, బయలుదేరాడు. వసుంధరను చేర్పించిన హాస్పిటల్ కు వచ్చాడు ప్రదీప్.

రిసెప్షన్ దగ్గరే హరి కలుసుకుని, వసుంధరవున్న గదికి తీసుకువెళ్లాడు. వసుంధర బాగా సన్నబడింది. చాలా ఏళ్ళ తరువాత వసుంధరను అలా చూసేసరికి, ప్రదీప్ చాలా బాధ పడ్డాడు. “నీకీ చిన్న వయసులో గుండెనెప్పి రావటమేమిటి?” ఆశ్చర్యంగా అడిగాడు ప్రదీప్. “ఏమో అన్నయ్యా! మిమ్మల్నందరిని బాధ పెట్టానుగా అందుకేనేమో ఈ బాధ” ఏడుస్తూ అన్నది వసుంధర. “ఊరుకోమ్మా! నువ్వేమీ తప్పుచేయలేదు. మేమే  నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాము. హరి! నా ఫోను నెంబర్ నీకెలా తెలిసింది.” అడిగాడు ప్రదీప్. “మొన్న నీ ఆఫీసులో పనిచేసే రవి, నేను ఒక పెళ్ళిలో కలిశాము. మాటల్లో నీ ప్రస్తావన వచ్చింది. అప్పుడు నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. వెంటనే కాల్ చేద్దామనుకున్నాను. ఇంతలో ఇది జరిగింది.” అన్నాడు హరి.

ఆరోజంతా ప్రదీప్, వసంతలు, వసుంధర దగ్గరే వున్నారు. “డాక్టర్, మా చెల్లికి ఎలావుందీ. ఫర్వాలేదా?” అడిగాడు ప్రదీప్. “కంగారు పడాల్సినదేమీ లేదు. ఇది చాలా మైల్డ్ స్ట్రోక్ కాబట్టి సరిపోయింది. కావలసిన మందులు అన్ని వ్రాసాను. ఒక రెండు రోజులు ఆబ్సెర్వేషన్లో ఉంచి పంపిచ్చేస్తాము. ఇంటికి వెళ్లిన తరువాత, మేము చెప్పే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి, లేకపోతె, గుండెనెప్పి మళ్లీ  వచ్చే ప్రమాదముంది.” అన్నాడు డాక్టర్. ఒక రెండు రోజుల తరువాత, వసుంధరను, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. అందరూ హరి వాళ్ళ ఇంటికి వచ్చారు. వసుంధర కొంచెం తేరుకుంది. మొహం కొంచెం తేట పడింది. మధ్యాహ్నం భోజనాలయిన తరువాత, అందరూ కూర్చొని మాట్లాడుకొంటున్నారు. “నేను, హరి అలా చేసుండాల్సింది కాదు అన్నయ్యా. మీ రెండు కుటుంబాలకి మేము దూరమయ్యాము” బాధగా అంది వసుంధర. “వసూ!  ప్రేమించటం తప్పు కాదమ్మా. ఆ ప్రేమ సఫలమవడానికి, మనం ఎంచుకునే మార్గమే సరిగా ఉండాలి. నువ్వు హరిని ప్రేమించడం తప్పు అని, మన ఇంట్లో ఎవరూ అనలేదు. కానీ నువ్వు ప్రేమించడం అనే విషయాన్ని, నీ నోటి ద్వారా కాకుండా బంధువులద్వారా తెలుసుకున్నందుకు నాన్నగారు బాధ పడ్డారు. అయినా పెద్ద మనసు చేసుకుని నీమీద వున్న అనురాగంతో హరి వాళ్ళ ఇంటికి, నీ పెళ్లిమాటలు మాట్లాడటానికి వెళ్లారు. దురదృష్ట వశాత్తు, హరి తల్లితండ్రులు, వాళ్ళ దృక్పధంతో ఆలోచించి, మీ పెళ్లి వద్దన్నారు. అందుకు వాళ్ళను కూడా, తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి మనకంటే మంచి సంబంధం తీసుకు రావాలన్నదే వాళ్ళ కోరిక. ఎవరి తల్లి తండ్రులకైనా, అలాంటి కొరిక ఉండటం సహజం. పిల్లలను కని, చిన్నప్పటినుంచి పెంచి, పెద్దవాళ్ళను చేసి, వాళ్లకు మంచి చదువులు చెప్పించి, వాళ్ళ పెళ్లిళ్లు తమ చేతులమీదుగా జరగాలని ప్రతి తల్లితండ్రులు అనుకుంటారు. అది స్వార్ధం కాదు. వాళ్ళ కనీస కోరిక. అది మనం అర్ధం చేసుకోవాలి. నువ్వు, హరి ఇంకొంత కాలం ఆగి ఇరు కుటుంబాలను సమాధానపరిచి, పెళ్లి చేసుకుని ఉంటే, మీ ప్రేమ విషయం ఇంకొంచెం బాగుండేది. అలా చేయడానికి మీరు భయ పడ్డారు. ఎందుకంటే, పెద్దవాళ్ళు మీకు వేరే పెళ్లిళ్లు చేస్తారేమోనని అనుకొనివుంటారు. వసూ! నీకు బాగా తెలుసు నాన్నగారు నిన్ను ఎంతగా ప్రేమించేవారో. నన్ను ఎప్పుడైనా కొట్టారేమో గాని, నిన్ను మాత్రం ఒక్కసారి కూడా కొట్టలేదు. తండ్రికి కూతురుమీద, తల్లికి కొడుకుమీద ఎనలేని అభిమానముంటుంది. పిల్లలు, తల్లితండ్రులను అర్ధం చేసుకోవాలి.  తల్లి ఇంటి విషయాలు చూసుకుంటూ, పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది.

ఇంటికి, పిల్లలకు, అందరికి కావలసినవన్నీ సమకూరుస్తూ, తండ్రి పూర్తి బాధ్యత తీసుకుంటాడు. తల్లి తండ్రులలో, ఎవరుగొప్ప అని చెప్పలేము. నాన్నగారు, మన ఇద్దరి పెళ్లిళ్లు అయినా తరువాత, పురాణాలు చదువుకుంటూ, దైవ చింతనతో కాలం గడపాలనుకున్నారు. ఆఖరి నిముషంలో కూడా, ఆ పని చేయలేక పోయినందుకు, చాలా బాధ పడ్డారు.” అన్నాడు ప్రదీప్. “మా తల్లితండ్రుల తప్పుకూడా వుంది ప్రదీప్. ఆరోజు వాళ్ళు అలా ప్రవర్తించి ఉండకూడదు.” బాధగా అన్నాడు హరి. “లేదు హరి, మీ అమ్మానాన్నలది సహజమైన ఆవేశం. ఏ తండ్రైనా తన కొడుక్కి, మంచి ఆస్తి వున్న సంబంధం తేవాలనుకుంటాడు. తన కొడుకు జీవితానికి ఏ లోటు వుండకూడదనుకొంటాడు. రేప్పొద్దున మన పిల్లల విషయంలో, మనం కూడా ఇలాగే చేస్తాం” అన్నాడు ప్రదీప్. వసుంధర మౌనంగా ఉండిపోయింది. కళ్ళవెంట నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయి. తను ఆలోచించకుండా చేస్తిన తప్పు తల్లితండ్రులను ఎంత బాధ పెట్టిందో, తలచుకొనేసరికి దుఃఖం వెల్లువలాగా బయటకు వచ్చింది. “బాధపడకు వసు! మనం ఇప్పుడు గతం తవ్వుకుంటూ కూచుంటే, ఏమి ప్రయోజనం లేదు. నేను ఈ రెండు రోజులుగా ఆలోచిస్తున్నాను. మనం తిరిగి, ఒకరి ఇళ్లకు ఒకరు, రాకపోకలు జరుపుకుందాము. మీకు అభ్యంతరం లేకపోతె, మీ అబ్బాయికి మా అమ్మాయినికాని, లేకపోతె మా అబ్బాయికి మీ అమ్మాయిని కానీ ఇచ్చి, వివాహం చేద్దాం. అప్పుడు చనిపోయిన మన తల్లితండ్రుల ఆత్మలు, శాంతిస్తాయి. అమ్మకూడా తన చివరి రోజుల్లో ఇదే చెపుతుండేది. ఒకవేళ వసును ఎప్పుడైనా కలిస్తే, ఇదే నా ఆఖరి కోరికగా చెప్పమని అంటుండేది. అమ్మ నీ గురించి ఆలోచించని రోజే లేదు. నువ్వు పెళ్లిచేసుకుని వెళ్ళిపోయినందు అమ్మ బాధపడలేదు. కానీ నాన్నగారికి ఒక్కమాటైనా చెప్పనందుకు, చాలా బాధ పడింది. మీ ఇద్దరూ మంచి జీవితం గడపాలని వున్న రెండు సంవత్సరాలు దేవుడికి పూజ చేసేది అమ్మ. అందుకనే తల్లితండ్రుల ఋణం తీర్చలేనిదని పెద్దవాళ్ళు అంటారు. తల్లితండ్రులది నిష్కల్మషమైన ప్రేమ. దానిముంది సృష్టిలోని ఏ ప్రేమ సరిపోదు.” అన్నాడు ప్రదీప్. ప్రదీప్ మాటలతో అందరూ ఊరట చెందారు. “అలాగే అన్నయ్యా! మన బంధం కొనసాగిద్దాము”. ఆప్యాయంగా చెప్పింది వసుంధర.

Posted in February 2019, కథలు

3 Comments

  1. AMBALLA JANARDAN

    కథ మరీ మామూలుగా ఉంది. మేనరికాలు మంచివి కావలుకుంటున్న ఈ రోజుల్లో, మేనరికం చేసుకుని బంధం కొనసాగించాలనే ఆలోచన పాతచింతకాయ పచ్చడిలా ఉంది.
    -అంబల్ల జనార్దన్

    • BHANU MURTHY

      జనార్దన్ గారికి,

      మీరు నా కధను చదివి మీ అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదములు. ఈ కధలో పిల్లలు, తల్లితండ్రుల అభిప్రాయాలను గౌరవించాలన్నదే ముఖ్యాంశం. తమకు కష్టం వచ్చినప్పుడు తల్లితండ్రులకు చెప్పే పిల్లలు, తమ ప్రేమ/పెళ్లి విషయం కూడా పెద్దవాళ్ళతో పంచుకోవాళ్ళన్నది సారాశం. ఈనాడు సమాజంలో ఉమ్మడికుటుంబాలు తగ్గుతున్నాయి. పిల్లలు పెద్దవాళ్లయిన తరువాత “ఎవరికీ వారే” అన్నట్లుగా వుంటున్నారు. ఈ కధ నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్నట్లుగా ఉండాలన్నది నా ఆలోచన. ఇక పిల్లల వివాహాల గురించి తల్లి అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడు ప్రదీప్. “మీకు అభ్యంతరంలేకపోతే” అన్న పదాన్ని కూడా వాడాను. కాబట్టి పెళ్లి చేసుకోవటం, చేసుకోకపోవడం పిల్లల ఇష్టం. నా కథను సునిశితంగా పరిశీలించి మంచి అభిప్రాయాన్ని తెలిపిన మీకు మరొక్కసారి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. మీ సూచనవల్ల మన సిరిమల్లె సంచికలో మరిన్ని ఉత్తమ రచనలు/శీర్షికలు వస్తాయని ఆశిస్తున్నాను.

      నమస్కారములతో,
      భానుమూర్తి

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!