Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
అంతా అందలమెక్కితే మోసేవారెవరు?

చెంచురామయ్య, సుశీలమ్మా దంపతుల ఇల్లు కళకళ లాడుతున్నది. వారి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళూ, వారి కుటుంబాలతో దిగారు ఉగాది పండక్కి. పిల్లల అత్తమామలూ ఇంకా కొద్దిమంది వారి కుటుంబీకులతో ఇల్లు పెళ్ళి కళతో ఉంది. పెద్ద లోగిలి హాలు చుట్టుతా గదులు, చుట్టూ వసారాల పెద్ద పెంకుటిల్లు వారిది.

ఇంటి చుట్టూ పెద్ద పండ్లతోట, కూరగాయలూ, పూలూ అన్ని ఇంట్లోనే పండిస్తారు వారు. పిల్లలు వస్తారని ముందుగానే ఇనుప కమ్ములతో పందిరేయించిన పది పెద్ద మల్లె పందిళ్లకూ ఆకులు దూయించి మల్లె మొగ్గలు నిండుగా తొడిగేలా శ్రధ్ధతీసుకుంది సుశీలమ్మ.

ఇహ చెంచురామయ్యకు నెలక్రితం నుండే కూరగాయలూ, పండ్ల చెట్ల మధ్యే నిద్ర అన్నట్లు గడిపారు. పిల్లలంతా వారి కుటుంబాలతో సుమారుగా యాభైమంది కార్లలో దిగగానే ఊరంతా వింతగా వచ్చిచూసి, పలకరించి పోయారు. అందరికీ తలలో నాలుకలా వుంటారు ఆ వృధ్ధ దంపతులు.

ఉగాదికి ఒకరోజు ముందే అంతా వచ్చి శ్రీరామనవమి వెళ్ళాక అంతా వెళ్ళిపోతారు. అప్పుడు ఆ ఇల్లు బోసిపోయి ఆవృధ్ధ దంపతులకు తోచక ఊరి వారిని పిలిచి మాట్లాడుతుంటారు. వారంతా ఓదార్పుమాటలు చెప్పి "ఎంతండీ! పంతులుగారూ వచ్చే ఉగాదికి అంతా మళ్ళా దిగిపోతారు గందండా! ఎంతలో వస్తది తిరిగి ఉగాది. ఇట్టా సూసేసరికి అట్టావచ్చేయదూ తిరిగి  చూసేసరికీ వచ్చేస్తది గదండా!" అంటూ బుజ్జగించి పోతుంటారు. వారి మాటలతో తిరిగి తమ పనుల్లో పడిపోతారు ఆ వృధ్ధులు.

ప్రతి ఏడాదీ చూస్తున్నవారు కొందరైతే, మొదటిమారుగా ఆ పల్లెకు వచ్చినవారు కొందరు, ఆ ఇంటినీ, దాని అందాన్నీ, ఇంత మందికి అన్ని ఆధునిక సౌకర్యాలతో నగరపు ఇంటిలా తీర్చి దిద్దిన తీరునూ చూసి విస్తుపోతూ, ఇంటి చుట్టూ కొన్ని ఎకరాల్లో ఉన్న పండ్ల చెట్లనూ, పూల పందిళ్లనూ, కూరలపాదులనూ చూస్తూ రోజంతా అక్కడే గడిపేస్తున్నారు. అన్నానికీ, టిఫిన్లకూ పిలిపించుకుని, పిలుపించుకుని పోసాగారు, తిండే పట్టనట్లుగా ఆ పల్లె అందాలను చూస్తూ ఫోటోలు తీసుకుంటూ గడపసాగారు.

అందరికీ కమ్మని నీటీతో ఉన్న కొబ్బరి బోండాలూ, రుచికరమైన మామిళ్ళూ, తోటలో సహజంగా పండిన అనేక పండ్లనూ, ఇంట్లో చేసిన రుచికరమైన నేతి పిండివంటలనూ, అన్నీ తింటూ తిరుగుతూ ఒక స్వర్గలోకంలోకి వచ్చామా అనిపించేలా ఉండే ఆ పల్లెనూ, ఆ ఇంటి తీరునూ చూస్తూ అచ్చెరువందుతూ, మురిసిపోతూ, తాము ఇంతకాలం రానందుకు,"ఆ పల్లెలో ఏముంటుందిలే అనుకుని చాలా నష్టపోయామని బాధ పడుతూ, ఇప్పటికైనావచ్చి చూసి తరిస్తున్నందుకు సంతోషిస్తూ, తాతగారినీ, బామ్మ గారినీ అడుగడుక్కూ పొగుడుకుంటూ   గడిపేస్తున్నారు.

పొద్దుటే కాలిమువ్వల శబ్దాలతో తమను నిద్రలేపే లేగ దూడల వెంట పరుగులూ తీస్తూ వాటితో పోటీ పడుతూ గెంతుతూ, తిరిగే ఆ పిల్లలను చూసి మురిసిపోసాగారు ఆ వృధ్ధ దంపతులు.

జుం జుమ్మని పాలేర్లు పాలు పితికే శబ్దం కొందరికి కొత్తగా ఉండి ఆనందిస్తూ, తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసుకోసాగారు.

"ఇదేంటీ ఇలా ఉందీ!" అంటూ సున్నుండలనూ, కాకినాడ కాజాలనూ, పూతరేకుల రుచినీ పొగుడుతూ తింటున్న వారినంతా చూసి తాము తిన్నట్లే ఆనందించసాగారు వారు.

'పిల్లలంతా ఇంటికి వస్తే ఎంత సందడీ!' అనుకున్నారు ఆ వృధ్ధ దంపతులు. ప్రతి ఏడాదీ వారికి ఆ సంతోషం కొత్తగానే ఉంటుంది.

ఉగాదికి పూజారి వచ్చి పూజచేసి అందరికీ కమ్మగా చేసిన ఉగాది పచ్చడి ప్రసాదం ఇచ్చి వేడివేడి గారెలూ, బూరెలూ, కమ్మని చింత గింజవేస్తే మునగని కాఫీ త్రాగి, త్రేన్చి, దీవించి వెళ్లాక ఇంటి బంతులు మొదలవుతాయి.

టిఫిన్ కు ఒక బంతి, దాని తర్వాత భోజనాల బంతి, అంతా మహదానందంగా తింటుంటే ఆ వృధ్ధ దంపతుల మనసులు పులకించిపోతుంటాయి.

శ్రీరామ నవమి వచ్చిందంటే వారికి చింత మొదలవుతుంది. ఇహ పిల్లలు ఒక్కోరూ బయల్దేరి వెళ్ళిపోతారని.

ఆ రోజు శ్రీరామ నవమి ఇంటిముందు వేయించిన తాటాకు పందిళ్ళలో, కొత్త తాటాకు విసన కర్రలూ, కొత్త బెల్లంతో పానకాలూ, వడపప్పులూ, పందిట్లో శ్రీరామ స్వామీ పూజ, పెళ్ళీ అన్నీ చేసి అందరికీ ప్రసాదాలూ పంచి, ప్రత్యేకంగా చేయించిన కడవలకొద్దీ పాయసం అందరికీ కొబ్బరి ఆకుల గిన్నెల్లో పంచి, అంతా వెళ్ళాక ఇంటి భోజనాల టిఫిన్ బంతి మొదలైంది.

సుమారుగా పదిమంది వంటవాళ్ళూ ఏపూటకాపూట కొత్త కొత్త కూరలతో, పిండి వంటలతో రుచికరంగా చేసి వడ్డింస్తుంటారు. ఆ రోజు మధ్యాహ్న భోజనంలో ఇంకా ప్రత్యేక వంటకాలతో ఘుమ ఘుమలాడే నేతి వంటకాలూ ముక్కులకు సువాసనలు వెదజల్లుతుండగా అంతా 'భోజనకాలే శ్రీరామ నామ స్మరణా గోవిందా గోవిందా' అని భగవంతుని స్మరించి భోజనాలు మొదలుపెట్టారు.

కూతుళ్ళూ, కోడళ్ళూ "మీరూ కూర్చోండి, పొద్దు పోతుంది" అని ప్రేమగా సుశీలమ్మ గారిని పిలిచారు. "అంతా ఎక్కితే పల్లకీ మోసేదెవరూ! మీకంతా ఏమేమి కావాలో చూసి వడ్డించమని చెప్పాలా! మీరు కానీండి" అంటూ పెద్దల బంతీ, పిలల్ల బంతీ అందరినీ చూస్తూ వడ్డించమని వంట వారిని కేకేస్తున్న సుశీలమ్మ గారి ప్రేమకు అంతా మురిసిపోయారు. అపర కాశీ అన్నపూర్ణలా పచ్చని చీరలో కాణీ కాసంత ఎర్రని బొట్టుతో కళ కళ లాడుతున్న ముఖంతో సందడి చేసే సుశీలమ్మను ప్రేమకు అంతా పులకించి పోయారు.

అదండీ ఆ వృధ్ధ దంపతుల ఇంట ఉగాది పండగ సందడి.

Posted in August 2021, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!