Menu Close
anna-chelleli-gattu

ధారావాహిక నవల

శల్యూష సమయం ముగిసిపోగానే వెలుగు మాయమైపోయి పరిసరాలన్నీ మళ్ళా చీకటితో నిండిపోయాయి. అది శుక్లపక్షం కావడంతో చందమామ ఎప్పుడో అస్తమించాడు. నక్షత్రకాంతి బయటికి రాకుండా ఆకాశంలో పరుగులుపెడుతున్న మేఘాలు అడ్డుకుంటున్నాయి. అదేమీ పట్టించుకోకుండా ముక్కుకి సూటిగా పోతున్నాడు కన్నయ్య. తెడ్డు నీటిని కోసినప్పుడల్లా నీటిలో చెలరేగిన తళతళలు కడలమ్మ కట్టిన ముదురు నీలం రంగు పట్టుచీరపై  చేసిన సరిగ పనిలా మెరవసాగాయి. సముద్రపు హోరుకాక, ఉండుండీ ఒక్కో రెక్కలచేప నీటి పైకంతా ఎగిరి, తిరిగి దబ్బున నీటిలో పడి చేసిన శబ్దం తప్ప మరే ధ్వనీ లేదు.

ఈ వినీల జలనిధిలో బ్రతుకు తెరువును వెతుక్కుంటూ వచ్చిన ఒంటరి జాలరికి తోడుగా ఉండేవి ఇవేకదా - అనుకున్నాడు కన్నయ్య, చీకటిలోకూడా వెండిలా మెరిసే వాటి పొట్టల మిలమిలలు చూస్తూ. లయబద్ధంగా తెడ్డును కదుపుతూ అతడు అలవోకగా పడవను నడుపుకు పోతూంటే అది కొలనులో ఈదే రాయంచలా వయ్యారాలుపోతూ ముందు ముందుకి పరుగు పెడుతోంది. చిన్నతనం నుండీ అలవాటైన పని కావడంతో అతని కదంత కష్టమైన పని అని అనిపించడం లేదు.

ఉండుండీ ఒక చిరు అల పైకి లేచినా, మొత్తం మీద సముద్రం ప్రశాంతగా ఉంది. రెక్కలచాటున ముక్కులు దాచుకుని అన్నీఒకేచోట నిద్రపోతున్న సాగర పక్షుల గుంపులు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాయి. కన్నయ్య వాటి పక్కనుండి పడవ నడుపుకు పోతూంటే వాటిలో కొన్ని కదిలి గాలిలోకి లేచినా, పడవ దూరంగా వెళ్ళిపోగానే మళ్ళీ యధాస్తానంలోవాలి తిరిగి నిద్రపోతున్నాయి. సుమారుగా ఇంకొక అరగంట గడిస్తే గాని అవి లేచి వేట మొదలెట్టవు.

తూర్పున ఉషోదయమయ్యింది. చీకటి పొరలు తొలగాయి. అప్పటికే కన్నయ్య సముద్రంలో చాలా దూరం ముందుకు వెళ్ళిపోయాడు. కాని అతడు ఈ ప్రదేశంలో చాలా రోజులనుండి వేట చేస్తూనే ఉన్నాడు. కానీ నాణ్యమైన చేప ఒక్కటీ దొరకలేదు, అందుకే ఇక్కడ కాకుండా ఇంకొకచోట, పెద్ద పెద్ద చేపలు చెరలాడే ప్రదేశంలో గాలం వేస్తే లాభం ఉంటుందన్న ఆశతో దోనేను మరింత ముందుకు నడిపాడు. సర్రున బాణంలా ముందుకు దూసుకుపోయింది నావ.

"ఒక పెద్ద సేపగీని దొరికితే, నాసామి రంగా! పట్టిన దరిద్దరమంతా ఒకేపాలి డుల్లిపోద్ది" అనుకున్నాడు ఆశ ప్రేరేపించగా.

వెంటనే అతడు వడి వడిగా సాగిపోతున్న ఒక ప్రవాహంలో ప్రవేశపెట్టాడు పడవను. ఇక తన ప్రమేయం లేకుండానే, ఆ ప్రవాహపు వడిలోపడి, అది పోతున్న దిశలోనే సాగిపోతోంది పడవ కూడా. క్రమంగా ఒడ్డు కనిపించడం మానేసింది.

అలా కొంత దూరం వెళ్ళాక తెడ్డు మెడ్డి, పడవను ప్రవాహం నుండి తప్పించాడు కన్నయ్య. నీటిలో పడవను నిలిపి, గాలాలూ, ఎరలూ ఉన్న బుట్ట అందుకున్నాడు. కిత్తనారతో రాధమ్మ తాళ్ళు పేని, వాటిని తలోరంగు అద్ది, కట్టిన గాలాలు మూడున్నాయి బుట్టలో- ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగుల్లో. మూడింటి తాళ్ళూ మూడు వేరు వేర రంగుల్లో ఉండడమే కాకుండా వేరువేరు కొలతలలో కూడా ఉండడంవల్ల, వాటిని నీటిలో విడిచినప్పుడు అవి వేరు వేరు లోతులను చేరుకుంటాయన్నమాట! మూడు గాలాలకు ఎరలుగా తొలల(సార్దీన్సు) దండలను గుచ్చి ఆమూడింటినీ నీటిలో వదిలాడు కన్నయ్య. గాలాలకు కట్టిన బెండ్లు నీటిపైన తేలుతూ, ఆ గాలం ఉనికిని తెలియజేస్తాయి. చేప ఎరనుపట్టి లాగినప్పుడు బెండు నీటిపైన నాట్యo చేస్తుంది. బెండు కదలికనుబట్టి ఆ విషయం తెలుసుకుంటాడు జాలరి.

గాలం నీట వెయ్యగానే చేపవచ్చి తగులుకుంటుందన్న నమ్మకం లేదు. గాలాన్ని నీటిలోవదలి, దానిని చేప పట్టడం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు జాలరి. ఆ ఎదురుచూసే సమయం ఒకప్పుడు తక్కువగానూ, మరొకప్పుడు ఎక్కువగానూ ఉండవచ్చు. అలా ఎదురుచూపులు చూస్తూ కనిపెట్టుకు ఉండడమన్నది చాలా శ్రమతో కూడిన పని! చేప ఎరనుపట్టడం కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా కూర్చుని ఉన్న కన్నయ్యకు ఇల్లు గుర్తొచ్చింది. అతని మనసంతా రాధమ్మ మీది జాలితో కూడిన ప్రేమతో నిండిపోయింది. "పాపం! తన పుట్టుకేమిటో, తానేమిటో తెలియని రోజుల్లో నన్ను పెళ్ళాడింది. తానెవరో తెలిస్తే నన్నిడిసి ఎలిపోతాదనుకున్నా! కాని, అంతా గురుతొచ్చాకకూడా, ఎలిపోలేదు సరిగదా ఏ దాపరికం లేకుండా జరిగినదంతా నాకు సెప్పింది. రవంత గీరుమాణం(గర్వ౦) కూడా లేకుండా మా మ్మరకాల్లల్లో ఒకతెగా కలిసిపోయి, మరక్కత్తెగా మారిపోయింది. అంతేకాదు, మరక్కత్తెలు సేసే పనులన్నీ నేర్సుకుని, ఆటిని ఆల్లకంటే బాగా సెత్తాది. పట్నంబాబు బతికొచ్చి, రమ్మని  పిలిసినా కూడా మమ్మల్నిడిసి ఎల్లనంది. నిజం సెప్పాలంటే నా రాధమ్మ నికార్సైన పతివ్రొత. ఏదో సేపం తగిలి ఈడకు వచ్చిన దేవత. నా అదురుట్టంగొద్దీ నాపాలబడి, తానిలా అస్టకష్టాలూ అనుబగిస్తోoది. "సావైనా బతుకైనా నీతోటే కన్నయ్యా" అంటాది. అంటే - నేను సొరగానికి గీని ఎలిపోయినానంటే నా రాధమ్మ కూడా నా ఎనకాతలే తనూ వచ్చేస్తాది కాబోలు! అక్కడకూడా, నాను తెరసాప, తెడ్డు, ఎదుర్లసాప లాంటియి పట్టుకుని ముంగల నడుస్తావుంటే, తను గాలాలు, ఎరలబుట్ట, సద్ది ఉగ్గo లాంటియి అట్టుకొని నా ఏనకాతలే వస్తాది కాబోలు!" ఆ ఆలోచన అతనికి నవ్వుతెప్పించింది. కిసుక్కున నవ్వాడు కన్నయ్య. తనలో రాధమ్మపైన  ప్రేమ పొంగిపొర్లగా, "నా రాధమ్మ, నా రాధమ్మ" అంటూ పదేపదే ఆమె పేరుని తలపోశాడు.

అంతలో తెల్లవారింది. తూరుపుదిక్కున ఆకాశంలో సిందూర వర్ణంలో ఉదయరాగం పరుచుకుంది. నునులేత వెలుగు కిరణాలు సోకి, మేఘాల వంచలు, ముదురు నీలంరంగు పట్టుచీరకున్న బంగారు సరిగంచులలా తళతళా మెరుస్తు అందంగా ఉన్నాయి. నిత్య చంచలయైన సముద్రపు నీటిపై సూర్యకిరణాలు పది, రాణికాసులు గుమ్మరిస్తునట్లు మిలమిలలాడుతూ కళ్ళు మిరిమిట్లు గొల్పుతున్నాయి ఆగక కదిలే అలలు. ఉండుండీ ఒక చేప గాలిలోకంతా ఎగిరి తిరిగి నీటిలో పడుతోంది. తెల్లని వాటి పొట్టలు ఆ నీరెండలో వెండి రంగులో ధగధగా మెరుస్తు అందంగా ఉన్నాయి. రకరకాల నీటి పక్షులు ఆకాశంలో ఉల్లాసంగా ఎగురుతూ, పల్టీలుకొడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ వేట సాగిస్తున్నాయి. ఈ ఉదయ ప్రభాసం నిత్యనూతనం! అవధులెరుగని ఈ సౌందర్యం అలౌకికం! దానిలో ఉన్న - ఎంతచూసినా తనివితీరని అపరిమిత మాధుర్యమేదో ఎప్పటి కప్పుడు కన్నయ్యని ఆకట్టుకుని, ఏరోజునా అతన్ని చూపు తిప్పుకోనీయదు.

పెద్దరేవులో వేట పడవలు బయలుదేరాయి కాబోలు, ఆ సువిశాల సముద్రంలో దూరంగా, అక్కడక్కడా ఒక్కో పడవ వేటచేస్తూ కనిపిస్తోంది. వాటిని చూడగానే కన్నయ్యకు పాతవిషయాలు గుర్తుకువచ్చి మనసు విలవిల లాడింది.

సూర్యదేవుడు దిగంతరేఖను (హోరైజన్)దాటి, ఉషక్కాంత నుదుటి కుంకుమలా మెరిసిపోతూ, తూర్పుసముద్రం నుండి నెమ్మదిగా పైకి వచ్చాడు. ఆకాశం, భూమీ కలిసినచోట – దిగంతవలయం చుట్టూ ఒక కాంతిరేఖ కనిపిస్తూ, ప్రకృతిమాత నడుముకి పెట్టుకున్న వడ్డాణంలా మెరిసిపోతూ భూమికీ ఆకాశానికీ మధ్య హద్దై నిలచింది.

అటే చూస్తూ అనుకున్నాడు కన్నయ్య - ఆ హద్దేమిటో, దానికి ఆవల ఏముందో చూసినవారెవరూ లేరు కదా! అంతేకాదు, దానిని అందుకోవాలని ఎంత ముందుకు వెళ్ళినా అది అంతకంతకూ వెనక్కి వెనక్కి జరుగుతూ మనల్ని మురిపిస్తూనే ఉంటుంది, అదేమి చిత్రమో! - అతనికి ఈ ఆలోచన రావడం ఇది మొదటిసారి కాదు.
నెమ్మదిగా ఆకాశంలో సూర్యుడు పైపైకి ఎక్కి వస్తున్నాడు. అంతకంతకీ వేడి పెరిగి ఎండ చుర్రుమనిపిస్తోంది. కర్తవ్యం గుర్తుకిరావడంతో, నీటిలో తేలుతున్న బెండ్ల  వైపు చూశాడు కన్నయ్య. అవి అలల ఊపుతో నీటిపై నాట్యం చేస్తూ కనిపించాయి. వాటిని చూస్తూంటే కన్నయ్యకు ప్రాణం ఉసూరుమంది. అతని హృదయాన్ని చీల్చుకుని వచ్చింది గాఢమైన నిట్టూర్పు ఒకటి. ఇక్కడ కాకుండా మరోచోటుకి వెళ్ళి గాలం వెయ్యడం మంచిది - అనుకున్నాడు అతడు.

సమీపంలోనే ఒక గుండం ఉందని కన్నయ్యకు తెలుసు. ఆ గుండం ఒక చల్లారిన అగ్నిపర్వతం తాలూకు చిమ్నీ. లావా అంతా కారిపోగా మిగిలిన పర్వతంలో అది ఒక బావిలా ఏర్పడి ఉంది. ఆ బావి వంచలలో మొలిచిన సముద్రపు నాచు ఏపుగా పెరిగి, నీటిపైకంతా వ్యాపించి ఉంటుంది అక్కడ. ఆ నాచు తినడానికి ఎన్నోరకాల చిన్నచిన్న చేపలు వచ్చి చేరుకుంటాయి అక్కడికి. ఆ చిన్నచేపలను పట్టి తినడానికి పెద్దచేపలూ, ఆ పెద్దచేపలకోసం ఇంకా పెద్దవైన చేపలు వస్తాయి అక్కడకు. శఫరి (డాల్ఫిన్), శిశుకం (పోర్పోయిస్), దొడ్డసొర (టైగర్ షార్కు) లాంటి మరీ పెద్దరకాలేకాకుండా, జీవకమ్ (సాల్మన్), టేకి, సుత్తిసొర (హేమార్ హెడ్ షార్కు), పాలసొర, ఏలాoచేప  వంటి మధ్యరకాలు, సాధారణమయిన వాలుగ, సవర, ముల్లువలస, ఇంకా మామూలు వైన ములుగు, పాలబొంత, తొలలు, సవర్లు, ఆకుచేప లాంటివి, ఇంకా ఎన్నెన్నోరకాలు అక్కడ దర్శనమిస్తాయి. ఆ పర్వతాన్ని అంటిపెట్టుకుని తిరిగే పెద్దపెద్ద తాబేళ్ళు కూడా కనిపిస్తాయి. పెరజు (సీ స్నేక్), పెద్దచేపల పొలసులక్రింద దూరి వాటిని కరిచిపట్టి నెత్తురుతాగి బ్రతికే పరాన్నజీవి (పేరసైట్) పైజారుకట్టు లాంటివి కూడా కనిపిస్తాయి. ఇంకా రకరకాల రొయ్యలు, పీతలు, జల్లిచేపలు, నత్తలు, గవ్వలు, శంఖాలు, ఆలిచిప్పలు, పురుగులు, బూచిలు - ఇలా భగవంతుని సృష్టిలో ఉన్న ఎన్నోరకాల సముద్ర జీవులు మనకి అక్కడ కనిపిస్తాయి. అష్టపాదులు (ఆక్టోపస్లు) - అక్కడి రాళ్ళ సందుల్లో పొంచి ఉండి, తనకు అందుబాటులోకి వచ్చిన జీవుల్ని పొడవైన తన కాలుజాపి పట్టుకుని, దగ్గరగా తెచ్చుకుని తన చిలకముక్కులా వంపుతీరిన ముక్కుతో పొడిచి పొడిచి ముక్కలు చేసుకుని తింటాయి. అప్పుడప్పుడు తిమింగలాలు కూడా వచ్చి చేరుతాయి అక్కడికి, మేము చూశాము – అని అంటారు కొందరు. ఆ చుట్టుపక్కల పన్నెండు ఆమడల దూరంలో పుట్టిన ప్రతి సముద్రజీవి మనకు అక్కడ కనిపిస్తుంది - అనడం అతిశయోక్తి కాదు. ఎంతో సంవృద్ధిగల ఆ ప్రదేశానికి వెళ్లి గాలం వెయ్యాలనుకున్నాడు కన్నయ్య.

ఆ ఆలోచన మనసులోకి రాగానే నీటిలోని గాలాలు వెనక్కు తీసుకుని, పడవను దగ్గరలోనే సాగుతున్న ప్రవాహం వైపు తిప్పాడు. ఆ సమీపంలో ప్రవహించే ప్రవాహాలన్నీ ఆ గుండం వైపుగానే వెడతాయన్నది కన్నయ్యకు తెలుసు. ప్రవాహంలో ప్రవేశించిన పడవ కొద్దిసేపట్లో ఆ గుండం దగ్గరకి  చేరుకుంది. వెంటనే అక్కడ గాలాలు పన్ని చేప రాక కోసం ఎదురుచూస్తూ కనిపెట్టుకుని ఉన్నాడు కన్నయ్య.

#### #### ####

కాలం ఊపందుకున్న ప్రవాహంలా ఎక్కడా ఆగకుండా సాగిపోతోంది. కన్నయ్య ఇదివరకెప్పుడూ అంత శ్రమ పడి ఎరుగడు. కాలానికి ఎదురీదడం లాగే ప్రవాహానికి ఎదురీదడం కూడా చాలా కష్టం. కానీ కన్నయ్య తన భుజశక్తితో పడవను ప్రవాహానికి ఎదురు నిలిపి గాలాలను వదిలాడు. నాణ్యమైన చేపను వెంటతీసుకునిగాని ఇంటికి వెళ్ళకూడదని మరోసారి గట్టిగా అనుకున్నాడు. ఆ సమయంలో అతని మనసులోఉన్నది తన కుటుంబం మాత్రమే! సరైన తిండిలేక బక్క చిక్కిన పిల్లలు, మందూ మాకూ లేక బాధతో మూలిగే ముసలితల్లి, ఎంతకష్టాన్నైనా పంటిబిగువున ఓర్చుకుంటూ, భర్త సంతోషం కోసమని నవ్వుతూ ఎదురొచ్చే తన ఇల్లాలు రాధమ్మ - కళ్ళకు కట్టారు. అంతే, అతనిలో అడ్డూ, అదుపూలేని మహాశక్తి ఏదో విజృంభించినట్లయ్యింది. ఎంతో వేగంగా పడవను నడపసాగేడు.

అల్లంత దూరంలో తిమింగలం జాతివైన శిశుకాలు కొన్ని ఒకచోట జేరి, తమ శ్వాసరంధ్రాలనుండి నీటిని విరజిమ్ముతూ వినోదిస్తున్నాయి. తెల్లటి పక్షి, రెక్కలకొసల్లో నల్లని ఈకలున్నది ఒకటి, విశాలమైన తనరెక్కలు బారజాపి నీటిపై ఎగురుతూ గింగిరాలు తిరుగుతోంది. అలా అది ఒకేచోట వలయాలు తిరుగుతోందంటే అక్కడ చేపలు గుంపులు గుంపులుగా ఉన్నాయని అర్థం. దానిని చూడగానే కన్నయ్య నావ నక్కడకు పోనిచ్చాడు. అక్కడ చేపలు చాలానే ఉన్నాయిగాని, అవి అతని ఆశను తీర్చగలిగేవి ఎంత మాత్రం కావు. బిలాబిలలాడుతూ చిన్నచిన్న చేపలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి అక్కడ. కానీ అవి చాలా చిన్నవి. కన్నయ్యకు గొప్ప ఆశాభంగమయ్యింది.

గుండం దగ్గరవున్న చేపల్లో ఏదో అలజడి కనిపించింది. అవి ఆటూ ఇటూ ఈదుతూ కంగారుపడుతున్నట్లుగా  పరుగులు పెడుతున్నాయి గాని, ఎప్పటిలా లేవు అవి - అనిపించింది కన్నయ్యకు. ఓమాదిరి పెద్ద చేపలు హడావిడిగా అటూ ఇటూ ఈదుతున్నాయే గాని, అవి గాలాలకు కట్టిన తొలల దండల్ని పట్టించుకోడం లేదు. ఇంక ఆ ప్రాంతంలో ఆగడంలో లాభం లేదు - అనుకున్నాడు కన్నయ్య.

తెడ్డు సాయంతో ప్రవాహానికి ఎదురొడ్డడం వల్ల అతనికి నెమ్మదిగా జబ్బలు పీకడం మొదలెట్టాయి. అతడు సముద్రంలో వదలిన గాలాల తాలూకు బెండ్లలో మాత్రం ఏమార్పూ రాలేదు. అవి ప్రవాహంలో కొంచెం వాలుకి వెళ్ళి నీటిపై తేలుతూ ఆడుతున్నాయి. వాటిని చూసిన కన్నాయ్యకు ప్రాణం చాలివచ్చింది. దూరంనుండి పెద్ద అలా ఒకటి ఈ చిన్నచేపల గుంపులున్న వైపుగా రావడం కనిపించింది. అది కన్నయ్య ఆశకు తిరిగి జీవమిచ్చింది. అది ఏమిటో అర్ధం చేసుకుని బల్లేన్ని పైకి తీసి చేత పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు.

ఔను! నిజమే! పెద్దచేపల గుంపు ఒకటి, సగం మూపులు నీటిపైకంతా కనిపించేలా ఈదుకుంటూ, నోళ్ళు విశాలంగా తెరుచుకుని చిన్నచేపలున్నవైపుకి వేగంగా వస్తున్నాయి. ఒక చేపనైనా బల్లెం గుచ్చి పట్టుకోవాలని, ఒడుపుగా బల్లేన్ని పట్టుకుని సిద్దంగా నిలబడ్డాడు కన్నయ్య. కానీ, అప్పటికే వాటి కడుపులు నిండిపోయివుండడంతో కాబోలు, కన్నయ్య సమీపానికి రాకముందే అవి, కూడబలుక్కున్నట్లుగా అన్నీ ఒకేసారి నీటిలో బుడుంగున మునిగి, ఎటో ఈదుకుంటూ వెళ్ళిపోయాయి. హతాశుడైన కన్నయ్య నిస్త్రాణగా బల్లెం పడవలో పడేసి, కళ్ళల్లోకంతా కారి మంట పుట్టిస్తున్న, మొహానికి పట్టిన చెమటను తుండుతో తుడుచుకున్నాడు.

అపరాహ్నమయ్యింది. సూర్యుడు నడినెత్తి మీదికంతా వచ్చాడు. కన్నయ్యకు కడుపులో ఆకలి దంచేస్తోంది. ఇక ఇతర ఆలోచనలు మాని, తిండి తినాలనుకున్నాడు. తెడ్డు పక్కనబెట్టి, దోనె కడుపులో చేరి రాధమ్మ ఇచ్చిన చద్దిముంత బయటికి తీశాడు. దానిలో కొద్దిపాటి గంజి, అన్నం, పచ్చడిబద్ద ఉన్నాయి. వాటిని తింటూండగా కన్నయ్యకు ఇల్లు గుర్తుకి వచ్చింది. “ఇంటికాడున్నోళ్ళకు ఈ రోంతైనా తిండానికి ఉందో, లేదో” అన్న ఆలోచన వచ్చింది. ఆ తరవాత అతనికి తిండి సయించలేదు. బలవంతంగా ఆ తిండి కాస్తా తిన్నాననిపించి, చేతి మడమతో మూతి తుడుచుకున్నాడు కన్నయ్య. ఆపై సీసాలోని నీరు తాగుతూ, తలెత్తి ఆకాశం వైపు చూశాడు.  పైన వినీల ఆకాశం, క్రింద అఖండ జలారాశి, మధ్యలో ఒంటరిగా తను!

అతనికి తన ఒంటరితనం దుఃఖాన్ని తెప్పించింది. తనది అసలే ఏకాకి పుట్టుక! తనలాంటివాడికి ఒంటరితనమే తోడు! కానీ, నీడలా ఎప్పుడూ తనని వెన్నంటి ఉండే రాదమ్మని తనకు తెచ్చి ఇచ్చింది కడలమ్మ! బెస్తవాడలోని చాలామందికి అదే కదా అసూయ! వాళ్ళందరినీ రెచ్చగొట్టి, తమకు వెలిపడేలా చేశాడు చుప్పనాతి భేతాళుడు. "మంచితనానికియి రోజులుకావు, సెడ్డబుద్దులున్నోల్లనే నమ్ముతారు అందరూ" అనుకుని బాధపడ్డాడు కన్నయ్య.

ఒక్క క్షణం విశ్రాంతి కావాలనిపించడంతో దోనె కడుపులోని వెదుర్లచాపపైన చతికిలబడి, దాని వంచకు చేరగిలి కూర్చున్నాడు. కానీ, శరీరానికి విశ్రాంతి దొరికినా మనసుకి దొరకలేదు. రకరకాల ఆలోచనలతో అలజడి పడుతోంది అతని మనసు. అకస్మాత్తుగా అతనికి మనసులోకి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది- తను రాధమ్మకి పిల్లలకి కడుపునిండా బువ్వైనా పెట్టలేకపోతున్నాడు కనక వాళ్ళని ఆ బస్తీబాబు దగ్గరకు పంపేస్తే...
వెంటనే, “చావైనా బ్రతుకైనా నీతోనే! నిన్ను విడిచి ఎక్కడికీ పోను” అన్న రాధమ్మ మాటలు అతని హృదయకుహరంలో ప్రతిధ్వనించాయి. తనకలాంటి తప్పుడు ఆలోచన వచ్చినందుకు తనకు తానే తలపై గట్టిగా ఒక టెంకిజల్ల ఇచ్చుకున్నాడు కన్నయ్య. "ఇంకా నయం, ఆ యమ్మితో అన్నాను కాదు! ఈ మాట గీని రాధమ్మ విన్నాదంటే, తప్పకుండా నన్ను తప్పుపట్టేది - అందరితోపాటుగా తన పెనిమిటి కూడా తనను నమ్మటల్లేదు -  అనుకుని ఏ ఒగాయిత్యానికైనా తలపడి ఉండేది గందా” అనుకుని అలజడిపడ్డాడు.

కొద్దిసేపు ఆగి, మళ్ళీ అనుకున్నాడు, “బెస్టోళ్ళ సంగానికి కులతప్పు కడితే సాలంట! కులతప్పు అంటే జరిమానా! డబ్బుతో పాపాలు కడుక్కుపోతాయా? డబ్బు కడితే సాలు, తప్పు ఒప్పైపోద్దా? డబ్బుకడితే “ఎలి” ఎత్తేస్తారంట! కుళ్ళుమోతు నాయాళ్ళంతాకూడి, ఆ తెంపి – భేతాలుడి మాయ మాటలట్టుకుని నా బారియాని – నా రాధమ్మని “సెడిపె” అన్నంత, మాత్తరంలో నేను నమ్మేస్తానా? ఆ యమ్మిని గురించి నా కంటే బాగా ఎవ్వరికెరుకవుతాదంట! అళ్ళు ఎంత గింజుకు సచ్చినా నేను పైసా జరిమానా కట్టేది లేదు. అలా కట్టి నా బారియాకు నా సేతులతో నేనే “సెడిపె” అన్న ముద్దర ఏస్తాననుకున్నారు కాబోలు! ఈ బెస్తోళ్ళ కన్నయ్య కంటంలో ప్రేణముండగా అది జరిగేపని కాదు, అమ్మతోడు” అనుకున్నాడు కన్నయ్య గుండెలమీద చెయ్యి ఉంచుకుని. ఉద్రేకంతో అతని కండరాలు ఉక్కులా బిగుసుకున్నాయి. ఆదాటుగా లేచి తెడ్డందుకుని వీరావేశంతో మెడ్డడం మొదలుపెట్టాడు. ఆ చిన్న పడవ శరవేగంతో పరుగెట్టింది. కన్నయ్య తెలివితెచ్చుకుని చూసేసరికి ఎండవేడి తగ్గింది. సూర్యుడు పడమరకు తిరిగి చాలాసేపయ్యింది. కెరటాల అలజడి అంతగా లేకపోవడంతో ఎండపడి సముద్రపు ఉపరితలం అద్దంలా మెరుస్తోంది. గాలిపెర ఒకటివచ్చి చెమటలు కారుతున్న అతని శరీరాన్ని సేదతీర్చింది.

వేట పడవలు ఇంటిదారి పట్టే సమయమది. అంతవరకు దూరంగా చుక్కల్లా కనిపించిన వేటపడవల సంఖ్య క్రమంగా తగ్గిపోయి, చివరకు సున్నైపోయింది. ఉండుండీ ఒక్కో మేఘం భూమి వైపునుండి ఆకాశం మీదికి దూసుకువస్తోంది. గాలి వీయసాగింది. మేఘాలపై ప్రతిఫలించే సూర్యరశ్మి నీటిమీద వింత కాంతులు ప్రసరిస్తోంది. నీటిపైన తేలుతున్న నాచుతీగలు ఆ కాంతికి బంగారు మలామా చేసినట్లు మెరుస్తున్నాయి. ఆ ప్రదేశాన్ని ఏదో తెలియని ఒక అలౌకిక శోభ ఆవరించివుండడంతో అక్కడ ఒక విధమైన ప్రశాంతత  చోటు చేసుకుని ఉంది. అలజడి మానిన జలారాశి, అందమైన సూర్యరశ్మి, నీలాల జలధిలో వెండిరంగుతో మెరిసే జలచరాలు, బంగారంతో చేసిన వాటిలా ఉండే నాచు తీగలు – వాహ్! అద్భుతంగా ఉన్నాయి ఆ పరిసరాలు. కానీ, కన్నయ్య మనసు కీడును శంకించింది. ఏదైనా ఒక ఉధృతానికి ఈ ప్రశాంతత  సూచన కాదు కదా – అనుకున్నాడు.  ఐనా ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన మాత్రం అతనికి రాలేదు. “ఏట సెయ్యాల, ఇంటికెళ్లాల! ఉత్తి సేతులతో ఇంటికెళ్లడం ఉత్తిమాట” అనుకున్నాడు.

సూర్యుడు ఆస్తాద్రిని చేరుకున్నాడు. పడమటి దిక్కున ఆకాశం సిందూరం ఆరబోసినట్లుగా ఉండి. నీటిపక్షులు వేట చాలించి సూర్యుడు వాలుతున్నదిక్కుగా భూమిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. కానీ కన్నయ్యకు ఔనన్న చేపని పట్టకుండా ఇంటికి వెళ్ళాలనిపించలేదు. చీకటిపడడానికి ఇంకా నాలుగుగంటల వ్యవధి ఉంది, ఈలోగా తన పుణ్యంబాగుంటే ఓ మంచి చేప గాలానికి చిక్కవచ్చు– అనుకున్నాడు ఆశగా.

చీకటి పడినా కూడా అతనికి దారి తెలుసుకునే నేర్పు పుష్కలంగా ఉంది. సముద్రం మీదనున్న జాలరికి పగటిపూట దారి చూపేది సర్వసాక్షియైన సూర్యభగవానుడైతే, రాత్రి దారి చెప్పేందుకు సిద్ధంగా ఆకాశంలో గురకొయ్యలున్నాయి, ధృవ నక్షత్రముంది. ఇక వేకువఝామునైతే వేగుచుక్క ఉంటుంది. తనకు  ఆకాశాన్ని చూసి దారి కనుక్కునే తెలివి ఉంది. ఇకనేమి, ఆ ధీమాతోనే తొందరపడి ఇంటికి వెల్లిపోకుండా,  వెన్నెలవెలుగులో కూడా తన అదృష్టాన్ని వెతుక్కోవాలనుకున్నాడు కన్నయ్య.

సూర్యుడు అస్తమించాడు. చూస్తూండగా మునిమాపు వేళ గడిచిపోయి, నెమ్మదిగా తూరుపుదిక్కున సముద్రగర్భంలో నుండి లేచి క్రమంగా పైపైకి రాసాగాడు చంద్రుడు. జలనిధి కొత్త అందాలతో కేరింతలు కొట్టింది. పిండారబోసినట్లు నీటిపై పరుచుకుంది వెన్నెల. ఆ వెన్నెల వెలుగులో పైకంతా ఎగురుతూ ఆడుకుంటున్నాయి రెక్కలచేపలు. రాత్రులందు నీటిలోని కదలికలవల్ల పుట్టే తళుకుల వల్ల, అనుక్షణం కదలే కడలి కెరటాలు కన్నయ్య కళ్ళను మిరిమిట్లు గొల్పసాగాయి. ఎన్నాళ్ళనుండో అతడు సముద్రం మీద తిరుగుతూన్నా, రాత్రిపూట సముద్రం ఎలా ఉంటుందో ఎప్పుడూ చూసిందిలేదు. ఏదో ఒక అద్భుత ప్రపంచంలో ప్రవేశించినట్లు అనిపించింది అతనికి. ఇది విచిత్రమైన ఒక కొత్త అనుభవం కన్నయ్యకు.

వెన్నెల వెలుగులో నీటిపైన తేలుతున్న బెండ్లు అందంగా మెరవసాగాయి. కానీ వాటికి ఏ చేప తగులుకున్నపాపాన పోలేదు. పడవ చుట్టూ చిన్నచిన్న చేపలు ఎన్నో బిలబిలలాడుతూ తిరుగుతున్నా కన్నయ్య దృష్టి వాటిమీదకు పోలేదు. నాడెమైన పెద్ద చేప కోసం ఎదురు చూస్తున్నాడు అతడు. తన ఆశ తీరేవరకు తన పట్టు విడవకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు కన్నయ్య. వాతావరణం చల్లబడింది. పగలంతా ఎండనబడి అలసి ఉన్నాడేమో కన్నయ్యకు రాత్రి అవ్వగానే ఆవులింతలు వచ్చాయి. ఇంటిని తలుచుకున్నాడు - తన తల్లి, వయోభారంతో, అనారోగ్యంతో చీడుముడి పడుతూ మరో చంటి బిడ్డలా తయారయ్యింది. పిల్లలతో సమానంగా అన్నింటికీ పేచీలు! రాధమ్మ కనక ఆ పేచీలన్నీ భరించి, ఓపిగ్గా చక్కదిద్ది, తన పిల్లలతో పాటుగా ఆమెనూ సాకుతోంది. “రాధమ్మ నిజంగా దేవత” అనుకున్నాడు కన్నయ్య ప్రేమతో. అక్కడితో అతని ఆలోచనలు ఆగిపోయాయి. నిద్ర అతన్ని లొంగదీసుకుంది. తెడ్డును పైకిలాగి, పడవ కడుపులో ఒకవారగా ఉంచి, దానిపక్కనే తలకింద చేతిని ఉంచుకుని, వెదుళ్ల చాపపై పడుకున్నాడు. అలసి ఉన్నాడేమో, మరుక్షణం అతనికి గాధంగా నిద్ర పట్టేసింది, నిద్ర సుఖమెరుగదు అన్న నానుడిని నిజం చేస్తూ.

సగం రాత్రివేళ ఎవరో తట్టి లేపినట్లు అదాటుగా మెలకువ వచ్చింది కన్నయ్యకు. విరబూసిన పుచ్చపందిరలా ఉంది వెన్నెల. ఆకాశంలో సంచరిస్తున్న మేఘాలు ఉండుండీ చంద్రుణ్ణి మూస్తూ తెరుస్తూ, వెన్నెలతో దోబూచులాడుతున్నాయి. ఒక్క క్షణం తానెక్కడున్నాడో తెలియక దిగ్భ్రాంతికి లోనయ్యాడు కన్నయ్య. మళ్ళీ అంతలోనే అతనికి అంతా గుర్తువచ్చింది. వెంటనే నీటిలోని బెండ్ల వైపుకి చూశాడు. ఆకుపచ్చతాడుకి కట్టి ఉన్న బెండు నీటిలో మునుగుతూ, తేలుతూ ఆడుతోంది. అది చూడగానే కన్నయ్య ముఖం ఆనందంతో వికసించింది. "ఆకుపచ్చతాడంటే - అన్నింటిలోకీ పొడుగెక్కువ గాలమది. అంత లోతులోని గాలాన్ని చేప తగులుకుందంటే అది పెద్దచేపే అయ్యి ఉంటుంది. కొద్దిగా ఆలీశమైనా, ఇక నా పంట పండినట్లే" అనుకుంటూ, మురిసిపోతూ చేప గాలానికి చిక్కుకునే సమయం కోసం ఎదురుచూడసాగాడు.

ఆ చేపను గాలానికి కట్టిన తోలల దండలు ఆకర్షించాయి. వాటిని తినే ప్రయత్నంలో ఉంది అది. ఈ మాటు ఆ చేప గాలానికి కట్టిన ఎరను గట్టిగా లాగింది కాబోలు బెండు నీటిలో మునిగింది. ఆ తరవాత చాలాసేపటివరకూ అంతా నిశ్శబ్దం! ఎక్కడా ఏ చలనమూ లేదు. ఉన్నబడంగా కాలం స్తంభించి పోయినట్లనిపించింది కన్నయ్యకు. ఆశా నిరాశలమధ్య దోబూచులాడుతున్న మనసు ఉగ్గబట్టుకుని మౌనంగా చేప పోలకువ కోసం ఎదురు చూడసాగాడు. అంతలోనే ఆకుపచ్చ తాడు కదలడంతో అతని హృదయం తేలికపడింది, చేప ఇంకా అక్కడే ఉoదని తెలిసింది.

కన్నయ్య గాలానికి కట్టినతాడు చేతితో పట్టుకుని పడవలో నిలబడి ఉన్నాడు. మరికొంతసేపట్లో అతనికి తాడు స్పర్శనుబట్టి చేప గాలాన్ని మింగిందని తెలిసింది. అంతేకాదు, కొంచెం సుమారుగా చేప పరిమాణం కూడా అవగతమయ్యింది. అంతలో తాడు లాగినట్లయింది. వెంటనే తాడు చుట్టిన బండిని రాట్నానికి తగిలించాడు కన్నయ్య, తాడు వేగంగా విప్పుకోడం మొదలుపెట్టింది.

ఎరతోపాటుగా గాలాన్నికూడా మింగింది చేప. గాలం గొంతుకులో గుచ్చుకోడంతో దానికి నెప్పి పుట్టింది. తనకు వచ్చిన ఆపదనుండి శీఘ్రంగా తప్పిoచుకుపోవడంకోసo ఆ చేప వేగంగా ఈదుకుంటూ పారిపోతోంది.  కాని మృత్యువు తనను వెన్నంటే వస్తోందన్నది దానికి తెలియదు పాపం! అది పడుతున్న ఆరాటం పైనున్న బండి తిరుగుతున్న వేగంలో తెలుస్తోంది.

చూస్తూండగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఈదురుగాలి మొదలయ్యింది. ఆకాశం మేఘావృతమై ఉంది. అలల ఎత్తు పెరిగింది. దూరంగా ఎక్కడో ఆకాశం ఉరిమింది. వెన్నెలకు మేఘాలు అడ్డురావడంతో చీకటి అలముకుంది. ఇంక కొద్దిసేపటిలో వాన మొదలవ్వవచ్చు - అన్నట్లుగా ఉంది వాతావరణం. మసక మసకగా కనిపిస్తున్నాయి పరిసరాలు.

బండికి ఉన్న తాడు అయిపోవచ్చింది. తక్షణం, తాను అదనంగా తెచ్చిన తాడును ఆ తాడుకి ముడివేశాడు కన్నయ్య. చేప ఈదడం ఆపి, మునగడం మొదలుపెట్టింది. రాటం క్షణం సేపు ఆగింది. మళ్ళీ అంతలోనే తిరగడం మొదలుపెట్టింది. ఆ తాడు కూడా అయిపోవచ్చింది. కన్నయ్య తన చేతిలోని తాడును బిగించి పట్టుకున్నాడు.

తాడు ఒదులయింది, చేప మునగడం ఆపి, పైకి లేవడం మొదలుపెట్టింది. వదులౌతున్న తాడును చిక్కుపడని విధంగా దోనేలోకి తోడుకోడం మొదలుపెట్టాడు కన్నయ్య. కొంతదూరం అలా పైకిలేచి, ఆ చేప ఏమనుకుందోగాని, మళ్ళీ ముక్కుకు సూటిగా ఈదసాగింది. ఎలాగైనా దాన్ని ఆపాలనుకున్న కన్నయ్య ఈమాటు తాడును వదలకుండా, బిగించి పట్టుకున్నాడు. కాని చేప ఆగలేదు. నీటిలో చేప, నీటిపైన పడవ ఒకే దిక్కుగా ప్రయాణం చెయ్యసాగాయి.

చేప బలానికి అబ్బురపడ్డాడు కన్నయ్య. అది ఎంత పెద్ద చేపో చూడాలన్న కుతూహలం క్షణక్షణానికి పెరిగిపోతోoది అతనికి. దానిని చూసి, అది తనకు ఏపాటి సంపదను తెస్తుందో అంచనా వెయ్యాలనుకున్నాడు. కాని ఆ చేప బలం చూస్తూంటే అది ఇప్పట్లో తనకు లొంగేలా లేదు. దాని వరస చూస్తూంటే అది తననిలా ఏ దూరతీరానికి లాక్కుని పోతుందోనని భయం పుట్టిoది కన్నయ్యకు.

గాలం సరిగా చేప కంఠంలోకానక దిగిందంటే, తాడు లాగగానే చేప ఆగుతుంది. కానీ ఒక్కొక్కప్పుడు, ఆ గాలం గొంతుకులో గాయం చేసి ఊడిపోయే ప్రమాదం కూడా ఉంది. అలా జరిగితే ఇంతవరకూ పడిన శ్రమంతా వృధా. గాలం ఎంత లోతుకు దిగింది అన్నది, ఆచేప ఎరను మింగిన తీరుమీద ఆధారపడి ఉంటుంది. అది ఆ జాలరి అదృష్టాన్నిబట్టి ఉంటుంది.

తెల్లవారబోతోందన్న సూచనగా తూరుపు దిక్కు రవంత తెల్లనై కనిపించింది. కన్నయ్యకు నెమ్మదిగా బడలిక తెలుస్తోంది. "ఈసారికి పెద్దరేవులో వేట పడవలు బయలుదేరి ఉంటాయి - అనుకున్నాడు. వెంటనే మరో ఆలోచన వచ్చింది అతనికి, "ఆల్లని చూసి శానా రోజులైనట్లున్నాది, మాయమ్మా, పిల్లలూ నిద్రపోతూ ఉండి ఉంటారు. మిదం రేతిరి కాడ రాధమ్మకి కునుకు పట్టిందో లేదంటే నన్ను తలుసుకుంటా నిద్ధారామానుకుని కూకుందో!" అనుకున్నాడు.

చెప్పాను ఆపాలంటే తాడిపట్టి లాగాక తప్పదు. ఇలా ఎంతదూరమని ఈ ప్రయాణము? ఏదైతే అది కానిమ్మని కన్నయ్య గాలాపుతాడు గట్టిగా పట్టుకుని లాగాడు. వెంటనే చేప ఆగింది. తాడు బిగువు సడలించగానే - ఈమాటు పరుగుపందెం మాని, చేప పైకి లేవడం మొదలుపెట్టింది. కొంతసేపటికి అంతవరకూ మునిగిఉన్న బెండు పైకితెలింది. మరు క్షణంలో చేప నీడలా కనిపించింది. దానిని చూసి దడుసుకున్నట్లై, "అయ్యబాబోయ్ ఎంత పెద్దసేపో" అంటూ పెద్దగా కేకపెట్టాడు.

సరిగా అప్పుడే రివ్వున వీచిందిగాలి, చివ్వున లేచింది కెరటం వాన ఝల్లున కురవడం మొదలెట్టింది. కెరటం విసురుకి పడవ పల్టీ వెయ్యకుండా ఆపే ప్రయత్నంలో చేపని పెద్దగా పట్టించుకోడానికినికి కుదరలేదు కన్నయ్యకి.

.... సశేషం ....

Posted in September 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!