Menu Close
anna-chelleli-gattu

ధారావాహిక నవల

చేపల వేటకు వెళ్లకుండా ఒడ్డుమీదనే ఉండిపోయిన జనం కూడా కన్నయ్యను పలకరించకుండానే  ఎవరిదారినవాళ్లు వెళ్లిపోయారు. నెమ్మదిగా రేవు మొత్తం నిర్మానుష్యమైపోయింది, కన్నయ్య అక్కడ ఏకాకిగా మిగిలిపోయాడు. అతని చూపులు మాత్రం వానరాజు పడవను కనుచూపు మేర వరకూ వెంబడించాయి. పడవ దూరమైనకొద్దీ చిన్నదిగా కనిపించి, క్రమంగా ఇంకా ఇంకా చిన్నదై చివరకు చుక్కలా మారి అంతర్ధానమై పోయింది. అలా ఆ పడవ కనుమరుగు అయ్యాక కన్నయ్యకి జగమంతా శూన్యంలా అనిపించింది. సిగ్గుతో అవమానంతో అతని హృదయం ఘుర్ణిల్లుతోoది. అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. చెదిరిన హృదయాన్ని చిక్కబట్టుకునీ ప్రయత్నంలో తోటలవెంట, దొడ్ల వెంట గమ్యమన్నది తెలియకుండా తిరగసాగాడు కన్నయ్య.

"చిన్ననాయనా!" అన్న రాధమ్మ పిలుపు విని కంగారుగా బయటకు వచ్చింది రాగమ్మ.  కానీ, వెంటనే రాధమ్మను పలకరించకుండా, మరుగుకోసం కట్టిన తడిక చాటుకి వెళ్ళిపోయింది. తెల్లబోయింది రాధమ్మ.

అంతలో తడిక చాటునుండి లోగొంతుకతో " రాదమ్మా" అంటూ పిలిచింది రాగమ్మ.

రాగమ్మ ప్రవర్తన వింతగా తోచింది రాధమ్మకి. అయినా ఆమె తాను వచ్చిన పని మర్చిపోలేదు.

"పిన్నీ! చిన్నయ్య వేటనుండి  వచ్చాడా?"

"ఆ యబ్బొచ్చి శానా సేపయ్యింది. బువ్వదిని తొంగుడున్నాడు. ఆ యబ్బితో ఏంపని నీకు?"

"పిన్నీ! కన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. చిన్న నాయనకు ఏమైనా తెలుసేమో కనుక్కుందామని వచ్చినా. కన్నయ్య ఎప్పుడూ ఇలా చేయలేదు."

"ఎవరైనా ఎవరిని గురించైనా ఒక మంచిమాట సెపితే, అది నిజమో, కాదో - అని జనం రకరకాలుగా ఆలోసిత్తారు గాని, అదే సెబ్బరమాటైతే అదే జనం ఛనం కూడా ఆలోసించకుండా సిటుక్కున నమ్మేత్తారు. దున్నపోతు ఈనినాదంటే దూడను కట్టేయ్యమన్నారంట! ఇన్నావా? ఇంక ఈ ముదనట్టపు జనం - ఇదిగో పులి - అంటే, అదిగో తోక - అంటారు! ఆ పట్నంబాబు తన ఎంట నిన్ను పట్నం వచ్చెయ్యమన్నాడంటగా!"

"ఔను, రమ్మన్నాడు! కాని అతడు రమ్మన్నంతమాత్రాన నా భర్తనీ, పిల్లల్నీ విడిచిపెట్టి నేను వెళ్ళిపోతానా ఏమిటి పిన్నీ? అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని, ఇదేనా ఇల్లని, ఇక్కడివాళ్ళని వదిలివచ్చే ఉద్దేశం నాకు లేదని చెప్పి అతన్ని పంపేశా. అది తప్పా?"

"ఆ పట్నపాయనని చూడగానే నువ్వు మొగం దిరిగి పడిపోయావు. నిన్ను కింద పడనీకుండా ఆయబ్బి సటుక్కున పట్టుకుని, దగ్గరగా తీసుకుని సాపమీన పండబెట్టి, నీళ్ళుసల్లి ఉపశారాలు సేసిండు. తెలివివచ్చి నువ్వాయబ్బి భుజాలు తడిమి ఏడ్చినావు. అయ్యి సాలవా ఏంటి, నీ సేత సెంపదెబ్బ తిన్న బేతాళుడికి నీ మీన కచ్ఛ తీర్చుకోడానికి?"

గతుక్కుమంది రాధమ్మ. "అవన్నీ నీకెలా తెలిశాయి  పిన్నీ?" ఆశ్చర్యంగా అడిగింది.

"అమ్మ కూతురో! అంత ఇస్తుబోతున్నావేంటి! మా ముంగిట్లో నిలమడితే శాను, మీ లోగిలంతా సక్కగా గమనించొచ్చు. తలుపు తెరిసి ఉంటే లోపలగూడా ఆపడుద్ది. పరీచ్చ సేసుకో, నీకే తెలుస్తాది."

"పిన్నీ! చాలాయేళ్ల క్రితమ్ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం! కానీ మా నాన్నకది ఇష్టం లేక మాకు పెళ్ళికాలేదు. పైగా దొంగ కేసు బనాయించి అతన్ని జైలుపాలు చేశాడు. శిక్ష నుండి తప్పించుకోవడానికి పారిపోతున్న అతన్ని పోలీసులు కాల్చి చంపేశారని చెప్పాడు నాకు మా నాన్న. దుఃఖం భరించలేక, ఆరాత్రికి రాత్రే నేను వెళ్ళి పడవలకాల్వలో దూకి చనిపోవాలని ప్రయత్నిoచా. కానీ, కాలవలో దూకినప్పుడు, వంతెన స్తంభం కాబోలు తలకి గట్టిగా కొట్టుకోడంతో నాకు స్పృహ పోయింది. తరవాత నువ్వు చెప్పినప్పుడే తెలిసింది - చెత్తకుప్పమీద పడడంతో ములిగిపోకుండా సముద్రం లోకి కొట్టుకొచ్చి, కెరటం నెట్టెయ్యగా మీ ఒడ్డుకి చేరాను. తరవాతి సంగతి నీకు తెలుసున్నదే కదా! అప్పట్లో నేనెవతెనో నాకు తెలియదు.

ఆ తరవాత నాకు ఏ విషయం గుర్తురాకపోడంతో నేను జాలరి కన్నయ్యను పెండ్లాడి, మీలో ఒకరిగా మారాను. మనం లక్ష్మనేశ్వరం వెళ్ళినప్పుడు నాకు గతం గుర్తొచ్చింది. కాని, కాలవలో పడ్డప్పుడే నా గతజన్మ ముగిసిపోయింది. బెస్తోల్ల రాధమ్మగా ఇది నాకు మరో జన్మ! ఈ బతుకు నాకు చాలా ఆనందాన్నిచ్చింది.  దీనినుండి వెనక్కి వెళ్లే పనిలేదు. ఆ పట్నంబాబుకి, తనతో నాకిక ఎసంబంధం లేదనీ, "తన అమ్మా నాన్నలు చెప్పిన పిల్లని పెళ్ళాడి సుఖంగా బ్రతక"మని చెప్పి వెనక్కి పంపేశా. అతనింక ఇటు రాడు. నన్ను నమ్ము పిన్నీ! ఈ రాధమ్మ నీతి తప్పే మనిషి కాదు" అంది రాధమ్మ దీనంగా.

వెంటనే రాగమ్మ, "నామాట కేముందిలే! నేను నమ్ముతా, సరే! నువ్వా బాబుని, నీ పెనిమిటి ఇంటో లేనప్పుడు ఇక్కడికే వచ్చివెళ్లమని సెప్పావని -నీ మీన ప్రెశారం సేత్తున్నాడా పాపిట్టి బేతాళుడు! ఇయ్యే లటివరకు "రాదమ్మ దేవొత" అన్నోళ్లే ఇప్పుడు అదే నోటితో "రాదమ్మ సెడిప" అంటూ "నీ మూలంగా రేవు పరువు పోయినాదని సెప్పి, నీ మీన దుమ్ము సెరిగి పోస్తన్నారంట! "ఎలి" మూలంగా వానరాజు పడవమీన కన్నయ్యకు పనిగూడా పోయిందంట! ఆళ్ళన్న మాటలు ఇనలేక కన్నయ్య మొగాన గంటు ఎట్టుకుని ఏడకో ఎలిపోయాడంట! ఈ సుట్టుపక్కలే ఏడనో తిరుగుతో ఉంటాడు. ఎల్లి నెలుకు. రాదమ్మా ఒక సుబవార్త ఏమిటంటే, కులపోల్లకు ౫౦౦ జరిమానా కడితే సాలు తప్పు ఒప్పైపోద్ది, ఎలి ఎత్తేసి మిమ్మల్ని కులంలో సేరుచుకుంటారు."

"ఏమిటి! డబ్బుతో చేసిన పాపాలు కడుక్కుపోతాయా!" అని మనసులో అనుకుని రాధమ్మ ఆశ్చర్యపోయింది.

"ఆ డబ్బులు ఏమిచేస్తారు పిన్నీ?"

"ఏముంది! కులపెద్దలంతా సేరి,విందు సేసుకుని, తాగి తందనాలాడతారు. అంతే !" నిర్లిప్తంగా అంది రాగమ్మ.

రాధమ్మ మళ్ళీ ఎదో అనబోతే వెంటనే, "ఇక సాలు రాదమ్మా! మనం ఇలా మాటాడుకోడం ఎవరైనా సూత్తే,  "ఎలి" మాకూ వస్తది. ఇక యెల్లిపో, నీకు పున్నెముంటాది."

ఒకసారి విప్పారిన కళ్ళతో రాగమ్మవైపు వెర్రిగా చూసి, మాటాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది రాధమ్మ.

###############

మరికొద్ది సేపట్లో సూర్యుడు అస్తమించ బోతున్నాడు. తూర్పు దిక్కున ఆకాశం లో సంధ్యారాగం అలముకొంది. కన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. రాధమ్మ అతని రాకకోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుతెన్నులు చూస్తోంది. ఊరికే ఉండలేక, పిల్లల్ని అత్తగారికి అప్పగించి, బయలుదేరి; చుట్టుపక్కల ఉన్న తోటలూ, దొడ్లూ కన్నయ్య కోసం వెతకసాగింది. ఒకవేళ సాయంకాలపు వేటకై సముద్రం మీదకు వెళ్లాడేమోనని తుమ్మలరేవుకి వెళ్లి చూసింది. అక్కడ కన్నయ్య వాడుకునే దోనె కెరటాలకు దూరంగా ఇసుకలో బోర్లించి ఉంది.

"కన్నయ్య ఏమైపోయాడు" అనుకునేసరికి రాధమ్మకు గుండెల్లో బండపడి నట్లయ్యిoది. వల్లమాలిన దుఃఖంతో మనసు బరువెక్కింది. అడుగులు తడబడుతుండగా, పల్లేరుకాయలు కాళ్ళలో గుచ్చుకుంటున్నా లెక్కజేయకుండా దగ్గరదారిన తాళ్ళరేవుకి బయలుదేరింది. చుట్టుపక్కల అంతా గాలించి చూడడం అయ్యింది. ఇక మిగిలి ఉన్నది దూరంగా ఉన్న తాళ్ళరేవు ఒక్కటే!

మనోవేదనతో రాధమ్మ నుదుట పట్టిన చెమటలో కరిగిన కుంకుమ ముక్కు మీదికంతా కారింది. కన్నీటితో కలిసి దిగజారిన కాటుక ఆమె చెంపలకు నల్లరంగు పులిమింది. సముద్రపుగాలికి ఎగురుతున్న ముంగురులు, ఆమె చెక్కిళ్ళపై ధారలుగా కారుతున్న కన్నీటికి అతుక్కునిపోయాయి. కాని ఆమె అవేమీ పట్టించుకునే స్తితిలో లేదు. చీర కుచ్చిల్లు కాళ్ళకు బందాలుపడుతున్నా కూడా, పరుగులాంటి నడకతో డొంకలకడ్డంపడి వచ్చి, తాటి తోపును చేరుకుంది రాధమ్మ.

కన్నయ్య కోసం తోటంతా కలయజూస్తున్న రాధమ్మకు దూరాన సముద్రపు ఒడ్డున నున్న ఇసుకలో, తలపై చెయ్యి ఉంచుకుని కూర్చుని ఉన్న మానవాకారం ఒకటి కనిపించింది. వెంటనే కన్నయ్యను గుర్తుపట్టిన రాధమ్మ "కన్నయ్యా!" అని ఆక్రోశిస్తూ అతనివైపుగా పరుగెత్తింది.

ఆ పిలుపు విన్న కన్నయ్య ఉలికిపాటుతో లేచి నిలబడ్డాడు. నిరాశా నిస్పృహలతో నిండిన అతని మనసుకు హఠాత్తుగా కుటుంబ బాధ్యత తలపుకువచ్చింది. తనకై ఎదురుచూస్తున్న తల్లి, భార్య, పిల్లలు కళ్ళకి కట్టారు. వెంటనే అతనికి వాళ్ళంతా తనకోసం పొద్దుటి నుండీ ఎంత దిగులు పడ్డారో - అన్న ఆలోచన వచ్చి, అతడు రాధమ్మ వైపు తిరిగి, ఆమెను చేరుకోవాలన్న కోరికతో తనుకూడా పరుగుపెట్టాడు ఆమె వైపుగా.

ఇద్దరూ ఒక చోటికి చేరుకున్నారు, "ఇన్నావా రాదమ్మా! కులపోల్లు మనల్ని ఎలేశారు. నిన్ను ఒగ్గేస్తేగాని నన్ను కులంలో సేర్చుకోరంట" అని చెప్పి, ఆమెను కౌగిలించుకుని  భోరున ఏడ్చాడు కన్నయ్య. పరస్పర సానుభూతితో, గాఢ పరిష్వంగంలో ఇరువురూ - ఒకరినొకరు ఓదార్చుకున్నారు. వాళ్ళలా ఆ కౌగిలిలో ఎంతసేపున్నారో వాళ్ళకే తెలియదు!

ఆ రాత్రి యధాప్రకారం వంట చేసి అత్తగారికీ పిల్లలకీ భోజనాలు పెట్టింది రాధమ్మ. కొంతసేపు కాలక్షేపంగా అందరూ ఒకేచోట కూర్చుని కబుర్లు చెప్పుకున్నాక, ముసలి ఎల్లమ్మ, పిల్లలూ నిద్రపోయారు. కాని, చాలా రాత్రి గడిచేవరకూ రాధమ్మా కన్నయ్యా నిద్రపోలేకపోయారు. కొంతసేపు మౌనంగా గడిచిపోయాక అంది రాధమ్మ, "నీకు ఏది సబవనిపిస్తోందో చెప్పు కన్నయ్యా! నువ్వు ఉండమంటే ఉంటా, ఒద్దంటే వెళ్ళిపోతా. నువ్వు ఏమి చెపితే అదే చేస్తా."

ఆశ్చర్యంగా చూశాడు కన్నయ్య రాధమ్మ వైపుగా, "ఎక్కడకి పోతావు రాదమ్మా! ఆ యబ్బి కాడికేనా?"

"ఎంతమాత్రం కాదు. ఎప్పుడో అ బంధం తెగిపోయింది. ఇప్పుడు అతడు నాకేమీ కాడు. నా పుట్టింటికి వెళ్ళాలనే కోరిక కూడా నాకు లేదు. అసలు వెనక్కి వెళ్ళే ఆలోచనే నాకు లేదు."

"మరైతే నన్నూ, మాయమ్మనూ, పసోల్లనూ ఒగ్గేసి ఏడకు పోతావు రాధమ్మా?"

"ఏమో మరి! ఈ మాటకు నా దగ్గర జవాబు లేదు. నువ్వు పొమ్మంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతా... అదిమాత్రం ఖాయం!"

"నువ్వేడకీ పోవోద్దె రాదమ్మా! నువ్వు లేకుండా మేమెలా బ్రతకగలమని ఆమాట అంటున్నావు? ఈ కన్నయ్య ప్రానం రాధమ్మ! రాధమ్మ లేపోతె కన్నయ్య ఉండడు. ఒక మాట ఒకపాలి సేవితే సాలదా ఏoటి?"

"నామాటా అదే! కన్నయ్య లేకపోతే రాధమ్మ ఉండదు. ఐతే, కులతప్పుకి జరిమానాగా ఐదొందలు కడితే చాలుట కదా? అది కట్టేద్దామా? మనకు వెలి తప్పిపోతుంది!"

"ఇసీ! ఆ జరిమానా కడితే - "నా రాధమ్మ సెడిపే"నని, నేను ఒప్పుకున్నట్లే ఔతాదిగందా! అంతకన్నా సచ్చినా మేలే! ఆ పనిమాత్తరం నేను సెయ్యను గాక సెయ్యను. నేను ఛత్రియున్నే రాదమ్మా! అగ్నికుల ఛత్రియున్ని! ఎన్ని కట్టాలువచ్చినా బరిస్తాను గాని అలాంటి కంత్రీ పనులు మాత్రం నా వల్లగావు."

"ఔను! నా కన్నయ్య నిజమైన క్షత్రియుడు! విజయమో, వీరస్వర్గమో - అంతేగాని తప్పుదారి పట్టడు. రాధమ్మ నీతి తప్పే మనిషి కాదన్న నమ్మకం అతనికి ఉంది, అది చాలు నాకు." అనుకుంది రాధమ్మ మనసులో. ఆమె ముఖంలో సంతోషం తళుక్కున మెరిసింది.

రాధమ్మ ఒడిలో తలవుంచి పడుకుని, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు కన్నయ్య, "రాధమ్మా! నువ్వు గీని నా ఎనకాతలేవుండి బుజం కాస్తేశాను, నేను సముద్దరాన్ని కూడా అడ్డంగా ఈదేసి ఆవలి ఒడ్డుకి సేరుకోగలను! అలనాడు సీతామ్మోరికీ నిందొచ్చినాది, ఇయ్యేల నా రాదమ్మకీ నిందొచ్చినాది. కాని ఈ కన్నయ్య ఆ శీరామసెందురుడు కాడు. ఆయిన మందికోసం బతికాడు, ఈడు మంచికోసం బతుకుతాడు. ఈ ఎలి ఎన్నాళ్ళుoటాదో సూత్తా! అంతవరకూ నేను ఒంటరి పోరాటం సేత్తూనే ఉంటా. ఎంత కట్టమైనా వోరుసుకుని నా కుటుంబంకోసం బతుకుతా. కుదరకపోతే అందరం ఒకేపాలి సచ్చిపోదారి. అంతేగాని ఆ పాపిట్టి నాయాలు, బేతాలుడున్నాడే ... ఆడికి మాత్తరం లొంగేది లేదు" అన్నాడు.

"నా కన్నయ్య కంటే గొప్ప ధీరోదాత్తనాయకుడు (హీరో) ఎవ్వరున్నారుట!" అనుకుంది రాధమ్మ మురిపెంగా,  కన్నయ్య చేతిని గట్టిగా పట్టుకుని, "కన్నయ్యా! నువ్వు ఒంటరివి ఎప్పుడూ కావు. నీ వెంటనే ఉంటుంది నీ రాదమ్మ - అన్నది ఎప్పుడూ మరిచిపోకు సుమీ" అంది.

ఒక నిర్ణయానికి రాగానే ఇద్దరి మనసులూ తెలికయ్యాయి. అప్పుడు ఒకరి నొకళ్ళు హత్తుకుని ప్రశాంతంగా నిద్రపోయారు ఇద్దరూ. అప్పటికి చాలారాత్రి గడిచిపోయింది.

అది మొదలు ఇరుగుపొరుగులవాళ్ళు కన్నయ్య కుటుంబాన్ని పలకరించడం మాటాడడం మానేశారు. ఎల్లమ్మతో ఉబుసుపోక కబుర్లు చెప్పీవారెవరూ లేకపోవడంతో ఎల్లమ్మకు రోజు గడవడం కష్టంగా ఉoది. రాధమ్మాకన్నయ్యలు మాత్రం తమ సమయాన్నంతా బ్రతుకుతెరువు సంపాదించుకోడం కోసమే వినియోగిస్తున్నారు. వానరాజు వేటపడవ మీది పని పోవడంతో, తన దోనె పై రెండుపూటలా సముద్రం మీదికి వెళ్లి; గాలం వేసీ, డోకి వలతో దేవీ కన్నయ్య చేపలని పట్టి తెస్తున్నాడు. వాటిని ఊరిలోని మిలటరీ హోటళ్ళలో ఇచ్చి, ఆ వచ్చిన డబ్బుతో గుట్టుగా సంసారం గడుపుతున్నాడు. రాధమ్మ కూడా కన్నయ్య తెచ్చిన డబ్బును నేర్పుగా, పొదుపుగా ఖర్చుచేస్తూ, ఏ ఇబ్బందీ తెలియకుండా ఇల్లు గడుపుతోంది. అంతేకాదు, వేడి నీళ్ళకు చన్నీళ్ళు సాయం - అన్నట్లు తనుకూడా ఇంట్లోనే ఉండి, ఉప్పుచేపలు తయారు చేసీ, తాళ్ళు పేనీ డబ్బు సంపాదించి అతనికి ఆసరాగా ఉంటోoది. వెలివల్ల ఒంటరివాడైన కన్నయ్యకు మరో చెయ్యవసర మొచ్చినప్పుడల్లా తనే చెయ్యాసరా ఔతోంది. ఎల్లమ్మకూడా పరిస్థితిని అర్థం చేసుకుంది. పిల్లలను ఆడిస్తూ, నాన్నికి కథలు చెపుతూ, మనుమలే లోకంగా పొద్దుపుచ్చుతోంది.

దినసరి వెచ్చాలకు దినవారీ కన్నయ్య సంపాదించిన సొమ్ము సరిపోయినా, ముసలమ్మకు నల్లమందు కొనాలన్నా, ఇంట్లో వాళ్ళకెవరికైనా అనారోగ్యం చేస్తే డాక్టర్ కనీ మందులకనీ సొమ్ము కావలసివచ్చినా, రాధమ్మ పొదుపుచేసి, స్వంత పడవ కొనడానికని దాచిన సొమ్ము లోంచి కొంచెం కొంచెం తియ్యక తప్పడం లేదు వాళ్లకి. చీమలు తింటే కొండలు తరుగుతాయి అన్న సామెతను నిజం చేస్తూ, ఆ డబ్బు నెమ్మదిగా తరిగిపోతోంది. అది చూసిన రాధమ్మకి, స్వంత పడవ కొనాలన్న ఆశ సన్నగిల్లడమే కాకుండా, రేపటి రోజు ఎలా గడుస్తుoదా  - అన్న భయం కూడా పట్టుకుంది ఆమెకు.

.... సశేషం ....

Posted in July 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!