Menu Close
anna-chelleli-gattu

ధారావాహిక నవల

ఆ రోజు భర్త వెంట తుమ్మలరేవు వరకూ వెళ్ళి, అతన్ని సాగనంపి తిరిగివచ్చింది రాధమ్మ. ఆ రోజు పర్వదినం కావడంతో రాధమ్మను చూడగానే రామాలయానికని బయలుదేరింది ఎల్లమ్మ. పసిపిల్ల ఉయ్యాలాలో పడుకుని నిద్రపోతోంది. ఎడపిల్లాడు నానీ, ఇంట్లోకీ, బయటికీ తిరుగుతూ ఆడుకుంటున్నాడు. ఇంటికి రాగానే ఉతికి ఆరేసిన బట్టల్ని చాపమీద వేసుకుని మడతలు పెడుతోన్న రాధమ్మ, గుమ్మంలో మోటారు సైకిలు ఆగిన శబ్దం వినిపించి, తమ ఇంటికి మోటారుబైక్ మీద వచ్చేవారెవరని ఆశ్చర్యబోయింది.

పొట్టిగా ఉన్న చూరు క్రిండనుండి తలవంచి లోపలకు వచ్చిన వ్యక్తిని చూసి దిగ్భ్రాంతితో మ్రాన్పడిపోయింది రాధమ్మ. ఈ భూమిపై అసలు లేడనుకున్న వ్యక్తి ఎదురుగా వస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది మరి!

అతడు “అనూ” అంటూ రెండడుగులు ముందుకి వేసి దగ్గరగా వచ్చాడు.

“శీనూ! నువ్వు ... నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నా!” అకస్మాత్తుగా చెలరేగిన భావోద్వేగంతో ఒక్కసారిగా ప్రపంచమంతా అదుపుతప్పి గిరగిరా తిరిగిపోతున్నట్లు అనిపించింది రాధమ్మకు. కళ్ళు తిరిగడంతో ఆమె తూలిపోయింది. వెంటనే అతడు రెండడుగులు ముందుకువేసి, రెండుచేతులా ఆమెను పొదివిపట్టుకుని నెమ్మదిగా చాపమీద పడుకోబెట్టి, గోడ వారగా ఉన్న మంచినీళ్ళ కుండ నుండి నీళ్ళుతెచ్చి, ముఖంపైన జల్లి ఉపచారం చేశాడు. రాధమ్మ నెమ్మదిగా తెప్పరిల్లింది. లేచి “నేను చూస్తున్నది నిజమేనా“ అంటూ, అతని భుజాలమీద చేతులువేసి తడిమి చూసింది రాధమ్మ.

మోటారుబైక్ మీద కన్నయ్య ఇంటికి వచ్చిన వారెవరో చూడడం కోసం భేతాళుడు, అలాంటి మరో నలుగురు “పోరమ్బోకు నాయాళ్ళు” కూడి, నెమ్మదిగా చప్పుడు లేకుండా వచ్చి, చూరుక్రింద దూరి లోనికి తొంగిచూశారు. తమ ధోరణిలో తామున్న శ్రీనివాస్ గాని, రాధమ్మ గాని వాళ్ళని గమనించలేదు.

ముతకగా బొద్దంచుతో ఉన్న నేతచీర కట్టి, గుత్తంగా ఉన్న రవికె తొడిగి, పనికి అడ్డంరాకుండా చీరకుచ్చిళ్లను వెనక్కి విరిచికట్టి, ఒక అతిసాధారణ మహిళలా దుస్తులు ధరించి; మెడలో పసుపుతాడు, నల్లపూసల కుత్తికంటు; నుదుట నయాపైసంత కుంకుమ బొట్టుతో, చేతులకు రంగురంగుల మట్టి గాజులతో, నున్నగా దువ్వి, ముచ్చటముడిగా వేసుకున్న జుట్టుతో- ఒక సాధారణ మరక్కత్తె ముస్తాబులోఉన్న రాధమ్మని చూస్తూంటే శ్రీనివాసుకి కడుపు తరుక్కుపోయింది. తల్లికి దగ్గరలోనే కూర్చుని కాగితం పడవలు చేస్తూ వాటితో ఆడుకుంటున్న నానీ పైకి మళ్ళింది అతని దృష్టి. వాళ్ళని చూసి, “ఎలా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉన్నారు! అంతా దుర్విధి!” మనసులో అనుకున్నాడు బాధగా.

రాధమ్మ చెప్పసాగింది, “నువ్వు బ్రతికే ఉన్నావు కదూ! కాని మా నాన్న, నువ్వు జైలునుండి తప్పించుకు పారిపోతూంటే నిన్ను పోలీసులు “ఎన్కౌంటర్” చేసి చంపేశారని చెప్పాడు. మా నాన్న మాటలు నమ్మాను నేను. మా నాన్నచెప్పిన మనిషి, అంటే – వాళ్ళ బాసుని పెళ్లి చేసుకొని బతికి ఉండేకంటే చావే మేలనిపించింది. జీవితం మీద విరక్తితో కాలువలోపడ్డా. ఎవరో కాలువలో రకరకాల చెత్త పాడేశారు కాబోలు, ఆ చెత్తకుప్ప మీద పడిన నేను  కాలువలోంచి, గోదావరిలోకి, అక్కడనుండి సముద్రంలోకి కొట్టుకొచ్చివుంటా ...  కెరటం ఆ చెత్తకుప్పను, దానితోపాటు, కొనవూపిరితోవున్న నన్ను ఒడ్డుకి నెట్టేసి ఉంటుంది! బెస్తలు, సముద్రపు ఒడ్డున చెత్తకుప్ప పైన శవంలా పడివున్న నన్ను చూసి, ప్రాణం పోలేదని గుర్తించి కాపాడి,  వైద్యం చేయించి బ్రతికించారు. తలకి ఏమి తగిలిందో ఏమోగాని, పెద్ద గాయమయ్యింది. ఆ దెబ్బతో గతాన్ని మరిచిపోయా. ఆసుపత్రినుండి డిశ్చార్జీ ఐన నేను ఎక్కడికి వెళ్ళాలి? అలా - చూడ చుట్టము, మ్రొక్క దైవమూ లేని స్థితిలోనున్న నన్ను కన్నయ్య పెళ్ళిచేసుకుని నాకు దక్షతయ్యాడు. జాలరి కన్నయ్య భార్యగా, ఒక బెస్తపడుచుగా ఏడేళ్లు గడిచిపోయాయి. మధ్యలో ఒకసారి గతం మొత్తం గుర్తుకొచ్చింది. కానీ, నువ్వు బ్రతికి ఉన్నావని తెలిసింది మాత్రం ఇప్పుడే! నువ్వు ఇలా బ్రతికి ఉన్నావంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మాటలతో చెప్పలేను” అంది రాధమ్మ. ఆమె కళ్ళు భావావేశంతో శ్రావణమేఘాలయ్యాయి.

శ్రీను నొచ్చుకున్నాడు. “అనూ! ఏడవకు. కష్టదినాలు గడిచిపోయాయి. ఇంక ఏడవవలసిన పనిలేదు. కళ్ళు తుడిచేసుకో” అంటూ తన జేబులో ఉన్న రుమాలు తీసి ఆమెకు అందివ్వబోయాడు. ఆమె అది తీసుకోలేదు.

రాధమ్మ బొడ్డున దోపుకున్న పైట కొంగు బయటికి తీసి కళ్ళు తుడుచుకుంది. “నిజమే! ఇక ఏడుపెందుకు! ఇంతవరకూ ఎప్పుడూ నాకు అనిపించేది, నామూలంగానే కదా మీ అమ్మా నాన్నలకు అంత దుఃఖం - అని. మీ అమ్మగారి కడుపుచలవ గొప్పది, నువ్వు బయటికి వచ్చేశావు. ఆ సంతోషం చాలు నాకు" అంది రాధమ్మ కళ్ళు తుడుచుకుంటూ.

అంతలో అక్కడకు బంతి కోసం వచ్చిన నానీ వైపు శ్రీనివాసు ప్రేమగా చూశాడు. బంతి తీసుకుని వెళ్ళిపోయాడు నానీ, స్నేహితులతో ఆడుకోడానికి.

అక్కడితో శ్రీనివాస్ నానీ పైనుండి చూపు తిప్పుకుని రాధమ్మ వైపు చూసి, చెప్పసాగాడు, “నువ్వారోజు ఆ వార్త అందించినాక, నా మనసు నిలువలేదు. వెంటనే మీ ఊరు బయలుదేరా. అమ్మా నాన్నా కూడా నన్ను ప్రోత్సహించారు. ఆ సమయంలో మా నాన్నకి జ్వరంగా ఉండడంతో వాళ్ళు నాతోపాటుగా బయలుదేరలేకపోయారు. వెనకాల మంచిరోజు చూసుకు వస్తామని చెప్పమన్నారు. నేను నా “బ్రీఫ్ కేసులో ఒకరోజుకి కావలసిన బట్టలు సద్దుకుని మీ ఊరుకి బయలుదేరా. ఎప్పటిలాగే బస్సు కిక్కిరిసి ఉంది. ఎలాగో చోటు చూసుకుని, పెట్టి పైనున్న రేక్ మీద ఉంచి కూర్చున్నా. మీ ఊరు వచ్చింది, దిగబోతూండగా పోలీసులు నన్ను చుట్టుముట్టారు. నాలో తప్పేమీ లేదుకదా, ఏదో పొరపాటు జరిగివుంటుంది – అనుకుని నేను ధైర్యంగా ఉన్నాను. నా చేతిలోని పెట్టె తీసుకుని, నన్ను “అన్ లాక్” చెయ్యడానికి “కోడ్” ఐనా అడక్కుండానే వాళ్ళు పెట్టి తెరిచారు. దానిలో, నా బట్టలకు బదులుగా వందరూపాయిల నోట్లకట్టలు ఉన్నాయి. వెంటనే అన్నా – ఇది నా పెట్టె కాదని. పోలీసులు నా మాట పట్టించుకోలేదు. అది ఎవరో కావాలని చేసిన కుట్ర – అని నాకు అర్థమయ్యింది. నన్ను అరెస్ట్ చేసి, జైలుపాలు చేశారు. ఎప్పుడూ నువ్వే గుర్తొచ్చేదానివి. జైలు నుండి తప్పించుకోవాలని చాలామాట్లు ప్రయత్నించా, ఫలించలేదు. కానీ నా ప్రయత్నం ఫెయిల్ అయ్యినప్పుడల్లా శిక్ష పెరుగుతూ వచ్చింది."

“శ్రీనూ! నావల్లనే కదా మీకు ఇన్నిబాధలు! ఇదంతా మా నాన్నే చేయించాడనిపిస్తోంది. ఆయనెంతకైనా తగినవాడే” అంది రాధమ్మ నొచ్చుకుంటూ.

“ఔను! అదంతా తనే చేయించినట్లు ఆయనే ఒప్పుకున్నారు. ఈమధ్య దొంగనోట్లు తయారుచేస్తున్న రాకెట్ ఒకదాన్ని మన పోలీసులు పట్టుకున్నారు. అందులోని ముఖ్యుల్లో మీ నాన్నకూడా ఉన్నారు. ఆయనకి జైలు శిక్షవేసి, నేనున్న జైలుకే పంపించారు. అక్కడే ఆయన నాకు అన్నివిషయాలు చెప్పారు. మీ తమ్ముడు ఆ అవమానాన్ని భరించలేక ఎవరికీ చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడుట! తరవాత, అందినంత డబ్బు, విలువైన సామాను, వెండి, బంగారాలూ తీసుకుని మీ పిన్ని కూడా వెళ్ళిపోయిందిట! ఇప్పుడు మీ నాన్నకి పశ్చాత్తాపం మొదలయ్యింది. జైలులో నన్ను కలుసుకుని నా రెండుచేతులూ పట్టుకుని క్షమించమని అడిగారు.”

“ సిగ్గు లేకపోతే సరి! క్షమించదగిన పనులే చేశాడా ఏమిటి మా నాన్న! ఆయనవల్ల ఎన్నిజీవితాలు అగచాట్ల పాలైపోయాయి! ఆ ఉసురుకొట్టదా?”

“ఏమో! నా కంటే ఎంతో పెద్దవయసాయన క్షమించమని ప్రాధేయపడుతూంటే కాదనలేకపోయాను. నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయం కూడా ఆయనే చెప్పారు,  తెలుసా? అంతేకాదు, “నేను నా కూతురుకి తీరని అన్యాయం చేశాను, ఇకనైనా నువ్వు దాని నక్కడనుండి తీసుకువచ్చి, దానికి వెనకటి జీవితాన్నియ్యి” అంటూ నా రెండు చేతులూ పట్టుకుని కన్నీళ్ళతో బ్రతిమాలారు. అంతేకాదు, ఆపైన, నన్ను దొంగనోట్లకేసులో ఇరికించింది ఆయనేనని పోలీసులదగ్గర తప్పు ఒప్పుకుని, కేసు “విత్ డ్రా” చేసుకుని, నేను నిర్దోషినని చెప్పి నన్ను విడుదల చేయించారు. ఆయన మొదట్లోనే కొంచెం సవ్యంగా ఆలోచించి ఉంటే ఎంతో బాగుండేది. మన బ్రతుకులు ఇలా కుక్కలు చింపిన విస్తరిలా, చీకిరి బాకిరిగా తయారు చేసింది ఆయనేకదా!”

“నేను మా నాన్నాకు పడిన జైలు శిక్షను గురించి ఏమీ బాధపడటంలేదు. చేసుకున్నవాళ్ళకు చేసుకున్నది అనుభవించక తప్పదు. మా తమ్ముడి గురించే బెంగగా ఉంది నాకు” అంటూ కళ్ళు తుడుచుకుంది రాధమ్మ.

"మీ తమ్ముణ్ణి గురించి నువ్వు అసలు బెంగపెట్టుకోవలసింది లేదు, అతడేమీ చిన్న పిల్లాడు కాడు. పైగా బాగా చదువుకున్నవాడు. మంచి ఉద్యోగం చూసుకుని చక్కగా స్థిరపడే శక్తి ఉన్నవాడు. అతని గురించి నువ్వేం దిగులుపడకు. ఇక నా సంగతి - నాకు విధించిన శిక్షాకాలం పూర్తయ్యి, నేను విడుదలయ్యే సమయం దగ్గరకొచ్చింది. ఒక వారం – పదిరోజుల్లో ఎలాగా విడుదలై బయటికి వచ్చేసే ఉండే వాడిని.  కానీ మీ నాన్న నలుగురిముందు నేను నిర్దోషినని చెప్పి, తను చేసిన కుట్ర వల్లనే నేను జైలుపాలయ్యానని ఒప్పుకొని, కేసు వెనక్కి తీసుకోడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. నేను నిర్దోషినని రుజువయ్యింది. ఇది తెలుసా నీకు, నేను దోషినంటే మా ఊరివాళ్ళెవరూ నమ్మలేదుట! నిష్కారణంగా మా అమ్మానాన్నలకు వచ్చిన కష్టానికి సానుభూతిగా ఊళ్ళోవాళ్ళే ఈ ఏడు సంవత్సరాలు వాళ్లకి అండగా నిలబడ్డారుట!"

“నన్ను క్షమించు శ్రీనూ! ఇన్నాళ్లూ నా మూలంగా నువ్వు చాలా కష్టాలు పడ్డావు, ఇకనైనా ఒక ఇంటివాడివై మీవాళ్ళని సంతోషపెట్టు.”

“అదే అనుకుంటున్నాను నేను కూడా. ఇన్నాళ్ళూ నాకోసం ఎదురు చూసిన నా తల్లిదండ్రులు ఇప్పుడు తమ మనుమడికోసం ఎదురుచూస్తున్నారు, తెలుసా?”

అంతలో నానీ మళ్ళీ వచ్చాడు. వాడిని శ్రీనివాసు పైకి లేపి, చేరదీసుకుని ముద్దుపెట్టుకుని క్రిందకు దింపాడు. ఒక్క క్షణం ఆ కొత్తమనిషిని ఆశ్చర్యంగా చూసి, నానీ ఆడుకోడానికి బయటికి వెళ్ళిపోయాడు.

రాధమ్మకు శ్రీనివాసు మనసు తెలిసినట్లయ్యింది. వెంటనే, “నువ్వు ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా నీ తల్లితండ్రులకు నచ్చిన అమ్మాయిని పెళ్ళాడి సుఖంగా ఉండు” అంది.

“అదేం మాట! నానీకి నాన్న వద్దా?”

“నన్ను మన్నించు శ్రీనూ! నానీ నీ బిడ్డకాడు. వంతెన మీదనుండి కాలవలో దూకినప్పుడు ఏం దెబ్బతగిలిందో ఏమో, నాకు అబార్షనయ్యిపోయింది. నానీ కన్నయ్య కొడుకు.”

కొంతసేపు అవాక్కై ఉండిపోయాడు శ్రీనివాసు. మరికొంతసేపటికి తెప్పరిల్లి, “ఇన్నాళ్ళూ ఇక్కడ నువ్వు, జైలులో నేను పడిన కష్టాలు చాలు. ఎప్పటికీ ఇలాగే బ్రతకాల్సిన పనిలేదు, ఇకనుండీ మంచి జీవితం ప్రారంభిద్దాము. ఈ గలీజు, ఈ ఉప్పుచేపల గబ్బు భరిస్తూ నువ్వు ఇక్కడ ఉండాల్సిన పనిలేదు. అనూ! నేను నిన్నిలా చూడలేకపోతున్నాను” అన్నాడు.

రాధమ్మ నవ్వింది. “నువ్వు మొగలిపువ్వుని కోసుకోవాలనుకుంటే, మొగలి పొదకున్న ముళ్ళని పట్టించుకుంటావా? కన్నయ్య చాలా మంచివాడు. తన పెళ్ళికోసమని దాచుకున్న సొమ్ము మొత్తం నా వైద్యానికి ఖర్చుపెట్టి, చావుకి దగ్గరైన నన్ను కాపాడి నా ప్రాణం నిలబెట్టినవాడు. గతాన్ని మర్చిపోయి అనాధగా రోడ్డున పడ్డ నన్ను తన ఇల్లాలిని చేసుకుని, సంఘంలో నాకో స్థానాన్ని కల్పించినవాడు. పోలీసు కేసు కాకూడదని, తన కూతురు పేరు నాకిచ్చి, తాను నాకు తల్లినని చెప్పుకున్నామె నాకిచ్చిన పేరు రాధమ్మ. అప్పటినుండీ నేను ఒక మరక్కత్తెగా, బెస్తోళ్ళ రాధమ్మగా, జాలరి కన్నయ్యకు భార్యగా బ్రతుకుతున్నాను. ముసలి అత్తగారు భర్త, ఇద్దరు పిల్లలు , నేను – ఇది మా సంసారం.“

“అనూ" ఆర్తితో పిలిచాడు శ్రీను. “నేను మనసారా నిన్ను ప్రేమించాను. ఈ ఏడు సంవత్సరాలూ జైల్లో నిన్ను మనసులో ఉంచుకునే జీవించాను. ఇప్పుడు కూడా ఇంకా నా ప్రేమ అలాగే ఉంది, ఏమీ మారలేదు. నిన్ను నిన్నుగా నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నా. నీకు భర్తగా, నీ బిడ్డలకు తండ్రిగా నీకొక మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నా. నీ పూర్వ స్థితి నీకు రావాలన్నదే నా కోరిక కూడా. గతాన్ని మరచిపోయి హాయిగా బ్రతుకుదాము. మీ నాన్న కోరింది కూడా అదే!“

రాధమ్మ హిస్టీరియా వచ్చినదానిలా వెర్రిగా నవ్వి అంది,” మంచి చెడ్డలన్నవి మన మనసులోని ఆలోచనలని బట్టి ఉంటాయి. ఎక్కడి జనం అక్కడ సుఖంగానే బ్రతుకుతున్నారు. సంతృప్తిని మించిన సంతోషాన్నిచ్చేది ఏదీ లేదు. ఇక మా నాన్న కోరికంటావా – ఆయన మంచి చేయాలని తలపెట్టే వేళకు అది మంచి అవ్వదు, చెడే ఔతుంది. ఆయన పుట్టుకే అంత! కానీ, శ్రీనూ, నీకు ఇలాంటి ఆలోచన రాకూడదు.“

“అంటే నువ్వు నాతో రావా?” భవిష్యత్తులో తాను అనూరాధతో కలిసి జీవించబోయే జీవితాన్ని గురించి తాను ఊహల్లో నిర్మించుకున్న ఆశాసౌధాలన్నీ క్షణంలో గాలిమేడలై కూలిపోగా నీరసపడిపోయాడు శ్రీనివాసు.

“శ్రీనూ! అలా అనే ముందు కొంచెం ఆలోచించు, నీకే అర్థమౌతుంది. నా మాటవిని నన్ను మర్చిపో. మన దురదృష్టం మా నాన్న రూపంలో మనల్ని ఎప్పుడో విడదీసింది. నే నిప్పుడు జాలరి కన్నయ్య భార్యను, ఇద్దరు బిడ్డల తల్లిని. బెస్తోళ్ళ “రాధమ్మ”ని! నీకు ఏమీ కానిదాన్ని. తల్లిగా మారిన ఏ స్త్రీ కూడా తనను గురించి తాను ఆలోచించుకోకూడదు. ఆమె ప్రతి ఆలోచనలోనూ బిడ్డలకు పాలుంటుంది. నాపై ఆధారపడి బ్రతికే పసిమొగ్గల్లాంటి పిల్లల్ని, నేనే ప్రాణం అనుకునే నా పెనిమిటి కన్నయ్యను, కాటికి కాళ్ళుచాచుకుని ఉన్న నా ముసలి అత్తగారిని వదలి నేను ఎక్కడికీ రాను, రాలేను. గతాన్ని పునరుద్ధరించడం కోసం, ప్రస్తుతాన్ని బలిపెట్టలేను. నన్ను క్షమించి సరిగా అర్థం చేసుకో!”

ఆమె కంఠంలో ధ్వనించిన స్థిరనిశ్చయానికి ఇక మాటాడలేకపోయాడు శ్రీనివాసు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. చివరిమాటగా, “ఇదే నీ తుది నిర్ణయం అంటావా” అంటూ ఆక్రోశించాడు.

“ఔను, అదే నా తుది నిర్ణయం. త్వరలో నువ్వు నీకు తగిన అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, నీ తల్లిదండ్రులని సంతోషపెట్టు. అది నీ ధర్మం. నేనిక్కడేదో కష్టపడిపోతున్నాననుకుని బాధపడకు. ఎంచుకున్న దారిలో శ్రమిస్తూ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. నువ్వుకూడా పరిస్థితుల్ని అర్థం చేసుకుని తీరైన దారిని వెతుక్కుని సుఖంగా బ్రతుకు. నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. గతం మనిద్దరికీ కూడా తలుచుకోదగింది కాదు. దాన్ని నువ్వు మరిచిపోవాలి."

“అనూరాధా!” ఆర్తితో పిలిచాడు శ్రీనివాస్.

“శ్రీనూ! నీ అనూరాధ ఇప్పుడు లేదు. ఏనాడు కాలవలో దూకిందో ఆనాడే ఆమె చచ్చిపోయింది. నీ ఎదుట ఇప్పుడున్నది నీ అనూరాధ కాదు, "బెస్తోల్ల రాధమ్మ", జాలరి కన్నయ్యకు భార్య! ఈమె నీకు ఏమీ కాదు. మా నాన్న అడిగితే ఈ మాటే చెప్పు. ఏనాడు జరగవలసిన పనులు ఆనాడు జరిగినప్పుడే అందగిస్తాయిగాని, నువ్వు కోరుకున్నప్పుడు కాదు.”

“ఇక అంతేనా?” బేలగా అడిగాడు శ్రీనివాసు.

“అంతే! ఇక ఎప్పటికీ అంతే! మన మిద్దరమూ ఒకరికొకరం శ్రేయోభిలాషులం, మన బంధమిక ముమ్మాటికీ ఇంతే!"

ఇంక సెలవు తీసుకోవలసిన సమయం వచ్చేసిందని అర్ధమయ్యింది శ్రీనివాసుకి. "సరే మరి ... ఇక వెడతాను అనూ" అంటూ వెనుదిరిగాడు. అతనిని సాగనంపడానికి వెంట గుమ్మందాకా వచ్చింది రాధమ్మ.

వాళ్ళు బయటకు వస్తారని పసికట్టి, చూరుక్రింద పొంచివుండి, వాళ్ళ మాటలు వింటున్న జనాన్ని భేతాళుడు గమ్మున చాటుకు తప్పించాడు..

బయటికి వచ్చిన శ్రీనివాసు బైక్ దగ్గరకు నడిచాడు. "ఇక సెలవు అనూ" అన్నాడు.

"ఇక ఎప్పటికీ సెలవు శ్రీనూ! ఎప్పుడైనా కాంచన గాని నన్ను తలపెడితే, నా గురించి ఏమీ చెప్పకు సుమీ, విని అది తట్టుకోలేదు!"

బైకు స్టార్టుచేసి వెనక్కితిరిగి చూశాడు శ్రీనివాసు, "ఇదే బహుశః అనూరాధకూ నాకు మధ్య ఆఖరి చూపులు" అనుకున్నాడు. బరువెక్కిన హృదయాన్ని పదిలపరచుకుంటూ అతడు బైక్ నడుపుకుని  వెళ్ళిపోయాడు.

కనుచూపుకి అందినంతమేర అతన్ని చూపులతోనే సాగనంపి ఇంట్లోకి నడిచింది "బెస్తోళ్ళ రాధమ్మ." తీవ్రమైన మనో వేదనతో ఆమెలోని బింకమంతా సడలిపోగా నిస్త్రాణగా నట్టింట చతికిలబడిపోయింది.

xxxxxx xxxxxx xxxxxx

చూరు క్రింద, గోడవారగా చేరి లోపలనుండి వినిపించే మాటలు వినాలనుకున్నవారికి, ఇంగ్లీషు తెలుగు కలిపి పట్నం యాసతో లోపలివాళ్ళు మాటాడుకున్న మాటలు సరిగా అర్థం కాలేదు. తెల్లమొహం వేసుకుని భేతాళునివైపు చూశారు వాళ్ళు. కన్నయ్యా రాధమ్మలమీద తన కసితీరేలా దెబ్బతియ్యడానికి ఇదే సరైన అదును అనుకున్నాడు భేతాళుడు. ఆయాచితంగా వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు వాడు.

"మీకేం తెలవలేదా? సరే! నే సెవుతా ఇనుకోండి.! నేను కేరళలో ఉన్నప్పుడు ఆళ్ళతో ఇంగిలీసులోనే మాటాడేటోన్ని. ఆ వచ్చినోడు ఎవరో ఎరుకైనాదా మీకు? ఆయబ్బి రాధమ్మ తొలి పెనిమిటి. ఇద్దరికీ తగువొచ్చి ఈయమ్మి ఏట్లో దూకినాదంట. కానీ సావలేదు, ఈడకి తేలివచ్చి మనోణ్ణి పెళ్లాడి, మనలో సేరింది. ఇన్నేళ్ళకి ఈడ నున్నట్టు తెలిసి, ఇప్పుడు ఆయబ్బి రాజీకొచ్చాడు. తనతో రమ్మన్నాడు. అప్పుడీ యమ్మి ఏమన్నాదో తెలుసా? - "నాకు ఈడనే బావున్నాది. ఈడ నన్నంతా దేవొతమాదిరి కొలుస్తున్నారు. ఆడనేముంది - అత్తా ఆడబిడ్డల పోరే గందా! నే రాను. నీకు బెమారినప్పుడల్లా నువ్వీడకు వచ్చిపోతావుండు. ఈడ నా మొగుడు పొగులంతా సముద్దరమ్ మీనే ఉంటాడు. ముసల్దేమో బుడ్డోన్ని ఎంటేసుకుని రామ్మందిరం సుట్టూ తిరుగుతా ఉంటాది, సంటిది ఎప్పుడూ నిద్దరోతావుంటాది. మనకు అడ్డేం ఉండదు. ఇక ఈ బుద్ధితక్కువ బెస్తోళ్ళు ఏమనుకున్నా లెక్కసెయ్యొద్దు, మనం ఆయిగా జలసా సేసుకుందారి" అంది" అని చెప్పి కొంతసేపు మాటలు ఆపి, అక్కడ చేరిన జనంలో మార్పు కోసం చూశాడు భేతాళుడు.

భేతాలుడి మాటలు, తమ కళ్ళకు కనిపించిన దానితో అన్వయించుకోడానికి కొంత సమయం అవసరమయ్యింది వాళ్లకి. వాడి మాటలు నమ్మలేక, నమ్మకుండా ఉండనూ లేక, అక్కడ చేరిన జనం స్తబ్దంగా గుడ్లప్పజెప్పి భేతాళుణ్ణే చూస్తూ అవాక్కై నిలబడి పోయారు. వాళ్ళని రెచ్చగొట్టాలని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు భేతాళుడు ...

"ఆ ఇద్దరూ మాటాడుకున్న మాటలు నేను సుబ్బరంగా ఇన్నా. నాయి పాము సెవులు, సీమ సిటుక్కుమన్నా ఇనిపిస్తాది. అమ్మతోడు, నేను సెప్పిందంతా పచ్చి నిజం. ఆయబ్బి, రాధమ్మని నేలమీంచి లేపి గుండెలకు అత్తుకోడం మీరూ సూశారు గందా? ఇంక ఇందులో అబద్ద మేముంటాది? ఈమె ఆ యబ్బి బుజాలు తడమడం కూడా సూసినోల్లకి ఇంకా సాచ్చీకం ఏం గావాలంట - ఆళ్ళిద్దరి మద్దెన సంబందం ఉందనడానికి? ఎక్కడనుండో వచ్చిన ఈ "సెడిపె" మన బెస్తకుల మరియాదను మంట కలిపేస్తూంటే మనం సూత్తో ఊరుకుంటామా ఏంటీ? మీరే సెప్పండి సబవు ఏంటో" అన్నాడు కవ్వింపుగా.

అప్పటికి వాళ్ళ ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో, "దాన్ని కులం లోంచి ఎలి (వెలి) ఏద్దారి” అంటూ కొందరు ఏకకంఠంతో కేకలుపెట్టారు. మందలోని గొర్రెల్లాంటి స్వంత ఆలోచన అన్నది లేని, బుర్ర ఉపయోగించడం ఏమాత్రం తెలియని జనం కావడంతో చాలామంది భేతాళుడి మాటల్ని అందిపుచ్చుకుని వాడికి వంతపాడారు. నెమ్మదిగా వాళ్ళoదరికి భేతాళుడు చెప్పినదంతా నిజమే అనిపించింది. "నిజం కాకపోతే పాపం! భేతాళుడు అంత కంఠశోషగా ఎందుకు చెపుతాడు" అనుకున్నారు. చూస్తూండగా భేతాలుడు చెప్పిన కథ ప్రచారమైపోయింది.

“ఏడనుండి అచ్చిందో ఆడకే ఎల్లి పడేలా తరిమి తరిమి కొడదారి. కులకట్టుబాటును ఇడిసి పెట్టి, ఎవరి కిట్టమొచ్చినకాడికి ఆళ్ళు సెడు తిరుగుళ్ళు తిరుగుతా ఉంటే, సూత్తూ ఊరుకోడానికి ఈడ మనం గాజులుగీని తొడిగించుకుని కూకున్నామా ఏంటి” అన్నాడు వాళ్ళలో ఒక పెద్దమనిషి.

అలా అక్కడి కక్కడ వాళ్ళందరి మనసుల్లోనూ “రాధమ్మ సెడిపె” అన్నముద్రపడిపోయింది. ఇప్పటిదాకా "రాధమ్మ దేవొత" అన్న నోళ్ళే, ఇప్పుడు ప్లేటు ఫిరాయించి "రాధమ్మ సెడిపే" అనసాగాయి.

xxxxxx xxxxxx xxxxxx

కన్నయ్య ఉషారుగా తెడ్డువేస్తున్నాడు, ఎంత తొందరగా ఒడ్డుకి జేరి రాధమ్మ చెవిని ఈ శుభవార్త వేద్దామా - అని ఆత్రపడుతున్నాడు. వేగంగా వచ్చి, ఒడ్డు చేరిన కన్నయ్యకు రోజూలా రేవులో కనిపెట్టుకుని ఉన్న రాధమ్మ కనిపించకపోయే సరికి అతని ఉత్సాహం మీద నీళ్ళు జల్లినట్లై మనసు చివుక్కుమని, నీరుగారిపోయింది.

సముద్రం మీద వేట చేస్తున్న సమయంలో, తనలాగే దోనెపై వేటకొచ్చిన, వేరే రేవు తాలూకు మిత్రుడు, దోనె నడుపుకుంటూ తన దగ్గరగా వచ్చి చెప్పిన మాటను - ఎప్పుడు ఇల్లుచేరి, ఎప్పుడు రాధమ్మ చెవిని వెయ్యాలా - అన్న తహతహలో ఉన్నాడు కన్నయ్య.

చాలాసేపు స్నేహితునితో మాటలు పెట్టుకోడం వల్ల ఆరోజు ఆలస్యంగా రేవుకి జేరాడు కన్నయ్య. దోనెలోని సామాను మొత్తం తానే మోసుకుంటూ, పెద్దపెద్ద అంగలు వేస్తూ వేగంగా ఇల్లు చేరాలన్న తహతహతో చురుగ్గా నడుస్తున్నాడు అతడు. అల్లంతదూరంలో ఇల్లు కనిపిస్తోంది.

మునిమాపువేళ కావడంతో ఒకరొకరు ఇళ్ళల్లో దీపాలు వెలిగిస్తున్నారు. క్షణక్షణానికీ దట్టమౌతున్న చీకట్లను చీల్చి చెండాడే శక్తి ఆ చిరు దివ్వెలకు లేకపోయినా, యధాశక్తి అవి చీకటితో పోరాడి, తమ పరిసరాలను కాంతితో నింపాలని తాపత్రయ పడుతున్నాయి.

బెస్తవాడ లో ఏదో మార్పు కనిపించింది కన్నయ్యకు. ఇళ్ళముందు జనం గుంపులు గుంపులుగా చేరి మాటాడుకుంటున్న వాళ్ళు కన్నయ్యను చూడగానే మాటలు ఆపి, కళ్ళు విశాలం చేసుకుని అతనివంక చూడసాగారు. మరో రోజైతే కన్నయ్య ఆగి, ఆ చర్చలకు కారణం ఏమిటో వెంటనే కనుక్కునీవాడేగానీ, ఆరోజు తన మనసుకు ఆహ్లాదాన్నిచ్చిన శుభవార్తను, ఎంత తొందరగా రాధమ్మ చెవిలో వేద్దామా - అన్న తహతహలో ఉన్నాడేమో, అదేమీ పట్టించుకోకుండా తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు.

ఇంటికి వచ్చిన కన్నయ్యకు ఇల్లు నిర్జీవంగా కనిపించింది. చీకటి పడ్తున్నా ఇంకా ఇంట్లో దీపమైనా వెలిగించకపోడం చూసి కంగారు పడ్డాడు. చేతిలో ఉన్నవన్నీ క్రింద పడేసి, తలుపు పక్కనున్న ఉగ్గుబల్లమీది అగ్గిపెట్టె తీసి, పుల్లగీసి కొవ్వొత్తి వెలిగించాడు. పసిపిల్ల ఉయ్యాలలో పడుకుని నిద్దరపోతోంది. రాధమ్మ నేలమీద కూర్చుని, మోకాళ్ళపై తలవుంచుకుని దుఃఖిస్తూ ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. మరుక్షణంలో అతని ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఏం ఆపద వచ్చిందోనని అతని ఒళ్ళు ఝల్లుమంది. దగ్గరగా వచ్చి “రాధమ్మా” అంటూ వణికే కంఠంతో ఎలుగెత్తి పిలిచాడు.
ఆ కేకకి ఉలికిపడి తెలివి తెచ్చుకున్న రాధమ్మ తలెత్తి చూసి, ఆదాటుగా లేచివెళ్ళి భర్తను కౌగిలించుకుని భోరున ఏడ్చిoది.

ఆమెను దగ్గరగా హత్తుకుని, “ఏందిది రాధమ్మా! ఏంటైనాది” అని అడిగాడు కన్నయ్య ఆత్రంగా.

ఏడుస్తూనే చెప్పుకొచ్చింది రాధమ్మ, “ఈ వేళ ఊహకందని విషయాలేన్నో తెలిశాయి కన్నయ్యా! వాటిలో నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది, శ్రీనివాసు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడన్నది ఒక్కటే! అతడు నన్ను వెతుక్కుంటో ఇక్కడకు వచ్చాడు.”
ఆమాటతో కన్నయ్యకు మెరుపు కొట్టినట్లయ్యింది. కంగారు పడుతూ అడిగాడు, “రాధమ్మా! నన్నిడిసిపెట్టి ఆ యబ్బితో ఎలిపోతావా?”

గమ్మున అతని నోరు తన చేత్తో మూసేసింది రాధమ్మ. “అలా అనుకోవద్దు కన్నయ్యా! ఈ "బెస్తోళ్ళ రాధమ్మ" జాలరి కన్నయ్యకే సొంతం! ఇకపోతే, ఆయబ్బితో నాకున్న సంబంధం ఈ జన్మది కాదు. అది వెనక జన్మ తాలూకు బంధం. ఇప్పుడు కన్నయ్యే రాధమ్మకు ప్రాణం! మనల్ని ఆ యముడుకూడా విడదీయ్యలేడు, గురుతెట్టుకో” అంది రాధమ్మ బింకంగా.

“నిజమేనా రాధమ్మా! ఒట్టు?”

రాధమ్మ తన తలపైన చెయ్యి ఉంచుకుని, “ఒట్టు! ఈ మాటే చెప్పి అతన్ని వెనక్కి పంపేశా. అమ్మానాన్నలు కుదిర్చిన పిల్లని పెళ్ళిచేసుకుని ఆనందంగా బ్రతకమని చెప్పా. నాకు సెలవు చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ జన్మలో అతన్ని నేను కలుసుకోడం ఉండదు! కాని, అతని వల్ల ఎన్నో విషయాలు తెలిశాయి, చెపుతా విను ...” అంటూ శ్రీనివాసు చెప్పిన తన పుట్టినింటి విశేషాలన్నీ ఏకరువు పెట్టింది రాధమ్మ. చివరగా కొంగుతో కళ్ళు తుడుచుకుని, “ఇంక నేను నా పుట్టింటితో కూడా ఏ సంబంధం పెట్టుకోవాలనుకోటంలేడు. మానాన్న ఇప్పుడు పశ్చాత్తాపంతో నాపేర ఆస్తి రాస్తానన్నాడుట! కాని ఆ డబ్బు మనకు వద్దు, అది పాపపు సొమ్ము” అంది.

అవాక్కైనాడు కన్నయ్య. రాధమ్మ నిర్ణయం అతనికి ఆశ్చర్యాన్ని కల్గించింది. డబ్బుకోసం అడ్డమైనగడ్డీ కరిచే పెద్దమనుష్యులున్న ఈ భూమ్మీద, ఆయాచితంగా వస్తున్న పుట్టింటి సంపదని "పాపపు డబ్బ"ని గడ్డిపరకలా తీసిపారేసిన రాధమ్మ అతనికి నిజంగానే ఒక దేవతలా కనిపించింది. “నా రాధమ్మ మణుసుల్లో పుట్టిన దేవొత! నా పున్నెo గొద్దీ నాకు దొరికిన ఆనిముత్తెం” అనుకున్నాడు కన్నయ్య మనసులో.

అతని మౌనాన్ని అపార్ధం చేసుకున్న రాధమ్మ, అతనికి తనపై పూర్తి నమ్మకం కలగలేదేమో నని బాధపడింది.
రాధమ్మకు కన్నీళ్లు ఆగిపోయాయి, అభిమానం పొడుచుకొచ్చి, గొంతు తీక్షణంగా మారింది. "ఇంతవరకూ నాకు శ్రీనివాసు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలియదు. మా నాన్న మాటల్ని నమ్మి, అతడు లేడనే బాధతో ప్రాణాలు తీసుకోవాలనుకున్నా. కాలవలో దూకి చచ్చిపోవాలని చూశా, కానీ నీటిలో కొట్టుకొచ్చి మీ రేవుకి చేరుకున్న నన్ను నువ్వే బ్రతికించావు. నా ప్రాణం నీదేననుకుని నిన్ను పెళ్లాడా. బెస్తోళ్ళ రాధమ్మగా మరో పుట్టుక పుట్టా. ఇది నాకు మరోజన్మలాంటిది. ఆ వెనకటి జన్మతో దీనికి ఏ సంబంధమూ లేదు. ఇది నా ఇల్లు! నువ్వు నా భర్తవు! భర్త, ఇద్దరు పిల్లలు, ముసలి అత్తా - ఇదే నా సంసారం. నా బాధ్యతలేమిటో నాకు తెలుసు కన్నయ్యా! నన్ను సరిగా అర్థం చేసుకో" అంది రాధమ్మ ఖచ్చితంగా.

కన్నయ్య గమ్మున రాధమ్మను చేరదీసుకున్నాడు. "నువ్వే నన్ను సరిగా అర్ధం సేసుకున్నావుగాదు...  నా రాధమ్మ నా కెప్పుడూ అన్నేయం సెయ్యదని నా కెరుకేలే. నేనాలోసిత్తన్నది ఏరే ఇసయం" అంటూ ఆమెను గాఢంగా గుండెలకు అదుముకుని, తన పై గుడ్డతో ఆమె చెంపలనంటిన కన్నీటిని మృదువుగా తుడిచాడు. రాధమ్మ ఇచ్చిన వత్తాసుతో అతని మనసు సంతృప్తితో నిండిపోయింది.

"ఏడవమొకు రాదమ్మా! నేనున్నానుగందా నీకు తోడుగా! నేను బావుండగా నిన్ను కన్నీరు యెట్టనీను, ఏది ఏమైనా సరే " అన్నాడు కన్నయ్య.

xxxxxx xxxxxx xxxxxx

మరుసటి ఉదయం, అలవాటుగా ఇంకా చీకటుండగానే అవసరమైన సరంజామా అంతా తీసుకుని, రేవుకు బయలుదేరాడు కన్నయ్య. రోజూలాగానే చద్దిఉగ్గ చేతికిచ్చి, భర్తని కంటికి కనిపించినంతమేర గుమ్మంలో నిలబడి చూసి చెయ్యూపుతూ వీడ్కోలు చెప్పి, ఆ తరువాత వెనుదిరిగి ఇంటిలోకి వెళ్ళిపోయింది రాధమ్మ.

రేవుని జేరిన కన్నయ్యకు, అప్పటికే అంతా రేవులో గుమిగూడి ఉండడం ఆశ్చర్యమనిపించింది. వేళ మీరినా చాలా పడవలు ఇంకా రేవుని విడిచి పోలేదు వేటకి! ప్రతి రోజూ ఆలస్యంగా వచ్చే వెంకయ్య, అబ్బులు లాంటి వాళ్లుకూడా అప్పటికే అక్కడ చేరి ఉన్నారు. అంతేకాదు, అంతవరకు గుంపుగా చేరి వాళ్ళలో వాళ్ళు ఏమేమో మాటాడుకుంటున్నవాళ్ళల్లా, కన్నయ్యను చూడగానే హటాత్తుగా మాటలాపేసి, ఒకరినొకరు నర్మగర్భితంగా దొంగ చూపులు చూసుకుంటూ, నెమ్మదిగా, లోగొంతుకతో గుసగుసలాడుకోడం మొదలెట్టారు. తెల్ల మొహం వేసి చూశాడు కన్నయ్య వాళ్ళను. అసలిదంతా ఏమిటో అతడికి తెలియలేదు.

దగ్గరగా వచ్చి వానరాజుని, "ఏమైందన్నా? ఏమిటి ఇసేసం ఇయ్యేల" అని అడిగాడు కన్నయ్య.

"ఏందిరా కన్నయ్యా? నీకేం తెలవదా ఏంటి" అన్నాడు వానరాజు వక్రంగా చూస్తూ.

"ఆడికేలా తెలుస్తాది? ఆడు ఇంటో లేనప్పుడేగందా ఈ యవ్వారం నడిసేది!" అన్నాడు మరో సరంగు వెంకయ్య.

వాళ్ళంటున్నదేమిటో అంతుపట్టలేదు కన్నయ్యకు. బిత్తర చూపులు చూశాడు.

"నిజంగానే నీకు తెల్డా! అదేంటంటే - సెవుతా, ఇనుకో ... నీ బారియా సేసిన నిరువోకమ్ వల్ల ఈ రేవు పరువు మొత్తం గోదాట్లో కలిసిపోనాది! ఆ యమ్మీ పట్నం పిల్లేగందా, పట్నపోడి మీన మోజుండడంలో ఇసేసమేమీ లేదు. అలాంటప్పుడు ఆయబ్బితో ఎలిపోతే సరిపొయ్యేదిగందా! ఆయబ్బినే ఈడకు రమ్మని సెప్పి, పెనిమిటి సాటున యవ్వారం సాగించాలనుకోడం తప్పే ఔద్ది గందా? తప్పు సేసినోళ్లకి సిచ్చ అనుభగించక తప్పదుగదరా అబ్బయా!" అన్నాడు బ్రహ్మయ్య కులపెద్ద హోదాలో.

పెద్దయ్య పోయాక ధర్మయ్య, ధర్మయ్య చనిపోయాక బ్రహ్మయ్య కులపెద్ద లయ్యారు. కులపెద్ద చెప్పిన మాట కులానికంతకీ వేదవాక్కు అవ్వాలి!

బ్రహ్మయ్య మాటలు విని గతుక్కుమన్నాడు కన్నయ్య. ఆ మాటలు కొరడాదెబ్బల్లా కన్నయ్య మనసుకు. "ఛెళ్లు"న తగిలాయి. అతనికి నోట మాట పెగల్లేదు కొంతసేపటివరకూ. జీవం లేని కళ్ళతో అందరినీ చూస్తూ కొయ్యబారి నిలబడి ఉండిపోయాడు.

అక్కడ ఉన్నవారిలో పెద్దవాడైన వెంకయ్య కల్పించుకుని, "ఒకరిని పెళ్ళాడి, ఆడిని బుట్టలో ఏసి మూతేసి, ఏరేవోడితో కులకాలనుకోడం ఛమించరాని తప్పు. అలాంటి పనులు సేసెటోల్లని రేవులో ఉండనిస్తే రేవు పరువు మొత్తంగా పోద్ది. ఈడ నికార్సయినవోల్లు మాత్తరమే ఉండాల" అన్నాడు.

కన్నయ్యకు మతి పోయినట్లయింది. "ఏం మాటలయి ఎంకన్న తాత్తా! రాధమ్మ అటుమంటి మనిసి కాదన్నది నీకు తెలీదా? ఆమె పదారణాలా నికార్సయిన ..."

మాట ఇంకా పూర్తికాకముందే ఠక్కున వానరాజు అడ్డుపడ్డాడు కన్నయ్యకి, "మేమూ నిన్నటిదాకా అలాగనే నమ్మాము.  నిన్ననే బయటపడింది అసలు రంగు ఏంటో! కళ్లారా సూసినోళ్లు సెవుతావుంటే నమ్మకపోడం ఎలాగంటావురా కన్నయ్యా?"
పద్దాలు అల్లంతదూరంనుండి గట్టిగా అరిచాడు, "నడండహే! పొద్ద లెగిసినాది, ఇక సాలు, బేగే పడవుల్ని వదలండహే! పొద్దు గడిసిపోతాంటే  మీకు సీమ కుట్టినట్లైనా లేనట్టున్నాదేంటీ... "

పడవల్ని నీటిలోకి తోసి, లంగరు దిగేసి, సముద్రపువారనున్న ఇసుకలో నిలబడి మాటలాడుకుంటున్న వాళ్లకి, ఆ కేక అకస్మాత్తుగా కంగారుపుట్టించింది. మరు క్షణంలో వాళ్ళు, తొందరతొందరగా పడవల్ని సముద్రంలోకి వదిలే ప్రయత్నంలో పడ్డారు.

పడవను నీటిలోకి తోస్తున్నవాళ్ళతో కన్నయ్యకూడా చెయ్యి కలపబోయాడు. వెంటనే ఆ చేతిని ఒడిసి పట్టాడు వానరాజు. "ఆగు కన్నయ్యా! పడవ ముట్టుకో మోకు, మీకు ఎలిపడ్డాది, తెలుసా? దూరంగుండు" అన్నాడు గర్జిస్తూన్నట్టుగా.

ఉలిక్కిపడి, కన్నయ్య చటుక్కున చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. "అదేంటి సిన్నయ్యా! నాతో సెప్పకుండా అదెలా కుదురుద్ది?" బాధగా అన్నాడు కన్నయ్య బ్రహ్మయ్యతో.

బ్రహ్మయ్య అందుకున్నాడు. "మిదంరేతిరి ఎన్నెట్లో అన్నాసెల్లెలి గట్టు కాడనున్న అనుమంతులోరి గుడి కాడ, కులపోళ్ళందరం సబ సేసినాము. అందరితోపాటుగా, అసలోడివి నీకూ కబురెట్టినాను. కానీ, నువ్ రానని సెప్పి, నా కబురుని తిప్పికొట్టావంట! అటుమంటప్పుడు నువ్వు లేకుండానే తీరుమానం సెయ్యాల్సివచ్చినాది నీకు సిచ్చ. మరి ఏటి సెయ్యమంటావు సెప్పు" అన్నాడు.

కన్నయ్య తెల్లబోయాడు. "సబా!? ఆ ఇసయం నాకు తెలీదు. తెలిస్తే నే రానా? అసలు సబ ఏంటీ? ఎందుకంట?"
అక్కడున్నవాళ్ళందరూ మొహామొహాలు చూసుకున్నారు.

"ఆడికి తెలీదంట, పాపం! ఓ పాలి సెప్పండి, మావూ మరోపాలి ఇంటాము" అన్నాడు, అక్కడవున్నసరంగుల్లో ఒకడు వెకిలిగా నవ్వుతూ.

బ్రహ్మయ్య చెప్పసాగేడు... "ఒలే అబ్బయా! ఆ పట్నం బాబుతో రాధమ్మ సేరికగా ఉండడం శానామందే సూశారు. అంతేకాదు, ఆళ్ళిద్దరూ సెప్పుకున్న ముచ్చట్లు సెవులారా ఇన్నారంట! మిదంరేత్తిరి కాడ సబలో ఈ ఇసయాలే సెర్చ సేసినం. నేను నీకు భేతాలునిసేత కబురెట్టాగందా, నువ్వు సబకు రాలేదెందుకని?"

అంతా అర్థమైపోయింది కన్నయ్యకి. సభ జరగబోతోమ్దన్న విషయం చెప్పకుండా దాచేసి, పెద్దలందరి దృష్టిలో తనను దోషిని చేసి, తనకు "వెలి" పడేలా చేశాడు భేతాలుడు. అంతేకాదు, కులపోళ్ళందరి ఎదుట రాధమ్మ నిర్దోషిత్వాన్ని గురించి మాటాడే అవకాశం కూడా లేకుండా చేశాడు. ఇదంతా భేతాళుడు చేసినకుట్ర! ఇప్పుడింక తనేం చెప్పినా ప్రయోజనం ఉండదు, తనమాట వినీల లేరెవరూ - అనుకున్నాడు బాధగా కన్నయ్య. కానీ, నోరు మూసుకుని ఊరికే ఉండలేకపోయాడు.

"ఆడు సెప్పింది అబద్దం సిన్నయ్యా. ఆడు నాకాడికి కబురట్టుకుని రానేలేదు. కబురు తెలిస్తే కులపోల్ల సబకి నేరానా?"

"సర్లే ఏది నిజమో, ఏది అబద్దమో ఆ బగమంతునికే ఎరుక! నిన్న సభలో తీరుమానమైపోయినాది. దానికింక తిరుగులేదు. నీ కుటుంబానికి "ఎలి" పడ్డాది. నిన్ను, నీ కుటుంబాన్నీ కులంలోనుంచి ఎలేశారు. మీతో ఎవరైనా సంబందం ఎట్టుకున్నారంటే ఆళ్ళకీ ఎలి పడుద్ది" అన్నాడు బ్రహ్మయ్య తాపీగా.

కన్నయ్యకు అరికాలిలో పుట్టిన మంట సర్రున నడినెట్టికంతా పాకినట్లు అనిపించింది. ఆ సమయంలో భేతాళుడు కనిపిస్తే పీక నులిమి చంపేసే వాడేమో! ఆనాడే వాడిని పట్టుకుని దూరంగా సముద్రంలోకి విసిరిపారేసి ఉంటే, ఈతకూడా రాని వాడిని చేపలు బతికుండగానే ఫలహారం చేసేసి ఉండేవి, అలాజరిగివుంటే ఇప్పుడు తనకు ఈ దుస్థితి వచ్చివుండేది కాదుకదా - అన్న ఆలోచన వచ్చింది కన్నయ్య.

ఆ సంగతి ముందుగానే ఊహించుకున్న భేతాళుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేకుండా జాగ్రత్తపడ్డాడు. బలవంతంగా ఎంతో కష్టం మీద, తన కోపం బయటకు తెలియనీకుండా తమాయించుకున్నాడు కన్నయ్య.

"సిన్నయ్యా! నువ్వు నన్నెరుగవా? నువ్వు సబ సేత్తే, నేను సభకి రాకుండా ఎప్పుడైనా ఎగ్గొట్టానా? మిదం రెట్టిరి కాడ భేతాళుడు నాకు ఏ కబురూ సెప్పింది లేదు. నే సెప్పీ మాట ఇనకుండానే నా మీన కులతప్పు ఎయ్యడం నేయం గాదు."

"నువ్వు పుట్టినకాడినుండీ నీ సంగతి నాకేరికే కన్నయ్యా! నువ్వు మంచోడివి కావని ఇప్పుడెవరన్నారు గనక! కానీ, నీ బారియా ఏంజేసినా దానికి పూసీకత్తు నువ్వే ఔతావు గందా! రేత్తిరికాడ ఇదే ఇసయాన్ని శానాసేపు సెర్చించుకున్నాము. నువ్వు నీ బారియాని ఒగ్గేస్తే నిన్ను కులంలో సేర్చుకుంటాము. రాధమ్మను పట్నం తోలెయ్యి, శాను."

కన్నయ్యకు చాలా కష్టo అనిపించింది ఆ మాట. "అదెలా కుదురుద్ది సిన్నయ్యా! ఆ యమ్మికి, కట్టాల్ల, సుకాల్లో ఎంట నుంటానని సల్లని ఐరేని కుండల సాచ్చికంగా ప్రెమానం చేసినాకనే గందా ఆయమ్మి మెడలో నేను తాలి గట్టినా! కిట్టనోల్ల మాయ మాటలు అట్టుకొని ఆమెనెలా ఒగ్గేయ్యగలను? ఆ యమ్మి పులుగడిగిన ఆనిముత్తెం - నా మాట నమ్ము సిన్నయ్యా! ఆయమ్మి నా బారియా - నాకంటే ఎక్కువ  రాధమ్మని గురించి ఎవరికి తెలుస్తాది? ఆమె ఏడకీ పోదు, నాకాడే ఉంటాది. ఆ యమ్మి ఏరు, నానేరూ గాదు. భేతాళుడి మాయమాటలు నమ్మి, మీరు ఎలి - గిలి అంటే నానేం భయపడను." అన్నాడు బింకంగా కన్నయ్య.

వయసు తెచ్చిన పెద్దరికంతో వెంకయ్య చటుక్కున అందుకున్నాడు, "నువ్వు సూడలేదుగాని అబ్బాయా! ఆళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు మనోల్లు శానా మంది సూశారు, కావాలంటే ఆల్లని అడుక్కో, సెవుతారు. నీకు అంతగా ఆ యమ్మిని వదలాలని లేకపోతే, కులపోల్లకి సేసిన తప్పుకి జరిమానా చెల్లించి, ఆయమ్మిని ఏలుకో, సరిపోద్ది. అలా కాపోతే మేమెవళ్ళం నీ ఓల్లమేగాము, గురుతెట్టుకో!"

"ఇక సాలుగాని నడవండహేయ్" అంటూ తెడ్డు అందుకున్నాడు వానరాజు. అప్పటికే అన్నిపడవలూ సముద్రం మీదికి వెళ్లి పోయాయి. కన్నయ్యను ఒడ్డుమీదే ఒంటరిగా వదిలి వానరాజు పడవకూడా వెళ్ళిపోయింది.

కన్నయ్య మనసు మూగవోయింది. ఏమీ మాటాడకుండా, ఎవరినీ తిట్టకుండా అవాక్కయి, వెళ్లిపోతున్న వానరాజు పడవని గుడ్లప్పగించి చూస్తూ ఒడ్డుమీద నిలబడి ఉండిపోయాడు.

పడవలపై చేపల వేటకు వెళ్లకుండా ఒడ్డుమీదనే ఉండిపోయిన జనం కూడా కన్నయ్యను పలకరించకుండానే ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. నెమ్మదిగా రేవు మొత్తం నిర్మానుష్యమైపోయింది, కన్నయ్య ఒంటరిగా మిగిలిపోయాడు. అతని చూపులు మాత్రం వానరాజు పడవను కనుచూపు మేర వరకూ వెంబడించాయి. పడవ దూరమైన కొద్దీ చిన్నదిగా కనిపించి, క్రమంగా ఇంకా ఇంకా చిన్నదై చివరకు చుక్కలా మారి అంతర్ధానమై పోయింది. అలా ఆ పడవ కనుమరుగు అయ్యాక కన్నయ్యకి జగమంతా శూన్యంలా అనిపించింది. సిగ్గుతో అవమానంతో అతని హృదయం ఘుర్ణిల్లుతోoది. అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. చెదిరిన హృదయాన్ని చిక్కబట్టుకునీ ప్రయత్నంలో తోటలవెంట, దొడ్ల వెంట గమ్యమన్నది తెలియకుండా తిరగసాగాడు కన్నయ్య.

.... సశేషం ....

Posted in June 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!