Menu Close
anna-chelleli-gattu

ధారావాహిక నవల

భేతాలుని బారినుండి తప్పించుకున్న రాధమ్మ అదిరే గుండెల్ని చిక్కబట్టుకుని, దొడ్డిగుమ్మం నుండి, పరుగులాంటి నడకతో రాగమ్మ ఇంటివైపుగా నడిచింది. ఆమె బుజాన ఉన్న పసిబిడ్డకు కడుపు నిండకపోడంతో గుక్కపట్టి ఏడుస్తోంది. ఏదుపుమాని నిద్రపోవాలంటే ఆ పిల్లకి కడుపు నిండా పాలు కావాలి.

గడపలో కూర్చుని, రేషన్ బియ్యంలో రాళ్ళు ఏరుకుంటున్న రాగమ్మ, తను పక్కకి తప్పుకుని రాధమ్మను ఆప్యాయంగా లోపలకు ఆహ్వానించి పలుకరించింది, "ఏమయ్యింది రాదమ్మా? అలాగున్నావు... కుశలమా?" అంటూ.

వెంటనే జవాబు చెప్పింది రాధమ్మ, "ఏం అడుగుతావులే పిన్నీ! కుశలమెక్కడ! రెండు రోజులనుండీ దీనికి జలుబు! ఈ వేళ ఒళ్ళు కూడా వెచ్చబడింది.. తెగ ఏడుస్తోంది" అంది రాధమ్మ దిగులుగా.

"కానిమాట కప్పెట్టుకోవా"లన్న ఉద్దేశంతో, అసలు సంగతి రాగమ్మ కేమీ చెప్పకుండా, ఇంట్లోకి నడిచి, పిల్లని ఒడిలో ఉంచుకుని గోడ వారగా తలుపు చాటున కూర్చుంది.

రాగమ్మ చాట పక్కనబెట్టి, పిల్ల ఒళ్ళు ముట్టుకుని చూసి ఆశ్చర్యపోయింది. పిల్ల ఒళ్ళు మరీ అంత వేడిగా లేదు. జలుబువల్ల వచ్చే వెచ్చదనమది. అంటే ... !

"ఇంతోటి దీనికే భయపడి పోయేటంత బేల కాదు రాధమ్మ. ఇంకా పెద్ద విషయమేదో ఉండి ఉంటాది, రచ్చ చెయ్యడం ఇష్టంలేక దాచిపెడుతోంది, కానియ్" అనుకుంది మనసులో రాగమ్మ.

భేతాలుడు కన్నయ్య ఇంటికి వెళ్ళడం ఆమె, తన ఇంటి గుమ్మంలో నుండి చూసింది. మరి కాసేపటిలో వాడు మొహం ఎర్రగా చేసుకుని, చెంప చేత్తో పట్టుకుని, బయటకువచ్చి, విసవిసా నడుచుకుంటూ వెల్లిపోడం కూడా ఆమె కళ్ళలో పడకపోలేదు. "అమ్మ నా కూతురా! ఎంత గుట్టు..." అనుకుంది మనసులో మెప్పుగా. ఆమెకంతా అర్థమైపోయింది. "ఆ పాపిస్తోడు నా తల్లిని ఎంత ఇబ్బందిపెట్టేడో!" మనసులో అనుకుంది. కాని, పైకి మాత్రం "ఎర్రిపిల్లా ! అంత బయపడ వలసిందేమీ లేదు. అడ్డాల్లో యేసుకో, ఏడు పాపుద్ది. పిల్లకేం గాలేదు, పడిశం ఎక్కువై పక్కలు వెచ్చబడ్డాయి. మరేం బయం లేదు. మాడున పొడి పసుపద్దు. సిటికెలో ముక్కు కారడం ఆగుద్ది. ఎందుకైనా మంచిది, సందమాటేల నానచ్చి దిట్టి తీస్తా. తెల్లారేతలికి బిడ్డకి ఏ నలతా ఉండదు. బయపడకు" అంటూ తన పెద్దరికం చూపించి రాధమ్మకు భరోసా ఇచ్చింది రాగమ్మ.

ఎప్పుడూ ఏదో ఒక పనికొచ్చే పని చేసుకుంటూ ఉండడమే తప్ప, వేళకాని వేళల్లో ఇరుగు పొరుగులిళ్ళకు వచ్చి, ఉప్పుకి పత్రికి కూడా కొరగాని కబుర్లు- ఆశమ్మ, ఓశమ్మ అంటూ చెప్పుకుంటూ పాద్దుపుచ్చడం తెలియని రాధమ్మ ఇలా తన ఇంటికి ఎటూ కానివేళ, పనిమాలి వచ్చినప్పుడే అనుకుంది రాగమ్మ, "తగినంత కారణమేదో ఉందని!"

బెస్తవాడ ఏ ఇంజనీరో, ఆర్కిటెక్టో ప్లానువేసి కట్టిన ఊరుకాదు, నిర్వాసితులైన బెస్తలు కొందరు వచ్చి, ఈ తీరం నచ్చి, ఇక్కడ ఎవరికి తోచిన జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉండిపోయారు. తరాలు మారినప్పుడల్లా అదే తీరులో అక్కడ కొత్త ఇళ్ళు కూడా పుట్టుకొచ్చాయి. క్రమంగా పెరిగిపెరిగి అది ఒక ఊరుగా మారి బెస్తవాడన్న పేరు తెచ్చుకుంది. కాని, అక్కడి ఇల్లు అడ్డదిడ్డంగానే ఉంటాయి.

ఆ యిళ్ళు, ఇటుకలూ సిమ్మెంటూ ఉపయోగించి కట్టిన పక్కా ఇళ్ళేమీ కావు. నిట్రాటలు లేపి వేసిన పాకలవి! వాటికి గోడలుగా దడులుకట్టి, వాటిపై మన్ను మెత్తి , ఆపై పేడతో నున్నగా అలికి, వెల్లవేసి గోడలుగా చేసి, గదులు ఏర్పరచి, వాటిలో నివసిస్తూ, సముద్రపు గాలినుండి, శీతాతపాలనుండి రక్షణ పొందుతారు ఆ పల్లె వాసులు. కావాలనుకున్నవారు ఆ గోడలకే చెక్కతో చేసిన కిటికీలు, ద్వారబంధాలు అమర్చుకుంటారు. విత్తం కొద్దీ ఉంటుంది వైభవం!

బెస్తవారికి సముద్రమంటే ప్రాణం. సముద్రమే దైవం! తమవైన సమస్త నిధి నిక్షేపాలు ఉన్నది సముద్రంలోనే అనుకుంటారు వాళ్ళు. సముద్రజీవులే వారి సంపద! సముద్రం చల్లగా ఉంటేచాలు బెస్తవాడికి ఏలోటూ ఉండదని నమ్ముతారు వాళ్ళు. సముద్రంలో చేపలు పట్టి, ఊరిలో అమ్ముకుని భుక్తి గడుపుకోడమే కులవృత్తి వాళ్లకి. సముద్రపు హోరు చెవులకు వినిపిస్తూంటే చాలు, వాళ్ళు హాయిగా కూడు తిని, ఆ హోరే సంగీతంలా ప్రశాంతంగా నిద్రపోగలరు. మళ్ళీ శాల్యూష సమయం (౪-౩౦ am) కాగానే నిద్రలేచి సముద్రం మీద చేపలవేటకి సిద్ధమౌతారు!

"మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు" అంటారు. అలా సందర్భo వచ్చింది కదాని చాలా విషయాలే ఏకరువు పెట్టాగాని ... ఇక ప్రస్తుత విషయానికి వద్దాం -

ఇంతకీ ఇప్పుడు నేను ఇక్కడ ఇళ్ళు అచెప్పొచ్చే దేమిటంటే - ఇక్కడి ఇళ్ళు ఇలా అడ్డదిడ్డంగా ఉండడం వల్ల రాగమ్మ ఇంటి గుమ్మంలోనుండి చూస్తే కన్నయ్య ఇల్లు చక్కగా కనిపిస్తుంది. తలుపు తెరిచి ఉంచితే లోపలి భాగం కూడా చాలావరకు చూడొచ్చు. అలా, చాలాసేపటి నుండి గుమ్మంలోనే కూర్చుని ఉన్న రాగమ్మ, తన పని తానూ చేసుకుంటూనే, కన్నయ్య ఇంట్లో జరిగిన భాగోతాన్ని సుబ్భరంగా పసిగట్టింది. "ఆ పాపిష్టి బేతాళుడి కళ్ళు నాతల్లి మీన పడ్డాయన్న మాట" అనుకుని బాధపడింది రాగమ్మ.

పొద్దు వాటారింది. సముద్రం మీదినుండి వచ్చే గాలి చల్లబడింది. నీటిపక్షులు గూళ్ళను జేరే ప్రయత్నంలో పడ్డాయి. వాటి కువకువలతో దిక్కులు ప్రతిధ్వనించ సాగాయి. కాని రాధమ్మ ఇంకా అక్కడే కూర్చుని, రాగమ్మతో ఈ కబురూ, ఆకబురూ చెపుతూ ఉండి పోయింది. సందెవేళ కావడంతో రాగమ్మ ఆమెతో కబుర్లు చెబుతూనే తన పనులు తాను చేసుకోడం మొదలు పెట్టింది. దాంతో, ఇంకా అక్కడే ఉండడం భావ్యం కాదని లేచింది రాధమ్మ.

############

ఇల్లు జేరి వెనక్కి తిరిగి చూసిన రాధమ్మకి, అల్లంత దూరంలో ఇంటికి తిరిగివస్తున్న కన్నయ్య కనిపించడంతో సంతోషంగా ఇంట్లోకి నడిచి, నిదురబొయిన పసిపిల్లను ఉయ్యాలలో పడుకోబెట్టింది.

అంతలో కన్నయ్య లోపలకు వచ్చాడు, "ఆకలి దంచేస్తోంది రాదమ్మా! బేగి తానం సేసి వస్తా, భోయినం వడ్డించు" అంటూ, చేతిలో సామాను గోడవార పడవేసి, స్నానానికి వెళ్ళిపోయాడు.

దొడ్లో ఎండకు కాగిన బానలోని నీళ్ళతో, సబ్బు రుద్దుకుని, శుభ్రంగా స్నానంచేసి, పొడి బట్టలు కట్టుకుని వచ్చి, కంచం ముందు పెట్టుకుని నట్టింట కూర్చున్నాడు కన్నయ్య.

మాటాడకుండా వచ్చి, పొద్దుట తినగా మిగిలిన పట్టెడు అన్నం, పులుసూ కంచంలో వడ్డించింది రాధమ్మ. అన్నం మీద చేయుంచి విస్తుబోయి, రాధమ్మ వైపు చూశాడు కన్నయ్య. రాధమ్మ మొహంలో ఏదో మార్పు కనిపించింది  అతనికి. ఇక మాటాడకుండా పెట్టినది కాస్తా తిని, లేచివెళ్ళి చెయ్య కడుక్కుని వచ్చాడు కన్నయ్య.

ఏ రోజునా కన్నయ్య వేట ముగించి ఇంటికి వచ్చేసరికి, రాధమ్మ అన్నం వార్చి, కూర వండి ఉంచేది. తను వచ్చి కంచం పెట్టుకోగానే వేడివేడిగా వడ్డించి, కబుర్లు చెపుతూ పక్కన కూర్చునే రాధమ్మ, ఈ రోజు ఎందుకనో మౌనంగా ఉండిపోయింది. అంతేకాదు ఈవేళ ఉదయం చేసిన వాటిలో మిగిలివున్న కొంచెం వడ్డించి ఉందంటే దానికి తగినంత పెద్ద కారణమేదో ఉండే ఉంటుందని ఊహించాడు కన్నయ్య.

ఆమెకు దగ్గరగా చేరి తడిచేయి ఆమె కొంగుకు తుడుస్తూ, "ఏటయ్యింది రాదమ్మా! అలాగున్నావేమ్తి? ఒళ్ళు బాగోలేదా" అంటూ నుదుటిమీద అరచెయ్యి ఉంచి చూడబోయాడు.

ఆ ఓదార్పుకి నీళ్ళ కుండ పగిలినట్లయ్యి రాధమ్మ భర్తను కౌగిలించుకుని భోరున ఏడ్చింది. ఏడుస్తూనే జరిగినదంతా చెప్పింది. కన్నయ్య ఆమెను చేరదీసుకుని, తన బుజాన ఉన్న తువ్వాలుతో మృదువుగా ఆమె కళ్ళు ఒత్తుతూ, "స్నేయితం, స్నేయితం అంటూ ఆ తెంపి మన ఇంటి సుట్టూ తిరుగుతున్నప్పుడే అనిపించింది నాకు, ఈడికేదో దురాలోశన ఉండే ఉంటాదని! కాని, ఇoత గోరం తలపెదతాడనుకోలేదు! రాదమ్మా! ఏడవమోకు, ఆడి సంగతి నే జూస్తా. ఆడు మళ్ళీ ఇటైపుసూడకుండా బుద్దిసెప్పి వస్తా" అన్నాడు. వెంటనే చొక్కా తొడుక్కుని బయలుదేరాడు.

రాధమ్మ భర్తకి అడ్డమోచ్చి, "ఆగు కన్నయ్యా! రట్టు చెయ్యొద్దు. మనం వీధిన బడితే అందరూ తలొక రకంగానూ మాట్లాడుతారు. అల్లరై పోతుంది. ఒదిలై, వాడి పాపాన వాడే పోతాడు. మన జాగ్రత్తలో మనం ఉందాము" అంది.
అంతలో పెత్తనాలు ముగించి నానీ చెయ్యి పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చింది ఎల్లమ్మ. కన్నయ్య ఒక్క క్షణం తటపటాయించాడు. ఆలోచిస్తే రాధమ్మ చెప్పిందే సబవనిపించింది. వెంటనే మనసు మార్చుకుని, చేపల్ని తీసుకుని, వతనులదగ్గర ఇవ్వడానికని వెళ్ళిపోయాడు కన్నయ్య .

############

భేతాలున్నలా బేషరతుగా వదిలెయ్యడానికి కన్నయ్య మనసు సమ్మతించ లేదు. ఒకసారి వాడిని గట్టిగా మందలించడం అవసరమనిపించింది కన్నయ్యకు. పట్టిన చేపల్ని హోటళ్లకు ఇచ్చి తిరిగివస్తూ, నీలమ్మ ఇంటివైపుగా నడిచాడు. నీలమ్మ గుమ్మంలోనే ఎదురై పలుకరించింది, 'ఏమది కన్నయ్యా, ఇటచ్చినావు" అని అడిగింది.

"నీలం పిన్నీ! భేతాలుడు ఇంటికాడున్నాడా? ఓపాలి మాటాడిపోదామని వచ్చా" అన్నాడు కన్నయ్య.

"స్నేయితుడి కోసమచ్చావా? ఆడు ఇంట్లోనే ఉన్నాడు. పిప్పిపన్ను సలుపుతా ఉందని మూలుగుతా మూల సాపేసుకుని తొంగున్నాడు. ఎవరో సత్తువకొద్దీ లాగి లెంపకాయ కొట్టినట్లు దవడ ఇంతెత్తున వాసిపోయినాది. సెడ మూలుగుతా ఉన్నాడు. రేపోపాలి మంగలి మానిక్కేన్ని పిలిపించి ఆడి పన్ను పీకించేత్తే సరిపోద్ది" అంది, అసలు విషయం ఏమాత్రం తెలియని నీలమ్మ.

కన్నయ్య వెళ్ళిపోకుండా, "శానా జరూరుపని పడింది, ఒకమాట చెప్పిపోదారనోచ్చా. ఓపాలి పిలు పిన్నీ" అంటూ పట్టుబట్టాడు. లోపలనున్న భేతాలుడు వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు. కన్నయ్య తనను వదలడని వాడికి అర్థమయ్యింది. ఇంక ఎలాగా తప్పదని, లేచి బయటికి వచ్చాడు.

భేతాలున్ని చూడగానే కన్నయ్యకు అరికాలిమంట తల కెక్కినట్లయ్యి, వాడిని  చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కాని నలుగురిమధ్య అల్లరి కాకూడదన్న రాధమ్మ మాటలు గుర్తుకి తెచ్చుకుని, కోపాన్ని తమాయించుకుని, శాంతం నటిస్తూ, భేతాలుడి బుజం చుట్టూ చెయ్యేసి, "రారా, బామ్మర్దీ! కూoచేపలా తిరిగొద్దారి" అంటూ నెమ్మదిగా నడిపించుకు పోయాడు వాడిని కన్నయ్య.

వాళ్ళ మధ్య అంత స్నేహం ఉండడం చూసి, నీలమ్మ చాలా సంతోషించింది. కన్నయ్య సావాసం వల్ల ఏదో ఒకనాటికి, కన్నయ్యకి లాగే తన తమ్ముడికి కూడా మంచి బుద్ధులు అబ్బగలవని ఆశించింది.

అలా బుజం చుట్టూ చెయ్యేసి భేతాలున్ని నడిపిస్తూ సముద్రపు ఒడ్డుకు దారితీశాడు కన్నయ్య. తననలా అక్కడకు ఎందుకు తీసుకెడుతున్నాడో తెలియక కంగారు పుట్టింది భేతాలుడికి.

ఆరడుగులకు మించిన శరీర సౌష్టవంతో సంకల్పమాత్రాన ఉక్కులా బిగిసే కండబలంతో, రాజసం ఉట్టిపడుతూ టీవిగా కనిపిస్తున్న కన్నయ్య పక్కన బక్కగా, పీలగా ఉన్నతాను ఎంత దీనంగా, హీనంగా ఉంటాడో తొలిసారిగా తెలిసివచ్చింది భేతాలుడికి. ఆ తేడా వాడిలో అసూయను రేకెత్తించింది. వాడి మనసు ఉడుకుబోతు తనంతో నిండిపోయి, పగ - ప్రతీకారం అంటూ ఘూర్నల్లింది. అంతేగాని, తన తప్పును ఒప్పుకోడానికి వాడికి ఇష్టం లేకపోయింది. పైగా తనకే ఏదో ద్రోహం జరిగినట్లు అనిపించి బాధ కలిగింది వాడికి.

వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ సముద్రపు ఒడ్డుకు చేరేసరికి మునిమాపువేళ కావడంతో ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. నీటి పక్షులు గూళ్ళకు వెళ్లి చాలాసేపయింది. సముద్రపు హోరు తప్పించి అక్కడ మరేసందడీ లేదు. అప్పుడప్పుడు ఒక్కొక్క చేప నీటి పైకంతా ఎగిరి, నీళ్ళలో పడి చేసిన "భులుక్కు" మన్నశబ్దం కూడా అక్కడ స్పష్టంగా వినిపిస్తోంది.

భేతాలుడి బుజాన్ని చుట్టి ఉన్న కన్నయ్య దండ, హఠాత్తుగా - గాలిపోసుకున్న తెరచాపకు కట్టిన డమాన్తాడులా - బిర్రబిగిసింది. భేతాలుడికి ప్రాణ భయం పట్టుకుంది. కన్నయ్య తనని చంపెయ్యడానికే ఇక్కడకి తీసుకువచ్చాడేమో నన్న ఆలోచన వచ్చింది. వెంటనే వాడికి భయంతో  పై ప్రాణాలు పైకే పోయాయి. సముద్రపుగాలి చల్లగా వీస్తున్నా కూడా వాడికి నుదుట చెమటలు పట్టాయి. కాళ్ళల్లో ఒణుకు పుట్టింది.

కన్నయ్య పక్కకు తిరిగి, వాడి ముఖంలోకి సూటిగా చూసి అన్నాడు ...

"ఏరా తెంపి! ఎన్నివేల గుండెలున్నాయిరా నీకు, నా రాదమ్మనలా అవుమానం సేయ్యడానికి?!  గెట్టిగా ఒక్కదెబ్బ కొడితెసాను, నీళ్ళైనా అడక్కుండా - ఎంటనే మట్టిగరిసి సత్తావు! నీ పెద్దోల్లని తలుసుకుని నిన్నీపాలికి ఇడిసిపెడుతున్నా. మల్లీగీని ఎదవ్వేసాలేస్తివా, ఇక నిన్ను ఛమించేది లేదు. నీ గుండెల్లో వొంకాయి దీసి, నీసేతనే తినిపిస్తా, బద్రంగుండు."

భేతాలుడు ఏ జవాబూ చెప్పకుండా స్థాణువులా నిలబడి ఉండడంతో, "తెలిసిందా" అంటూ కన్నయ్య ఒక్క కేకపెట్టాడు. ఇక తప్పనిసరిగా వాడు "తెలిసింది" - అన్నట్లుగా తలూపాడు.

"ఇకనుండి రాదమ్మ కనిపించినప్పుడు తల్లిని, చెల్లిని గుర్తుచేసుకో! పాపిష్టి నాయాలా! థూ! నీలాటోడు రేవుకి ఒక్కడుంటే శాను, రేవు మొత్తానికే అవుమానం! ఇసీ" అంటూ, భేతాలున్ని అక్కడే వదిలి, కన్నయ్య పెద్దపెద్ద అంగాలు వేసుకుంటూ వేగంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

గండం గడిచినందుకు సంబరపడ్డాడు భేతాలుడు. కాని వాడి బుద్ధి ఇంకా పెడదారినే ఉంది. తను చేసింది తప్పన్న ఆలోచన వాడికి లేనేలేదు. తనకే ఎదో, జరగరాని అవమానం జరిగిపోయినట్లుగా బాధపడుతున్నాడు వాడు. కన్నయ్యతో ముఖాముఖీ తలపడడం తనవల్ల నవ్వదన్నది వాడికి బాగా అర్థమైపోయింది. ఇకపోతే, మాయామర్మాలు తెలియని కన్నయ్యను యుక్తితో కొట్టాలనుకున్నాడు వాడు.

"కాసుకోరా కన్నయ్యా! నాగుబాముతో ఇరోదమిది! సమయం రానీ సెవుతా నీపనీ, నీ రాదమ్మ పనీ ...  నీకు కండబలం ఎక్కువైతే, నాకు బుద్ధిబలం ఎక్కువ. కాస్కో, నిన్ను యుక్తితో నిన్ను ఎలా మట్టి కరిపిస్తానో సూస్కో" అంటూ సవాలు చేశాడు భేతాలుడు.

############

రాజీకి కూడా పెళ్ళయ్యింది. ఈసారి వచ్చిన ఓలి డబ్బుతో వడ్డీవ్యాపారం మొదలుపెట్టాడు రుద్రయ్య. క్రమంగా అతని ఆర్ధిక స్థితి మెరుగయ్యింది. గతాన్ని మరిచిపోయి, డబ్బుని చూసి సంతోషించడం నేర్చుకుంది అచ్చమ్మ. కాని అంత ఆనందంలోనూ, ఎదలో ముల్లులాంటి అంశం ఒకటి ఉండిపొయింది. అది - పెళ్లై ఏడు సంవత్సరాలైనా కూడా చుక్కకు సంతానం కలగకపోడం! చుక్క పరిస్థితి గుర్తువచ్చినప్పుడల్లా, గతం సెలవేసిన ములికిలా "కలుక్కు" మని ఆమె మనసును ఇబ్బంది పెట్టేది. అంతేకాదు, మొదటి భార్య రోగిష్టిది కావడం చేత పిల్లలు కలుగలేదనీ, ఇప్పుడు ఈ రెండవభార్య, (చుక్క) కూడా గొడ్రాలే అయ్యిందనీ గౌరయ్య ఎక్కడో అన్న మాట నెమ్మదిగా అచ్చమ్మ చెవిని చేరింది. అది ఆమెను మరింతగా బాధపెట్టింది. కూతురు పరిస్థితి ఏమిటో డాక్టరుకి చూపించి అసలు సంగతి తెలుసుకోవాలనుకుంది అచ్చమ్మ.

ఊళ్ళోని ఒక డాక్టరమ్మ ఇంట్లో అచ్చమ్మకి చేపల వతనుంది. ఆమె ధరను గురించి అంతగా పట్టిoచుకునేదికాదు. కాని, తూకాన్ని గురించి బాగా నిక్కచ్చిగా ఉండేది. ఏపాటి తీరుబడివున్నా, తూకం దగ్గరుండి చూసుకునేది. అలాంటి సమయంలో ఒకరోజు చుక్కను గురించి ఆమెతో చెప్పింది అచ్చమ్మ.

ఆమె సలహామేరకు కూతుర్ని, అల్లుడిని వైద్యపరీక్షలకు తీసుకువెళ్ళింది అచ్చమ్మ. రిపోర్టులు కూడా వచ్చాయి. ఆ రిపోర్టులు చూసి చెప్పింది డాక్టరమ్మ ...చుక్కలో ఏ లోపం లేదనీ, ఉన్న లోపమంతా ఆమె భర్తలోనే ఉందనీ - చెప్పింది. తిరుగులేని తీర్పది!

డాక్టర్ మాటలకు చుక్క నిస్త్రాణ పడిపోయింది. రిపోర్టులన్నీ చేతపట్టుకుని ఏడుపు ముఖంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో గౌరయ్య ఇంట్లోనే ఉన్నాడు. ఇక ఈ జన్మకి అతనికి పిల్లలు కలిగే యోగం లేదన్న వార్త అతనికి చెప్పి ఏడ్చింది చుక్క.. అది అతనికి కూడా దుఃఖాన్ని కలిగించింది. ఏభై సంవత్సరాలు దాటిన గౌరయ్యకు తొలిసారిగా అనిపించింది- తానింత చిన్నపిల్లని పెళ్ళాడి చాలా పెద్ద తప్పు చేశాడని...

ఆమెకు తనకు మధ్య సుమారుగా ముప్పది ఏళ్ళు వ్యత్యాసం ఉంది. ఆమెది తన కూతురు వయసు! ఆమె కింకా నిండు జీవితం ముందుంది, తను మరికొన్ని ఏళ్లలో అరవై ఏళ్ళు పూర్తిచేసుకుని, వృద్ధాప్యంలో ప్రవేశించ నున్నాడు! ఆమెకంటే ముందుగా తను స్వర్గానికి వెళ్ళడం ఖాయం. అప్పుడు ఆమె ఒంటరి! తామిద్దరూ ఉన్నప్పుడే పారాడే పసిబిడ్డలేక ఇల్లు నిప్పచ్చరంగా ఉండి. పిల్లల ఆటలు, అలరింపులూ శూన్యమై - ఈరోజుకు, మరో రోజుకు మధ్య తేడాయే ఉండటంలేదు. ఇక తనుకూడా లేనప్పుడు ఆమె ఎలా బ్రతకగలదు!

"చుక్కా!" అంటూ ఆక్రోసించింది అతని మనసు. "తప్పు చేశాను. ఈ తప్పును దిద్దుకునే దారి ఏదైనా ఉందేమో పంతులుగారిని అడగాలి" అనుకున్నాడు గౌరయ్య.. అతని మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది.

############

తెల్లవారకముందే వానరాజు ముఠాలో ఒకడిగా కన్నయ్య సముద్రం మీదకు వేటకు వెడితే తిరిగి వచ్చేది సూర్యుడు పడమరకు తిరిగాకనే. సూర్యుడు నడినెత్తి మీదకు రాగానే పిల్లలకీ అత్తగారికీ భోజనాలు పెట్టేసేది రాధమ్మ. తనుమాత్రం కన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ ఉండేది. అతడు వచ్చాక ఇద్దరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవారు. ఆ తరవాత ఒక గంట, రెండుగంటలసేపు విశ్రాంతిగా - తల్లితో, పెళ్ళాంతో పిల్లలతో సరదాగా గడిపి, సాయంకాలం అయ్యాక మళ్ళీ స్వంత దోనేమీద వేటకని సముద్రం మీదికి వెళ్ళేవాడు కన్నయ్య. ఆ ఇంట్లో ఒక్క ఎల్లమ్మ మాత్రమే మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోయేది. ఎల్లమ్మ కొడుకు చెప్పాడని సాయంకాలం పెత్తనాలు మానేసి, కోడలికి సాయంగా ఇంట్లోనే ఉండిపోతోంది. ఏ పర్వదినం వచ్చినప్పుడో తప్ప, ఆమె రామమందిరంకి కూడా వెళ్ళడం లేదు.

ప్రతి రోజూ సాయంకాలం నాలుగు అయ్యేసరికి రెండవసారి వేటకని బయలుదేరుతాడు కన్నయ్య. సంసారం పెరిగినకొద్దీ సంపాదనకూడా పెరగక తప్పదు కదా! ఎలాగైనా పొదుపుచేసి, నాలుగురాళ్ళు వెనకేసి, స్వంతానికి ఒక వేటపడవ కొనాలనే ఆలోచనతో ఉన్నారు వాళ్ళు.

సాయంకాలం కన్నయ్య వెళ్ళాక రాధమ్మ ఒక గంటసేపు పిల్లలకు పాఠాలు చెప్పేది. ఆ తరవాత వంట మొదలెట్టి, కన్నయ్య తిరిగి వచ్చేలోగా భోజనం సిద్ధం చేసి ఉంచేది.

ఎల్లమ్మకి ఆ వేళ ఉప్పుకూర మీద భ్రమారింది. "రాదమ్మా! నువ్వు ఉప్పుకూర వండి శాన్నాల్లయ్యిమ్ది కదూ" అంటూ తన మనసులోని కోరికను గుంభనంగా వెళ్ళబెట్టింది.

రాధమ్మ నవ్వుకుంది. "అదెంత భాగ్యం అత్తమ్మా! రేపే ఆ కూర వండుతా" అంటూ పిల్లల్ని ఆమెకు అప్పగించి ఉప్పుకూర కోసుకురావడానికి బుట్టపట్టుకుని బయలుదేరింది. దానిలో ఉన్న పోషకాలు, ఔషధ విలువలు తెలిసిన జనం దానిని అడపాతడపా వండుకు తింటారు. భాస్వరలవణాలకు కాణాచి ఉప్పుకూర!

సముద్రపువారనున్న ఇసుకలో పుట్టి, ఒక అడుగు ఎత్తువరకు పెరుగుతాయి ఉప్పుకూర దుబ్బులు. ఆ ఆకును పిండితే ఉప్పటి రసం వస్తుంది, అందుకే దానిని ఉప్పుకూర - అంటారు. దీనిని కూరగా వండినప్పుడు వేరే ఉప్పు దానికి చేర్చనక్కరలేదు. అంతేకాదు, ఉప్పు సమపాళంలో ఉండాలంటే ఈ ఆకులతోపాటు, సెనగపప్పు, కొబ్బరికోరు కూడా చేర్చి వండవలసి ఉంటుంది.

ఆ రోజు కన్నయ్య పంట పండ నందన్న దానికి సూచనగా, అతడు బయలుదేరి రేవును విడిచి రవంత ముందుకు సాగగానే, కడలమ్మ ఇష్టసఖి శఫరి (డాల్ఫిన్) సపరివారంగా ఎదురువచ్చింది. తిమింగలం జాతివైన శిశుకాలు తనకు దారి చూపుతున్నవాటిలా, తన దోనెకు ముందుండి నడిపించాయి. ఆ రోజు కన్నయ్య గాలానికి అరుదైన చేప ఒకటి చిక్కుకుంది. వేట బాగా సాగడంతో తొందరగా వేట ముగించి ఇంటి దారిపట్టాడు కన్నయ్య.

ఒడ్డు చేరువౌతూoడగా ఒక ఆడమనిషి రేవులో నిలబడిఉడడo తెలిసింది. ఆమె రాధమ్మే అనుకున్న కన్నయ్య. కాని ఒద్దు దగ్గరకు రాగానే తెలిసింది ఆమె ఎవరో!

తుమ్మల రేవుకి వెళ్ళే దారి పొడుగునా ఏపుగా పెరిగిన ఉప్పుకూర దుబ్బులు చాలాఉన్నాయి. వాటిమధ్య తిరుగుతూ, నేవళీకంగా ఉన్న చిగుళ్ళను కోసి బుట్టలో వేస్తోంది రాధమ్మ.

అక్కడక్కడా చిన్నచిన్న తాడిచెట్లు గుంపుగా పెరిగిఉన్నాయి. ఇంకొంచెం ముందుకు నడిచేసరికి ఆ తాడిచెట్ల చాటున ఎవరో మాటాడుకుంటున్నట్లుగా తెలిసింది, కాని, దట్టంగా పెరిగిన చెట్లు అడ్డురావడం వల్ల మనుష్యుల వైనం తెలియలేదు రాధమ్మకి . కాని మగమనిషి కంఠస్వరం అచ్చంగా కన్నయ్య గొంతు లాగే ఉందేమిటి - అని విస్తుపోయింది రాధమ్మ. తాడి చెట్లను చాటు చేసుకుని మరి రెండు అడుగులు ముందుకు నడిచింది. అప్పుడు స్పష్టంగా తెలిసింది రాధమ్మ కు - ఆ చెట్లచాటున నిలబడి మాటాడుకుంటూన్నది మరెవరో కాదు, చుక్కా కన్నయ్యలే నని!

కన్నయ్య అంటున్నాడు," సుక్కా! నువ్వలాంటి మాటలు నాతో సెప్పకూడదు, నేనయ్యి నా సెవులతో ఇనకూడదు; మా సెడ్డ అపశారమౌద్ది!"

"కన్నయ్యా! నువ్వే నన్ను కాదంటే ఇంక నా గతేమిటి? సొంతానికి సంతానం కలగకపోతే దరమసంతానం తప్పుకాదంట! మన పురాణాల్లో శానా మంది గొప్పగొప్పోల్లు అలా దరమానికి పుట్టినోల్లేనంట! నా ప్రేర్దన ఇనుకో కన్నయ్యా!"

రాధమ్మకి వాళ్లకీ మధ్య దట్టంగా పెరిగిన తాడిచెట్లు అడ్డంగా ఉండడంతో ఒకరికొకరు కనిపించకపోయినా, మాటలు మాత్రం చక్కగా వినిపిస్తున్నాయి. రాధమ్మ చెట్టు చాటున నిశ్శబ్దంగా నిలబడి వాళ్ళ మాటలు వినసాగింది. చుక్కా కన్నయ్యలు ఒకనాడు ప్రేమించుకున్నారన్న సంగతి, ఆమెకు బెస్తవాడ అమ్మలక్కలద్వారా ఎప్పుడో తెలిసింది. అందుకనే, చుక్క ప్రతిపాదనకు, కన్నయ్య జవాబు ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో వాళ్ళ మాటలు వింటూ అక్కడే నిలబడింది.

"అది తప్పు సుక్కా! నువ్వు పురానాలను గురించి మాటాడకూడదు. ఆ రోజులు ఏరు, ఆ పద్ధతులూ ఏరు. అయ్యి మనకు నప్పేయి కావు. మన మంచి సెబ్బరలు ఏరుగా ఉంటాయి. ఈ సంగతి గౌరయ్యన్నకు తెలిస్తే ఎంత ఔమానం! ఆ యబ్బి ఏమనుకుంటాడు? నీ కిలాంటి దురుబుద్ధి పుట్టిందేంటే! సీ! ఎలిపోయే" అన్నాడు కన్నయ్య.

"దరమ సంతానం తప్పు కాదంట కన్నయ్యా! పంతులుగోరిని గౌరయ్యే కనుక్కొచ్చి నాకు సెప్పేడు. దరమ సంతానంగా పుట్టినా, నా బిడ్డలు తన బిడ్డలే ఔతారంట! ఆ యబ్బే నన్ను నీకాడి కంపాడు, తెలుసా! పంతులుగారిని అన్నీ ఇవరంగా గౌరయ్యే కనుక్కు వచ్చాడు. దరమసంతానం ఇచ్చినోడిది కూడా పున్నెమేనంట! కన్నయ్యా, నువ్వు తప్పుసేసినట్టు అవ్వదు. మరి సూడు, గౌరయ్యకేమో బిడ్డలు కలగరంట, నాకేమో బిడ్డలు కావాలి! నేనేం సేయ్యాలి సెప్పు" అంటూ చుక్క బోరున ఏడవసాగింది.

కన్నయ్య కలవెళ పడ్డాడు."సుక్కా ! నన్ను ఛమించవే... మిగిలినోల్లకి తప్పోకాదో నాకు తెల్దు, కాని నాకిది తప్పే! నీ పెళ్ళప్పుడు నేను అచ్చమ్మత్తకి మాటిచ్చా - నిన్ను సొంత సెల్లెల్లా సూసుకుంటానని. ఎంతో కట్టపడి, నీ మీన నాకున్న ఇట్టాన్ని అన్నకు సెల్లెలిమీనుండే ఇట్టంగా మార్చుకున్నాను. ఆ తరువాతే రాదమ్మ ను పెళ్లి సేసుకున్నాను. నేను మాట తప్పితే నీకు, మీ యమ్మకు, రాదమ్మ కు కూడా సెబ్బర సేసినోన్నౌతా. సల్లని ఐరేని కుండల సాచ్చీకంతో, పెల్లిమండపంలో రాదమ్మ కు సేసిన ప్రమానీకాల్ని తప్పినోడి నౌతా!  ఇది మంచిదారి కాదు."

"మరేది మంచిదారి? తెలిస్తే సెప్పు" వెక్కిళ్ళు పెడుతూనే అడిగింది.

"అమ్మా అయ్యా లేని బిడ్డల్ని నీ బిడ్డలుగా సాకితే నీకు బిద్దలే కాదు, ఆల్లను రచ్చించిన పున్నెం కూడా దక్కుద్ది గందా!"

"అనాదల్నా! అమ్మా అబ్బా ఎవరో తెలియనోల్లని పెంచమంటావా? గౌరయ్య ఒప్పుకోవాలి గందా.."

"గౌరయ్య కాదంటే మా బిడ్డలలో ఒకర్ని, రాదమ్మ నడిగి నీకు పెంచుకోడానికిస్తా, సరా? తోడబుట్టినోడిలా నేను అన్ని వేళలా నీ సుకాన్నే కోరుకుంటా! నా కట్టాన్ని నువ్వుకూడా అర్ధం సేసుకో"

"చాలు! ఇక చాలు" అనుకుంది, చాటునుండి వింటున్న రాధమ్మ. సంబరంగా. నెమ్మదిగా సడీ చప్పుడూ లేకుండా వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయింది.

పడవలోని సామానంతా తీసుకుని కన్నయ్య ఇల్లు జేరుకునేసరికి రాధమ్మ నట్టింట సంధ్యాదీపం ముట్టిస్తూ కనిపించింది. రాధమ్మ గోముగా తనవైపు చూసి చిరునవ్వు నవ్వితే, దానిని ఆమె పలకరింపు అనుకున్నాడు అసలు విషయం తెలియని కన్నయ్య. రాత్రి పడుకోబోయేముందు రాధమ్మ కి చుక్క సంగతి చెప్పబోయాడు కన్నయ్య. అప్పుడు బయటపెట్టింది రాధమ్మ, తానూ అంతా వినేసిన సంగతి. అదంతా మళ్ళీ తన నోటితో చెప్పాలంటే కన్నయ్యకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆమె అర్థం చేసుకుంది. అందుకే తనకంతా తెలుసనీ, ఇక చెప్పొద్దనీ చెప్పి వారించింది. అరమరికలూ, అపోహలూ లేని అన్యోన్య దాంపత్యం వాళ్ళది.

.... సశేషం ....

Posted in May 2018, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!