Menu Close
anna-chelleli-gattu

ధారావాహిక నవల

గత సంచిక తరువాయి »

భేతాళుడు తన అనుభవాలంటూ చెప్పే కథలు వేరు విధంగా ఉంటాయి. తను సినిమాల్లో చూసినవి, ఇతరత్రా విన్నవి సాహస కృత్యాలను గుదిగుచ్చి, తన కల్పనలు జోడించి, వాటిని అద్భుతమైన తన అనుభవాలుగా చెప్పుకుని, తానొక కధానాయకుడైనట్లు బోర విరుచుకుని బెస్తవాడలో తిరిగేవాడు. మొగమ్మీదికంతా జులపాలు వేలాడేలా జుట్టు దువ్వుకుని, చేతికి (సరిగా టైం చూపని) వాచీ, కళ్ళకి చలవ కళ్ళజోడు, పేoటులో టక్చేసిన షర్టు, కాళ్ళకు బెల్టు షూస్ వేసుకుని, మొగానికి దిట్టంగా పౌడర్ రాసుకుని, బట్టలమీద (చవకబారు) సెంటు కొట్టుకుని, సిగరెట్టు కాల్చి విలాసంగా పొగ వదులుతూ “టింగ్ రంగా” అని వాడు తిరుగుతూ ఉంటే ... “చూడ రెండు కళ్ళు చాలవు” అని – తన గురించి తానే అనుకుని తన బుజమ్మీద తానే తట్టుకుని మురిసేవాడు భేతాళుడు.

యధార్ధాన్ని దాచి సింధుబాద్ సాహసయాత్రల ఒరవడిలో, తనగురించి తానే ఇష్టం వచ్చినట్ల కల్పించి గొప్పలు చెప్పుకునే భేతాలుని కథలు బెస్తవాడలోని వారిలో కొందరు నోరు తెరుచుకుని మరీ వినేవారు. క్రమంగా ఆ వినేవాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. "భ్రమర కీట న్యాయం"గా విని విని, నెమ్మదిగా వాళ్ళు అవన్నీ  నిజమేనని నమ్మడం మొదలుపెట్టారు. కాలక్రమంలో వాడికి సానుభూతిపరులు ఆపై, ముందువెనుకలు ఆలోచించకుండా గుడ్డిగా అభిమానించే "ఫేను"లు ఏర్పడ్డారు, "ఫేన్" అన్న మాటకి "ఫేనాటిజమ్" అన్నమాట మూలమేమో అనిపించేలా.

"రేయ్ భేతాళం! కేరలలో సేసిన రొయ్యిపప్పు మా సెడ్డరుసి గుంటది. అన్నేళ్ళు ఆడున్నావుగందా, అది ఎలా సెయ్యాలో నేర్సుకోలేపోయావంట్రా” అని గాని, ఖర్మంజాలక ఎవరైనా అడిగారంటే మాత్రం - ఇక వాళ్ళు వాడికి పరమ శత్రుకోటిలోవాళ్ళకిందే లెక్క.

వాడి మాటల మాయాలో పడి నీలమ్మ దగ్గర ఎవరైనా వాడిని పొగిడారంటే, వాళ్ళమీద విరుచుకుపడేది నీలమ్మ. “ఆడిని గురించి నాకాడ సెప్పమోకండి, ఆడి తంతంతా నా కెరికే! ఆడు, “తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు!”  నా కొంపమీన పడి పీకలదాకా తిని, పోసికోలు కబుర్లు సెప్పుకుంటూ తిరగడమే తప్ప, బతుక్కో దారి సూసుకోడం తెలియని ఎదవ సన్నాసినాయాలు ఆడు. సీ! ఎదవ జలం, ఎదవ జలమాని” అని, చీదరింపుతో అక్కడనుండి వెళ్ళిపోయేది.

#########

ఒకరోజు భేతాళుడు బెస్తవాడలో బేవార్సుగా తిరుగుతూండగా వాడి దృష్ఠి, ఇంటి గుమ్మంలో పదిమంది బెస్తవాడ పిల్లలకు చదువు చెపుతున్న రాధమ్మ మీద పడింది. బెస్తపడుచు లందరి మధ్య ప్రత్యేకంగా, "చుక్కల మధ్య చంద్రుడిలా" కనిపిస్తున్న ఆమెను చూసి, ఆమె ఎవరో, ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో తెలుసుకోవాలని వాడు తహతహలాడాడు. చాలామందిని అడిగాడు, కానీ ఇన్నాళ్ళూ వాడి కథలు విన్నావాళ్ళే ఇప్పుడు వాడికి కతలు చెప్పారు...

ఆమె ఒక మత్యకన్య అనీ, ఒడ్డుకు వచ్చి మనిషిగా మారి, కన్నయ్య నచ్చడంతో అతనికి పెళ్ళామయ్యిందని ఒకడు చెపితే; కాదు, కాదు - ఆమె మనిషేననీ, ఆవలి ఒడ్డు నుండి శఫరి (డాల్ఫిన్) వీపున ఎక్కించుకుని ఈ ఒడ్డుకి తెచ్చి వదిలి వెళ్ళిoదని ఇంకొకడు చెప్పాడు. “అదేంకాదు... ఎల్లమ్మ పిన్ని పొగలు రేత్తిరి కూడా రాములోరిని అడిగేది గందా, తనకొక కోడలు కావాలని, ఆమె ప్రార్థన విని రాములోరిచ్చిన వరం రాదమ్మ” అన్నాడు, వాళ్లలో రవంత తెలివి ఎక్కువున్నవాడు.

దగ్గరలో గోలీలాడుతున్న రాగమ్మ చిన్నకొడుకు విన్నాడు ఆ మాటలు. వాడూ ఊరుకోలేదు. వెంటనే ఆటాపి ఒక్కపరుగున వాళ్ళదగ్గరకు వచ్చి, “ఆళ్ళమాటలు నమ్మకన్నా! అన్నీ ఆబద్దాలే! రాదమ్మ మాయప్ప! సిన్నతనంలోనే కడలమ్మ అట్టుకెళ్లి శాన్నాళ్ళు పెంచి పెద్దసేసి, మళ్ళీ మా యమ్మకు అప్పగించినాది. మా యమ్మా, అయ్యా సేశారు రాదమ్మపెల్లి కన్నయ్యతో, తెలుసా! కావాలంటే నువ్వు మా యమ్మ నడుగు, సెప్పుద్ది” అన్నాడు.

ఇలా భేతాళుడి కబుర్లు నోరెళ్ళబెట్టి విన్నవాళ్ళే వాడికి మళ్ళీ రకరకాల కథలు చెప్పారు, ఆ దెబ్బతో భేతాళుడి తల గిర్రున తిరిగిపోయీలా. వాడు అడిగినచోటల్లా - ఏ ఒక్కరూ కూడా "నాకు తెలియదు" అన్నపాపాన పోలేదు. ఎదో ఒకటి కల్పించి చెపుతూనే వచ్చారు. ఒక్కటి కూడా పూర్తిగా నమ్మదగింది అనిపించలేదు భేతాలుడు. ఇక పడలేక చేతులెత్తేసి, ఇక అడగడం మానేశాడు.

#########

నీలమ్మకి ముగ్గురు కొడుకులు, ఆడపిల్లల్లేరు. ఇన్నాళ్ళూ వాళ్ళు తల్లితండ్రులకు సాయపడుతూ, కులవృత్తిని నేర్చుకుంటూ ఒద్దికగా ఉండేవారు. మేనమామ సావాసం వచ్చాక నెమ్మదిగా వాళ్ళు చాటునా మాటునా బీడీలు కాల్చడం, చెప్పకుండా డబ్బులు ఎత్తుకెళ్ళి సినిమాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. నీలమ్మ భర్త పోలయ్య భేతాళుడి మూలంగా పిల్లలు చెడిపోతున్నారని సణగడం మొదలుపెట్టాడు. కొడుకులు కూడా తమ్ముడిలా తయారౌతారేమోనన్న భయం పట్టుకుంది నీలమ్మకు కూడా. ఒకరోజు వీలుచూసుకుని వెళ్ళి కన్నయ్యని కలుసుకుంది...

“బాబూ, కన్నయ్యా! సూత్తన్నావు గందా, బేతాళుడు బొత్తిగా బాజ్జత తెలియకుండా తిరుగుతన్నాడు. నీకు పున్నెముంటాది, నువ్వు ఆడిని కూంతంత దారిలో ఎడితివా సచ్చి నీకడుపునుడతా. నువ్వు సిన్నప్పటి స్నేయితుడివి గందా, నువ్వు సేవితే ఇంటాడేమో... ” అంది.

ఎప్పుడూ గలగలా మాటాడుతూ ఉషారుగా ఉండే నీలమ్మ ఇలా దిగులుగా మాటాడితే తట్టుకోలేకపోయాడు కన్నయ్య. “ఓపాలి సెప్పి చూద్దారి లే... ” అనుకున్నాడు.

“నీలమ్మపిన్నీ! నువ్వు నన్నింతగా అడగాలా! తప్పకుండా నా ఒంతు ప్రెయెత్తనం సేస్తా. కానీ, ఇది నా వొల్ల నౌతాదనిపించడంలే. ఐనా నువ్వు నోరువిడిసి అడిగినావుగనక నా ఒంతు పని నేను సేత్తాను” అంటూ హామీ ఇచ్చాడు కన్నయ్య.

నిట్టూర్చింది నీలమ్మ. “మన ప్రెయత్తనం మనం సేద్దారి, ఆపై ఆడి నొసట రాసి ఉన్నది జరుగుద్ది. దానికి మనమేం సేయగలం” అంది.

ఆ మరునాడు పనిగట్టుకుని తీరుబడి చేసుకుని, వాడున్న చోటుకి వెళ్ళి, పలకరించి కుశలమడిగి, తనకు వేటలో తోడూరమ్మని పిలవాలి అనుకున్నాడు కన్నయ్య. తన కది కష్టమే ఐనా, నెమ్మదిగా మొదలెట్టి,  క్రమంగా వాడిని కులవృత్తిలో నేర్పరిని చెయ్యాలనుకున్నాడు.

భేతాళుడుకి ఎలా మేలుచెయ్యాలి - అని కన్నయ్య మనసుపెట్టి ఆలోచిస్తూంటే, భేతాళుడు కన్నయ్యకు ఎలా కీడు చెయ్యాలా - అని రకరకాల ప్లానులు వేస్తున్నాడు. ముఖ్యంగా రాధమ్మ రూపంలో కన్నయ్యకు పట్టిన అదృష్టాన్ని చూసి, వాడు ఎంతమాత్రం వోర్వలేకుండా ఉన్నాడు. మొరటు వాడైన కన్నయ్యని రాధమ్మ పెళ్ళాడిందంటే దానికి కారణం - సరైన సమయంలో తానిక్కడ లేకపోవడమేనన్నది వాడి పరిపూర్ణ విశ్వాసం.
చెమటలు కారేలా ఎండలో పడి పని చేస్తూ, కంపు కొట్టుకుంటూ తిరిగే మోటుమానిసి కన్నయ్యకూ, ఎప్పుడూ నీటుగా తయారయ్యి, షర్టుని, పేంటులో "టక్" చేసి, ఘుమఘుమలాడే సెంటు వాసనవేస్తూ, విలాసంగా సిగరెట్టు కాలిచి రింగులు రింగులుగా పొగ వదులుతూ "స్టైలు"గా మసిలే తనకూ సాపత్యం లేదనీ, తను కొంచెం చొరవ చూపితే చాలు, రాదమ్మ వచ్చి తన ఒడిలో వాలిపోతుందనీ కలలు కంటూ, ఆ కలలే నిజమని నమ్ముతున్నాడు భేతాళుడు.

కలల్లో తేలిపోతూ నీలమ్మ ఇంటివైపుగా వెడుతున్న భేతాళుడికి ఎదురుగా వచ్చిన కన్నయ్య, వాడి వెన్నుపై తట్టి, “ఏరా బామ్మర్దీ ! రేపు సందమాటేల మనిద్దరం నా దోనేమీన ఎల్లి  కుశాలుగా సముద్దరంలో సేపలు పడదారి. మరిసిపోక రేపు రేవు కాడికి రా” అన్నాడు కన్నయ్య.

భేతాళుడి ఆలోచనలు ఆదాటుగా దారిమళ్ళాయి. దోనేమీద సముద్రంలోకంతా వెళ్ళాక, చేపల్ని పడుతూ కన్నయ్య పరాకుగా ఉన్నప్పుడు వాడిని కత్తితో పొడిచేసి, చేపలకి మేతగా వేసేస్తే ఎవరికీ తెలియకుండా పని జరిగిపోతుంది కదా! అక్కడితో రాదమ్మ తనదవ్వడానికి ఉన్న ఒక్క అడ్డంకీ కూడా తొలగిపోతుంది - అన్న అమోఘమైన ఆలోచన వచ్చింది వాడికి. అంతలోనే మళ్ళీ వాడి మనసు వాడిని హెచ్చరించింది. తనకు దోనె నడపడం ఏమాత్రం రాదుకదా, ఇక ఒడ్డుచేరేది ఎలా - అన్న ఆలోచన వచ్చింది. అక్కడితో ఆ ఆలోచన విరమించుకున్నాడు.

కన్నయ్య భేతాళుడి బుజము చుట్టూ చెయ్యేసి, “ఏంట్రా అంతలా ఆలోసిత్తన్నావు, నీరంటే బయమా ఏంటీ” అని అడిగాడు, వాడిని రెచ్చగొట్టి ఒప్పించాలని.

“బయమా? నా కలాంటి బయాలేమీ లేవు. పిరికోణ్ణే ఐతే అంత దూరం - కేరల వరకూ ఒక్కణ్ణీ, అంత సిన్నప్పుడు ఎల్లగలిగేటోణ్ణా ఏంటి?” అంటూ బీరాలు పలికాడు భేతాళుడు.

“మరేంటి అంతలా ఆలోశన సేత్తన్నావు?”

“అదే, ఆ మలయాల జ్యోతిస్కుడు సెప్పిన ఇసయమే ఆలోసిత్తన్నా ... నేను కేరలలో ఉన్నప్పు డోపాలి గుడికెల్లా. ఆడ నో మలయాల జోతిస్కుడు నన్ను సూసి, “నీలో రాసకల ఉన్నాది. ఈ జలగండం గీని తప్పిపోతేశాను, నీకు రాజయోగం పడుద్ది! సముద్దరo నిన్ను మింగాలని సూత్తా ఉన్నాది, దానికి అందకుండా బతుకు” అన్నాడు. ఆ యబ్బి నాకు మలయాలమ్ లో సెప్పింది నేను నీకు మన బాసలో సెవుతున్నా. దాని గురించే నాకు కొంచెం ఆలోశనగా ఉంది, అంతే. సముద్దరమ్ కాడికి పోనని ఆయినకి మాటిచ్చా. - అని ఆలోసిత్తన్నా, అంతేగాని, నాకు బయమా!”

కన్నయ్య తెల్లబోయి, చేష్టలుదక్కి, వాడి మొహంలోకి చూస్తూ అవాక్కై నిలబడిపోయాడు. అలా ఎంత సేపు చూసినా కన్నయ్యకు వాడి మొహంలో ఎక్కడా రాచకళన్నది కనిపించలేదు.

“ఏంటిరా కన్నయ్యా! ఎందుకలా గుడ్లప్పసెప్పి సూత్తన్నావు? కేరల జోస్యం అంటే నీ కేటి తెలుస్తాది! గుడిపాము లాటోడివి, బయటి ప్రెపంచం నీ కేటెఱుకంట!” నవ్వుతూ ఏకసక్కెంగా మాటాడాడు భేతాళూడు కన్నయ్యతో.

కన్నయ్య జవాబు చెప్పలేదు. తరవాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

నీలమ్మ కనిపించగానే కన్నయ్య జరిగిన దంతా చెప్పాడు. ఉసూరుమంది నీలమ్మ. “ఎత్తుకు పై ఎత్తులేసే ఎదవ తెలివితేటలకేం తక్కువలేదు గందా, సచ్చినోడికి!” ఉసూరుమంది నీలమ్మ.

అక్కడితో వాడి పరిచయానికి ఉద్వాసన చెప్పెయ్యాలనే అనుకున్నాడు కన్నయ్య. కానీ భేతాలుడుమాత్రం కన్నయ్యని పట్టుకుని, పనసకాయ జిగురులా వదిలిపెట్టలేదు. స్నేహం వంకతో వాడు కన్నయ్య ఇంటికి రాకపోకలు సాగించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా రాధమ్మని పలకరించాలని చూసేవాడు. కానీ, ఇదివరకే వాటిగురించి విని ఉందేమో, రాధమ్మ వాడివైపు కన్నెత్తి చూడకుండా తప్పించుకు తిరిగేది. ఆపనీ ఈపనీ చక్కబెట్టుకుంటూ మెరుపుతీగలా తిరుగుతున్న రాధమ్మ సొగసుల్ని దూరంనుండే ఆబగా చూస్తూండేవాడు భేతాళుడు. వాడొచ్చి కన్నయ్యని గురించి అడిగితే ఎల్లమ్మ జవాబు చెప్పేది. అది వాడికి నచ్చేది కాదు.

ఎన్నాళ్ళు కన్నయ్య ఇంటి చుట్టూ తిరిగినా వాడికి రాధమ్మని పలకరించి మాటాడే అవకాశం దొరకలేదు. ఏ సలహాకో, సంప్రదింపులకో వచ్చిన జనం ఆమె వెంట ఎప్పుడూ ఉంటూనే ఉండీవారు. జనం దృష్టిలో ఆమె ఒక దేవత! ముందు ఆమెనాపీఠం మీదనుండి కిందకు దింపితేగాని ఆమెను తను అందుకోలేడనుకున్నాడు భేతాళుడు.

తనకు రాధమ్మతో ఏకాంతంగా మాటాడేందుకు ఒక్కటంటే ఒక్క అవకాశం దొరికితే చాలు, ఆపై తనకింక ఏ సమస్యా ఉండదు. సినిమా హీరోలా టిప్ టాప్ గా సెంటు వాసన వేస్తూ విలాసంగా ఉండే తనెక్కడ, ఉసూరుమంటూ ఎండనబడి తిఱగడం వల్ల భయంకరమైన చెమటకంపుకొడుతూ ఇంటికి వచ్చే కన్నయ్య ఎక్కడ! ఒక్కసారి ఆమె కనక తనవైపు కన్నెత్తి చూస్తే చాలు - కన్నయ్యను పెండ్లాడడంలో తనెంత తప్పు చేసిందో ఇట్టే తెలిసుకుంటుంది. అక్కడితో తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో, కన్నయ్య పిల్లల్ని కన్నయ్యకే వదిలేసి, తప్పకుండా తనతో వచ్చేస్తుంది. ఇది ఖాయం - అనుకోసాగాడు భేతాళుడు. పనీపాటా లేకుండా రోజంతా బేవార్సుగా తిరుగుతూ పొద్దుపుచ్చే భేతాళుడు, రాధమ్మమీద ఇలాంటి పగటికలలేన్నో కంటూ, గాలిమేడలు కట్టుకుంటూ రోడ్లవెంట తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు.

చిన్నప్పుడు బెస్తవాడనుండి తానూ, సముద్రుడు, కన్నయ్యా కలిసి బడికి వెళ్ళేవారు. ఈ ముగ్గురిలో సముద్రుడు చనిపోయాడు, తానేమో ఇలా పెళ్ళీ పెటాకులూ లేకుండా మోడులా ఉన్నాడు. ఒక్క కన్నయ్య మాత్రం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడు. వాడొక్కడే తమ ముగ్గురిలోనూ అదృష్టవంతుడు. రత్నమాణిక్యం లాంటి రాధమ్మ వాడికి భార్య అయ్యింది - అనుకున్నాడు భేతాళుడు బాధగా. వాడి మనసు ఈర్ష్యాసూయలతో నిండిపోయింది. వాడి వక్రదృష్ఠి రాధమ్మా కన్నయ్యల పచ్చని సంసారంపైన పడింది.

#########

పసిపిల్లకు జలుబుచేసి పక్కలు వెచ్చబడ్డాయి. ఊపిరాడకనో ఏమో తెగ ఏడుస్తోంది. రాధమ్మ మనసు మనసలో లేదు. పిల్ల పేరుమీద రామాలయంలో పూజ చేయిస్తానంటూ ఎల్లమ్మ మనుమడిని వెంటతీసుకుని రామాలయానికి వెళ్ళింది. పిల్లకు పాలవేళ కావడంతో పిల్లను ఒడిలో ఉంచుకుని, కొంగుకప్పి పాలుతాగించే పనిలోపడింది రాధమ్మ.

వేపచెట్టు మీద కూర్చున్న కాకి గొంతెత్తి గట్టిగా కూస్తోంది. వేప చెట్టు నానుకునున్న రావిచెట్టు ఆలులు గాలికి కదులుతూ చేస్తున్న చిరు సవ్వడి వింటూ రాధమ్మ పసిదానికి పాలు తాగిస్తోంది. కన్నయ్యతో తన పెళ్ళి జరిగిన కొత్తలో ఆ రెండుచెట్లనీ కలిపి గుమ్మానికి ఎదురుగా, కొంత దూరంలో నాటి పెంచింది ఆమె. అవి ఒకదానినొకటి పెనవేసుకుంటూ గున్నల్లా పెరిగాయి. వాటి మీదినుండి వీచే గాలితో ఆరోగ్యకరమైనది అని ఆమె నమ్మకమ్!

అటూ ఇటూ మేతకని వెళ్ళిన కోళ్ళు మేత ముగించి ఇంటికి తిరిగివచ్చినడానికి గుర్తుగా "కొక్కొ క్కొక్కో, క్కొక్కో" మని లయబద్ధంగా శబ్దం చేస్తున్నాయి. కానీ అంతలోనే అవి చెదిరి గోలగా అరుస్తూ పరుగులుపెట్టాయి, ఎవరో కొత్త మనిషి గుమ్మంలోకి చ్చాడన్నదానికి గుర్తుగా. రాధమ్మ గమ్మున లేచి, పిల్లను ఉయ్యాల లో పడుకోబెట్టి, చీర సద్దుకుని నిలబడింది. ఉయ్యాలాలో పిల్ల ఏడవసాగింది.

"కన్నయ్య ఉన్నాడా రాదమ్మా!" అంటూ చనువుగా లోపలకు వచ్చాడు భేతాళుడు, ఇన్నాళ్ళకి, వాడికి తాను రాధమ్మతో కోరుకున్న ఏకాంతం లభించిందన్న సంతోషంతో ఉప్పొంగిపోతూ... పొద్దువాలాగానే కన్నయ్య దోనె వేసుకుని వేటకని సముద్రం మీదికి వెడతాడని వాడికి తెలుసు. ఇక పోతే ఎల్లమ్మ నానిని వెంట తీసుకుని గుడికి వెళ్ళడం చూశాడు వాడు. కన్నయ్య ఇంటి చుట్టుపక్కలకూడా జనం ఎవరూ లేరు. రాధమ్మ ఒంటరిగా ఉంది. ఇంత మంచి సమయం మించిపోతే మరి దొరకదని కంగారుగా ఇటు వచ్చాడు భేతాళుడు.

"ఇంట్లో లేడన్నా! సముద్రం మీదకి వేటకెళ్ళాడు. పనేదైనా ఉందా" అని అడిగింది రాధమ్మ.

భేతాళుడు గతుక్కుమన్నాడు. అది కన్నయ్య ఇంట లేనందుకు కాదు, రాధమ్మ వాడిని "అన్న" అన్నందుకు. మళ్ళీ తనకు తానే సద్ది చెప్పుకున్నాడు, "ఆ - ఈ శెబ్దాలన్నీ ఉట్టి "గేసే" గoదా! ఇయన్నీ ఒట్టి గాలిమాటలు.  అలవాటుగా నోటెంబడి తుస్సూ, తుస్సూ ఒచ్చేస్తూంటాయి. అసలైనది ఏరే ఉంటాది, అది ఆయమ్మి గుండె సప్పుడు. అది ఏటంటాదో అదీ ముక్యెమ్ "అనుకున్నాడు మనసులో...  పైకిమాత్రం, " అయ్యో! అప్పుడే ఎలిపోయాడా! ఇయ్యేల నన్ను రమ్మన్నాడు గందా, ఇదేంటి" అన్నాడు. కానీ అంతా ఉట్టిదే!

మళ్ళీ వెంటనే, "ఆదేపోయినాదిలే! రోపెడతా ఏటకి. ఏడుస్తాయండి, పిల్లని నాకియ్యి, నే పండేస్తా. నాకు నువ్వు అగ్గిపెట్టి తెచ్చియ్యి, సిగరెట్టు కాల్సుకోవాల" అంటూ రాధమ్మకు దగ్గరగా వచ్చాడు భేతాళుడు.

కడుపు నిండకముందే ఉయ్యాలాలో పడుకోబెట్టినందుకు ఏడుస్తున్న పసిపిల్లను సముదాయించాలని జోకొడుతూ అంది రాధమ్మ, "పసిపిల్లలున్నచోట పొగ తాగ కూడదు. దీనికి అసలే ఒళ్ళు బాగాలేదు. వీధి తలుపు పక్కనున్న ఉగ్గుబల్ల మీదుంది అగ్గిపెట్టి. అది తీసుకొని బయటికెళ్ళి సిగరెట్టు కాల్చుకో అన్నా!" అంది సౌమ్యంగా. కానీ వాడి ఉనికి ఆమెకు నచ్చలేదు. కన్నయ్య ఇంట్లో లేడని చెప్పేక కూడా వెళ్ళిపోకుండా ఆగడం అసలు నచ్చలేదు ఆమెకు. మనసులో గిజాటుపడుతున్నా శాంతాన్ని కోల్పోదల్చుకోలేదు ఆమె.

ఏకాంతంలో రాధమ్మను కలుసుకున్నప్పుడు ఏం మాటాడాలి, ఎలా మాటాడాలి - అన్నదానిమీద ముందుగానే ఎన్నెన్నో "రిహార్సల్సు" వేసుకున్నాడు భేతాళుడు. కానీ, ఇప్పుడు వాడికి, అప్పుడు వల్లించిన వాటిలో ఒక్కముక్క కూడా గుర్తుకి రావడం లేదు. ఏదో తోచిందల్లా మాటాడెయ్యడమేతప్ప మరోదారి కనిపించలేదు వాడికి. ఆలస్యం చేస్తే ఎవరైనా రావచ్చు. రాకరాక వచ్చిన ఒక్క అవకాశం చేజారిపోతుందేమోనని వాడు కంగారుపడ్డాడు.

భేతాళుడు దురూహతో వచ్చాడన్న సంగతి రాధమ్మ కనిపెట్టింది. "పరాయివాడి పెళ్ళాం చెల్లెలితో సమాన"మన్న బెస్తవాడ మర్యాదని, బెస్తకులంలో పుట్టికూడా, గౌరవించని భేతాళుణ్ణి చూస్తే ఆమెకు అసహ్యం పుట్టింది. ఎల్లమ్మ ఇంట్లో ఉంటే ఈ పరిస్తితి వచ్చేది కాదుకదా - అని బాధపడింది మనసులో. ఇలా ముసుకులో గుద్దులాటలా ఊహాగానాలు కాకుండా, వాడి మనసులో ఏముందో బయటకులాగి తగిన బుద్ది చెప్పాలని గట్టిగా నిర్ణయించుకుంది రాధమ్మ. ఇప్పుడు తనకు సాయపడేందు కెవరూ లేరు ఈ చుట్టుపక్కల. ఇక తనకుతానే ఈ ఇబ్బందిని దాటాలనుకుంది.

"అన్నా! కన్నయ్య ఈ సమయంలో సముద్రం మీద వేట చేస్తూ ఉంటాడని నీకు తెలియదా? అసలే పిల్ల ఊపిరాడక ఏడుస్తోంది, దానికి వల్లమాలిన కొత్తవుంది. అది నీ దగ్గరకు రాదు. ఇంక నువ్వు వెళ్ళిపోయి రేపు కన్నయ్య ఉన్నప్పుడు రా" అంది.

ఇక ఆలస్యం చేయకూడదు - అనుకున్నాడు భేతాళుడు. "అదేం మాట రాదమ్మా! నేనేమైనా పరాయోడినా ఏంటీ?! ఐనా నే నొచ్చింది ఆడికోసం కానేకాదు, నీకోసం! రెండూసులు నీ సెవినేసి పోదారని ఇటొచ్చా ... నువ్వoటే నాకు శానా శానా ఇట్టం! ఇట్టమేంటి - ప్రేనమే! అమ్మతోడు!! దినామూ నువ్వుపడే కట్టాలు కల్లారా సూడలేకపోతన్నా. ఓపాలి నా గుండెకాయ మీన సెయ్యేసి సూడు, నువ్వు పడే కట్టాలు  సూసి, అది లబుకూ - డబుకూ మంటా ఎలా ఏడుస్తా ఉన్నాదో నీకే తెలుస్తాది. కన్నయ్య ఒట్టి మొరటోడు. నీలాంటి నాజూకుమనిసిని ఎలా సూసుకోవాలో ఆడికేం తెలుస్తాది? నాతో ఎలిపోయొచ్చెయ్యి రాదమ్మా! నీకు సొరగం సూపిత్తా! ఈడుండొద్దు మనం. సక్కగా, సెట్టాపట్టాలేసుకుని మనిద్దరం, గాలిలో ఎగిరే పచ్చుల్లా సేచ్చగా కేరల ఎలిపోదారి. ఆడ బలేగుంటది. ఎటు సూసినా నీల్లు, కొబ్బరితోటలు, అరటి తోటలు, సముద్దరంలో రకరకాల రొయ్యలు, సిత్తర విసిత్తరాలైన సేపలు... వాహ్! ఒకటేంటిలే! ఈడ అంటిన జిడ్డు ఈడనే ఒగ్గేసి, రాదమ్మా! నాతోరాయే" అంటూ భేతాళుడు ఆమె చెయ్యి పట్టుకోబోయాడు ...

వాడు ఒక్కొక్కమాట అంటూండగా విశాలమైన రాధమ్మ కళ్ళు మరింత విశాలమై, కోపంతో ఎర్రబడసాగాయి. నిప్పులు కురిసే కళ్ళతో వాడివైపు తీక్షణంగా చూసింది రాధమ్మ. వాడు మాటలధోరణిలో అది గమనించలేదు. వాడి చేయి ఇంకా తనకు తగలకముందే, శక్తినంతా కూడదీసుకుని, చేయెత్తి బలంగా తన కుడిచేత్తో వాడి ఎడమ చెంపపై, తీసిపెట్టి ఒక్క దెబ్బ కొట్టింది రాధమ్మ. చెంప "ఛెళ్ళు"న మ్రోగింది.

ఊహించని ఈ హఠాత్పరిమాణానికి దిమ్మతిరిగిపోయిన భేతాలుడు కొయ్యైపోయాడు. దెబ్బ తగిలిన చోట నోటిలోని పళ్ళన్నీ కదిలిపోవడంతో, చెoపకి చేతిని అదిమిపెట్టి, కొయ్యబారి నిలబడిపోయాడు వాడు.

భేతాళుడు తెలివిలోకి రాకముందే ఉయ్యాలాలో పడుకుని ఏడుస్తున్న బిడ్డను లేవదీసుకుని బుజానవేసుకుని, తన పక్కనే, దగ్గరలో ఉన్న దొడ్డిగుమ్మం తలుపు తెరుచుకుని వేగంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది రాధమ్మ.

రాధమ్మ ఇచ్చిన ఈ అనుకోని పురస్కారానికి భేతాళుడి దిమ్మతిరిగిపోయింది. దవడ పట్టుకుని, కొయ్యబారి, కొంతసేపు అలా నిలుచున్నచోటనే నిలబడిపోయాడు. వాడు తేరుకుని చూసేసరికి రాధమ్మ అక్కడ లేదు. రాధమ్మ కొట్టిన దెబ్బకు పళ్ళు కదిలిపోడంతో బూరెలా పొంగిన చెంప జివ్వున లాగేస్తోంది. చేతికి దొరికిం దనుకున్న “పిట్ట“, ఇట్టే తప్పించుకుపోయిందని ఉక్రోషంతో ఊగిపోయాడు వాడు. వల్లమాలిన పగతో రగిలిపోతోంది వాడి అంతరంగం.

“అమ్మనీ ...! తప్పించుకుపోయానని సంబరపడిపోకే రాదమ్మా! సమయం వచ్చాక తెలుస్తాదిలే ఈ బేతాలుడి పగేలాగుంటదో, కాసుకో...  ఇంత కింతా దెబ్బతియ్యక వదలను. నీకు తెలదుగాని, నువ్వు తాసుపాముతో సెలగాటానికి దిగావు, కపడ్దార్!“ అంటూ రాధమ్మ నుద్దేసించి స్వగతం చెప్పుకుని, వడివడిగా అక్కడనుండి వెళ్ళిపోయాడు భేతాలుడు.

.... సశేషం ....

Posted in April 2018, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *