Menu Close
Ankurarpana Page title

అంతర్జాల ఆటలు

నేడు చరవాణికి ఎంత అలవాటు పడ్డారో..అంతకు రెట్టింపుగా ఈ అంతర్జాల ఆటలకు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్లవరకు అందరూ బానిసలయిపోయారనే చెప్పాలి..ముఖ్యముగా పిల్లలు. సమయము చిక్కితే చాలు...నాన్న ఫోనో...అమ్మ ఫోనో తీసుకోవడం...తీక్షణముగా ఆటలు ఆడేయడం...ఇది ఒక అలవాటుగా మారిపోయింది వాళ్ళకు. ఆ కదిలే బొమ్మల వెంట తమ సున్నితమైన కళ్లను...చక్రాల వలె అతివేగముగా త్రిప్పుతూ... మరొక రెండు కళ్లను [కళ్ల జోడు] అతికించుకుంటున్నారు. నాజూకయిన చేతి వేళ్ళను ఆటకి అనుగుణముగా ఎన్నో ఒంపులు..ఓంకారాలు తిప్పుతూ...నరాల బలహీనతలను కొని తెచ్చుకుంటున్నారు...ఇది అంతా ఒక ఎత్తయితే ఈ మధ్య ఒక అంతర్జాల ఆటకు బానిసగా మారి..ఆరవ..ఏడవ తరగతికి చెందిన ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించిన విషయము నన్ను చాలా కలవర పరిచింది. ఒక ఆట వలన ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము అంటే... అసలు ఎటువైపు పయనిస్తున్నాము మనము? చెడు ఆలోచనలను రేకెత్తించే ఇలాంటి ఆటలు మన పిల్లలు ఆడకుండా ఎందుకు నియంత్రించ లేకపోతున్నాము... అసలు పిల్లలకు ఈ ఆటలాడే అలవాటు ఎలా వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం పెద్దలమైన మనమే అంటాను నేను.. పిల్లలు అల్లరి పెట్టకుండా బుద్దిగా ఉంటారని.. మారాము చేయకుండా భోజనము చేస్తారని..మనకి ఇష్టమయిన కార్యక్రమము టి‌విలో చూడనిస్తారని.. శుభకార్యాలలో మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటారని ..ఇలా రకరకాల కారణాల వలన మనమే పిల్లలకు ఈ అంతర్జాల ఆటలను అలవాటుచేశాము..అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యవచ్చు! మరి పిల్లలు అల్లరిని కట్టడి చేసేది ఎలా అని? మన చిన్నతనములో ఇలాంటి ఆటలు ఆడే ఎదిగామా? మనము బుద్దిగా పెరగలేదా? ఒకసారి మనము ఆవైపుగా ఆలోచించాలి! పిల్లలతో నేడు తల్లితండ్రులు ఎంత సమయాన్ని గడుపుతున్నారో..ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అపార్ట్మెంటులలో ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుని ఉండే వైఖరిని మానుకుని...అందరి పిల్లలని బయట ఆడుకునేటట్లు ప్రోత్సహించాలి...మనము చిన్నప్పుడు ఆడుకునే ఆటలను వాళ్ళకు నేర్పించాలి..అవసరమయితే వాళ్ళకు అలవాటయిన వరకు మనము కూడా ఉండి ఆడిపించాలి...ఇది పిల్లలకే కాదు..ఇంటా బయట ఒత్తిడి తో సతమవుతున్న పెద్దలకు కూడా కొంత ఉపశమనము కలుగుతుంది. మారుతున్న కాలముతో పాటు, జీవన ప్రమాణాల మెరుగుతో పాటు మనమూ మారాలి కాదనను. కానీ ఆ మార్పు పెడదారిన పడకుండా చూడవలసిన బాధ్యత కూడా మనదే కదా! పిల్లలు బయట ఆటలలో ఉండే మాధుర్యము చవిచూసిన తరువాత ఆ ఆటలను విడిచిపెట్టమన్నా విడిచిపెట్టారు..ఒకసారి మన చిన్నతనాన్ని గుర్తు చేసుకోండి. మన తల్లిదండ్రులు మనల్ని ఆడుతున్నపుడు ఇంటికి రప్పించుకోవడానికి ఎన్ని అవస్థలు పడేవారో! ఇంకా పిల్లలకి మంచి పుస్తకాలు చదివే అలవాటు చెయ్యవచ్చు..ఇలా ప్రత్యామ్నాయాలు ఎన్నో! మనసుంటే మార్గాలెన్నో ఉన్నాయి...ప్రయత్నించి చూద్దాము..పోయేదేముంది!

Posted in April 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!