Menu Close
Kadambam Page Title
అందిన ద్రాక్ష
వెంకట వరలక్ష్మి కామేశ్వరి వెలగలేటి

ఏదో సాధించాలని
ఇంకేదో పొందాలని
తెల్లని కాగితపై నల్లని గీతలు గీశా
ఉండలు చుట్టా...
చుట్టూ విసిరా ...
విసిగి వేసారా...
జాలిగా చూసే నాముందు
నిలిచింది వెక్కిరిస్తూ...
శిఖరంలా కాగితాల గుట్ట ....
అయోమయంతో నిస్తేజం ఆవరించగా
చెత్తబుట్ట వంక దీనంగా చూస్తున్న నా ముందు
వెటకారం చేస్తూ సీతాకోకమ్మ
ఒక్క క్షణం కనురెప్పలు మూశా
నా జ్ఞాపకాల పుటలో బందీ చేశా
గుడ్డుగ పుట్టా ....లార్వా నయ్యా....
ప్యూపాగా తపమే చేశా.... కోరిక కోరా...
రంగుల రెక్కల ఆశలు తొడిగా....
అవతారం మార్చా...
అవలీలగ ఎగిరా....
అవధులులేని సుదూర తీరాలకేగా
అందమైన అద్భుత దృశ్యాలను గాంచా
నవ రాగాలాపన చేస్తూ అన్వేషించా
కనురెప్పల మాటున కన్న కలలన్నిటిని
సాకారం చేయగ దీక్షను బూనా....
మనో నిశ్చయంతో ముందుకు సాగా ....
వెన్నెల రేనికై వేచిన నల్లని కలువలు
పాడిన నిశి రాతిరి వేదం విన్నా...
లక్ష్యాన్ని ఛేదించా...అందలాలను ఎక్కా....
అందని ద్రాక్షను చటుక్కున అందుకున్నా
ఆనందపుటంచులు తాకా...
నన్ను నేను నిరూపించుకుంటూ...
గెలుపు బాటలో ఆగక పరుగులు పెడుతూ...

Posted in August 2021, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!