Menu Close
Kadambam Page Title
అమ్మది ఒక్క రోజేనా?
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

మనని కన్నదగ్గర నుండి పెంచి పెద్ద చేసేంతవరకు,
ఆపై మనం పెద్దయ్యాక కూడా తను కనులు మూసేంతవరకు,
మనవల్ల అనేక శోకాల్నిచవిచూస్తూ,
ఐనా సరే, తన చిరునవ్వులతోనే మనని దీవిస్తూ,
మనమే సర్వంగా భావించి జీవిస్తున్న అమ్మకి
“జై”అనటం ఒక్క రోజేనా?

మన ప్రారబ్ధం తెలియకపోయినా
తొమ్మిదినెలలు కడుపునమోసి కన్నందుకు,
చివరివరకూ మన చెడును తొలగించటానికి
తనివి తీరా తాపత్రయ పడుతున్నందుకు,
మనం పొగపెట్టి పొమ్మన్నా మనని ప్రేమిస్తున్నందుకు,
మనం “ఛీ” కొట్టి తిట్టినా మనకి జై కొడుతున్నందుకు,
అమ్మ ప్రాతస్మరణీయురాలు, అమ్మ చిరస్మరణీయురాలు.

అమ్మను మనం తలుచుకోగలిసినది,
తలుచుకోవలసినది మాతృదినోత్సవ రోజు మాత్రమేనా?
మిగిలిన రోజుల్లో ఏమైంది అమ్మపై మనబోజు?  (బోజు=అభిమానం)
మనం కడుపులో పడిన దగ్గరనుండి
మనమే లోకంగా భావించి, జీవిస్తున్న అమ్మకి
కావాల్సింది బాహ్యమైన ప్రకటనలు కాదు
అంతరంగం నుండి వెల్లువైన మన ఆదరణ.
అమ్మకి కావాల్సింది తన గూర్చి ప్రచారం కాదు,
మననుండి అయ్యే ప్రేమ ప్రసారం.

ఒక్కసారి ఆ పవిత్ర పాదాలకు నమస్కరించి చూద్దామా,
పరమపదం మనముందు మోకరిల్లుతుంది.

ఒక్కసారి ఆ ప్రేమమూర్తిని ఆర్తితో పలకరించి వద్దామా,
పరమానందం మనలో ప్రవహిస్తుంది.

ఆకళ్ళలో ధైన్యాన్నితొలగించివేద్దామా,
శాంతి మనని ఆవరిస్తుంది.

ఆమనసుకు ధైర్యాన్ని కలిగించిచూద్దామా,
కాంతి మనని ఆవహిస్తుంది.

మాతృదినోత్సవ శుభాకాంక్షలు

Posted in May 2018, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!