Menu Close
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి
అక్కరకు వచ్చినవాడే మనవాడు

పసిమనసు - పసిడిమనసు

శ్రీరాం తల్లి సరస్వతమ్మ శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలని కొడుకు చేతికి ఇరవై రూపాయలిచ్చి, కొబ్బరి కాయ, పూలు, కర్పూరం కొని తెమ్మని పంపింది.

శ్రీరాం కు తల్లి ప్రతివారం ఇరవై రూపాయలు ఇలా ఖర్చుచేయడం నచ్చడం లేదు. ‘దేవునికి ఒక దండం, ఒక పూవూ చాలుకదా! అమ్మకు చెప్తే కోప్పడుతుంది. పాపం తన స్కూల్ గేటు ముందు నిన్నటినుంచీ కూర్చుని ఉండే తాతకు ఒక కాలు లేదు. అతడు ఏ పనీచేయలేడు. ఈ ఇరవై రూపాయలకూ కాసిని పండ్లో లేక ఇడ్లీలో కొని ఇస్తే హాయిగా తింటాడు, కానీ అమ్మో అమ్మకు తెలిస్తే తన్నదూ! పాపం ఆ తాతకు ఎలాగైనా సాయం చేయాలని అనుకున్నాడు శ్రీరాం.

ఇంతలో వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ముందుగా అమ్మ చెప్పినవన్నీ కొనితెచ్చి ఇచ్చాక తన కిడ్డీ బ్యాంక్ లో ఉన్న ఐదు రూపాయలు తీసుకుని వెళ్ళి తాటాకుల పందిరి హోటల్ నుంచి నాలుగు ఇడ్లీలు పొట్లం కట్టించుకుని వెళ్ళి తాతకు ఇచ్చాడు.

తాత "బాబూ! ఇవి ఎక్కడివి? నా కెందుకు ఇస్తున్నావు?"అని అడిగాడు.

"తాతా! నీకు ఒకకాలు లేదుకదా! ఎలా బువ్వతింటావు అందుకే  నా కిడ్డీ బ్యాంకులో నేను దాచుకున్న ఐదు రూపాయలతో ఇవి కొని తెచ్చాను. తిను తాతా!" అంటూ ఇచ్చాడు.

"నిండు నూరేళ్ళు బ్రతుకు బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు" అని దీవించి ఆకలవుతున్నందున ఇడ్లీలు తినేశాడు గబగబా.

శ్రీరాం ఇంటి కొచ్చాడు తృప్తిగా. ఆ మరునాటి నుంచీ పాస్ బెల్ లో తినేందుకని తల్లి ఇచ్చే బిస్కెట్స్, అరటిపండ్లూ తాతకు ఇవ్వసాగాడు.

తాత “బాబూ! నీవు తినకుండా నాకు ఇలా రోజూ ఇస్తున్నావు కదా! మీ అమ్మానాన్నలకు తెలిస్తే నన్ను కోప్పడతారేమో!" అన్నాడు.

"తాతా! ఫరవాలేదు. కానీ నీవు ఎలా బతుకుతావు తాతా! నీకెవ్వరూలేరా!” అని అడిగాడు శ్రీరాం. "ఉండేవారు నాయనా! నేను రైల్లో రంగు కాయితాలతో పూలు, తోరణాలూ చేసి అమ్ముకుని డబ్బు సంపాదించేవాడ్ని. నెల క్రితం రైలు దిగుతూ క్రిందపడ్డాను, నా కాలు విరిగిపోయింది. ప్రభుత్వ వైద్యశాలలో నయం చేశారు, ఇహ నేను సంపాదించ లేనని నన్ను ఇంట్లోంచీ తరిమేశారు బాబూ! నీలాంటి మనవడూ, కొడుకూ కోడలు ఉండేవారు.” అని కన్నీరు కార్చసాగాడు.

శ్రీరాంకు ఎలాగైనా ఆ తాతకు సాయం చేయాలనిపించింది. ధైర్యంచేసి తన స్కూల్ పెద్ద సార్ గారి దగ్గరకెళ్ళి "నమస్కారం పెద్దసార్గారూ! మన స్కూల్లో ఆగస్ట్ పదిహేనున జండా పండుగ ఉంది కదా! ఆ రోజుకు ఊరేగింపుకు పిల్లలందరికీ కావల్సిన జెండాలు, బళ్ళో కట్టను రంగుకాయితాల తోరణాలు అన్నీ మన బడి ముందుండే కాలు లేని తాత చేత చేయించుకుందామా సార్! పాపం అతడికి ఎవ్వరూ లేరుట!" అని చెప్పగానే పెద్దసార్ కుర్చీలోంచి లేచి గేటు దగ్గరకొచ్చి అక్కడున్న ఒక కాలులేని తాతను చూసి పలకరించి మాట్లాడారు.

శ్రీరాం చెప్పిన మాట నిజమని తెలిశాక వెంటనే తానే స్వయంగా వెళ్ళి బజారు నుంచీ కావల్సిన రంగుకాయితాలు, కత్తెర, నారతాడూ, గ్లూ కొని తెచ్చి అతడ్ని బళ్ళో వసారాలో కూర్చుని తోరణాలు తయారు చేయమని చెప్పారు. అంతేకాక ప్రతిరోజూ తనతో పాటుగా భోజనం తెప్పించి ఇవ్వసాగారు. పది రోజుల్లో జండా పండుగ వచ్చింది. స్కూలంతా రంగు తోరణాలతో కళకళ లాడ సాగింది.

పిల్లలంతా మూడురంగుల జండాలు పట్టుకుని వీధుల్లో జేజేలు పలుకుతూ దేశభక్తి గీతాలు పాడుతూ ఊరేగింపులు జరిపి వచ్చి జెండా ఎగరేయను లైన్లుగా నిల్చున్నారు. పెద్దసార్ ఆ తాతను పిలిచి జెండా ఎగరేయించారు.

శ్రీరాంకు చాలా సంతోషం కలిగింది. పెద్దసార్ మాట్లాడుతూ "పిల్లలూ! ఈ రోజున మీకే కాదు నాకూ మన బళ్ళో పంతుళ్ళందరికీ శ్రీరాం స్పూర్తి. మనమంతా శ్రీరాంలా ఆలోచించడం నేర్చుకోవాలి. ఊరికే ఎవరినైనా చూసి అయ్యోపాపం అనుకోడంకాదు, గమనించాలి. మానవసేవే మాధవసేవని నమ్మి అవసరమైన వారికి తప్పక సాయం చేయను ముందుకు రావాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఈ తాత బిచ్చగాడు కాదు. కాళ్ళు రెండూ ఉన్నపుడు రైల్లో కాయితాల పూలు, తోరణాలు, ఇంకా చాలా వస్తువులు స్వయంగా తయారు చేసి అమ్ముకుని జీవించేవాడు. ప్రమాదంలో కాలు పోగొట్టుకుని ఈ ఊరికి వచ్చి శ్రీరాం కంట పడ్డాడు. నేను స్కూల్కు వస్తూ చూసినా అంతగా ఆలోచించలేదు.

అక్కరకు వచ్చినవాడే మనవాడు’- అన్నట్లు అంతా రోజూ ఈ తాతను చూస్తూనే ఉన్నాం, నాతో సహా. ఐనా మనలో ఎవ్వరికీ కలగని ఆలోచన మన శ్రీరాం కు వచ్చిందంటే నిజంగా ఇతను శ్రీరాముడంతటి వాడవుతాడు. మంచిమనసు, సేవచేయాలనే ఆలోచన అందరికీ కలగవు, కలిగినా ఇలా మనసుకు పట్టించుకుని చేసే వారు తక్కువ. నిజంగా శ్రీరాం మన స్కూలు విద్యార్ధి కావడం మనందరికీ గర్వకారణం. నేనెంతో గర్విస్తున్నాను. అందుకే నేనూ సేవ చేయడంలో శ్రీరాం ని స్పూర్తిగా తీసుకుంటున్నాను. ఈ రోజునుంచి ఈ తాత మన బళ్ళోనే ఉంటారు వాచ్ మెన్ గా. ఎవ్వర్నీ లోపలికి రానివ్వకుండా మీ అందరికీ కాపలా కాస్తుంటాడు. కాయితం పూలూ అవీ తయారు చేసుకుని గుడి దగ్గర సాయంకాలాలు అమ్ముకుంటుంటాడు. అసలు విషయం జండా పండుగ రోజున మంచి పని చేసిన వారికి ఒకరికి మన స్కూల్ నుంచీ బహుమతి ఇస్తాం కదా! అది ఈ ఏడాది మన శ్రీరాంకు ఇస్తున్నాము." అనిచెప్పి శ్రీరాం ను పిల్చారు పెద్దసార్ గారు.

శ్రీరాం సార్తో ఏదో చెవిలో చెప్పాడు. పెద్దసార్ క్లాప్స్ ఇస్తూ, "చూశారా పిల్లలూ! ఏవరైనా కానుక లభిస్తుందంటే ఆశపడతారు. కానీ శ్రీరాం తన కిచ్చేకానుక బదులుగా ఈతాతకు చొక్కా పంచ కొనివ్వమని చెప్పాడు" అంటూ శ్రీరాం భుజం తట్టి అభినందించాడు.

శ్రీరాం కళ్ళు ఆనందంతో వెలిగి పోయాయి.

Posted in July 2021, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!