Menu Close
balyam_main
సామెతలతో చక్కని కధలు
- ఆదూరి హైమావతి

అగ్నిలో ఆజ్యం పోయడం

ఆరోజు సోమవారం. అంతా యూనిఫాం ధరించి స్కూల్ కు రావాలి. ఐతే గత మూడు రోజులుగా ఒకటే వర్షం కావటాన కామేశం యూనిఫాం చొక్కా ఆరింది కానీ, నిక్కరు ఆరలేదు. అందువల్ల వేరే రంగు నిక్కరు వేసుకుని వచ్చాడు స్కూల్ కు. ఐతే భయ భయంగానే ఉన్నాడు. మొదటి పీరియడ్ తెలుగు సార్ కాస్త శాంతమూర్తే కానీ రెండో పీరియడ్ గణిత మేస్టారు కోపిష్టి. లెక్కలు చూపను దగ్గరకెళ్ళినపుడు నిక్కరు చూసి కోప్పడతారేమోనని భయంగానే ఉన్నాడు. ఇంకా ఒకరిద్దరు పిల్లలు అలాగే యూనిఫాం నిక్కర్లు వేరే రంగులవి వేసుకొచ్చారు. మొదటి పీరియడ్ మొదలైంది. తెలుగు మేస్టారు చక్కగా పద్యాలు చదువుతూ పాఠం చెపుతుంటే అంతా మహా శ్రధ్ధగా వింటున్నారు. 'ఎప్పుడైనా కానీ ఎవరినీ మాటలతో కానీ, చేతలతో కానీ బాధపెట్టకూడదు. ఎవ్వరినీ మనస్సు కష్టం కలిగేలా మట్లాడకూడదు. వీలున్నంత వరకూ అందరికీ మేలు చేయనూ, సాయం చేయనూ ప్రయత్నించాలి. మనం సంఘజీవులం. మన తోటి వారికి అన్ని విధాలా సాయపడితే అందరూ మనల్ని ప్రేమిస్తారు. మనతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇతరుల తప్పులను ఎత్తి చూపడం వారిని ఇబ్బందుల్లో పెట్టడం నీచస్వభావం.' అలా మాస్టారు పద్యాలకు అర్ధాలనూ, నీతులు జోడించి చెప్తూ ఉన్నారు. తెలుగంటే ఇష్టంలేని, తెలుగు బాగా రాని భాస్కర్ మాత్రం అందర్నీ గమనిస్తూ పాఠమే వినడం లేదు. పైగా ఎవరెవరు ఎలాకూర్చున్నారో, ఏ చొక్కా, నిక్కర్ వేసుకొచ్చారో గమనించసాగాడు.

తను ఎక్కువగా ఇష్టపడని కామేశం యూనిఫాం నిక్కర్ వేసుకురాలేదని భాస్కర్ గమనించి మహదానందపడ్డాడు. ఎప్పుడూ మాస్టార్లంతా పొగిడే కామేశాన్ని తిట్టించి తన పగ తీర్చుకోవాలని భావించాడు. ఇంతలో తెలుగు మాస్టారు బోర్డు మీద పద్యం వ్రాయమని ఒక విద్యార్ధిని పిలిచారు. తెలుగు పంతులు గారు పిల్లలచేత బోర్డు మీద వ్రాయించి తప్పులు సరిదిద్ది మిగతా వారికి ఎలా గుణింతం తప్పులు లేకుండా వ్రాయాలో నేర్పుతారు. బోర్డుమీద సుద్ద ముక్కతో వ్రాస్తున్న మురళి ‘హృదయం‘ అనే పదాన్ని ‘హ్రుదయం‘ అని వ్రాయగానే పంతులుగారికి కోపం వచ్చింది. సరిగా వ్రాయమని చెప్పారు. వానికి రాలేదు. కుమార్ ను వ్రాయమన్నారు. వానికీ  ‘హృ’ వ్రాయడం రాలేదు.

మాస్టారికి కోపం వచ్చింది. “ఏరా! మీకు ‘హృ’ వ్రాయడం రాదా! ఏం నేర్చుకుంటున్నారురా! మాతృభాష పట్ల భక్తిభావన లేదా!” అని ఆగ్రహించారు. ఇంతలో భాస్కర్ లేచి "మాస్టారూ! ఈరోజు మన క్లాసులో నలుగురు యూనిఫాం నిక్కరు వేసుకోకుండా వచ్చారండీ! వారిలో కామేశం కూడా ఉన్నాడండీ!" అని అన్నాడు. పంతులుగారు ఆ నలుగురినీ లేచి తన దగ్గరకు రమ్మని కోరారు. ఆ నలుగురూ లేచి భయభయంగా పంతులు గారి దగ్గరకు వెళ్ళారు. పంతులుగారు వారిని కారణం అడిగారు. వారు తమ ఇబ్బంది చెప్పారు.

కామేశం "మాస్టారూ మా ఇంట్లో వాషింగ్ మేషీన్ లేదండీ! మా అమ్మ చేత్తో బట్టలు ఉతికి ఆరేస్తారండీ! వర్షం వల్ల ఆరలేదు. మధ్యాహ్నానికి ఆరుతుందండీ! వేసుకొస్తాను." అన్నాడు. మిగతావారి పరిస్థితీ అంతే.

మాస్టారు భాస్కర్ ను పిలిచి "ఏరా భాస్కర్ ! నీవు ముందు ‘హృదయం’ అనేపదం బోర్డుమీద వ్రాయి” అని అన్నారు. భాస్కర్ కు రాలేదు. "చూశావా! నీకు పదం వ్రాయడం రాలేదు కానీ నేరాలు చెప్పడం వచ్చింది. నేను కోపంగా ఉన్నాను కదాని, వారు యూనిఫాం నిక్కరు వేసుకురాలేదని చెప్తే కోపంతో నేను వారిని దండిస్తానని నీ భావన. దీన్నే ‘అగ్నిలో ఆజ్యం పోయడం' అని అంటారు. మండుతున్న మంటలో నెయ్యిపోస్తే ఇంకా ఎక్కువగా మంట పైకి వస్తుంది. ఒరే భాస్కర్! ముందు చదువు నేర్చుకో, సద్భుధ్ధులు నేర్చుకో. స్కూల్ అసెంబ్లీ అవుతూనే వారు నలుగురూ వచ్చి హెడ్ మాస్టారి వద్ద తమ ఇబ్బంది చెప్పుకుని పర్మిషన్ కోరారు. మొదటి పీరియడ్ కు వచ్చే నాతో ఆయన చెప్పారు. మధ్యాహ్నం వరకూ వారికి పర్మిషన్ ఇవ్వమని. మధ్యలో నీకెందుకురా బాధ! చదువుమీద మనస్సు పెట్టు. ఇలా ఇతరుల గురించి చింతించడం మానుకో! తెల్సిందా!” అని బోధించారు.

భాస్కర్ సిగ్గుతో తలవాల్చుకున్నాడు. చేతనైతే సాయం చేయాలి కానీ ఎవ్వరినీ బాధకు గురిచేయాలని ఆలోచించడం తప్పు.

Posted in April 2018, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!