Menu Close
అద్వైతం
-- భావరాజు శ్రీనివాస్
Vivekananda

గత సంచిక తరువాయి »

ధర్మమోక్షాల ఏకస్వరూపమైన అర్ధనారీశ్వరతత్వం ఎలా ఉంటుందో, అర్ధనారీశ్వరుడైన శివ తత్వాన్ని (ఆత్మతత్వాన్ని) పరిశీలిస్తే తెలుస్తుంది.

  • శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు.
  • శివుడికి స్వపరబేధం లేదు. ఆయన అందర్నీ ఒక్కలాగే చూస్తాడు. రాక్షసులైనా వారు చేసిన తపస్సు ఫలిస్తే,  కోరింది ఇస్తాడు.
  • శివుడు అమృతాన్ని విషాన్నీ వేరుగా చూడడు. సత్ప్రయోజనం కోసం అవసరమైతే విషం పుచ్చుకుంటాడు.
  • ఈశ్వరుడు ధర్మాన్నీ, మోక్షాన్నీ విడగొట్టడు. మోక్షాన్ని, స్వేచ్ఛను విడిచిపెట్టకుండానే ధర్మాన్ని ( పార్వతిని) చేపట్టాడు.
  • శివుడు జననాన్ని, మరణాన్ని వేరుగా చూడడు. కాబట్టే ఆయనకు జననం లేదు. స్వయంభువు. మరణం లేదు. మృత్యుంజయుడు.

ఆత్మవిమర్శ, ఆత్మవిశ్వాసం వీటి ద్వారా పై చెప్పిన ఆత్మలక్షణాలను గుర్తించి ఆత్మజ్ఞానాన్ని పొందగలం.

ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తి జీవిత దృక్పధం ఎలా ఉంటుందో శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ‘జగమంతకుటుంబం’ పాటలో వ్యక్తం చేసారు.

పాట

పల్లవి: జగమంతకుటుంబం నాది, ఏకాకిజీవితం నాది
సంసారసాగరం నాదే, సన్యాసం, శూన్యం నావేలే
చరణం: కవినై, కవితనై, భార్యనై, భర్తనై
మల్లెలదారుల్లో, మంచు ఎడారుల్లో
పన్నీటి జయగీతల, కన్నీటి జలపాతాల
నాతో నేను సహగమిస్తూ, నాతో నేను రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని, రంగుల్ని, రంగవల్లుల్ని
కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని
//జగమంత//

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ 'చక్రం' సినిమా నిర్మించారు. కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు. కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్చిన ఘనత ఆయనదే.

advaitham

పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1 ×  1-1) విడిపోయింది. రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో, రెండుగా అనేకం (X+1 ×  X-1) గా మారిపోయింది. (X) స్థానంలో ఏ సంఖ్యనైనా ప్రతిక్షేపించుకోవచ్చు. సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం. ఈ అద్వైత తత్వానికి పై  సమీకరణం 'skeleton' అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది.

advaitham

జగమంతకుటుంబం(X+1 ×  X-1)లో X బదులుగా (కవి × కవిత), (భర్త  ×  భార్య), (భగవంతుడు × భక్తుడు)....ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ ఏవరసకావరసే. ఏమాటకామాటే. ఒక వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు. అలా ఏ వరసకు ఆ వరసను, ఏ రసానికి ఆ రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం.

కవినై, కవితనై, భార్యనై, భర్తనై … ఇలా అంతా నేనైనపుడు రెండో వ్యక్తి ఉండే ఆస్కారం లేదు. ఇద్దరు ఉంటే వారి మధ్య బేధం (లింగభేదం, స్వపరబేధం) తలెత్తి అర్ధకామాలు ప్రాధాన్యత వహిస్తాయి. అందరి రూపంలొ ఉన్నది నేనే అనుకున్నపుడు ధర్మం ప్రాధాన్యత వహిస్తుంది.

ఏకాకి జీవితంజగమంతకుటుంబంలో (జగత్తులో) ఉన్నదంతా నేనే అయినపుడు రెండో వ్యక్తి లేనపుడు నేను ఏకాకిని. ఈ ఏకాకితనాన్ని, ఏకాంతాన్ని గుర్తించడమే మోక్షం.

నేను (నాది)సంక్షిప్త రూపం లో ఉన్న 1  విస్తృత రూపం దాల్చి (X+1 ×  X-1) ​అయినట్లు, సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు, ఏకాకిగా వున్న 'నేను' ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను. ఏకాకియైన శ్రీకృష్ణుడు, తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. 1 ​లో ​(X+1 ×  X-1) వున్నట్టు, విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు, ఏకాకి లో విశ్వం ఇమిడి వుంది. ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే) విశ్వాన్ని చూపించాడు. విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది (evaluation) కనుక జగమంతకుటుంబం నాది. విశ్వం నాలో లీనం (లయం) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది. ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం. జగమంతకుటుంబం, ఏకాకిజీవితం రెండూ నావే అంటే ధర్మం, మోక్షం రెండూ నావే అనడంలో ఆత్మజ్ఞానం ఉంది.

వ్యక్తి కల కంటున్నపుడు, కలలో కనిపించే పాత్రలన్నీ తనే పోషిస్తున్నట్టు, కవి తన కావ్యంలోని పాత్రలన్నీ తానే అయినట్టు, సృష్టికర్త తన సృష్టిలోని పాత్రలన్నీ తనే పోషిస్తున్నాడు. మానవుడు ప్రేమికుడిగా, భావుకుడిగా, భక్తుడిగా ఉన్నపుడు పాడుకోవడానికి ప్రేమగీతాల్ని, భావగీతాల్ని, భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాశారు. కానీ మానవుడు మాధవుడిగా ఉన్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'.

పదార్ధానికీ, శక్తికీ ఉన్న సంబంధాన్ని ఐనస్టీన్ గుర్తించినట్లుగానే, జీవుడికీ, ఈశ్వరుడికీ ఉన్న సంబంధాన్ని గుర్తించిన కవులు వారి మధ్య నవరసాల్ని పలికించారు. ఈశ్వరుణ్ణి జీవుణ్ణి చేసి విమర్శించారు. హాస్యమాడారు. కళ్యాణం చేశారు, బంధుత్వం కలుపుకున్నారు. అలాగే జీవుణ్ణి ఈశ్వరుణ్ణి చేసి మానవ సేవయే మాధవ సేవ అన్నారు. నాస్తికులకీ ,భౌతిక వాదులకీ ఈశ్వరుడు జీవుడిగా కనపడతాడు. ఆస్తికులకీ, భావవాదులకీ జీవుడు ఈశ్వరుడిగా కనపడతాడు. ఇలా ఒకే వస్తువు ఒకరికి ఒకలా, మరొకరికి మరొకలా కనిపించడమే సాపేక్షత (relativity) మాయ. మనకే కాదు, మహాభారతంలోని పాత్రల్లో కొంతమందికి శ్రీకృష్ణుడు మానవుడిలా కనపడితే మరికొంతమందికి మాధవుడిలా కనిపించాడు. శ్రీకృషుడు కేవలం మాధవుడైతే, మానవుల మధ్య ఇమడలేడు. కేవలం మానవుడైతే ధర్మానికి (పాండవులకు) పట్టం కట్టడు. తనెవరో, జీవితాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. చెప్పినట్లే జీవించాడు. జీవేశ్వరుల్ని వేరుచేసి చూస్తే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ, ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రారు. అద్వైతమూ అర్ధం కాదు.

అద్వైతాన్ని గూర్చి స్వామి వివేకానంద
(‘లేవండి, మేల్కొనండి!’ నుండి)

  • “మతం,కళ,విజ్ఞానం - ఈ మూడు ఒకే సత్యం యొక్క విభిన్న అభివ్యక్తనలు. కాని దీన్ని అర్ధం చేసుకోవాలంటే అద్వైత సిద్ధాంతం అవసరం."
  • “శాస్త్రమంటే ఏకత్వగ్రహణమేగాని మరొకటి కాదు. పరిపూర్ణమైన ఏకత్వం ప్రాప్తించగానే - అదే గమ్యప్రాప్తి కాబట్టి - శాస్త్ర పురోగమనం ఆగిపోతుంది. ఎందులోవుండి ఇతర పదార్ధాలన్నీ నిర్మాణంకాగలవో అలాంటి మూల పదార్ధాన్ని కనుగొనటంతో రసాయనశాస్త్ర పురోగమనం పరిసమాప్తమౌతుంది. ఎందులోనుంచి ఇతర శక్తులన్నీ వెలువడుతున్నవో అలాంటి ఏకశక్తిని కనుగొంటే, పదార్ధవిజ్ఞానశాస్త్రం (ఫిజిక్స్) తన పరిశ్రమను సఫలం చేసుకోగలుగుతుంది. నశ్వరమైన ప్రపంచంలో ఎవడు అనశ్వరచైతన్య స్వరూపుడో, ఈ సవికారవిశ్వంలో ఎవడు శాశ్వతాధారభూతుడో, సమస్త జీవులూ ఎవడి మాయారూపాలో, అట్టి పరమాత్ముణ్ణి కనుగొంటే మతశాస్త్రం (=బ్రహ్మవిద్య)పరిసమాప్తిని పొందుతుంది. ఈ విధంగా నానాత్వమూలంగానూ ద్వైతమూలం గానూ పరమైక్యం(అద్వైతం) ప్రాప్యమౌతోంది. ఇదే సమస్త మతాలకూ -సమస్త ధర్మాలకూ -పరమావధి. ఇదే సకల శాస్త్రగమ్యం. సమస్త శాస్త్రాలూ పర్యవసానంలో ఈ సిద్ధాంతానికి రాకతప్పదు.”
  • వేదాంతతత్వమంతా ఈ కింది కథలో ఇమిడివుంది.
  • ఒకే చెట్టుమీద రెండు పక్షులున్నవి - ఒకటి చిటారు కొమ్మమీద, రెండవది కింది కొమ్మమీద. ఫైపక్షి ప్రశాంతంగా, మౌనంగా, గంభీరంగా స్వకీయ వైభవంలో మునిగివుంది. కిందిపక్షి తీయని పళ్ళను చేదుపళ్ళను తింటూ, ఒక కొమ్మనుంచి మరొక కొమ్మమీదికి ఎగురుతూ సుఖాసుఖాలను అనుభవిస్తోంది. కొంతసేపటికి యీ కిందిపక్షి మరింత చేదుపండును తిని, విసుగుచెంది, తల ఎత్తి ఆ పైపక్షిని చూసింది. బంగారు ఈకలున్న ఆ అద్భుతపక్షి తీయని పళ్ళుగాని చేదుపళ్ళు గానీ తినటంలేదు. దానికి కష్టానుభూతిగాని, సుఖానుభూతిగాని లేదు. ప్రశాంతంగా, అత్మస్థమై , తన ఆత్మను తప్ప వేరుదేన్నీ చూడక, కూర్చునివుంది. ఆ స్థితి పొందటానికై కింది పక్షి తీవ్రంగా ఆకాంక్షిస్తుందిగాని, అచిరకాలంలోనే మరచి మళ్ళా పళ్ళను తినటం ప్రారంభిస్తుంది. కొంతసేపటికి మరొక అతి చేదుపండు తిని, ఎంతో ఖేదమొంది, మళ్ళా పైకి చూసి, యింకొక పైకొమ్మ కెగిరింది. అలా పైపైకి ఎగిరి ఎగిరి, చివరికి ఆ చక్కని పక్షికి అతిచేరువులోకి వస్తుంది. చివరకు అది పైనున్న పక్షి చోటుకు వచ్చి దాన్లో తననే కోల్పోయింది. రెండు పక్షులు లేనేలేవనీ, ప్రశాంతమై గంభీరమై ఆత్మవైభవంలో వెలుగొందుతూన్న పైపిట్ట తానే అనీ అది తటాలున గ్రహించింది. నిజానికి తా నెప్పుడూ ఆ పైపక్షే. ఈ తినటం, యీ తీయనిపళ్ళు యీ చేదుపళ్ళు, యీ కింది చిన్నపక్షి, ఒకసారి సుఖించటం, ఒకసారి దుఃఖించటం - యిదంతా కేవలం భ్రమ, స్వప్నం. పై పక్షి భగవంతుడు, జగదీశ్వరుడు. కిందిది జీవాత్మ.”

advaitham

.....సమాప్తం.....

Posted in April 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!