Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట

తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన శైలి గురించిన సమాచారం అందించడమే ఈ ‘ఆదర్శమూర్తులు’ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం. ప్రతి సంచికలో తమ తమ రంగాలలో నిష్ణాతులై, నిస్వార్ధంగా నివసించి అందరికీ మంచి మార్గాన్ని చూపించిన మహానుభావుల గురించిన సమాచారం క్రోడీకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము.

మన సిరిమల్లె పంచమ వార్షిక ప్రత్యేక సంచిక సందర్భంగా సెప్టెంబర్ 2020 నుండి జూలై 2021 సంచిక వరకు ప్రచురించిన ఆదర్శమూర్తుల జీవిత గాథలు మరొక్కసారి సంగ్రహంగా మీకు అందిస్తున్నాం.

ఈ అంశాలను పూర్తిగా చదువుటకై క్రింద ఇవ్వబడిన శీర్షికలపై క్లిక్ చేయండి.

సెప్టెంబర్ 2020 - శ్రీ హ్యూమన్ కంప్యూటర్ శ్రీమతి శకుంతల దేవి

మనిషి తయారుచేసిన యంత్రాలకు అవధులు ఉంటాయి. స్వయంగా ఆలోచించే సత్తా ఉండదు. కానీ మనిషి మెదడులో జనించే ఆలోచనలు అనంతం. వాటికి ఎటువంటి పరిమితులు ఉండవు. ఇది అందరూ గుర్తించాల్సిన వాస్తవం. పై సూత్రమే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ స్త్రీని అపర గణిత మేధావిని చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. ఎటువంటి సంఖ్యాపరమైన సమస్యలనైనను అతి సులువుగా, అత్యంత వేగంగా పరిష్కరించడమే కాకుండా వివరణ కూడా ఇవ్వగలిగిన సత్తా ఈ మహాసాధ్వికి మాత్రమే సాధ్యమైనది. ఆవిడ ఆలోచనా విధానం ఎంతోమందికి ఆదర్శమై, ఆచరణయోగ్యమైనది. ఆ మహా మేధావే మన భారతావనిలో పుట్టి యావత్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని వెలుగొంది, ‘హ్యూమన్ సూపర్ కంప్యూటర్’ గా బిరుదు గాంచిన శ్రీమతి శకుంతల దేవి, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/shakuntala-devi/

అక్టోబర్ 2020 - కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

“రవి గాంచనిచో కవి గాంచునే కదా” అని తెనాలి రామకృష్ణ కవి సెలవిచ్చారు. కవి తన భావ సృజనాత్మక దృష్టితో ఎక్కడికైనను వెళ్ళగలడు, ఏ అంశాన్ని అయినను స్పృశించగల సమర్ధుడు. “కత్తి కంటే కలం గొప్పది” అని కూడా అంటారు. కత్తి వలన సమాజంలో భయాందోళనలు పెరిగి మానసిక ధైర్యం సన్నగిల్లుతుంది. అదే కలం వలన సమాజంలో ఎంతో చైతన్యం కలిగి విప్లవాత్మక మార్పులకు నాంది ప్రస్థానం జరుగుతుంది. అయితే  సామాజిక స్పృహతో సృజనాత్మకతను జోడించి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలిగిన సత్తా, తెగువ, సామర్ధ్యం కొంతమంది రచయితలకు మాత్రమే సిద్ధిస్తుంది. ఎంతో విలువైన, సమగ్రమైన, సునిశిత అంశాలను తమ రచనలలో పొందుపరచి వాటిని సమాజంలోని మార్పులకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగించేవారు. అటువంటి గొప్ప గుణాలు, లేక ధర్మాలు కలిగిన అతి కొద్ది మంది రచయితలలో, సమాజ జీవన పరిస్థితులను నిర్మొహమాటంగా వివరిస్తూ, వాస్తవ చిత్రాలను తన అక్షర అస్త్రాలుగా రచనలు చేసిన మహోన్నత వ్యక్తి, మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/viswanatha-satyanarayana/

నవంబర్ 2020 - శ్రీ తుమ్మల సీతారామమూర్తి

తెలుగు జాతి ప్రాభవం, తెలుగు భాష గొప్పతనం, తెలుగు సంస్కృతి, సంప్రదాయ విలువలను ఎంతో మంది మహానుభావులు తర తరాలకు పంచిపెట్టారు. నేటికీ, తెలుగు వెలుగులను, విలువలను, అత్యంత సులభశైలిలో తమ అమూల్యమైన రచనల ద్వారా మనకు నిత్యం తెలిసేటట్లు చేస్తున్నారు. తమ రచనల ద్వారా కొంతమంది బాగా ప్రాచుర్యం పొందారు. మరికొంత మంది వారి గురించి ప్రపంచం గుర్తించినా, గుర్తించక పోయినా తెలుగు ప్రాచుర్యాన్ని మాత్రం నలుదిశలా వ్యాపింపజేస్తూ తమ వంతు కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. వారికి గుర్తింపు, పురస్కారాల రూపంలో లభించినను అంతగా ప్రజల దృష్టిలో ప్రసిద్ధులు కాలేదు. అయినను వారి రచనల ద్వారా సమాజంలో ఉన్నతమైన చైతన్యాన్ని తీసుకొని వచ్చారు. అటువంటి వారిలో సౌమ్యశీలి, నిరాడంబరుడు, గాంధేయవాది, తెలుగు రైతుబిడ్డ, ఆధునిక పద్య కవుల్లో అన్నింటా ముందుండి తెలుగు భాషానురక్తి కలిగిన జాతీయోద్యమ కవి, అభినవ తిక్కన బిరుదాంకితుడు అయిన శ్రీ తుమ్మల సీతారామమూర్తి నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-thummala-sitaramamurthy/

డిసెంబర్ 2020 - డా. అంగర వేంకట సుబ్బారావు

సాధారణంగా డాక్టరు అంటే వైద్యం వృత్తిగా, ధనార్జనే లక్ష్యంగా, బీదల జోలికి పోకుండా ధనవంతుల్ని చాకచక్యంగా 'నూలు లా వడికి', ధనార్జనకై వాడుకుంటూ ఐశ్వర్యాన్ని పెంచుకుంటూ జీవన యాత్ర సాగించే విద్యావంతుడు. సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిసంపాదించుకున్న గౌరవనీయుడు. అల్లాంటి వారిని మనం ప్రతి ఊళ్లోనూ చూస్తూనే ఉన్నాము.

నేటి కాలంలో సుఖ జీవితానికి, హోదాని నిలబెట్టుకోవడానికి, ధనార్జనకు వైద్యవృత్తి సరిఅయిన మార్గమే అనిపించినా సామాజిక స్పృహ, మానవత్వం మనసులో పరిమళించిన వేళ, తమ ఆర్ధిక స్థితి గతులని పెద్దగా పెంచుకోలేక, సంసార బాధ్యతలు భరిస్తూ సగటు మధ్యతరగతి కుటుంబీకులు గానే మిగిలిపోయినను, సామాజిక సేవాతత్పరతతో బీదలకు, అనాధలకు వైద్య సేవలనందించి వారిచే దేమునిగా కొలువబడిన మహనీయులు ఎందఱో ఉన్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం, పల్లెటూరైన కొండపల్లి కేంద్రంగా చుట్టూ పక్కల పల్లెలలో, వైద్య సేవాతత్పరతతో కొండపల్లి ప్రజల మనసుల్ని దోచుకున్న మహోన్నత మూర్తి, ఎంతో మందికి ఆదర్శప్రాయుడైన డా. అంగర వేంకట సుబ్బారావు గారు, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/angara-venkata-subbarao/

జనవరి 2021 - శ్రీమతి కేథరిన్ జాన్సన్

పువ్వు పుట్టగానే పరిమళించిన విధంలో, కొంతమంది తమ చిన్న వయసులోనే అపారమైన మేథాసంపత్తిని కలిగిఉండి తమకు ఆసక్తికలిగిన రంగాలలో అద్భుతాలను సృష్టిస్తూ వివిధ రకాలుగా పరిణత చెంది, బాల మేధావులుగా గుర్తింపు తెచ్చుకొని తద్వారా అతి పిన్న వయసులోనే విశ్వవిద్యాలయ పట్టాలను కూడా పొందుతారు. అటువంటి వారి మేధస్సు ఎంతో ఉన్నతమైన సమాచారాన్ని అందించే అపురూప గనిలా రూపాంతరం చెందుతుంది. సరైన సమయంలో వారికి చేయూతనిచ్చి, సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే, తమ విజ్ఞాన పటిమతో నూతన సృష్టికి మూలకారకులౌతారు. అటువంటి బాల మేధావి, అమెరికా వారి నాసా అంతరిక్ష కేంద్రంలో మూడు దశాబ్దాలు సేవలందించిన కాథరిన్ జాన్సన్ నేటి మన మహిళా ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/katherine-johnson/

ఫిబ్రవరి 2021 - డా. వర్జీనియా అప్గర్ (Virginia Apgar)

ఈ సృష్టిలో ప్రతి శిశువు తల్లి గర్భంలోనే అన్ని అవయవాల నిర్మాణం, ఇంద్రియాల పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుని ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. అయితే కొంత మంది శిశువులలో అన్ని ఇంద్రియాలు సరిగా ఏర్పడ్డాయో లేదోననే అనుమానం కలగడం సహజం. అవి శరీరం బయట అయితే కంటితో చూసి నిర్ధారించవచ్చు. కానీ శరీరం లోపలి అవయవాల నిర్మాణం మరియు సామర్ధ్యం ఏపాటిదో చెప్పడం, డెబ్భై ఏళ్ల క్రితం వరకు వైద్య శాస్త్రం అంతగా అందుబాటులో లేని కారణంగా అంత సులభంయ్యేది కాదు. పుట్టిన శిశువు ను అనుభవంతో ఏర్పడ్డ  కొన్ని సంప్రదాయ పద్దతులలో పరీక్షించేవారు. కానీ పందొమ్మిది వందల అరవై నాటికి APGAR అనే విధానాన్ని కనుగొనడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా పుట్టిన శిశువులలో ఏర్పడిన అంగవైకల్యాలను పుట్టిన వెంటనే గుర్తించి తదనుగుణంగా చికిత్సలు చేయడం ద్వారా వారిని కాపాడి వారికి మంచి జీవితం ఇవ్వడం జరుగుతున్నది. ఈ APGAR అనే గొప్ప వైద్య ప్రక్రియ కనుగొనడం వెనుక ఒక మహిళామూర్తి కృషి అద్వితీయము. కనుకనే ఆ విధానాన్ని ఆమె పేరుతోనే నిర్వచించడం జరిగింది. ఆ మానవతామూర్తి పేరు Dr. Virginia Apgar, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/virginia-apgar/

మార్చి 2021 - పద్మభూషణ్ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి

కొంతమంది మహానుభావుల పుట్టుక ఒక నిర్దిష్టమైన కార్యం కొరకు నిర్ణయించబడి అందుకు తగినవిధంగానే వారి జీవనశైలి సూత్రీకరించబడుతుంది. ‘ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై ఈ అడవి .....’, ఇలానే, ఈ తెలుగు సాహిత్య కాననములో తన జీవితం కూడా సాగిపోయి, విలువకట్టలేని సాహిత్య మణి పూసలను, రత్నాలను మనకందించిన మహా రచయిత, లలితగేయాల సృష్టికర్త, అష్టావధాని, ఆంధ్రా షెల్లీ గా పేరుగాంచిన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-devulapalli-krishnasaashtri/

ఏప్రిల్ 2021 - పేదలపెన్నిధి - కీ.శే. డాక్టర్ రాయవరపు సూర్యనారాయణగారు

వైద్యవృత్తి చాలా ఉదాత్త వృత్తిగా ప్రఖ్యాతి చెందింది. అది చేపట్టాలంటే ఎంతో అంకితభావం, రోగికంటే ఎన్నోరెట్ల ఓర్పు, అన్నిటినీ మించి సేవాభావం, ఉండాలి. వీటికి హస్తవాసి తోడయితే, ‘వైద్యో నారాయణో హరిః’ అన్నది అక్షరాలా నిజ మౌతుంది. అలాంటి మహానుభావు లెందరో మానవాళికి అపూర్వసేవ లందించి వారి మానవ జన్మలను ధన్యం చేసికొని తరించారు. వీరిలో డాక్టర్ రాయవరపు సూర్యనారాయణగారు తప్పకుండా గణనీయులు. వారి గురించి తెలుసుకోవడానికి ఇది ఒక సవినయప్రయత్నం.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/rayavarapu-suryanarayana/

మే 2021 - డా. Gertrude B Elion

మనిషి పుట్టగానే వారి జీవన విధానం, అభివృద్ధి, శైలి తదితర అంశాలు అన్నీ వారి నుదిటిమీద వ్రాసి ఉంటాయని మనందరి నమ్మకం. అందుకే మన జాతకం ఎట్లుంటుంది అనే ఉత్సుకత మనందరిలో ఉంటుంది. కానీ, కొన్నిసార్లు మన నిజజీవితంలో జరిగే సంఘటనలు మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చి మనలను సరికొత్త మార్గంలోకి నడిపిస్తాయి. అటువంటి ఆలోచనలు సన్మార్గంలో ఉంటే వాటి వలన నిర్ణయాత్మకమైన కార్యాలతో మన జీవితం సన్మార్గంలో వెళుతుంది. ఆ క్రమంలోనే ఎన్నో వినూత్న ప్రక్రియలకు, సరికొత్త విషయాలను కనుగొనేందుకు, అభివృద్ధి పథంలో సాగేందుకు దోహదపడుతుంది. కష్టాలను చవి చూసినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది అన్నట్లు చిన్నప్పుడు ప్రాణాంతకమైన రోగాలతో బాధపడే వారిని చూసినప్పుడు కలిగే బాధ, అసంతృప్తి కొన్నిసార్లు వాటిని రూపుమాపేందుకు ఉన్న అనువుల వైపు మన ఆలోచననలను ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరణ వలన ఆ రోగాలకు విరుగుడును కనుగొనే విధానం మనకు కనపడుతుంది. అటువంటి ఆలోచనలతో, ఆ విధానం వైపు తన జీవన గమ్యాన్ని మార్చుకొని ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు సూత్రధారియైన మహిళా మూర్తి, జీవ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత, డా. Gertrude Belle Elion, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/gertrude-elion/

జూన్ 2021 - గానతపస్వి, పద్మవిభూషణ్ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

‘శిశుర్వేత్తి..పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః’ అని మనందరికీ తెలిసిన ఆర్యోక్తి. దానర్థం శిశువైనా, పశువైనా, పామైనా, సమస్త ప్రాణులకి సంగీతం ఒక జీవామృతం, ఆనందకర సాధనం. అటువంటి సంగీత సాగరంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ సంగీత గాన రసాన్ని ముందుగా తను ఆస్వాదించి, ఆనందించి, అటు పిమ్మట  ఒక విలక్షమైన గాత్ర శుద్ధితో, గాన మాధుర్యంతో, శ్రోతలను మంత్రముగ్ధులను చేయడం మొదలుపెట్టి వారిలో మధురానుభూతిని కలుగజేసి, ఆరు దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ జగత్తులో ‘బాలు’ అనే పదమే పదే  పదే వినిపించే విధంగా నలభై వేలకు పైగా పాటలు పాడి తనకంటూ, తనకు మాత్రమే ఉండే స్థానాన్ని అధిరోహించి, ఎంతో మంది సంగీత గాయనీగాయకులకు మార్గదర్శియై, భావితరాలకు ఒక భవికయై, వారిలో సంగీతం మీద మక్కువ ఏర్పరిచి, స్ఫూర్తిని రగిలించిన, గాన గంధర్వుడు, నటుడు, సంగీత దర్శకుడు, తాత్వికవేత్త, డా. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/sri-sripathi-panditharadhyula-balasubrahmanyam/

జూలై 2021 - డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య

సర్వతోముఖంగా ప్రజాభ్యున్నతికి కృషి చేయాలంటే సామాజిక హోదా, పదవి అవసరం లేదు. సత్సంకల్పంతో నీ ఆశయాలకు ఊపిరిని అందించి, నీ ఆలోచనలను అందరికీ పంచి సంఘటితం చేసి సామాజిక చైతన్యానికి నాంది పలకాలి. వివేకంతో నీ సామర్ధ్యాన్ని అంచనా వేసుకొని తదనుగుణంగా నీ కార్యాచరణ ఉండాలి. నీవు పదిమందికి మంచి చేయాలనుకుంటే అందుకు నీవు నిజాయితీగా పనిచేయాలి. నీ కృషిని గుర్తించి నీకు స్థైర్యాన్ని, శక్తిని అందించే సహాయకులు నీ దరికి చేరాలి. అప్పుడే నీవు అనుకున్న ఫలితాలను పొందగలవు. ఈ సూత్రాలను అక్షరాల పాటించి, ఎటువంటి పదవులు హోదాలు ఆశించకుండా తనవంతు బాధ్యతగా ప్రజాభ్యున్నతికై నిరంతరం శ్రమించి ఎంతో నిరాడంబర జీవితాన్ని గడిపి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ గాంధేయవాది, సమాజసేవకుడు, వ్యాపారవేత్త డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య, నేటి మన ఆదర్శమూర్తి.

పూర్తిగా ఇక్కడ చదవండి » https://sirimalle.com/bhogaraju-pattabhi-sitaramayya/

Posted in August 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!