Menu Close
ఆరు వసంతాల సిరిమల్లె బాల అంతరంగం

అందరికీ సిరిమల్లె 6వ వార్షికోత్సవ సంబరాలకు స్వాగతం, శుభ స్వాగతం.

సాధారణంగా ఏ పత్రికకైననూ సంపాదకీయం అనేది ఎంతో ముఖ్యం. అందులో ఆ పత్రికా సంపాదకులు తమ అభిప్రాయాలు, ఆలోచనలు, విశ్లేషణలూ, ఇలా ఎన్నో విధములైన విషయాలను పాఠకులతో పంచుకునే మంచి శీర్షిక అని చెప్పవచ్చు.

‘అందరూ మాట్లాడే భాషే అమ్మ భాష’ అనే సూత్రంతో 2015 ఆగష్టు నుండి, నాకు ఎల్లప్పుడూ ఎంతో మానసిక ధైర్యాన్ని అందిస్తూ ప్రోత్సహిస్తున్న నా శ్రీమతి, ఉమాప్రియ, ఆత్మీయ సహకారంతో, “సిరిమల్లె” అనే అంతర్జాల మాస పత్రికను నడుపుతున్నాను. ఎంతో కృషితో, పట్టుదలతో, ఆసక్తితో నిరాఘాటంగా 72 సంచికలను ప్రచురించిన తరువాత ఏర్పడిన ఆత్మసంతృప్తి తో కూడిన ధైర్యంతో నాలో ఏర్పడిన కొన్ని ఆలోచనల సాహితీ సుమహారాన్ని ఈ వేదిక ద్వారా మీతో పంచుకొంటున్నాను.

ఈ పత్రికను నిరాఘాటంగా వీలైనంత వరకు మంచి సాహితీ విలువలతో, మాతృభాష ప్రాధాన్యతను ఎత్తి చూపుతూ నా పరిధిలో నేను చేయగలిగిన సేవను చేస్తున్నాను. అందుకు నా చుట్టుప్రక్కల ఉన్న ఎంతో మంది సాహితీవేత్తల ఆశీర్వచనాలు నాకు సరికొత్త శక్తినీ, ఉత్సాహాన్ని అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. అందుకు అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. పత్రికను నిరాఘాటంగా నడపడం అంటే అందుకు మనకు ఎప్పుడూ కావలిసినంత సమాచారం ప్రచురణకు అందుబాటులో ఉండాలి. కొన్ని శీర్షికలు నేను వ్రాయగలను అనే ఒక్క ఇసుమంత ధైర్యంతో పాటు, నా కృషిని, సేవను గుర్తించి నాకు ఎంతో మంది తమ రచనల ద్వారా, సహకారాన్ని అందిస్తున్నారు.

ఒక చిన్న మాట మన మెదడు మీద ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. ఒక శాస్త్రవేత్తగా, పరిశోధక విద్యార్థిగా నా అనుభవమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. ఒక విధంగా సిరిమల్లె ఆవిర్భావం కూడా అలాగే జరిగింది.

ఇక సంపాదకీయంను అర్థవంతమైన, అత్యున్నత సాహిత్య విలువలతో, భాషా పటిమతో,  సృజనాత్మక పాండిత్యంతో వ్రాయాలంటే నా వంటి వారికి అంత సులువైన విషయం కాదు. కాకుంటే ఒక సామాన్య భాషా ప్రేమికుడిగా నా అనుభవాలు, ఆలోచనలు మీతో పంచుకోవడం తప్ప నైపుణ్యంతో సాహిత్యపరమైన సలహాలు ఇచ్చే స్థాయి నాకు లేదు. రాదు కూడా. ఎందుకంటే తాపి ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, గురజాడ అప్పారావు వంటి వారి మొదలు నేటి పత్రికారంగంలో ఎంతో కృషి సల్పుతున్న ఎందఱో మేధావులు తమ పత్రికల విలువలనూ పెంచుతూ వచ్చారు. ఒకప్పుడు సంపాదకుడు అంటే మార్పులు, చేర్పులు, కూర్పులు తదితర ధర్మాలను పరిగణలోకి తీసుకొని తమ వృత్తి ధర్మాన్ని తప్పక పాటించేవారు. కానీ సంపాదకీయం అనే పదానికి కాలానుగుణంగా అర్థం కూడా మారుతూ వస్తున్నది. సంపాదకుడు అంటే ‘సంపాదన మీదే దృష్టి పెట్టి అందుకు సదా కృషి సల్పేవాడు’ అనే వారు లేకపోలేదు.

సంపాదకునికి ఉండవలసినది భాషా పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేసే సృజనాత్మకత. సూర్య కాంతి అందరికీ సుపరిచితమే. కానీ కాంతి తరంగ ధైర్ఘ్యాన్ని మార్చి అందులో నుండి అందమైన వివిధ రంగులను సృష్టించవచ్చు. అలాగే విషయం పాతదే అవచ్చు కానీ దానిని విభిన్నంగా చూపించి అందులో కొత్తదనం నింపే బాధ్యత కూర్పరిదే.

వినూత్న రచనా ప్రక్రియతో పాఠకులను ఆకర్షిస్తే ఆ పిమ్మట వారికి భాషమీద ఆసక్తి కలిగి సాహితీ ప్రియులుగా మారి మన పంథాలో నడుస్తారు. ఆ విషయంలో సంపాదకునిదే ముఖ్య పాత్ర అవుతుంది. ప్రముఖ రచయితలూ, కొన్ని సందర్భాలలో పొరపాట్లు చేయవచ్చు. రచయిత అనే బిరుదు కోసం రచనలు సాగించకుండా అందులో ఎంతో ఆత్మసంతృప్తిని పొందినినాడే నీలోని నిజమైన సాహితీ విలువలు ప్రపంచానికి తెలుస్తాయి. సంపాదకులు క్రొత్తవారిని ప్రోత్సహించే అభిరుచితో ఉండి తప్పొప్పులను ఎత్తిచూపుతూ వారిలోని సృజనాత్మకతను పెంచేందుకు సహకరిస్తూ వారి రచనలకు అవకాశం కల్పించిన రోజు మంచి భావుకత మనందరికీ లభిస్తుంది.

నా దృష్టిలో సంపాదకీయం అనేది రెండు రకాలు:

ఒకటి, వ్యాపార దృష్టి తో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ చేసేది. మొదట్లో వచ్చిన ఎన్నో సాహిత్య పత్రికలు నాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ, ఎంతో పారదర్శకంగా విమర్శిస్తూ, జీవన అభ్యున్నతికి దోహదకాలుగా పనిచేసేవి. అందుకు తగినవిధంగా సంపాదకులు ఎంతో నిబద్దతతో తమ విధులకు న్యాయం చేసేవారు.

కాకుంటే ఆ శాతం తగ్గింది. ఆ నిస్వార్థ పారదర్శక సేవ ఈ మధ్యకాలంలో కొంచెం లోపించిందని నాకు అనిపిస్తున్నది.  ముఖ్యంగా వార్తా పత్రికల్లో భాష కన్నా బట్రాజు ధర్మానికే మక్కువ చూపుతున్నారు. అటువంటి వ్యాపార పత్రికలకు వ్రాయాలన్నా, కూర్పరిగా పనిచేయాలన్నా మనకు పాత్రికేయ అనుభవం అందులో పట్టా ఉండాలి. ప్రజల అభిమతానికి అనుగుణంగా మన అభిప్రాయాలను మార్చుకోవాలి. పైగా ప్రచురించే ప్రతి శీర్షికా వ్యాపార కోణంలోనే చూడాలి. ప్రతి క్షణం ప్రక్క పత్రిక మీద ధ్యాస వుంచి అనుక్షణం పోటీ ధోరణిలో సాగాలి. లేకుంటే మనుగడ కష్టం. ఇంతకన్నా నాకు ఇంకేమి తెలియదు.

ఇప్పడు, రెండో రకం:  ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా సామాజిక సేవా దృక్ఫధంతో మనకు తెలిసిన సమాచారాన్ని పది మందికి అందించే వాహకంగా పనిచేయడం. ప్రస్తుతం నేను చేస్తున్న పని ఈ కోవలోకే వస్తుంది. మన సిరిమల్లె ను  ఒక మంచి సాహితీ విరులను అందించే ఒక చిన్ని పూదోటగా మలిచి ఆ తోటమాలిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను.

ఇందులో నాకు ఆత్మ సంతృప్తినిచ్చే అంశాలు:

నేను సంగ్రహించిన విషయాలను నా మదిలో రేగే భావాలకు అనుగుణంగా అక్షరరూపం కల్పిస్తూ సులభతరమైన భాషలో అందించడం.

ఆధునిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్ననూ ఎంతో సాహిత్య పటిమ ఉన్న ఉద్దండులు స్వదస్తూరితో వ్రాసిన ఎన్నో అమూల్యమైన విషయాలను నేను స్వయంగా టైపు (ముద్రాలేఖనం) చేసి అంతర్జాలంలో ప్రచురించడం. ముఖ్యంగా ముదివయసులో కూడా ఏదో చేయాలనే ఆలోచనతో తమ రచనలను చేత్తో వ్రాసి పంపి మనందరికీ ఎంతో సంపదను అందిస్తున్న శిరోమణులకు నా నమస్సులు.

తమ మదిలో పొంగుతున్న ఎన్నో భావాలను బయటికి తీసుకురావాలని ఉవ్విళ్ళూరుతున్న వ్యాకరణ పరిజ్ఞానం లేని సామాన్య సాహితీ ప్రియులకు నా వంతు సహకారం అందించి వారి రచనలు ప్రచురించినపుడు వారు పొందుతున్న ఆనందం, అవధులు లేని ఆత్మసంతృప్తి నాకు ఎంతో ముఖ్యం.

నేటి సమాజ జీవన శైలికి అనుగుణంగా ఉన్న ఆరోగ్య విషయాలను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మాతృభాషలో ఆంగ్ల భాష రాని తెలుగువారికి అందుబాటులో ఉంచాలన్నదే నా అభిలాష.

ఇక రచనలు చేసే, చేయాలనే తపన ఉన్న వారికి నాదొక చిన్న సలహా:

మీ రచనలలో ఎదో ఒక సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. పదదోషాలు లేకుండా పది మందికి మీ అంతరంగ భావం అర్థమయ్యే రీతిలో మీ కలాన్ని కాలానుగుణంగా కదిలించండి.

మాటలు, చేతలు మాత్రమే కాక మౌనం కూడా కొన్నిసార్లు మనలను చైతన్య వంతులుగా మార్చుతుందని నాకు ఈ సాహితీ స్వానుభవం తెలిపింది.

సంపాదకుడికి ముందు స్థిరత్వం ఉండాలి అప్పుడే రచయితలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.

కొత్త నీరు వస్తే పాత నీరు పోతుందంటారు. కానీ సాంద్రత ఆధారంగా ఇంకా కొంత ఉండిపోతుంది. అదేవిధంగా కొత్త కొత్త ప్రక్రియలు ఎన్ని వచ్చినను వాటికి మూలాధారమైన పాత ప్రక్రియలు కనుమరుగు కాకూడదు. అప్పుడే భాష బతుకుతుంది. భాషకు ఆధారం ప్రాచీనత. నిజం చెప్పాలంటే వైన్ ఎన్ని సంవత్సరాలు ఎక్కువ నిలువచేస్తే అంత ఖరీదు చేస్తుంది. భాష కూడా అంతే.

ఆరు సంవత్సరాలుగా మన సిరిమల్లె ఎదుగుదలకు కారణభూతులైన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ

-- మీ మధు

Posted in August 2021, వ్యాసాలు

2 Comments

  1. Sarat babu

    అక్షర సంపాదకులకు నమస్తే. పత్రికతో పరిచయం, సంపాదక పఠనం ఇదే తొలిసారి.ఉన్న ఆలోచన పెంచారు, కొత్త వాటిని రగిలించారు. మీరన్నట్లు- ఇది పరిమళాల పూదోట. ఇక్కడ ఎప్పుడూ ఆనంద ఆరోగ్యాలే!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!