Menu Close
తేనెలొలుకు
(ఆలాపన కవితా సంపుటి)
- రాఘవ మాష్టారు

ముందుమాట:

భావాలపరంగా ఆత్మకు, పరమాత్మకు వ్యతిరేకినైన నేను ఒకే ఒక్కసారి “గీతాంజలి” చదవడంతో మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. అలా ఎన్నోసార్లు చదవడం వలన ఆ గీతాల భావాకర్షణకు నా మనస్సులోనైనది. నాలాంటి ఓ సాధారణ వ్యక్తిచేత ఈ “ఆలాపన” గీతాలకు ప్రేరణ కలిగించింది. నన్ను ఈ గేయసంపుటిని వ్రాసేందుకు ప్రోత్సహించింది.

ఇది ప్రియుని కోసం ప్రేయసి నివేదన కావచ్చు. ప్రేయసి కోసం ప్రియుని నివేదన కావచ్చు. భగవంతుని కోసం భక్తుని నివేదన కావచ్చు. ప్రేమకోసం ప్రేమ నివేదన కావచ్చు. ఇది ఒక ఆత్మార్పణ, ప్రేమార్పణ.

మానవ జీవితానికి సంపదే సర్వస్వం కాదు. అంతకు మించిన గొప్ప వరం “తృప్తి” “తీయని అనుభూతి” అవి ఈ ఆలాపన గీతాలలో మీకు సర్వదా కలగాలని మీరు కూడా ఈ గీతాలు చదివి ఓ క్షణమైనా ఆ అనుభూతి, తృప్తి పొందగలరని ఆశిస్తున్నాను. యిదే నా మనసులోని మాట.

ఈ ఆలాపన గీతాలకు “శ్రవణానందం” తో తమ ఆశీస్సులు అందించిన శ్రీమాన్ పూజ్యులైన ‘శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి’ గార్కి, ఈ కృతికి తన మౌనస్వరాల ఆకృతి నిచ్చిన శ్రీయుతులు మహనీయులైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అభినవకవన వసంతరాయలు శ్రీ ‘సి.నా.రె.’ గార్కి, ఈ రచనకు ప్రోత్సాహాన్నిచ్చిన పూజ్యులైన శ్రీ నాగభైరవ గార్కి, నా వెన్నుతట్టి ఉత్సాహపరిచిన ప్ర.ర.సం. అధ్యక్షులు శ్రీ హనుమారెడ్డి గారికి, డాక్టర్ మండవ నరసింహారావు గార్కి, నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

పుస్తకరూపంలో ప్రచురించిన ఈ గేయాలను ఇప్పుడు మన ‘సిరిమల్లె’ లో తేనెలొలుకు శీర్షిక రూపంలో మీకు అందిస్తున్నాను. మీ అభిప్రాయాలను తెలుపకోరిక.

- నమస్కారములతో కేదారి రాఘవ (రాఘవ మాష్టారు)

3. “ఆలాపన”

నిన్ను స్తుతించడానికే
నీ అద్భుతాలు వర్ణించడానికే
నీ సభా ప్రాంగణంలో
ఓ మూల స్థంభం వెనుక నిలుచున్నాను.

ఈ లోకానికి నాతో పనిలేదు
నేను భాగ్యవంతుడను కాను
విజ్ఞానఖనిని కాను
రాజకీయవేత్తను కాను
మతాచారిని కాను
నేనెవ్వరికీ ఏమీ కాదు
“అంధకారంలో ఉన్నవారికి
చిరుదీపం వెలిగించడం తప్ప”
నేనెవ్వరికీ ఏమీ కాను.

మౌనంగా
నేను నేర్చిన
తీయనైన కూనిరాగాలను పలుకగలను

ఈ జీవితాన్నిచ్చినందుకు
కృతజ్ఞతగా
నా జీవిత వీణపై
నీ ముంగిట
నీ గీతాలు శృతి చేయగలను

అందుకే......ప్రభో!!
నీ ముందు నిలబడి
నీ ఆజ్ఞకై ఆలాపనతో
ఎదురు చూస్తున్నాను.

***సశేషం***

Posted in August 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!