Menu Close
sitaramanjaneyulu_katha

కాకులు:

అది అమెరికాలో, టెక్సస్ రాష్ట్రంలో ఒక పెద్ద ఊరు. యాభై ఏళ్ళ నించీ అక్కడే వున్నవాళ్ళ దగ్గరనించీ, గత పదేళ్ళుగా వస్తున్న సాఫ్ట్వేర్ విద్వాంసుల దాకా అక్కడ భారతీయులు, వారిలో కూడా తెలుగువాళ్ళు, ఎక్కువగానే వున్న నగరం అది.

మరి గాలిలో అలా వచ్చిన ఆ వార్త ఒక్కసారిగా ఆ వూళ్ళో, నేల నించి నింగి దాకా గుప్పుమనటంలో ఆశ్చర్యం లేదు. అక్కడే కాదు పార్వతిగారి ఇంట్లో పార్టీలో కూడా అదే విషయం చర్చకు వచ్చింది.

“అయినా ఆ వయసులో ఆయనకి అదేం పోయే కాలం, సిగ్గు లేకపోతే సరి!” అంది శాంత.

“అవును, సావిత్రిగారు వున్నప్పుడు అందరితో ఇద్దరూ ఎంతో మంచిగా, స్నేహంగా వుండేవారు. ఆవిడ నాలుగేళ్ళ క్రితం చనిపోయాక, అప్పుడప్పుడే కనపడినా, మొన్నమొన్నటి దాకా ఆయన బాగానే వుండేవాడు. ఇప్పుడేమొచ్చిందో మరి” అంది సుజాత.

“పిదప కాలం, పిదప బుద్ధులు” అంది పార్వతి.

“ఈ మగవాళ్ళని గుడ్డిగా నమ్మేయకూడదు. పైకి బాగానే వుంటారు కానీ, వాళ్ళ ఆలోచనలు ఎలా వుంటాయో తెలుసుకోవటం కష్టం” అంది సుజాత.

“ఆయనకి ఇద్దరు పిల్లలు కూడాను. కూతురేమో ఒక మెక్సికన్ని పెళ్ళి చేసుకుంది. అబ్బాయి సంగతి మాత్రం రహస్యంగా అట్టిపెట్టారు” అంది శాంత.

“మెక్సికన్ అయితే ఏంలే, ఇద్దరూ డాక్టర్లుగా మంచి పేరు సంపాదించారు. డబ్బులు సంపాదిస్తున్నారు. ఇద్దరు పిల్లలతో చక్కగా కాపురం చేసుకుంటున్నారు” అంది పార్వతి.

“ఏమో.. మనుష్యుల బుధ్ధులు ఎలా మారతాయో చెప్పటం కష్టం” అంది సుజాత.

అక్కడ ఆ విషయం మీద వెనుక గదిలో అలా ఆడవాళ్ళ చర్చ జరుగుతుంటే, మగవాళ్ళు ముందు గదిలో అదే విషయం మీద వాళ్ళ సంభాషణ మొదలు పెట్టారు.

“అవును. మనమందరం ఎలా చూస్తూ వూరుకుంటాం. మన తెలుగువాళ్ళకి ఎంత చెడ్డ పేరు వస్తుంది” అన్నాడు రవి.

“రవీ, నువ్వు అమెరికాకి వచ్చి మూడు నాలుగేళ్ళు దాటలేదు. నువ్వు పుట్టక ముందే ఆయన అమెరికాలో ఎన్నో ఏళ్ళుగా వున్నారు. నీకేం తెలుసు ఆయన గురించి? అయినా తన జీవితంలో తనకి ఇష్టమైనదేదో ఆయన చేసుకుంటుంటే, ఈ వూళ్ళో వున్న తెలుగువాళ్ళకి చెడ్డ పేరు రావటమేమిటి?” అన్నాడు రఘు చిన్నగా నవ్వుతూ.

“రవి చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈ వయసులో కూడా ఏమిటది? ఆయన కొడుకు గురించి కూడా కొన్ని కథలు విన్నాను. ఎంత వరకూ నిజమో తెలియదు కానీ, నిప్పు లేనిదే పొగ రాదుగా” అన్నాడు సాయి.

“నాకు మాత్రం రఘు చెప్పిందే బాగుంది. ఇది అమెరికా. ఇండియా కాదు. అమెరికన్స్ అనవసరంగా ఇంకొకళ్ళ జీవితాల్లో వేళ్ళు పెట్టరు. మనం వాళ్ళకి ఎంతో దగ్గరయితే తప్ప, వాళ్ళ జీవితాల్లోకి వెడితే ఇష్టపడరు. ఎంత స్నేహంగా వున్నా, వాళ్ళ పరిధిలో వాళ్ళు వుంటారు. మన దగ్గరనించీ కూడా అదే ఆశిస్తారు. అదీకాక సీతారాంగారి గురించి మనకేమీ తెలియదు. మనమెవ్వరం పుట్టకముందే అమెరికా వచ్చి, యూనివర్సిటీలో ప్రొఫెసరుగా మంచి పేరు తెచ్చుకుని, ఆ మధ్యనే రిటైర్ అయి హాయిగా వున్నాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగులో ఆయన నాసాకి కూడా సలహాదారుగా వున్నాడు. ఆయన తన విశ్రాంత సమయంలో ఎలా వుంటే ఏమిటి?” అన్నడు మోహన్.

“ఏమో బాబూ. మనకీ కొన్ని విలువలూ, సిద్ధాంతాలు వున్నాయి కదా. కనీసం వాటినన్నా గౌరవించవద్దూ!” అన్నాడు మూర్తి. మూర్తి వయసులో అందరికన్నా కొంచెం పెద్దవాడు.

ఆ చర్చ ఇంకా అలా కొనసాగుతూనే వుంది

౦        ౦        ౦

సీతారాం:

తనకి ఈమధ్య అసలు మనసు మనసులో వుండటం లేదు. గుండెల్లో ఒకటే గాబరాగా వుంటున్నది. ముఖ్యంగా రాత్రిళ్ళు. మధ్య రాత్రి, ఎయిర్ కండిషన్ పని చేస్తున్నా, ఫాన్ తిరుగుతున్నా, ఒకటే చెమటలు పట్టేస్తున్నాయి. లేచి గ్లాసెడు మంచి నీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు కానీ, ఇక నిద్ర పట్టదు. అలా తరచుగా జరుగుతూనే వుంది. డాక్టరుతో చెబితే, మనసు ప్రశాంతంగా పెట్టుకుని పడుకోండి అన్నాడు.

మనసు ప్రశాంతంగా వుంచుకోమంటే ఎలా వుంటుంది? సావిత్రి పోయినప్పటినించీ అలాగే వుంటున్నది. మంచి రీసెర్చి ప్రొఫెసరుగా తను ఎంతో పేరు తెచ్చుకుని, ఎన్నో పురస్కారాలు, పేటెంట్లు సంపాదించినా, ఇంటికి వచ్చేసరికీ అంతా సావిత్రికే వదిలేసేవాడు. ఇంటి సంగతులు ఏమీ అసలు పట్టించుకునే వాడు కాదు. సావిత్రి కూడా ఆయనకి ఏ ఇబ్బందీ కలగకుండా ఎంతో జాగ్రత్త పడేది.

ఒకసారి ఏదో సభకి వెళ్ళి ఒక ప్రసంగం వింటుంటే, ఆయన చెప్పింది తనకి బాగా నచ్చింది.

ఒక స్త్రీకీ, పురుషుడుకీ వయసులో వున్నప్పుడు వారి మధ్య వుండేది ఆకర్షణ. వారికి నచ్చినవారితో ఆ ఆకర్షణలో పడతారు. పెళ్ళి చేసుకుంటారు. కొన్నాళ్ళు ‘లాహిరి, లాహిరి’ పాట పాడుకుంటూ సరదాగా గడుపుతారు. తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాక జీవన సరళి పూర్తిగా మారిపోతుంది. పెద్ద సంసారానికి సరిపడా ఆదాయం కోసం భార్యాభర్తలు ఇరువురూ పాటుపడటమూ, పిల్లలకి చదువులూ, కూతురికి డాన్సులూ, సంగీత సాధనలూ, కొడుకుకి టెన్నిస్, బేస్బాల్ ఆటలూ ఇలా గడిచిపోతుంది. మధ్యే మధ్యే పిల్లలకి రోగాలూ, రొష్టులూ. ఇలా పిల్లల చుట్టూ తిరుగుతుంది తల్లిదండ్రుల బాధ్యతాభరితమైన జీవితం.

పిల్లల చదువులు పూర్తయి, ఉద్యోగాలు సంపాదించుకుని, వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయేసరికీ, భార్యాభర్తలు ఇద్దరూ రిటైర్మెంటుకి దగ్గరవుతారు. ఒకళ్ళకొకరు దగ్గరవుతారు. కష్టమైనా, నష్టమైనా, దుఃఖమైనా, సుఖమైనా.. ఏదయినా  ఒకళ్ళ మీద ఇంకొకరు పూర్తిగా ఆధారపడతారు. అప్పుడే వారిరువురి మధ్యా నిజమైన ప్రేమ ఎక్కువయి, వారిని మరింత దగ్గరకు తీసుకువస్తుంది. ఇన్నాళ్ళూ వాళ్ళు చేయాలనుకుని, బాధ్యతల నిర్వహణలో చేయలేకపోయినవన్నీ చేయటానికి అప్పుడే మంచి అవకాశం. ఇద్దరూ కలిసి దేశదేశాలు తిరిగి ఎన్నో ప్రదేశాలు చూడాలని, ఎంతో ఉబలాట పడ్డారు. యూరప్లో కొన్ని ప్రదేశాలకి వెళ్ళి వచ్చారు కూడాను.

అప్పటిదాకా తమ జీవితంలో అన్నీ సరిగ్గా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి.

కూతురు డాక్టరయి, తన తోటి డాక్టర్ ఒక మెక్సికన్ అతన్ని పెళ్ళి చేసుకుంటానంది. ఎవరికైనా కావలసింది, పిల్లలు వారికి నచ్చిన వారిని పెళ్ళి చేసుకుని సుఖంగా వుండటం. అందుకే వారి పెళ్ళి ఇటు భారతీయ పద్ధతిలోనూ, అటు మెక్సికన్ చర్చిలోనూ ఘనంగా చేయంచాడు. ఇప్పుడు ఇద్దరూ ఎంతో సుఖంగా వున్నారు.

కొడుకు మైక్రో బయాలజీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడే, సావిత్రి హఠాత్తుగా తమ జీవితాల్లోనించీ వెళ్ళిపోయింది.

ఇక్కడే అప్పటిదాకా సాఫీగా క్రమం తప్పకుండా వెడుతున్న తన జీవితం పట్టాలు తప్పింది. ఈ వయసులో తనకి అండగా నిలబడి, తనకి ఎంతో మానసిక బలం ఇవ్వవలసిన సావిత్రి, తనని ఏకాకిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఒంటరిగా ఇంటి పనీ, వంట పనీ ఎలాగోలా చేసుకుంటున్నా, పక్కనే వుండవలసిన మనిషి తోడు కరువయింది.

అప్పుడే తన కొడుకు అతని మనసులోని మాట చెప్పాడు. అతనితో పని చేసే ఒకతనితో ప్రేమలో పడ్డాననీ, ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నామనీ చెప్పాడు. ఇంతకుముందు ఇద్దరు మగవాళ్ళు పెళ్ళి చేసుకోవటమంటే తనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈసారి తన స్వంత కొడుకే ఆమాట చెప్పగానే  తనకి మిన్ను విరిగి మీద పడినట్టు అనిపించింది. జీవితంలో ఎవరు ఇష్టపడినవి వాళ్ళు చేయాలనే భావనని గట్టిగా సమర్ధించేవాడు. కొంచెం ఆలోచించాక, ఇలాటి వివాహం కొంచెం ఇబ్బందిగానే అనిపించినా, కొడుకు చెప్పిన పని ఎలాగూ చేస్తాడు కనుక తనిక అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ కాలిఫోర్నియాలో వుంటున్నారు. ఇలాటి విషయాల్లో తన మనసులోని భావాలు పంచుకోవటానికి సావిత్రి కూడా లేదు. మొదటినించీ తను అందరితోనూ ముభావంగానే వుంటాడు కనుక, ఇటు అమెరికాలోనూ అటు ఇండియాలోనూ, తను అన్ని విధాలా ఒంటరి వాడయిపోయాడు.

మరి తన డాక్టర్ చెప్పినట్టు మనసు ప్రశాంతంగా వుంచుకుని పడుకోమంటే ఎలా కుదురుతుంది? ఎలా నిద్ర పడుతుంది?

౦        ౦        ౦

లోకులు:

ఆ వూరి కాకులు, వెయ్యి మైళ్ళు దూరంగా వున్న ఈ వూరి మీద వాలవలసిన అవసరం లేదు.

‘లోకులు కాకులు’ అనే సామెత వుంది కదా మరి.

లోకులు ఎక్కడైనా ఒక్కటే. వాళ్ళకి మిగతా వాళ్ళందరూ లోకువే!

‘ఈ సంగతి విన్నావా?’ అడిగాడు వేణు, శేషగిరికి ఫోన్ చేసి.

‘ఏది? మన ఆఫీసులో పనిచేసి, పోయిన సంవత్సరం రిటైర్ అయిన ఆంజనేయులుగారి గురించేనా..” అడిగాడు శేషగిరి.

‘అవును. ఆయన గురించి మనకి ఎక్కువ తెలియక పోయినా, ఆయన దగ్గరే పని చేసిన మణి చెప్పాడుగా. ఆయన పెళ్ళి చేసుకోకుండా ఇప్పటి దాకా బ్రహ్మచారిగానే వున్నాడుట. ఆయనకి ఇక్కడ అమెరికాలో చుట్టాలు కూడా ఎవరూ లేరు. భారతదేశంలో కూడా ఏవో ఆస్తి తగాదాలతో అందరూ దూరమైనారుట. అందుకే ఇక్కడ ఉద్యోగంలో కూడా రాత్రి పగలూ అనే తేడా లేకుండా పని చేసి, వైస్ ప్రెసిడెంట్ పదవి దాకా ఎదిగి, పోయిన సంవత్సరమే రిటైర్ అయాడు’ ఆగాడు వేణు.

‘ఇంకా ఏం చెప్పాడు మణి?’ అడిగాడు శేషగిరి.

‘నాకు తెలుసు నువ్వు ఏమడుగుతున్నావో, ఇన్నేళ్ళు ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోలేదనేగా? మణి ఎప్పుడూ

నాతో రహస్యంగా చెబుతూనే వున్నాడు. ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ లేదా అలాటి వేరే సంబంధాలు కానీ ఏవీ లేవుట. మరి తన అవసరాలు ఎలా తీర్చుకుంటున్నాడో! అసలు ఆయనలో మగతనం వుందా అని మణికి అనుమానం’ అన్నాడు వేణు.

‘అవును, నేనూ చూచాయగా ఆ విషయం విన్నాను. ఇప్పుడు ఆయన ఇక్కడ చికాగోలో ఇల్లు అమ్మేసి, టెక్ససులో అదేదో వూరికి వెడుతున్నాడుటగా. అక్కడ ఎవరో భార్య చనిపోయిన ఒకాయన వున్నాడుట. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటారుట. ఈ వయసులో ఇదేం పోయేకాలమో ఇద్దరికీ’ అన్నాడు శేషగిరి.

౦        ౦        ౦

ఆంజనేయులు:

మొదటినించీ తనకు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే ఎంతో ఇష్టం. విషయపరంగా అది తనకి రెండో ప్రాణం.

మెకానికల్ ఇంజనీరింగులో మాష్టర్స్ డిగ్రీ చేశాక, అమెరికాలోనే ఆపరేషన్స్ మేనేజ్మెంటులో ఎంబిఏ చదివాడు. వెంటనే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఎన్నో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి, మాన్యుఫాక్యరింగ్ ఎఫిషెన్సీ పెంచి, కంపెనీకి ఎన్నో లాభాలు తెచ్చిపెట్టాడు. ఆ కంపెనీలోనే త్వరగా ఎదిగి, వైస్ ప్రెసిడెంట్ పదవి కూడా సంపాదించాడు.

తన ఉద్యోగ నిర్వహణలో, పెళ్ళితో సహా మిగతా వ్యాపకాలన్నీ పక్కన పెట్టాడు. అంతేకాక, ఒక వయసు దాటాక మళ్ళీ అటు ధ్యాస కూడా పోలేదు. తనెప్పుడూ గాసిప్ కబుర్లకి దూరంగా వుంటాడు కనుక, ఎవరేమనుకున్నా ఎప్పుడూ అవేవీ పట్టించుకోలేదు.

ఉద్యోగంలో రిటైర్ అయాక ఒక్కసారిగా తెలిసివచ్చింది, ఒంటరిగా సమయం గడపటం అంత సులభం కాదని. ఎన్నో దశాబ్దాలపాటు ప్రతి రోజూ, రోజుకి పది పన్నెండు గంటలు పని చేసిన వాడికి, ఒక్కసారిగా జీవితంలో ఎంతో వెలితి కనపడింది. శూన్యంలో వున్నట్టు వుంది. ఏ వ్యాపకాలూ లేకుండా రోజుకి ఇరవై నాలుగు గంటలు గడపటం చాల కష్టమైపోయింది. రాత్రికీ పగలుకీ తేడా కూడా తెలియటం లేదు. అప్పటిదాకా తన జీవితంలో ఎన్ని విషయాల్లో ఎంత నష్టపోయిందీ కూడా అర్ధమైంది. తనకి టీవీ కానీ, సినిమాలు కానీ చూసే అలవాటు లేదు. పెద్దగా స్నేహితులూ లేరు. ఒక్కొక్కసారి బ్రతుకే నిరర్ధకమనీ, తను జీవించటం అనవసరమనీ కూడా అనిపించేది.

అప్పుడే అతనికి టెక్సస్ నించీ కలలో కూడా అనుకోని ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదే చిన్ననాటి మిత్రుడు సీతారాం దగ్గర నించీ. ఆ ఒక్క ఫోన్ కాల్ తన జీవితాన్ని, ఇంత పెద్ద మలుపు తిప్పుతుందని ఏమాత్రం ఊహించలేదు.

సీతారాం, తనూ బందరు నోబుల్ కాలేజీలో కలసి చదువుకున్నారు. తర్వాత ఇద్దరూ పై చదువులకి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తను అమెరికా వచ్చిన కొత్తల్లో, అప్పుడప్పడూ ఇద్దరూ ఫోన్లో కాసేపు మాట్లాడుకునేవారు కానీ, ఇద్దరూ ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు బిజీగా వుండటంతో, అదీ ఎక్కువరోజులు నడవలేదు. మళ్ళీ  ఇన్నేళ్ళ తర్వాతనే, సీతారాం మాట ఫోనులో వినటం.

‘ఎన్నాళ్ళయిందిరా సీతా, నీతో మాట్లాడి. ఎలా వున్నావు?’ అడిగాడు ఆంజనేయులు ఆప్యాయంగా పలకరిస్తూ.

సీతారాం భార్య చనిపోయిందనీ, తనకి ఒంటరితనం బాధగా వుందనీ చెప్పాడు. ఇద్దరు పిల్లలు వున్నా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు బిజీగా వుండేవారు. ఎప్పుడో, ఏ రెండు మూడేళ్ళకో ఒక్కసారి కలవటం, క్రిస్మస్ రోజుల్లో చిన్న చిన్న బహుమతులు ఇచ్చి పుచ్చుకోవటాలు తప్ప అందరూ కలిసి గడిపిన రోజులు ఎంతో తక్కువ అని చెప్పాడు. తనతో పాటు ఎవరైనా కలిసి తోడుగా వుంటే బాగుండేది కానీ, ఆ అవకాశమూ లేదన్నాడు.

అలాగే ఆంజనేయులు కూడా తన కష్ట సుఖాలు చెప్పుకున్నాడు. జీవితం దుర్భరమైపోయిందనీ, అప్పుడప్పుడూ ఇంకా బ్రతకటంలో ఏమిటి ప్రయోజనం అనే ఆలోచన వస్తున్నదని కూడా చెప్పాడు.

సీతారాం నవ్వాడు. ‘నీ సమస్యకు, నీ సమస్యకే కాదు ఎలాటి కష్టాల్లో వున్న ఎవరికైనా సరే, మరణం ఒక పరిష్కారం కానే కాదు. నీకు అభ్యంతరం లేకపోతే చికాగోలో నీ ఇల్లు అమ్మేసి, మా వూరు వచ్చేసి, మా ఇంట్లో నా దగ్గరే వుండు. నీకు నేను, నాకు నువ్వు. కష్టమైనా, సుఖమైనా ఇద్దరం కలిసే పంచుకుందాం. కలిసే వుందాం’ అన్నాడు సీతారాం.

ఇద్దరూ కాసేపు ఫోనులో తర్జనభర్జనలు చేశాక, ఆంజనేయులుకి అదే మంచిది అనిపించింది.

౦        ౦        ౦

సీతారామాంజనేయులు:

ఆంజనేయులు చికాగోలో ఇల్లు, ఇంట్లో సామాను చాలవరకూ అమ్మేసుకుని, కొద్ది సామానుతో సీతారాం దగ్గరికి వచ్చేసి నెల రోజులు దాటింది.ఆంజనేయులు దాదాపు ఏభై ఏళ్ళు ఒంటరిగా వంట చేసుకునేవాడేమో, ఆ అనుభవంతో రోజూ రెండు పూటలా అతనే వంట చేస్తున్నాడు. సీతారాం గిన్నెలన్నీ కడగటం మొదలైన పనులు చేస్తుంటాడు. సాయంత్రాలు ఇద్దరూ కలిసి అలా పార్కు దాక నడిచి వస్తుంటారు. పుస్తకాలు చదువుతూనో, పాత సినిమా పాటలు వింటూనో కాలక్షేపం చేస్తుంటారు.

ఆరోజు రాత్రి కూడా, ఇద్దరూ భోజనాలు చేసి చెరో సోఫాలో కూర్చున్నారు.

సీతారాం అన్నాడు, ‘అంజీ, నువ్వు వచ్చినప్పటినించీ నాకు హాయిగా వుందిరా. మళ్లీ ఇంట్లో సావిత్రి వున్నట్టుగా వుంది’ అన్నాడు.

‘అవును సీతా, నాకూ ప్రాణం లేచి వచ్చినట్టు వుంది. మళ్ళీ కొత్త జీవితం మొదలుపెడుతున్నట్టు వుంది. కానీ మన గురించి ఇక్కడ మన తెలుగువాళ్ళే ఏవేవో అనుకుంటున్నారనీ, అక్కడక్కడా పైకే అంటున్నారనీ చెప్పావు మరి..”  అడిగాడు ఆంజనేయులు.

చిన్నగా నవ్వాడు సీతారాం. ‘అలాటివి నేను ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడూ అంతే. నిజానిజాలు ఇలాటి వాళ్ళకి అఖ్కర్లేదు. వాళ్ళకి రాళ్ళు రువ్వటమే తెలుసు కానీ, అవసరానికి ఆదుకోవటానికి మాత్రం ముందుకు రారు. అమెరికా వచ్చాక కూడా కుల రాజకీయాలు, ఇలాటి మిగతా పురిటి కంపు వాళ్ళని ఇంకా వదలటం లేదు మరి. అయినా వాళ్ళు చెప్పేది ఈ వయసులో వున్న మనకి వర్తించదు. ఒరే అంజీ, నీకో రహస్యం చెప్పాలి. ఈ వయసులో నా జీవితం ఇలా మలుపు తిరగటానికీ, నా చిన్ననాటి మిత్రుడివి నిన్ను నా ఇంట్లో వుండమనటానికీ నా స్వార్ధం కూడా వుంది’ అన్నాడు.

‘ఏమిటది?’ ఆంజనేయులు అడిగాడు కుతూహలంగా.

‘రెండు మూడు నెలలయిందేమో.. ఒకరోజు అర్ధరాత్రి బాత్రూముకి వెడదామని లేచాను. తిరిగి వస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిపిడిపడి లేచేసరికీ తెల్లవారింది. చెమటతో కాబోలు చొక్కా తడిసిపోయివుంది. నుదుటి మీద తగిలిన దెబ్బతో కొంత రక్తం కూడా కారిపోయింది. లేచి ఫాన్ ఫుల్ స్పీడులో పెట్టి మంచం మీద కూర్చున్నాను. అప్పుడే అనిపించింది, అదే కనక ఎంతో సీరియస్ అయివుంటే, ఆంబులెన్సుకి ఫోన్ చేసేవారు కానీ, నా పక్కన నిలబడి ఆదుకునేవారు కానీ లేరు. సరిగ్గా సమయానికి వైద్య సహాయం అందక నా ప్రాణం పోయినా పోయుండేది. ఏదయినా రిటైర్మెంట్ హోంలో చేరదామా అనుకున్నను కానీ, అలాటివి రెండు మూడు చూశాక, అక్కడ చేరటానికి మనసొప్పలేదు. అందుకే ఎవరైనా నా దగ్గరే తోడు వుంటే బాగుండేది అనిపించి, నీకు ఫోన్ చేశాను’ అన్నాడు సీతారాం.

ఆంజనేయులు చిన్నగా నవ్వాడు. ‘నువ్వు ఏదో స్వార్ధంతో అలా చేశావని అనుకోనఖ్కర్లేదు. ఎందుకంటే నాకు కూడా ఇక్కడికి రావటానికి అలాటి కారణమే వుంది. మా ఆఫీసులోనే ఇంజనీరింగ్ మేనేజరుగా పని చేసే ఒక ఆయన.. భారతీయుడే..  మలయాళీ ఆయన.. పోయిన సంవత్సరమే రిటైర్మెంట్ తీసుకున్నాడు. కొన్నేళ్ళ క్రితమే ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకుని ఒంటరిగా వుంటున్నాడు. సరిగ్గా రెండు నెలల క్రితమే, అతని స్నేహితుడెవరో న్యూయార్క్ నించీ ఐదారుసార్లు ఇంటి ఫోనుకీ, సెల్ ఫోనుకీ ఫోన్ చేస్తే జవాబు రాలేదుట. పోలీసులని పిలిచి ఏదో అనుమానంగా వుందని చెబితే, వాళ్ళు ఇంటి తాళం పగలకొట్టి లోపలకి వచ్చి చూస్తే, అతను చనిపోయివున్నాడు. ఇల్లంతా కొంచెం వాసనగా కూడా వుందిట. అటాప్సీ చేసి అతను చనిపోయి కనీసం మూడు, నాలుగు రోజులయివుంటుంది అన్నారుట. చాల మంచి మనిషి. అవసరానికి సహాయం అందక, ఎంత బాధ పడి పోయుంటాడో.. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నాకు చెమటలు పడతాయి. నాకూ అలాగే అవుతుందేమోనని భయం పట్టుకుంది. అలాటి అభద్రత వల్లే, రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. We don’t deserve that kind of death’ అన్నాడు ఆంజనేయులు.

సీతారాం సోఫాలోనించీ లేచి, ఆంజనేయులు చేతిని మృదువుగా పట్టుకుని, ‘ఆ అభద్రతే మనిద్దరినీ దగ్గర చేసింది. నాకు నువ్వు, నీకు నేను. ఇక ఇద్దరం కలిసే ముందుకు వెడదాం’ అన్నాడు సీతారాం.

 

౦        ౦        ౦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *