Menu Close

Alayasiri-pagetitle

మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు

సంగమేశ్వర ఆలయం, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్

Sangameswara Temple

శాస్త్ర సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో మనిషి నిజంగా తన మెదడుకు పదునుపెట్టి ఎన్నో అపురూప అందాలను సృష్టించాడు. ఆనాటి సామాజిక జీవన పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఎన్నో రాతి కట్టడాలను నిర్మించాడు. అందుకొఱకు ఎంతగానో శ్రమించాడు. ఎందుకంటే ఈనాటి ఆధునిక పరిజ్ఞాన వసతులు, అవకాశాలు నాడు లేవు. అందుకనే ఒక్కో కట్టడం నిర్మించడానికి ఎన్నో ఏళ్ళు పట్టేది. అయితేనేమి శతాబ్దాలపాటు అవి చెక్కుచెదరక నిలిచి భావితరాలకు చరిత్రను చూపుతున్నాయి.

‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతాయి’ అన్న సామెతలో రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాజులు, చక్రవర్తులు ప్రతి ఊరిలో ఒక శిల్పారామం అన్నట్లు ఎన్నో అద్భుత కట్టడాలను, ఆలయాలను నిర్మింపజేశారు. వాటి ఆలనాపాలనా సరిగా జరగడానికి మాన్యాలను కూడా రాసిచ్చారు. అది ఆనాటి చరిత్ర. మరి నేడు అవే శిల్ప సౌందర్యాలు శిధిలావస్థలో ఉంటే పట్టించుకునే నాథుడు లేడు. కారణం పేదరికం అని, మనిషి మనుగడకు నిత్యం సతమతమవుతున్న తరుణంలో చరిత్రను పరిరక్షించడం అవసరమా అని వితండవాదం. పాశ్చాత్య దేశాలకు మనకు అక్కడే తేడా. 100 లేక 200 సంవత్సరాల కట్టడాలను వారు అపురూపంగా చూసుకుంటూ పరిరక్షిస్తే, వేల సంవత్సరాల హిందూ చరిత్రను ప్రతిబింబిస్తూ నిర్మించిన ఈ కళా కుడ్యాలు  ఎటువంటి గుర్తింపు పొందటం లేదు.

Sangameswara Templeతుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి అని ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం కర్నూలు జిల్లాలోని ఈ సంగమేశ్వరం.  ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం అయిన  శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి.

ఈ సంగమేశ్వర ఆలయానికి ఒక చరిత్ర ఉంది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ సంగమేశ్వర ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ఠ చేయవలసిన సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు ధర్మరాజు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

Sangameswara Temple

ఎంతో శక్తివంతమై నిత్యపూజలతో సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమై ప్రధాన ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం ఉండి వెలుగొందిన ఈ ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఎంతో శోభాయమానంతో భక్తుల భూ కైలాసంగా విలసిల్లిన ఈ దేవాలయం నేడు శిధిలాల కుప్పగా అది కూడా నీటిలో పూర్తిగా మునిగిపోయి నిరాశాజనకంగా కనిపిస్తున్నది. శ్రీశైలం వద్ద కృష్ణా నది మీద ఆనకట్ట కట్టినందువలన ఈ ఆలయం ముంపుకు గురై, కొన్ని నెలలు మాత్రమే భక్తులు సందర్శించుకునేందుకు వీలుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే నిత్య పూజాది కైంకర్యాలు ఉంటాయి.

Sangameswara Temple‘రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి స రి గ మ పదములే పాడగా’ అన్నట్లు నాటి శిల్పుల చాతుర్యం అమోఘం. ఈ శిల్పకళాసౌందర్యం నాటి సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, సృజనాత్మకతకు ప్రతిబింబాలు. కానీ, మనిషి తన అవసరాలకొరకు చరిత్రను పక్కన పెట్టి, అన్నీ రాళ్ళు రప్పలే కదా అంటూ తను నిర్మించుకొన్న ఆనకట్ట తాలూకు నీటిలో మునిగిపోతున్ననూ పట్టించుకోకుండా ఈ ఆలయాన్ని వదిలేశారు. ఎప్పుడైనా నీటి మట్టం తగ్గి ఆలయం కనపడితే వెళ్లి పూజించడం చేస్తున్నాం. అంతగా నీటిలో మునిగి నానుతున్ననూ వేపచేక్కతో చేసిన ఇక్కడి శివలింగం చెక్కుచెదరక నిలిచింది. అది నాటి శిల్పులు, శ్రామికుల సృజనాత్మక పనితనంకు తార్కాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *