Menu Close
sahiti-sirikona

తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక "సాహితీ సిరికోన" (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన మరిన్ని రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.

అసూయ - దివాకర్ల రాజేశ్వరి

నాదగ్గర విత్తముంది.

నాక్కొంచం సంతోష మివ్వు,

నాఇంట ఇంధనముంది

వంటకు సరకులున్నాయి,

నీ గంపలో సత్తుడబ్బా

గంజి ఎండిన ఖాళీ నివ్వు,

నీతోడుగ నడచి వచ్చే

చిన్నారి నిసువు భాగ్యాల తోడు నివ్వు,

వలస పోయిన నా గర్భ సంచి

పదవులన్నీ అందుకో

నా చల్లని కూజా

జల్లెడల మూతల జలమంతా

అభిషేకిస్తా

నీదాహమార్చిన

సీసాలో అడుగు మిగిలిన

నీటి చుక్క నివ్వు.

వెలుగు సూర్యుని

నెత్తి నెత్తుకొని

మరలి వచ్చే ఉదయాలకు

శ్రమదానమిచ్చిన దివ్య మాతా!

మెత్తని నా తివాచీల

ఖరీదును అంకితం చేస్తా,

నీకాలి నడకల శక్తి నివ్వు

అసూయతో యాచిస్తున్నా

నీ కష్ట ఫలితాల సంతృప్తి నివ్వు !!!

 

ఆమె - ఆచార్య లక్ష్మీ నారాయణ

తరులారా! మీలాగే ఆమెకూ తరాలను చూసిన అనుభవముంది

తరులారా! మీలాగే ఆమెకూ

అన్నీ దాచుకొనే అంతరంగముంది

మీలాగే అన్నిటినీ కాచుకొనే నిబ్బరముంది

నేల క్షారాలను పీల్చి మధురంగా పుష్పించే గుణమూ ఉంది

పరిమళాన్ని పదుగురికీ పంచే ప్రేమ నిండిన మనసూ ఉంది

మీలా ఋతువు మారిందని ఆకుల్ని రాల్చుకోదు

వెచ్చటి జ్ఞాపకాలుగా లోలోనే దాచుకొంటుంది

శిశిర హేమంతాలు ఆమెను వేధించవు

నిశ్శబ్దంగా ఆమెలో  ఒదిగిపోతాయి

ఆమెవ్వరు? నా అక్షరం!

కనులు మూసుకొంటే నాదం, తెరిస్తే కావ్యం!!

కన్నయ్యా-కృష్ణయ్య - ఆచార్య శనగవరపు కృష్ణమూర్తి శాస్త్రి

లేరా కన్నయ్యా- లేరా కృష్ణయ్య

లేరా మా మాధవా లేరా

లేరా కళ్యాణ లీలా మనోహరా

లేరా నను కన్న తండ్రి లేరా

యోగులకూ యోగీవి నీదైన యోగనిద్ర

క్షణిక మాత్రమే కదా లేరా

అరమోడ్పు కన్నుల అందమ్ముతో నెట్లు

అటు నిద్రించెదవు లేరా - తండ్రీ లేరా

తూరుపు తెల్లవారె - చుక్క పొద్దు పొడిచె

తొలి సంధ్య మొదలాయె - లేరా

కారుణ్య సాగరా- జగము లేలే తండ్రి

నీదు భక్తుల నెల్ల కాపాడె వేళాయె లేరా

తండ్రీ లేరా

గోపికలు నీ కోసం వాకిట నున్నారు

గోప బాలురెల్ల బారులు తీరారు

దేవాది దేవతలు నిన్ గొల్వంగ వచ్చారు  - లేరా

అధరామృత గానాన్ని

చవిచూడగ వేణువు

ఆరాట పడుచుండె -లేరా

ఆ వేణు గానంతొ వేదాలు పలికించ

ఆలకించగ జనులు గుమిగూడి ఉన్నారు - లేరా

ఆవులేమో పాలు ఇవ్వనంటున్నాయి

దూడ లేమో పాలు త్రాగానంటున్నాయి

నిను గానక గోశాల బోసి పోతున్నాది

లేరా- కన్నయ్యా  లేరా

చల్ల చక్కగ చేసి  వెన్న తీసుంచాము

వెన్న ముద్దలు తింటూ

మా వెన్నంట నిలవంగ

లేరా- కన్నయ్యా- లేరా

ఝరి - రమాకాంత్ (అంజలి)

ఈ సెలయేటి ఒయ్యారాలు

ఈ హోరు ఈ జోరు

ఈ కన్నులకింపైన నడకతీరు

చదునైన నేలపై సాగేవా?

గులకరాళ్ళతో బండరాళ్ళతో

ఏటవాలుగా ఎత్తూపల్లంగా

కొండాకోనలు గుండెలు పరచినా

తేనెలు ఝరులై పారేవా?

కొండాకోనల గుండెల్లో

గండుమేఘాలు కురవాలి

బండరాళ్ళతో ఒరుసుకుంటూ

గులకరాళ్ళను తోసుకుంటూ

ఏటవాలుగా జారిపడుతూ

ఎత్తుపల్లాలలో ఎగిరిపడుతూ

సెలయేరు నిండుగా పారాలి

ఎన్నెన్నో ఒయ్యారాలు పోవాలి

జోరుగా హోరుగా సాగాలి

కన్నులకింపుగా నడవాలి

కొండాకోనలు - ప్రపంచం

జలపాతం - జీవితం

హేమంతం - లక్కరాజు దేవి

హేమంతం అచ్చంగా గులాబులకు సొంతం

గుంపులు గుంపులుగా ఎటుచూసినా గులాబీల సభలు

చలికాలం రాగానే చెలులతో కొలువు తీరడానికి

కొత్తరేకుల వలువలు దాల్చి

మంచు ముత్యాల నగలు ధరించి

వలపు గుసగుసల గుభాళింపులతో వగలు సొగసులు పోయే కన్నె గులాబీలు...

వాడ వాడలన్నీ పొగరుగా తిరగేసి..

పరిమళమంటే మాదేనని తలలెగరేసి..

మిగతా పూలన్నిటినీ ఒకలా చూసేసి..

మల్లెవాడనుంచి వెళుతూ "ఏం సంగతి" అంటూ కొంటెగా నవ్వేసి..

మొల్లలూ, పున్నాగలూ, పొగడలూ, సంపెంగలూ దారిచ్చి తప్పుకు తిరుగుతున్నా

చిలిపిగా వాటిపై పుప్పొడి చిలకరించేసి..

వేళాకోళ మాడేసే గులాబీ మారాణుల అందం కందిపోకుండా

చుట్టూ మంచుతెరలు దింపుతోంది హేమంతం..

చూసీ చూడగానే వాటిపై మోహం పెంచుకున్న సూరీడు

కిరణాల మునివేళ్ళు సాచుతున్నాడు

సిగ్గుమొగ్గలై తుషారబిందువులు

సప్తవర్ణాల పులకింతలు అభివ్యక్తీకరిస్తున్నాయ్

మంద్రస్వరాల ధనుర్మాసపు తెల్లవారుఝాముల్ని అభిషేకిస్తున్నాయ్

ఓయ్ మిత్రమా! మగత నిదురలో మైమరచి

కంబళ్ళ మడతల్లో మత్తిళ్లిపోయావో...

మంచుపొద్దుల అందాలని చూడలేవు

గొంతెత్తి హేమంత గీతాన్ని పరవశంగా పాడలేవు...

రా! చలి వలువల్ని చుట్టుకొని ఝాము తెల్లారున వాహ్యాళికెళ్ళొద్దాం

గిల్లి గిలిగింతలు పెట్టే చలి చెలి ఒళ్ళో కాస్సేపు తుళ్ళోద్దాం..

1 Comment

  1. Hymavathy.Aduri.

    సిరిమల్లె, సాహితీ సిరికోన ,అత్యద్భుత మాతృ భాషా రూపాలు. నిజానికి మాతృభాష తెలుగు మహిమ అమేరికాలోనే సిరిమల్లె తోటమాలులు చాటుతున్నారేమో!అనిపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *