Menu Close

Adarshamoorthulu

రతన్‌ప్రసాద్ (రేడియో చిన్నక్క)

Ratan Prasadఏ సామాజిక జీవన స్రవంతిలోనైనా కాలానుగుణంగా శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగేకొద్దీ మనిషి జీవన విధానం మారుతూ వస్తుంది. ఆ మార్పుకు, అభివృద్ధికీ, వార్తా పత్రికలు, ఆకాశవాణి (రేడియో), ప్రస్తుత కాలంలో అయితే టీవీలు, అంతర్జాల మాధ్యమాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. పాత రోజుల్లో వార్తా పత్రికలు ఉన్ననూ అందరూ చదువరులు కాదు కనుక అర్థవంతమై, ఆరోగ్యవంతమైన భాషా వినియోగానికీ, భావాల ప్రసారానికి రేడియో ఎంతగానో ఉపయోగపడింది.

అయితే రేడియో ఉన్నంతమాత్రానా అందరూ ఆకర్షితులు కాలేరు కదా! అందరినీ ఆకర్షించే విధంగా అందులో పనిచేస్తున్న వ్యాఖ్యాతలు తమ  కంఠధ్వనితో, చతురోక్తులతో శ్రోతలను ఆకర్షిస్తూ తమ కార్యక్రమాలను నిర్వహించి తద్వారా మంచిని పంచేవారు. అంతటి చక్కటి వాక్శుద్ధి కలిగి ఆల్ ఇండియా రేడియోలో 10 ఏళ్లు రమణక్కగా, 30 ఏళ్లు చిన్నక్కగా అందరినీ తన స్వర మాధుర్యంతో అట్టే ఆకర్షించి ఎన్నో కార్యక్రమాలను, సామాజిక సందేశాలను, నాటికలు, ప్రకటనల రూపంలో రేడియో ద్వారా మనందరికీ పంచిన మహాసాధ్వి శ్రీమతి రతన్ ప్రసాద్ నేటి మన ఆదర్శమూర్తి.

మంచి రచనా పటిమ ఉన్నవారు వ్రాసిన విషయాలను చదవడం అనేది అందరూ చేస్తారు. కానీ ఆ చదివిన విషయాలను ఆకాశవాణి ద్వారా శ్రోతలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలోని స్పష్టత ఆవిడకు మాత్రమే సాధ్యం. కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు భాషా పరంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రత్యక్ష ప్రసారాలను చేయడం ఆమెకు ఉన్న గొప్ప సామర్ధ్యం. గుండె నిబ్బరంతో, గంభీరంగా ఇచ్చే ప్రత్యక్ష ప్రకటనలకు శ్రోతలు మంత్రముగ్దులయ్యేవారు. ఎప్పుడూ ఏ ఒక్క అక్షరంకానీ, ఒక కామా, ఫుల్‌స్టాప్‌గానీ, తడబడి తప్పుగా చెప్పడం ఆమె నాలుగు దశాబ్దాల వ్యాఖ్యాత వృత్తిలో ఎన్నడూ జరగలేదు. ఈ ఒక్క ఆధారం చాలు ఆమె యొక్క ప్రతిభను అంచనావేయడానికి. రేడియో ప్రసంగం చేస్తున్నప్పుడు ఎన్నడూ 'క్షమించండి అనే పదం ఆవిడ ఉపయోగించలేదట. నిజంగా ఇది ఎంతో గర్వకారణం.

1933 వ సంవత్సరంలో జన్మించిన రతన్‌ ప్రసాద్ గారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నావళి. అయితే వివాహానంతరం ఆమె భర్త పేరు కలుపుకొని రతన్‌ ప్రసాద్‌ అయ్యింది. ఆలిండియా రేడియోలో ప్రతి నిత్యం ప్రసారం అయిన "కార్మికుల కార్యక్రమం" లో "చిన్నక్క"గా ఆవిడ సుప్రసిద్ధులు.

Ratan Prasadసంగీతం మీద మక్కువతో అదే వృత్తిగా ఎంచుకోవాలనే సంకల్పంతో 1952 లో ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళిన ఆమె, అనుకోకుండా వ్యాఖ్యాతగా మారి ‘చేనుగట్టు’ కథా పఠనంతో తన ప్రస్థానం మొదలుపెట్టారు. అటుపిమ్మట ఎన్నో అద్భుత కార్యక్రమాలను తన ప్రతిభతో, చతురతతో నడిపించి, ఆకాశవాణి సంస్థకే వన్నె తెచ్చారు. రేడియో నాటకాల్లో కూడా పాల్గొని మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.

పుల్లల వెంకటేశ్వర్లు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, బుచ్చి బాబు, బాలమురళీకృష్ణ, ఆత్రేయ, ఆరుద్ర  తదితర సాహితీ శిరోమణుల సహచర్యంతో ఎంతో అనుభవాన్ని గడించి, సమయస్ఫూర్తి, సమయపాలన, సంగీత పరిజ్ఞానం తదితర అంశాలు తన ధర్మాలుగా గుర్తెరిగి ఎంతో ఉన్నత విలువలతో తన వృత్తిని నిర్వర్తించిన రతన్ ప్రసాద్ గారు తెలంగాణా ఆడపడుచుగా, తెలుగువారందరికీ రేడియో చిన్నక్కగా ఎంతో సుపరిచితురాలైనారు.

ఆమె జాతీయ కవిసమ్మేళనాలకు, రేడియో సంగీత సమ్మేళనాలకు, ఆహూతుల సమక్షంలో కార్యక్రమ నిర్వాహ సంధానకర్త గా ఎన్నోసార్లు పని చేశారు. "చంద్రి"గా తెలంగాణా మాండలికంలో చాలా కార్యక్రమాలను గ్రామసీమల్లో నిర్వహించారు. రేడియోలో ధారావాహికగా ప్రసారమైన "కాంతం కథలు"లో కాంతంగా నటించారు. 'రంగవల్లి’ స్రీల కార్యక్రమంలో "అమ్మబడి" అనే శీర్షికను నిర్వహించారు. 1962లో చైనా యుద్ధ సమయంలో సైనికులలో స్థైర్యాన్ని నింపడానికి "హంస సందేశం" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలా ఒకటేమిటి రతన్ ప్రసాద్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ కార్యక్రమాల ఫలాలను తెలుగు శ్రోతలకు అందించారు. అంతేకాదు, ఆమెలో ఒక మంచి రచయిత్రి కూడా ఉంది. అనేక కథలు రచించి వాటిని తన వ్యాఖ్యానంతో ప్రసారంచేశారు.

కొత్తపల్లి వీరభద్రరావు గారు ‘వాయిస్ అఫ్ ఇండియా’, బాపిరెడ్డి గారు ‘ఇంటింటి తెలుగింటి ఆడపడుచు’, నాటి దూరదర్శన్ అడిషనల్ డైరెక్టర్ అనంత పద్మనాభరావు గారు, ‘స్వరరత్న’ బిరుదులతో ఆవిడను సత్కరించారు. పోలీస్ అకాడమీ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుతూ తనను పిలిచి సత్కరించారు. ఇలా తన నాలుగు దశాబ్దాల ఉద్యోగ నిర్వహణలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఈ మహిళా చైతన్యమూర్తి, ఎందఱో నాటి, నేటి వ్యాఖ్యాతలకు, కార్యక్రమ నిర్వాహ సంధానకర్త లందరికీ ఆదర్శమూర్తి. ఆమె కంఠస్వరం నిత్య గంభీర ప్రకంపనం. సామాజిక చైతన్యానికి అది ఒక పాంచజన్యము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *