Menu Close

శ్రీమహాభాగవత మహాగ్రంథం ఆంధ్రజాతి పూర్వపుణ్యవిశేషం చాలనందువల్ల నిర్విఘ్నపరిసమాప్తం కాలేదనీ, పోతనామాత్య నారాయణామాత్య గంగనామాత్య మహాకవి కుశలకరాంగుళీవిలేఖితమైన రసవద్భాగానికి పరిశేషించి షష్ఠ స్కంధం ఒక్కటే వీనుమిగిలి ఉన్నదనీ లోకమంతటా వార్త వ్యాపింపగానే కొంచెం ఇంచుమించు పూర్వోత్తరాలలో ఏర్చూరి సింగనామాత్యుడు, రాచమల్లు కవులు, మలయమారుతం సర్వన్న, హరిభట్టు, ఇంకా మరికొంతమంది ఆ లుప్తశేషపూరణకు ఉద్యమించినట్లు కనబడుతుంది. వీరిలో సింగనామాత్యుని అనువాదం ప్రాజ్ఞప్రతిజ్ఞాతమై ప్రసిద్ధికెక్కి పాఠకాదరణకు పాత్రమైనందువల్ల భాగవతపాఠంలో మిళితమై, ఆ తర్వాత అసంఖ్యాకములైన వ్రాతప్రతుల వ్యాప్తి మూలాన విద్వల్లోకంలో ప్రచారంలోకి వచ్చిన తర్వాత తక్కినవన్నీ కాలక్రమేణ ఎంతో కొంత అంతర్హితములు కావటమో, అసలే అంతర్ధానం చెందటమో జరిగినట్లు భావింపవలసి ఉన్నది. ఏర్చూరి సింగనామాత్యుని రచనమైనా భాగవతంలో ఈనాడు మనకు గోచరీభవిస్తున్న రూపధేయంతో గాక, చరిత్ర పరిణామక్రమంలో చెప్పలేనన్ని ప్రక్షిప్తాలు చేరి వేరొక చోట మరొక సరిక్రొత్త రూపులో ఆవిర్భవించింది. ఆ వింత ప్రతిని గురించి కూడా విమర్శకులు సవిమర్శకంగా పరిశీలింపవలసి ఉన్నది. క్రీస్తుశకం 1540 ప్రాంతాల ద్విపద భాగవతమును, పద్య బాల భాగవతమును రచించిన దోనేరు కోనేరునాథ మహాకవి ఈ అన్నింటినీ అధ్యయనం చేసి, తన పద్య భాగవతం తృతీయాశ్వాసంలో షష్ఠ స్కంధం కథ వచ్చినప్పుడు ప్రధానంగా ఏర్చూరి సింగనామాత్యుని షష్ఠ స్కంధ భాగాన్ని అనుసరించినట్లు కనబడుతుంది. సింగనామాత్యుని పాఠం భాగవతపాఠంలో అప్పటికే ప్రతిజ్ఞాతమైనదని ఊహించేందుకు అదొక బలీయమైన సాక్ష్యం. రాచమల్లు కవుల ఉపలబ్ధమైన షష్ఠ స్కంధ రచనను అనుశీలించినప్పుడు అది ఏర్చూరి సింగనామాత్యుని రచన ముందు వెలవెలపోతున్నదని అడుగడుగున వెల్లడవుతూనే ఉంటుంది. మలయమారుతం సర్వన విషయమూ అంతే. కాగా, జగద్విదితుడైన మహాకవి హరిభట్టు రచన సైతం దీని ముందు హతప్రభమై తాటాకులలో తలదాచుకొన్నందుకూ కారణం ఇదేనని అనుక్షణం మన మనోనేత్రానికి కనబడుతూనే ఉంటుంది. ఇంతమంది మహాకవుల అనువాద యత్నాల గుణవత్తను అతిగమించి ఏ కావ్యధర్మవిశేషం చేత, ఏ సత్త్వసంపద్వైభవం మూలాన, ఏ చైత్యచోదన కారణాన సింగనామాత్యుని శేషపూరణ పోతన గారి వంటి మహాకవి కృతిలో తత్సహపంక్తికి చేరగలిగిందో హేతువులను పరిశీలింపవలసి ఉన్నది.

‘శేషపూరణ’ అంటూ ఒక మాట వచ్చింది కాబట్టి, ఆ మాట స్వరూప స్వభావాలను గురించి కొంత మనము ఆలోచింపవలసి ఉంటుంది. కుండలో నీళ్ళు సగం మాత్రమే నిండి, మిగిలిన సగం నింపేందుకు చోటున్నదనుకొందాము. పోతన్న గారు కుండలో సగభాగం నీళ్ళు నింపి ఉంచారు. నారాయణామాత్యుడు వచ్చి తక్కిన సగంలో నీళ్ళుపోసి కుండను నింపాడు. కుండను నింపాడనాలా? కుండలో మిగిలి ఉన్న భాగాన్ని నింపాడనాలా? ఘటము పూరణీయమా? ఘటశేషం పూరణీయమా? పోతనగారు కుండ నిండుగా నీళ్ళుపట్టి ఉంచి, కొన్నాళ్ళకు కుండకు చిల్లుపడి నీళ్ళు కారిపోతుంటే – నారాయణామాత్యుడు ముందు ఆ చిల్లులో గుడ్డను దోపి, జలస్రావాన్ని ఆపి, ఆ తర్వాత ఘటాన్నో, ఘటశేషాన్నో పూరించటం మరొక దృగ్విషయం. పోతన్న గారు నీళ్ళను కాచి, వడపోసి, కుండలో నింపిపెట్టిన తర్వాత చిల్లిపడితే, నారాయణామాత్యుడో మరొకరో వచ్చి ముందు కన్నానికి ఏదో ఒక అడ్డు నిలిపి - ఆ తర్వాత పోతనగారి వలె తానూ చక్కగా నీళ్ళను కాచి, వడగట్టి కుండను నింపటం ఇంకొక పద్ధతి. ఆ ప్రకారం చేయక కుండ నింపటం మాత్రమే పనిగా పెట్టుకొని కాచకుండానే నీళ్ళను తెచ్చి పోస్తేనో? పోతనగారు తెచ్చిన నదిలో నుంచి మంచినీళ్ళను గాక వేరెవరో వేరొక దిగుడు బావిలోని మట్టినీళ్ళను తెచ్చి కుండలో పోస్తే ఏమవుతుంది? కుండకు పడిన చిల్లు పెద్దదై అధికంగా జలస్రావం జరిగి మరిన్ని నీళ్ళు బయటికిపోయాయి కాబట్టి, ఘటాకాశమూ మహాకాశమూ ఒకటయ్యాయని ఆ పాతకుండను పగలగొట్టి కొత్తకుండలో నీళ్ళు నింపితేనో? కుండ ఒకటి గాక, పన్నెండు కుండలుండి – కొన్ని కుండలు సరిగా ఉండి, కొన్ని కుండలు పాడై, నారాయణామాత్యుడు ఒక్కడే గాక – నలుగురూ నాలుగు తీరుల నీళ్ళను నింపితే ఏమవుతుంది? పోతన్న గారు పరమపదించిన కొంత కాలం తర్వాత శేషపూరణ జరిగిన కుండలలో ఏ కుండలో ఎవరెవరు ఎంతెంత భాగం నింపారో తామై చెప్పివుంటే ఏ సమస్యా ఉండేది కాదు. ఒకరు ఘటశేషాన్ని యథాశక్తి పూరించిన తర్వాత వేరొకరు వచ్చి ఆ కుండలోని నీళ్ళను మార్చి, ఆ విధంగా మార్చినట్లు తమ పేరు చెప్పుకోకపోతే ఏమవుతుంది? ఏర్చూరి సింగనామాత్యుని రచనను వ్రాతప్రతులతో తైపారు వేసినప్పుడు భాగవత శేషపూరణ విషయంలో పరిష్కర్తలకు ఎదురయ్యే సమస్యలివి. ఇవన్నీ చర్చనీయాంశాలు. సింగనామాత్యుడు శ్రీమహాభాగవతము యొక్క అనువాదానికి పూనుకొన్న సమయానికి వ్రాతప్రతుల స్థితి ఏ ప్రకారంగా ఉండినదీ మనకిప్పుడు తెలియదు. వెలిగందల నారాయణామాత్యుని రచన ఆయనకు ఏ స్థితిలో ఉపలభ్యమైనదీ మనకిప్పుడు తెలియదు. పోతన్న గారు శ్రీమహాభాగవతాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశారని, ప్రథమ స్కంధంలోని “శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై సేవించెదన్” అన్న పోతన్నగారి నాందీ పద్యాన్ని బట్టి అది శ్రీకృష్ణ పరమాత్మకు అంకితమైన కృతి – అని కొందరంటున్న మాటలలో సత్యం లేదని, దశమ స్కంధం మొదట “శ్రీకంఠచాపఖండన!, పాకారిప్రముఖవినుతభండన! విలస,త్కాకుత్స్థవంశమండన!, రాకేందుయశోవిశాల! రామనృపాలా!” అని వ్రాసినటువంటిదానినే ఏ శ్రీరామచంద్ర స్తుతిపరకమైన పద్యాన్నో గ్రంథాదిని వ్రాసి ఉండగా ముద్రాపకులు దానిని తొలగించి భాగవతంలోని వేరొకచోటి నుంచి తెచ్చి యీ “శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై సేవించెదన్” అన్న ప్రార్థన పద్యాన్ని చేర్చి ఉంటారని, ఆ విధంగానే షష్ఠ్యంతములు సైతం శ్రీరామపరకములుగా రచితములై ఉండగా వాటిని తొలగించి భాగవతంలో ఎక్కడో వేరొకచోట ఉండిన శ్రీకృష్ణస్తుతి పద్యాలను తెచ్చి గ్రంథావతరణికలో షష్ఠ్యంతములుగా సమకూర్చి ఉంటారని -  శ్రీ చాగంటి శేషయ్య గారు 1949లో ప్రకటించిన తమ ‘ఆంధ్రకవితరంగిణి’ ఆఱవ సంపుటం (పు.160) లో వ్రాశారు.

అయితే శ్రీ చాగంటి వారు భావించినది సత్యం కాకపోవచ్చునని, శ్రీమహాభాగవతం తొలినాటి ప్రతి మొదట వెలిగందల నారాయణామాత్యునికి, ఆ తర్వాత ఏర్చూరి సింగనామాత్యునికి ఉపలభ్యమైన నాటికే, “శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై సేవించెదన్” అన్న పద్యం వ్రాతప్రతులలో ఆ నాటికే ఉండినదని మనము నిర్ణయించేందుకు ఒకటి రెండు ఆధారాలు భాగవతంలోనే ఉన్నాయి. దశమ స్కంధంలో పోతనగారే రచించిన నిర్వివాదమైన పూర్వభాగంలోనే, మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణన ఘట్టంలో యశోదకు శ్రీకృష్ణుడు అది “కలయో, వైష్ణవ మాయయో యితరసంకల్పార్థమో సత్యమో (10-1-341)” అజ్ఞేయమైన రీతిని తన విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు ఆ ఉదంతాన్ని విని ఆశ్చర్యపోయిన పరీక్షిత్తు శుకయోగిని (10-1-349,350) ఈ విధంగా అడుగుతాడు:

అనిన విని, రా జి ట్లనియె.

జగదధీశ్వరునకుఁ జన్నిచ్చు తల్లిగా

నేమి నోము నోఁచె నీ యశోద?

పుత్త్రుఁ డనుచు నతనిఁ బోషించు తండ్రిగా

నందుఁ డేమి సేసె? నందితాత్మ!

అని, ఇంకా ఈ విధంగా (10-1-351) ప్రశ్నిస్తాడు:

ప్రబ్బిన భక్తిని హరిపైఁ

గబ్బంబులు సెప్పి కవులు కైవల్య శ్రీ

కబ్బుదు రఁట! హరి పోషణ

మబ్బిన తలిదండ్రు లెచటి కబ్బుదురొ తుదిన్!

అని. ఇవి కేవలం పరీక్షిత్తు మాటలు కావు. ప్రబ్బిన భక్తిని హరిపై కబ్బంబులు చెప్పి శ్రీ కైవల్యపదాన్ని చేరగోరిన మహాకవి పలికిన మాటలివి. ఆ కైవల్యం జీవుల ఆత్యంతిక దుఃఖనివృత్తి కొరకైన చరమసీమ అని పోతన్న గారి విశ్వాసం. అది ఒకానొక అద్వితీయమైన అఖండజ్ఞానస్థితి. ప్రవృత్తులు అన్నింటికి ప్రాగభావమైన పుణ్యఫలం. అవిద్యాకల్పితమైన ప్రపంచం నుంచి విడుదలను చెందినప్పటి సాయుజ్యావస్థ. శ్రీమహాభాగవతంలో పోతన్న గారు ప్రతిపాదించిన శ్రీమన్నారాయణుడు శుద్ధసత్త్వస్వరూపుడై మనోబుద్ధ్యాదులకు అగోచరుడై ప్రత్యగాత్మగా ఉన్నప్పుడు శబ్దప్రవృత్తికి హేతువులైన జాతి గుణ క్రియాదులకు వ్యక్తావస్థ ఉండదు. ఆ అవ్యక్తావస్థలో త్రిగుణాలకు ప్రమేయం ఉండదు. అందుచేత ఆయనను నిర్గుణుడని అంటారు. అవ్యక్త నిర్గుణము యొక్క ఏ శక్తిచేత ఆ పరబ్రహ్మాత్మకుడు సర్వభూతములకు కారణమాత్రుడై, తన అంశవల్ల తనయందే కలిగిన జీవులు చరాచర విషయభోగాలను, ఆ విషయభోగాలకు అతీతమైన మోక్షావస్థను అనుభవించటానికి పృథివ్యాదిమహాభూతముల ద్వారా ప్రజాపతులు, దేవతలు మొదలైన శరీరాలను సృష్టించాడో, ఆ పరమేశ్వరునికి విపర్యయంగా దేహాదులయందు ఆత్మాభిమానరూపమైన  జ్ఞానానికే "మాయ" అని పేరు. అదే విష్ణుమాయ.

స్థూలము సూక్ష్మము కారణము అని దేహము మూడు విధాలు. స్థూలదేహమంటే ఇరవైఅయిదు తత్త్వాలు స్వరూపంగా కలిగినది అని అర్థం. అందులో మనోబుద్ధులు రెండు, సూక్ష్మ జ్ఞానేంద్రియాలు అయిదు, సూక్ష్మ కర్మేంద్రియాలు అయిదు, ప్రాణవాయువులు అయిదు - మొత్తం పదిహేడు తత్త్వాలకు సూక్ష్మశరీరం అనిపేరు. ఈ సూక్ష్మశరీరం అపంచీకృతమైనది. సూక్ష్మశరీరం కంటికి కనబడదు. దీనికే లింగశరీర మనిపేరు. జీవునికి అనాదిగా కలిగివున్న జ్ఞానమే కారణశరీరం. స్థూల సూక్ష్మ శరీరాలు కలగటానికి కారణం ఇదే.

ఈ దేహత్రయానికి అతీతమైనది ఆత్మ. ఆత్మానుభవం పొందటమే ముక్తి అని వేదాంతుల సిద్ధాంతం. దేహానికి ఆది లేదు. మూలమూ లేదు. కర్మలకు సాధనం అదే. దేహమున్నంతవరకే కర్మ లుంటాయి. కర్మ మిగిలినంతవరకే దేహం ఉంటుంది. గాఢనిద్ర(సుషుప్తి)లో ఉన్నప్పుడు స్థూల సూక్ష్మ భోగప్రదాలను గుర్తించే తెలివి లయించిపోవటం వల్ల కర్మలు లేవు. కర్మలను గ్రహించే ఎఱుక లీనమైనప్పుడు దేహం లేదు. "సుషుప్తికాలే సకలే విలీనే" అని పౌరాణికు లంటారు. సుషుప్తికాలంలో సకలం లయించిపోతుందని భావం. నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈశ్వరరూపి అయిన ఆత్మే నామరూపరహితంగా ఉండటం జరుగుతున్నది. ఆ ఈశ్వరుని యందే సకలమూ సంభవించి, లయమవుతున్నది. సుషుప్తిలో తెలివి లేకపోవటమూ, మెళకువ వచ్చినపుడు తిరిగి రావటమూ మన అనుభవం లోని సంగతే. ఈ తెలివి యొక్క రాకపోకలే జనన మరణాలని గీతాశాస్త్రం.

"బృహిర్బ్రహ్మ వృద్ధౌ బృహతే ర్ధాతోః అర్థానుగమాత్ దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్నం యద్వస్తు తద్బ్రహ్మేతి" అని శంకర భాష్యం. ఒక దేశంలో ఉన్నది, ఒక దేశంలో లేనిది, ఒక కాలంలో ఉన్నది, ఒక కాలంలో లేనిది, ఒక వస్తువులో ఉన్నది, ఒక వస్తువులో లేనిది అని నిరూపించటానికి వీలులేక ఏది సర్వదేశ సర్వకాల సర్వవస్తువులలో సర్వావస్థలలో పరిపూర్ణంగా వ్యాపించి, తనకు రెండవది లేక, సర్వం తాను తానై ఉన్నదో అదే పరమాత్మ. ఆ పరమాత్మ వస్తువు దేహం పుట్టక మునుపు, పుట్టిన తర్వాత, ఆ వెనుక, కాలత్రయంలోనూ సృష్టిస్థితిలయాల బాధలేక, స్వతస్సిద్ధంగా ఉన్నది. ఒక ఖాళీస్థలంలో ఇల్లు కట్టుకొంటే, ఇంటి చుట్టూ ఉన్న జాగాను ఆవరణం అంటున్నాము కదా! ఇల్లు లేనప్పుడు ఉండిన ఖాళీలోనే ఇల్లు కట్టిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఇంటిలోపల ఉన్న ఖాళీ ప్రత్యగాత్మ అయితే ఇంటి వెలుపల ఉన్న ఆవరణం పరమాత్మ అన్నమాట. అది ఖాళీగా ఉన్న మైదానంలో ఏర్పడిన వ్యవహార భేదమే కాని వస్తుభేదం కాదు. ఆ విధంగానే, ప్రత్యగాత్మ పరమాత్మల ఐక్యానుసంధానానికే యోగమని, బ్రహ్మజ్ఞానమని, విదేహ కైవల్యమని పేర్లు. ఈ జీవుని వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థమైన ప్రత్యగాత్మ యొక్క; ఈశ్వర వాచ్యార్థాన్ని విడిచి లక్ష్యార్థమైన పరమాత్మ యొక్క ఐక్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే అమనస్క రాజయోగ సమాధి. ఇందుకు భిన్నంగా మాయ కమ్ముకొన్నప్పుడు జీవికి దేహాభిమానం కలుగుతుంది. జడములైన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనవే తాననే విపరీతదృష్టి అలవడుతుంది. ఇదే బ్రాంతి. దీని పేరే మోహం. అభిమానం వల్ల దంభము మొదలైన గుణాలేర్పడుతాయి. ఆత్మాశ్రయత్వమే సర్వానర్థాలకూ మూలం.

జీవుడంటే ఘటాకాశం లాగా అవిద్యచేత ఆవరింపబడిన బ్రహ్మమే అని బ్రహ్మసూత్రసారం. అవిద్య ఈశ్వరోపాధికమైన మాయావికారం. దీనికి సత్త్వరజస్తమోగుణ రూపాలుంటాయి. ఈ అవిద్య ఒక్కటే అని, దానిలో సంగతమైన బ్రహ్మచైతన్యం జీవసంజ్ఞను పొందినందువల్ల ఆ జీవుడొక్కడే అని తాత్పర్యం. అవిద్య అనేక అంతఃకరణలుగా మారినందువల్ల ఆ అంతఃకరణలో సంగతమైన బ్రహ్మచైతన్యం అనేకజీవులుగా కనబడి, జీవియొక్క నానాత్వం భాసమానమై ఉన్నదని కొందరంటారు. మాయ, అవిద్య, అంతఃకరణం అనే మూడు ఆవరణలు కారణంగా జీవచైతన్యం అప్రకాశంగా ఉంటుంది. వేదాంతశాస్త్రంలో మాయ కారణమని, అవిద్య దానికి కార్యమని చెప్పబడినప్పటికీ సామాన్యవ్యవహారంలో మాయావిద్యలు పర్యాయాలుగానే పరిగణింపబడుతున్నాయి.

ఈ అవిద్యకు కారణశరీరమని, అంతఃకరణకు సూక్ష్మశరీరమని వేదాంతుల వ్యవహారం. ఈశ్వరునికి ఉపాధి అయిన మాయ శుద్ధసత్త్వాత్మకం కావటాన; దానితో కూడిన అవిద్యాంతఃకరణలు లేనందువల్ల; ఆ మాయ ఈశ్వరునికి స్వాధీనమై ఉన్నందున; అద్దపు బరిణెలో ఉన్న వస్తువులకు ఆ అద్దం ఆవరణమైనప్పటికీ లోపల ఉన్న వస్తువులను కానరానీయనట్లు మాయ ఈశ్వరునియొక్క రూపాలను గాని, గుణాలను గాని మరుగుపుచ్చలేదు.

ఈ మాయ మనోమూలకమైనదే కాని వాస్తవం కాదు. దీనినే సంసార మంటారు. "చిత్తే చలతి సంసారః" అని శ్రుతి. విద్యావిద్యలు, సంకల్పవికల్పాలు, జననమరణాలు, మానాభిమానాలు మొదలైన ద్వంద్వగుణాలన్నీ మనోధర్మాలే. మాయాజయమంటే మనోజయమే.

ఈ మనోజయం మనోనాశం మూలాన మాత్రమే సాధ్యం. మనోనాశనం సరూప మనోనాశమని, అరూప మనోనాశమని రెండు విధాలు. సుషుప్తిలో ఉన్నప్పుడు తానెవరో తెలియరాకుండా తెలివి లీనమవుతున్నది. అది స్వరూప మనోనాశం. తురీయావస్థలో తానెవరో తనకు తెలిసిన పిమ్మట లీనమవుతుంది. అది అరూప మనోనాశం.

మాయాస్వరూపాన్ని నిరూపించి, మనోజయాన్ని సాధించటానికి భగవద్గుణానువర్ణం తగిన ఉపాయమని గ్రహించి అంతరిక్షుడు భగవానుని మాయాప్రభావాన్ని వివరిస్తున్నాడు.

ఆ విధంగా పరమేశ్వరుడు తన మాయచేత పంచీకృతమైన పృథివ్యాది (స్థూల) భూతములతో చరాచర జగత్తును నిర్మించి, ఆ దేవాది శరీరాలలోనికి అంతర్యామి రూపంతో ప్రవేశించి, (తనను ఏకవిధంగానూ - అంటే అంతఃకరణాభిమాని రూపంతో ఏకవిధంగానూ, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాభిమానిరూపంతో దశవిధం గానూ విభజించి, విషయసమూహాలను అనుభవిస్తూ) తాను సాక్షిమాత్రుడై, ఆ దేహధారుల సుఖదుఃఖానుభవాల పట్ల ఎటువంటి ఆసక్తీ లేక నిశ్చింతగా ఉంటాడు.

దేహాభిమానం పొందిన జీవుడు అంతర్యామిపురుషుని చైతన్యబలం మూలాన అనుప్రాణితాలైన ఇంద్రియాల ద్వారా విషయముల యందు భోగానుభవాన్ని పొంది, ఆ ఇంద్రియార్థాలలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. సంకల్పవికల్పాత్మకమైన అతని మనస్సు స్వప్నసుషుప్త్యాద్యవస్థలకు లోనవుతుంది. ఆ అవస్థలకే సవికల్పసమాధి, నిర్వికల్పసమాధి అని పేర్లు. జీవాత్మ పరమాత్మల సమతావస్థ సిద్ధింపని స్థితి అజ్ఞానావరణం వల్ల కలుగుతుంది. మనోధర్మాలు కారణంగా సమాధిభంగం ఏర్పడి జీవుడు పరమేశ్వరుని పొందలేక అవస్థలకు లోనౌతాడు.

మనోధర్మం వల్లనే కర్త - కర్మ - క్రియ; గ్రాహకుడు - గ్రాహ్యము - గ్రహణము; భోక్త - భోగ్యము - భోగము; జ్ఞాత - జ్ఞేయము - జ్ఞానము మొదలైన త్రిపుటి ఏర్పడుతున్నది. మనోజయం సిద్ధించినపుడు త్రిపుటిభావం కూడా లయించిపోతుంది. అంతవరకు మనస్సు అవిద్య అనే చీకటితో కప్పబడి ఉంటుంది. మనోజయం సిద్ధించినపుడు మాయ స్వస్థత లేనిదై ఆత్మమునందు లీనమవుతుంది.

ఆదిపురుషుడు పృథివ్యాది మహాభూతమయమైన సృష్టిని కలుగజేసి పంచధాతువులతో కూడిన ఉపాధులలోనికి అంతర్యామిరూపంలో ప్రవేశించి, అంతఃకరణము, దశేంద్రియాలు అనే పదకొండింటితో విభాగించి, సత్త్వాది తన గుణాలతో గుణాత్మకుడై విషయసమూహాన్ని అనుభవిస్తుంటాడు.

దేహాభిమానం వహించిన జీవుడు కర్మేంద్రియాల మూలకంగా భావికాలంలో దేహాలను ధరించేందుకు తగిన వాసనలతో కూడిన కర్మలను ఆచరిస్తూ, ఆ కర్మఫలాలను అనుభవిస్తూ, దుఃఖమయమైన జీవితాన్ని గడుపుతూ, భౌతికప్రళయం వచ్చేంత వరకు జన్మమరణాలను పొందుతూ సంసారసముద్రంలో ఈదులాడక తప్పదు. దురంతమైన ఈ దుఃఖజాతం నుంచి విముక్తికై శ్రీమన్నారాయణ ధ్యానమగ్నులైన భక్తులు ఎదురుచూచే పరమావస్థ శ్రీ కైవల్యపదం. ప్రబ్బిన భక్తిని హరిపై కబ్బంబులు చెప్పి కైవల్యశ్రీకి చేరగోరిన మహాకవి పోతన అంటున్న మాటలివి.

ఇది పోతన గారి భాగవతావతరణికలోని తొలిపద్యానికి ప్రతిధ్వని అని వేరే చెప్పనక్కరలేదు. అందువల్ల “శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై సేవించెదన్” అన్నది కాలాంతరంలో భాగవతంలో లేఖకులో, ముద్రాపకులో ఎక్కడినుంచో తెచ్చి చేర్చిన పద్యమని సందేహించటం భావ్యం కాదు. ఏర్చూరి సింగనామాత్యుడు భాగవతానువాదాన్ని చేపట్టే నాటికే ఈ పద్యం వ్రాతప్రతులలో ఉన్నదనటానికి నిదర్శనాలను మరొక్క సంచికలో అనుశీలిద్దాము.

ఈ పరిశీలనకు ఉపక్రమించినప్పుడు వివిధ ప్రభుత్వ గ్రంథాలయాలలోనూ, వ్యక్తిగత సంచయాలలో భద్రపరుపబడి ఉన్న లిఖిత గ్రంథాల ప్రతులనూ, నా వద్ద ఉన్న శ్రీమహాభాగవతము యొక్క లిఖిత ప్రతులనూ గాక ముద్రిత ప్రతులలో ఏమున్నదో పాఠాంతరాలను పరిశీలించేందుకు నేను నా చేతనైనంతలో ప్రయత్నం చేశాను. 1840లో వేదము వేంకటాచలశాస్త్రి గారు పరిష్కరించి ప్రకటించారని చెప్పబడుతున్న శ్రీమహాభాగవతము యొక్క ప్రతిని నేను చూడలేకపోయాను. 1848లో పురాణం హయగ్రీవశాస్త్రి గారు పరిష్కరించి ప్రకటించిన ప్రతి గ్రంథాలయాలలో ఇంకా అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నది. 1855లో పురాణం హయగ్రీవశాస్త్రి గారు పరిష్కరించి ప్రకటించిన ప్రతికే ఆ తర్వాతి కాలంలో వావిళ్ళ రామస్వామిశాస్త్రుల వారి పునర్ముద్రణ ప్రతి వెలువడింది. 1855లో మా. వెంకటకృష్ణశాస్త్రులు గారు పరిష్కరించిన సంపూర్ణ భాగవతం ప్రతిని గురించి ఈ వ్యాసం మొదటి సంచికలో ప్రస్తావించాను. 1865లో కరాలపాటి రంగయ్య గారు ఎంతో జాగ్రత్తగా పాఠాంతరాలను సరిచూచి, మేలి పాఠాలతో పరిష్కరించి ప్రకటించిన ప్రతి వెలుగుచూసింది. 1869లో నేలటూరి వేంకట సుబ్బాశాస్త్రి గారు మొత్తం భాగవతాన్ని సంక్షిప్త టీకాతాత్పర్యసమేతంగా ప్రకటించారు. అద్భుతావహమైన వ్యాఖ్యాన ప్రతి యిది. 1877లో పంచాంగము దేవరాజ పెరుమాళయ్య గారు సమర్థంగా పరిష్కరించి విపుల పీఠికా సహితంగా అచ్చువేసిన ప్రతి ఈనాటికీ ప్రచారంలో ఉన్నది. 1887లో అద్వైతవిద్యాసార్వభౌములైన పాలపర్తి నాగేశ్వరశాస్త్రి గారు పరిష్కరించి విశేష టీకాతాత్పర్యసమేతంగా ప్రకటించిన సంపూర్ణ భాగవతం ప్రతిలో దశమ స్కంధం ప్రతి ఒక్కటే ఇప్పుడు ప్రచారంలో ఉన్నది. తక్కిన స్కంధాల ప్రతులు ఎంతో అరుదు గానే తప్ప సులభంగా లభించటం లేదు. నెల్లూరు వర్ధమాన సమాజం వారి గ్రంథాలయంలో పూర్తి ప్రతి ఒకటి నిన్నమొన్నటి వరకు స్వస్థావస్థలో ఉండేది. ఇటీవలి పరిస్థితులు నాకు తెలియవు. 1889లో మృగీస్థలం అయ్యమాచార్యులు గారి సంగ్రహ టిప్పణి గల వనపర్తి ప్రతి నిన్న మొన్నటి వరకు తెలంగాణ ప్రాంతమంతటా ప్రచారంలో ఉండి, ఇప్పుడు కనుమరుగైపోయింది. 1889లో నేలటూరి వేంకట సుబ్బాశాస్త్రి గారి ప్రతికి పునర్ముద్రణ వెలువడింది. తొలినాటి ముద్రణకంటె ఇందులో సరిక్రొత్త విశేషాలేమీ లేవు. 1894లో పనప్పాకం ఆనందాచార్యులు గారు దేవరాజ పెరుమాళయ్య గారి ప్రతిని పునఃపరిష్కరించి, సరిక్రొత్తగా కావ్యవిశేషాల భూమికతో ప్రకటించారు. 1894లో కొమాండూరి అనంతాచార్యుల వారి విద్యావినోద ప్రచురణాలయం ప్రతి సూర్యాలోకానికి నోచుకొన్నది. 1897లో నోరి గురులింగశాస్త్రి గారి ఏకాదశ ద్వాదశ స్కంధముల సంస్కృత మూలార్థపరిశీలనతోడి సంక్షేప వ్యాఖ్య అచ్చయింది. 1905లో తంజనగరము తేవప్పెరుమాళయ్య గారి పరిష్కరణతోడి ఆనంద ముద్రణాలయం వారి ప్రతి అచ్చయింది. దీనిలోని విశేషాలను కలుపుకొని 1915లో వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్సు వారి సంపూర్ణ శ్రీమహాభాగవతం పునర్ముద్రణ ప్రతి ప్రకటితమైంది. 1921లో రాయదుర్గము నరసయ్యశాస్త్రి గారిచే సుపరిష్కృతమైన వావిళ్ళ ప్రతి, 1922లో శేషాద్రి రమణ కవుల పీఠికతోడి వావిళ్ళ వారి ప్రతి, ఆ తర్వాత 1926లో, 1930లో, 1934లో, 1948లో నిడుదవోలు వెంకటరావు గారి పీఠికతో, ఆ తర్వాత 1952లో కొద్దిపాటి మార్పులతో, ఆపై 1961 నుంచి అదే బహుపర్యాయాలుగా పునర్ముద్రణను పొందిన వావిళ్ళ వారి ప్రతులు నలుగురికీ తెలిసినవే కనుక ఆ ముద్రణల వివరాలను విశేషించి ఇక్కడ పేర్కొనటం లేదు. పైని ప్రస్తావించిన 1925 నాటి తంజనగరము తేవప్పెరుమాళయ్య గారి ప్రతిలోని పాఠాంతరములతో శ్రీమాన్ బుక్కపట్టణం రామానుజయ్యగారు పరిశోధించిన ఎ. కణ్ణన్ శెట్టి అండ్ కంపెనీవారి ప్రతి గ్రంథాలయాలలో ఇప్పటికీ మినుకుమినుకుమంటున్నది. 1936లో శేషాద్రి రమణ కవులు మళ్ళీ ఉద్యమించి, స్వీయపర్యవేక్షణలో వివిధ పండితుల చేత లఘుటీకలను వ్రాయించి, తామై పీఠికలను వ్రాసి, బెజవాడలోని వాణీ నికేతనము వారి పక్షాన శ్రీమహాభాగవతాన్ని పెక్కు సంపుటాలలో పూర్తిగా ప్రకాశింపజేశారు. 1947లో తంజనగరము తేవప్పెరుమాళయ్య గారు తొలుత పరిష్కరించిన ప్రతికి వేమూరి వారి ప్రచురణ మద్రాసు నుంచి మరొకటి వెలువడింది. 1947లో వంగీపురం కృష్ణమాచార్యుల వారి పరిష్కరణతోడి భాగవతంలోని పాఠంతో వేంకట్రామా అండ్ కో వారి ప్రతి అచ్చయింది. 1952లో వేదము లక్ష్మీనారాయణశాస్త్రుల వారు పరిష్కరించిన రామా అండ్ కో ప్రతి వెలుగుచూసింది. ఆ తర్వాత 1954లో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు సమగ్రంగా పరిష్కరించిన రాయలు అండ్ కో వారి ప్రతి మంచి ప్రచారానికి వచ్చింది. 1961లో కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు లఘుటీకతో పరిష్కరించిన వేంకట్రామా అండ్ కో వారి ప్రతి అచ్చయింది. 1962లో బులుసు వేంకటరమణయ్య గారి లఘుటీకతోడి టాగూర్ అండ్ కో వారి ప్రతి ముద్రితమైంది. 1964లో రాయప్రోలు సుబ్బారావు గారు ప్రధాన సంపాదకులుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి నాలుగు సంపుటాలలో ప్రకటించిన ప్రతికి 1968లోనూ, 1977లోనూ పునర్ముద్రణలు వెలువడ్డాయి. 1976లో ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి రహస్యప్రకాశ వ్యాఖ్యతోడి సంపూర్ణ శ్రీ మహాభాగవతం ప్రతి ముద్రణ మొదలై చాలా కాలానికి ఆ అచ్చుముచ్చట పూర్తయింది. నేను ఎం.ఎ విద్యార్థిగా ఉన్న రోజులలో ప్రథమ సంపుటం మొదలుకొని వారి ఆదేశాన్ని పురస్కరించికొని ముద్రిత ప్రతీకలను దిద్దటంలో తోడ్పడే అవకాశం నాకు కలిగినప్పుడు ఈ పూర్వముద్రణల సంపుటాలను కొంత పరిశీలించటం మొదలుపెట్టాను. 1983 నాటి సాహిత్య అకాడమి వారి ప్రతికి ఆచార్య తూమాటి దొణప్ప గారు సంతరించిన విపుల పీఠికతో దాని పునర్ముద్రణ ప్రతి రెండు సంపుటాలలో వెలువడింది. దానికే 1987లోనూ, 2000లోనూ, 2004లోనూ, 2006లోనూ ఇంకా మరికొన్నిమార్లు తెలుగు విశ్వవిద్యాలయం వారి పక్షాన పునర్ముద్రణలు వెలువడ్డాయి. 1987లో నండూరి రామకృష్ణమాచార్యుల వారు ప్రారంభ సంపాదకులుగా తిరుమల తిరుపతి దేవస్థానము వారు అయిదు సంపుటాలలో ప్రచురించిన సరళ గద్యానువాదసమేత పోతన భాగవతము ప్రతి అచ్చయింది. 2004లో రాజమండ్రిలోని రోహిణీ పబ్లికేషన్స్ వారి ప్రతి మునుపటి వావిళ్ళ వారి ప్రతి ఆధారితంగా ప్రచురితమైంది. 2007లో తిరుమల తిరుపతి దేవస్థానము వారి ప్రతికి రామకృష్ణ మఠము (హైదరాబాదు) వారి పునర్ముద్రణ ప్రతి అచ్చయింది. 2008లో ఇదే, ఆవంచ సత్యనారాయణ గారి విపుల భూమిక ‘ప్రాంజలి’తో బెజవాడలోని ఇమ్మడిశెట్టి అక్కేశ్వరరావు ఛారిటబుల్ ట్రస్ట్ వారి పక్షాన క్రొత్త రూపాన్ని సంతరించుకొన్నది. 2016లో రామకృష్ణ మఠం వారు సరిక్రొత్తగా తాత్పర్యాలను రచింపజేసి మొత్తం భాగవతాన్ని అయిదు సంపుటాలలో మళ్ళీ ఒకసారి ప్రచురించారు. 2017లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సరిక్రొత్తగా టీకాతాత్పర్యాలను పండితులచేత వ్రాయించి, విశేషార్థసమేతంగా ఎనిమిది సంపుటాలలో ప్రకాశింపజేశారు. ఇవిగాక, ఎక్కడ అచ్చయినదీ, ఎవరు అచ్చువేసినదీ గుర్తింపరాని పాతకాలపు ప్రతులు కొన్ని నా దగ్గరున్నాయి. పూర్తి గ్రంథాన్ని కాకపోయినా ఒక్కొక్క స్కంధాన్నీ విడివిడిగా అచ్చువేసి భాగవత కవులను ప్రచారంలోకి తెచ్చినవారు బ్రౌను దొరగారి సమకాలం నుంచీ చాలామంది ఉన్నారు.

ఏర్చూరి సింగనామాత్యుని భాగవతానువాదాన్ని సాకల్యంగా పరిశీలించేందుకు ముందుగా ప్రాగ్భూమిక ఇది.

---- ఇంకా వుంది ----

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *