Menu Close

గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

ఈ ప్రశ్నలకు మా “సిరికోన” లో గంగిశెట్టి గారు చక్కటి సమాధానాలను అందించారు.

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

భావసాంద్రత, విమర్శతో సహా, అన్ని సాహిత్య ప్రక్రియలకూ సమానమే. దీంట్లో లఘు..అనుభూతి కవితల్లో లా కాస్త ఎక్కువ. జానపద ప్రక్రియల లోని ‘దంతకథ’, ఆధునిక శైలి లోని ‘ఉదంత కథ’ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో ఈ ‘గల్పికలు’ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం మాధ్యమ పరిమితీ, వేగంగా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది కనుక.

చదువు శ్రమ - తాటిపాముల మృత్యుంజయుడు

రంగాపురంలో రామయ్య అనే రైతు నివసించేవాడు. అతని భార్య పేరు రామలక్ష్మమ్మ. వాళ్ళది రైతు కుటుంబం. వారికి ఇద్దరు కొడుకులు. పేర్లు భీముడు, కృష్ణుడు. పెద్దవాడు భీముడు మందమతి. చదువులో శ్రద్ధ కనపరిచేవాడు కాదు. చిన్నవాడు కృష్ణుడు చాలా చురుకైన బాలుడు. తరగతిలో పంతుళ్ళు చెప్పిన చదువును శ్రద్ధగా వినేవాడు. పరీక్షల్లో ఎప్పుడూ ప్రథముడుగా నిలిచేవాడు. బడిలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకొనేవాడు. తెలియని విషయాలపై ప్రశ్నలడిగి తెలుసుకునేవాడు.

కొడుకులని కొంత కాలం గమనించిన తల్లిదండ్రులు, తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉంటాడని భీముడు చదువు మానిపించారు. కోడికూతతోనే నిద్రలేచి భీముడు తండ్రితో పొలం పనుల్లోకి వెళ్ళేవాడు. పశువులను కాసేవాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేవాడు. కృష్ణుడు రోజురోజుకు చదువుల్లో మెరుగైన ప్రతిభను కనబరుస్తూ అందరి మెప్పులను పొందేవాడు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతుండేవాడు.

విద్యావంతుడైన కృష్ణునిపై రామలక్షమ్మకు కూసింత ప్రేమ ఎక్కువగా ఉండేది. రాత్రి భోజనాల సమయంలో భీమునికంటే కృష్ణునికి ఒక ముద్ద అన్నం, ఒక గరిట పప్పు ఎక్కువగా వడ్డించేది. ఈ విషయాన్ని గమనించిన రామయ్య రామలక్షమ్మతో "నువ్వు కృష్ణునికి అన్నం ఎక్కువగా పెట్టటం చూస్తున్నాను. భీముడు ఎంత కష్టపడుతున్నడో నాకు తెలుసు. ఎంత కష్టమైన పనిచెప్పిన మారుమాటడకుండా పూర్తి చేస్తున్నాడు. వ్యవసాయం పనులు చేయాలంటే చాలా బలం కావాలి. అందుకు భీముడు ఎక్కువ తినాలి " అని అన్నాడు. అందుకు రామలక్షమ్మ "కాదు, చదువులో ఉన్న శ్రమ మీకు తెలియదు. కృష్ణుడిని నేను రోజు మొత్తం చూస్తున్నాను. నాకు తెలుసు చదవడం ఎంత కష్టమో" అని అన్నది. ఒకరికొకరు ఔనంటే కాదని, కాదంటే ఔనని అనుకొన్నరు. చివరికి రామలక్షమ్మ "సరే, రేపు రాత్రి ఇద్దరు పిల్లలకు నేను ఒక పరీక్ష పడతాను. మీకే తెలుస్తుంది ఎవరి చేసే పని ఎక్కువ శ్రమనో" అని అన్నది.

మరుసటి రోజు రాత్రి పిల్లలిద్దరు భోజనాలు చేసి ఒకే మంచంలో చెరో పక్క నిద్రకుపక్రమించారు. రోజంతా శ్రమించి ఉన్నారు కాబట్టి వెంటనే గాఢనిద్రలోకి జారుకున్నారు. ఇదే అదనుగా రామలక్షమ్మ ఉట్టిలోనున్న వెన్నకుండను కిందకు దింపింది. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్నాడు రామయ్య. కుండలోనిండి నేరేడు పండు పరిణామంలో ఉన్న రెండు వెన్నముద్దలను తీసి పిల్లల నుదుళ్ళ పై పెట్టింది. చూస్తుండగా వంటిలో వేడికి వెన్నముద్దలు కరగటం మొదలెట్టాయి. ఓ ఐదు నిమిషాల తర్వాత కృష్ణుని నుదిటిపై నున్న వెన్న పూర్తిగా కరిగి పోగా భీముని నుదిటిపై కాస్తంత వెన్న మిగిలే ఉంది.

అప్పుడు రామలక్షమ్మ "చూసారా, రోజంతా చదువుకోవడంలో చిన్నవాని మెదడు ఎంత శ్రమకు లోనైందో. వెన్నముద్దంతా కరిగిపోయింది. కాబట్టి, చదవటానినికి, తెలివిని సంపాదించడంలో ఉన్న శ్రమను తక్కువ అంచనా వేయవద్దు' అని అన్నది. రామయ్య 'సరే' అని ఒప్పుకున్నాడు.

జీవితం - డా.పాతూరి అన్నపూర్ణ

ఏంటి ఇలా తయారవుతున్నాను. పొద్దున లేచిన దగ్గరనుంచి ఒకటే‌ పరుగులు. వంట, టిఫెన్లు తయారు చేయడం, పిల్లలకి స్నానాలు, పానాలు. వెంటనే వాళ్ళకి బాక్సుల్లో స్నాక్స్, మధ్యాహ్నం లంచ్ సర్దడం, ఇంతలో స్కూల్ బస్ విజిల్ వినపడగానే వాళ్ళని బస్ ఎక్కించడం. తర్వాత రాజేష్ కు తనకు లంచ్ బాక్స్ లు సర్దడం. తొమ్మిదయ్యే సరికి ఎవరి బాగ్ లు వాళ్ళు సర్దుకుని ఆఫీసులకి పరుగులు.

మళ్ళీ తిరిగి రాత్రి ఏడు గంటలకు కానీ ఇంటికి రాలేని ట్రాఫిక్. తను వచ్చేంతవరకు పిల్లల్ని చూసుకునేందుకు మనిషిని మాట్లాడుకుంది. రాజేష్ ఏ రాత్రో పిల్లలు పడుకున్నాక వస్తాడు. ఈ లోపల వాళ్ళ హోంవర్క్ లు చేయించి అన్నాలు పెట్టి పడుకో పెట్టడం తో పెద్ద భారం దిగిపోతుంది. అమ్మయ్య!ఈ రోజు గడిచిపోయింది అన్న ఫీలింగ్. పిల్లలు ఒకటి, రెండు తరగతులు చదువుతున్నారు. కేజీల చదువులనుండీ బరువులు మోస్తున్నాయి ఆ లేత శరీరాలు.

అమ్మకు ఫోన్ చేసి ఎన్ని రోజులైంది. రోజూ చేద్దాం అనుకోవడం. ఏదో ఒక పనిలో పడిపోవడం. కాస్త ఖాళీ సమయం దొరికింది అనుకునే సరికి రాత్రి పదో పదకొండో అవుతుంది. వాళ్ళు పడుకుని వుంటార్లే!ఇప్పుడు ఫోన్ చేసి వాళ్లని లేపడం ఎందుకు. రేపు చేద్దాం అని వాయిదా వెయ్యడం...ఇదేనా జీవితం అంటే.. వారంలో ఐదారు రోజులు పరుగులు..శలవు రోజుల్లో వాషింగ్ మిషన్ లో గుడ్డలు వుతుక్కోవడం, ఇల్లు సర్దుకోవడం, పిల్లల్ని ఏ పార్కుకో హోటల్ కో తీసికెళ్ళడం..లేకుంటే వాళ్ళతో పడలేము. ఒకటే కొట్టుకోవడం, బొమ్మలకోసం పేచీ పడడం, కార్టూన్ షోలకోసం పేచీ. కళ్ళు మూసి తెరిచే లోపల శనాది వారాలు కనుమరుగయ్యేవి.

తన బాల్యం ఇలానే గడిచిందా? లేదుకదూ..ఎన్ని మధురమైన ఙ్ఞాపకాలు. ఆనందం పంచుకున్న అనుభవాలు. అట్ల తద్దికి అనుకుంటాను. ముందు రోజు రాత్రి అమ్మమ్మ అమ్మకు, నాకు గోరింటాకు చేతులనిండా పెట్టేది. పైగా ఓ కాకరాకో, బంతాకో వేసి అరచేతిలో అప్పచ్చిలా పెట్టేది. వేళ్ళనిండా పొడుగ్గా గోపురాల్లా గోరింటాకు తొడుగులు. తలకి, వంటికి రాసుకుంటావే.. చేతులు దూరంగా పెట్టుకుని పడుకో అనేది అమ్మ. అందరికన్నా తనచేతులే ఎర్రగా పండినట్లు కలలు.

తెల్లారు జామున నాలుగ్గంటలకే నిద్ర లేపేవాళ్ళు. నీళ్ళతో చేతులు కడిగాక అరచేతిలో ఎర్రని చందమామ, చుక్కలు మెరిసిపోతూ. తలంటి పోసుకుని వెన్నెల్లో అరుగులమీద కూర్చుని పొ ట్లకాయ కూర, పెరుగన్నం తినేవాళ్ళం. చెట్ల కొమ్మలకు కట్టిన తాళ్ళ తో ఉయ్యాల లూగేవాళ్ళం. ఆ సమయానికి ఓ నలుగురైదుగురు స్నేహితురాళ్ళు వచ్చేవాళ్ళు. అట్లా చెస్తే మంచి మొగుడు వస్తాడని అమ్మమ్మ చెప్పేది. గోరింటతో పండిన అరచేతులు, పట్టు పరికిణీలు, జడగంటల వాలుజడలు..ఒప్పులకుప్పాటలు. ఎంత బాగుండేవి ఆరోజులు.

శలవల్లో అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళం. సాయంత్రాలు డాబామీద జాజి తీగకు పూచిన అరవిచ్చిన పూలన్నీ గిన్నెనిండా కోసుకు వస్తే రెండు మూరల మాలలు కట్టేది అమ్మ. నల్ల మచ్చల అవుకి గడ్డి వెయ్యడం, తొక్కుడు బిళ్ళాటలు, పొద్దున్న చద్దన్నాలు, రాత్రి ఆరు గంటలకల్లా వేడి వేడి ఉడుకన్నాలు..నాకు, తమ్ముడికి, చెల్లికి ముద్దలు కలిపి పెట్టేది అమ్మమ్మ. అమ్మ వంట పని చూసుకునేది. అమ్మమ్మని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది అమ్మ. ఏ మాత్రం వీలున్నా అమ్మమ్మ గారింటికి తీసికెళ్ళేది. లేదా అమ్మమ్మని మాఇంటికి తీసుకు వచ్చేది. అమ్మమ్మకి అమ్మ ఒక్కర్తే సంతానం. తాత కాలంచేశాక ఒంటరితనంతో బాధ పడుతుందని మామయ్య గారింట్లో వున్నా అడపా దడపా అమ్మమ్మని చూసి వచ్చేది అమ్మ.

తన పెళ్ళికి కూడా వున్నది అమ్మమ్మ. అత్తారింటికి వెళ్తుంటే కావలించుకుని ఏడ్చేసింది. నేను ఇంకెన్నాళ్ళో వుండనే. మీ అమ్మని బాగా చూసుకోవాలి. కుంచమంత కూతురుంటే కంచం మంచం మీదికే వస్తుందంటారు. ఆడదాని కష్టాలు ఆడదానికే తెలుస్తాయంటారు అని చెప్పేది.

మరి నేనేం చేస్తున్నాను. కనీసం వారాని కోసారైనా ఫొన్ చెయ్యలేని జీవన శకటంలో చక్రంలా తిరుగు తున్నాను. అంటూ నిట్టూర్పు విడిచింది శిరీష.

రెండ్రోజుల తర్వాత ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు శిరీష అమ్మకి ఫోన్ చేసింది.

జీవితంలో మనం ఎన్నో కోల్పోతున్నాం. పోయిన వాటిని తిరిగి పొందటానికి ప్రయత్నించడమే జీవితం అనుకున్నది శిరీష.

గల్పికావని-శుక్రవారధుని - పౌరమహారాణి చరిత్ర - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

బుడతకీచుల రాజ్యాన్నుంచి ఓ నిరంతర వార్తా స్రవంతి తరపున వార్తాగ్రాహిణిగా వచ్చింది మార్గరెట్. ఆ "మార్గ"రెటు మన "మార్గా"న్ని తన వాళ్ళకి చూపిస్తుందో వాళ్ళ "మార్గా"న్ని మనకి నేర్పిస్తుందో తెలుసుకుందామనే కుతూహలంతో కాబోలు, అందరూ ఆమెవంకే చూస్తున్నారు. ఆమె వెనక ఓ ఛాయాగ్రాహకుడు ఉన్నాడు. అతడు రహదారి పక్కనే వెనక్కి పరిగెడుతున్న దుకాణాల్నీ.., కార్యాలయాల్నీ.., దారికి అడ్డంగా పరుగులుతీస్తున్న రకరకాల వాహనాల్నీ.., ఇలా కనిపించిన దృశ్యాలన్నింటినీ  తన కాళీపట్నం బొమ్మల పెట్టెలో చిత్రీకరిస్తున్నాడు.

అది లింగంపల్లి నుండి హయత్ నగర్ వెళ్ళే చలవ ప్రజా రవాణావాహనం. శీతాకాలం కావడంతో చల్లదనం ఎక్కువమందికి పడదు. కాబట్టి ఆ చలవబండిలో ప్రయాణించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. అందులో ఎక్కిన ప్రయాణీకులందరూ పెద్దపెద్ద కార్యాలయాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ తాము చాలా పెద్దవాళ్ళమనే అభిప్రాయం పెంచుకున్న పెద్ద పెద్దవాళ్ళే. సజాతి ధృవాలు వికర్షించుకోవడం సహజం కాబట్టీ ఏ పెద్దమనిషీ తన పక్కన ఉన్న మనిషిని  ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోజూ కనపడేవాళ్ళనికూడా అపరిచితులుగా చూస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల గాలి వీస్తోంది. కాబట్టీ ప్రచారం హోరెత్తిపోతోంది. అయినా సరే దానిగురించి ఎవరూ మాట్లాడుకోవటం లేదు. ఎవరికి వాళ్ళే మునుల్లా ముక్కుమూసుక్కూర్చుని ఎవరి కరవాణుల్లో వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

వాళ్ళందరినీ పరిశీలనగా చూసిన మార్గరెట్, వారి పట్ల తన అభిప్రాయాలు రాసుకుంటోంది. "హైదరాబాదులో ప్రజలందరూ నెమ్మదస్తులు, సంస్కారవంతులు. అకారణంగా ఒకరిజోలికి వెళ్ళేవారు కారు. సున్నితమైన మనస్తత్వం కలిగిన మితభాషులు. చాలా మంచివాళ్ళు..,"

అంతలోనే నాంపల్లిలో ఆగింది బండి. తలుపు తెరుచుకుంది. ఒక వృద్ధపేదరాలు, ఏదో గ్రామాన్నుండి వస్తోంది కాబోలు. ప్రాణాలు మునిపంట కరుచుకుని రెండు పెట్టెల్నీ, ఒక బట్టల మూటనీ, చేతి సంచినీ అష్ట కష్టాలూ పడుతూ బండిలోకి ఎక్కిస్తూంటే ఒక్కరు కూడా సాయం చెయ్యలేదు సరికదా, కనీసం సానుభూతి కూడా చూపించలేదు. ఆమెని చూసి కూడా చూడనట్టే నిమ్మకు నీరెత్తినట్టు అంతర్జాలంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళని ఏమాత్రం సహాయం అడక్కుండా తన సామాన్లని తనే సద్దుకుని ఓ వారగా కూర్చుంది.

ఆ ముసలమ్మని చూసిన మార్గరెటుకి ఎంతో ముచ్చటేసింది. అందుకే ఆమె గురించి తన చేతి పుస్తకంలో రాసుకుంది. "ఇక్కడి స్త్రీలు ఆత్మగౌరవం కలిగిన స్వయం సమృద్ధలు. ఎవరి సహాయమూ తీసుకోరు. ఎంతటి కష్టకార్యాలైనా స్వయంగానే చక్కబెట్టుకోగల ధీర వనితలు. వారు ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోని స్త్రీలలా వయసు మీద పడిందని కృంగిపోయే బలహీన మనస్కులు కారు."

ముసలమ్మ డబ్బులు తీసిచ్చింది. బండివాడు చీటీ చింపిచ్చాడు. ఎక్కడో ఉన్న మంచిర్యాలనించి నాంపల్లి రావడానికి అయిన మొత్తం కంటే పక్కనే ఉన్నకొత్త పేటకి ఎక్కువ డబ్బు అడుగుతూంటే ఏం చెయ్యాలో దిక్కు తోచక ఉన్న చిల్లరంతా ఊడ్చి బండివాడి చేతిలో పెట్టింది. ఆ చిల్లరని ప్రసాదంలా అందుకున్నాడు చీటీలయ్య.

బండి ముందుకు వెళ్తూంటే జనంతో కిక్కిరిసిపోయిన కోఠీ.., చెత్తా చెదారంతో నిండి నురగలు కక్కుతూ కుళ్ళు కంపు కొడుతున్న మూసీ.., గుమ్మెత్తించే సంభారాల గుబాళింపుల మలక్ పేట గంజ్.., ఇలా ఒక్కొక్క ప్రాంతాన్నీ చూస్తూ మైమరచిపోతోంది మార్గరెట్. చూసిన ప్రతిదాని గురించీ పక్కనున్నవాళ్ళని వివరాలడుగుతూంటే.., మునులంతా మౌనం వీడి ఆమె అడిగిందానికీ అడగందానికీ ఎగబడి సమాధానాలు చెబుతూంటే.., వాటన్నింటికీ తన అనుభూతుల్ని కూడా కలబోసి రాసుకుంటూ కూర్చుంది.

చూస్తూండగానే కొత్తపేట వచ్చేసింది. బండి ఆగింది. ముసలమ్మ దిగడానికి ఉద్యుక్తురాలై పైకి లేచింది. ఆ లేవడంలో నడుం పట్టేసినట్టుంది. అందుకే లేచింది లేచినట్టే నిలబడిపోయింది. సభ్యసమాజ పౌరులంతా ఆమెని తగలకుండా ఆమె వంక అదోలా చూస్తూ తప్పుకుంటూ కిందికి దిగిపోతున్నారే తప్ప ఎవరూ ఆమెకి చెయ్యందించడం లేదు.

ఆ ముసలమ్మ ఎవరినీ ఎటువంటి సహాయమూ అడక్కుండా తనని తానే సంభాళించుకుని మెల్లగా నిలబడింది. ఆమె అలా నిటారుగా నిలబడ్డం చూసిన మార్గరెట్ ఆ ముసలమ్మవంక గౌరవ పూర్వకంగా చూసింది ఆ ముసలమ్మ తనకు ఎదురైన కఠిన పరిస్థితులకు ఏమాత్రం తలవంచకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్న తీరు మార్గరెటుకి ఆనందం కలిగించింది.

అంతలోనే ఇస్త్రీ నలగని తెల్లని బట్టలు ధరించిన నాయకుడొకతను బండి దగ్గరకి వచ్చాడు. అతను ముసలమ్మ వెనకే కూర్చుని ఆవిడని చిత్రిస్తున్న ఛాయాగ్రాహకుణ్ణి చూశాడు. వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తక్షణమే కార్యరంగంలోకి దూకాడు.

ఆ నాయకుడి  వెంట మందీ మార్బలం దండిగా ఉన్నారు. వాళ్ళందరూ ముసలమ్మకి సాయం చెయ్యడానికా అన్నట్లు చేతులు ముందుకు చాచబోయారు. వాళ్ళని చూపులతోనే వారించాడు నాయకుడు. రెండే రెండు అంగల్లో బామ్మగారి దగ్గరకి చేరాడు. ముందుగా ఆవిడ కాళ్ళకి దణ్ణం పెట్టాడు. తరవాత ఆవిడ  వారిస్తున్నా వినకుండా బట్టల మూటని నెత్తిన పెట్టుకున్నాడు. రెండో చేత్తో ఆవిడ చేతి సంచిని అందుకున్నాడు. పక్కనే ఉన్న ఇద్దరు పెద్దలకు సైగ చేశాడు. వాళ్ళిద్దరూ చెరోపెట్టెనీ భుజాలకి ఎత్తుకున్నారు. అంతలోనే ఇద్దరు సింగారమ్మలు వచ్చి తమ అలంకరణ మాసిపోతుందేమోనన్న భయాన్ని కూడా లెక్కచెయ్యకుండా ముసలమ్మని రెండు వైపులా పట్టుకుని ఎంతో ఆప్యాయంగా కిందికి దించారు.

ముసలమ్మ ముందు నడుస్తూ తన గుడిసెకి దారి చూపిస్తుంటే..,

ఇద్దరు కులుకులేళ్ళూ చెలికత్తెల్లా ఇరు పక్కలా వంగి వంగి నడుస్తుంటే..,

నాయకమ్మన్యులు మూటా సంచీ మోస్తూ తమని ఎన్నుకుంటే కలిగే లాభాలేమిటో వివరిస్తూ ఆ బామ్మగారి సహాయం లేకుంటే తనకి భవిష్యత్తే లేదని తన గోడు వెళ్ళబోసుకుంటూ ఆవిడ కాళ్ళావేళ్ళా పడుతూంటే..,

వందిమాగధగణంలా అనుచరులంతా తలలూపుకుంటూ వెంట వస్తూంటే..,

మహారాణిలా ఊరేగుతున్న ఆ ముసలమ్మని చూసి గర్వపడుతూ ఛాయాగ్రహకుడికి సూచనలివ్వడం కూడా మర్చిపోయి కొత్తపేట సందులగుండా నడుస్తున్న ప్రజాస్వామ్య చరిత్రని గబగబా రాసేసుకుంటోంది మార్గరెట్.

"ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులనేమాట అన్నిదేశాల్లోనూ పుస్తకాల్లో చదవగలంగానీ, కేవలం భారత దేశంలో మాత్రమే కళ్ళారా చూడగలం. మనసారా ప్రజాస్వామ్య సౌరభాలను ఆఘ్రాణించగలం. ఇదిగో మీరే చూస్తున్నారుగా? ఈ వయోవృద్ధురాలికి బ్రహ్మరథం పడుతున్న నాయక గణాన్ని? ఆవిడ బండెక్కినప్పటినించీ చూస్తున్నాను. ఆవిడని మించిన ఆత్మగౌరవం, మర్యాద, మన్ననలు గల సామాన్యురాలిని ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేం. ఏకంగా నాయకుడే స్వయంగా ఆవిడని ఎంత శ్రద్ధాభక్తులతో సేవించుకుంటున్నాడో చూడండి. మహారాణి పాలన వల్లే మామూలు బ్రిటన్, గ్రేట్ బ్రిటన్ గా మారింది. ఇక్కడ ఈ బామ్మగారిని చూస్తుంటే ఒక మామూలు మనిషే మహారాణిగా మారి ది గ్రేట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా పూజలందుకుంటోందనిపిస్తుంది. ఇక్కడి నాయకులే సేవకులు. సేవకులే నాయకులు. ఇలాంటి సేవానాయకుల్నిగానీ నాయకాసేవకుల్ని గానీ ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేము. అదిగో ఆ బామ్మగారి గుడిసె. అదిగో చూడండి మాన్య సామాన్యురాలి ఆత్మీయ కుటుంబం. ఆ కుటుంబ సభ్యులని వారి నాయకుడు ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడో చూడండి. వారి అవసరాలేమిటో ఎంత ఆత్మీయంగా కనుక్కుంటున్నాడో.., భారత ప్రజాస్వామ్యం అతి పెద్దది మాత్రమే కాదు. అతి పెద్ద మనసున్నది కూడా. అందుకే అంత పెద్ద నాయకుడు కూడా కూటికికూడా గతిలేని నిరుపేదల "గుడి"సెల్లో అతి సామాన్యుడిలా కలిసిపోయి ఆ ఇంటి ఆడపడుచు ఇచ్చిన ముంతలోని గంజిని అమృతంలా ఎలా తాగుతున్నాడో? కళ్ళలో నీళ్ళొస్తున్నా లెక్కచెయ్యకుండా ఆ ఉల్లిపాయనీ మిరపకాయనీ ఎంత సంతోషంగా నంజుకు తింటున్నాడో?

అంటూ మొదలుపెట్టిన మార్గరెట్, తను ఎన్నడూ ఎక్కడా చూడని పడగలా పురివిప్పిన మానవతని వైనవైనాలుగా వర్ణిస్తూ..,అన్ని చరిత్రలనూ శక్తివంచన లేకుండా చిత్రీకరిస్తూనే ఉంది.

ప్రేమ ముఖ్యం - దివాకర్ల రాజేశ్వరి

నందినీ ఈ కుక్క అరుస్తోంది. ఏమీ చేయదుకదా..లోపలికి రావచ్చా! చీరకుచ్చిళ్ళను పక్కకు పట్టుకుని, దాదాపు అరిచినట్టుగా అడిగింది పార్వతి.

నందిని బయటకు వచ్చి "ఫరవాలేదు, దాన్ని కిటికీ ఊచకు కట్టేశాము ..లోపలికి రా అంటూ ధైర్యం చెబుతూ చేయి పట్టుకుని లోపలికి నడిపించింది.

అదేమిటే 'ఈ కుక్క వ్యవహారం ఎప్పటినుంచీ ..అదీ మీ ఇంట్లో, సంభ్రమంగా, సందేహంగా, అడిగింది పార్వతి.

అవును, నీకు ఆశ్చర్యంగా ఉంది కదా .. ముందు కూచో చెబుతాను. అంది నందిని.

అది కాదే నీకసలే మడీ, ఆచారం అన్నీ ఎక్కువ కదా, మరి కుక్కని ఇంట్లో ఎలా పెంచుతున్నావు?

అసలు కుక్కను పెంచాలనే ఉద్దేశ్యం ఎలా కలిగిందో చెప్పు. ఆసక్తిగా అడిగింది. నందిని చదువుకున్నదే అయినా ఆమె చేసే పూజలూ, వ్రతాల సంగతి పార్వతికి తెలుసు. ఇక శుభ్రత సంగతి చెప్పనే అక్కరలేదు. ఎవ్వరినీ చెప్పులేసుకుని ఇంట్లో వరండా లోకైనా రానీయదు. పిల్లలనైనా వంటిట్లోకి ఎలాపడితే అలా వెళ్ళనీయదు. అన్నిటికీ పద్ధతిని పాటిస్తుంది. అందుకనే నందిని ఇంట్లో కుక్కపిల్లను చూసి పార్వతి విస్తుపోయింది.

పార్వతికి కాఫీ కలిపి ఇస్తూ నందిని ఇలా చెప్పింది.

మొన్న నేను, మార్కెటుకు పనిమనిషి రత్న తో వెళ్ళి కావలసినవి కొనుక్కుని ఆటో లో వస్తున్నానా! ఇంటి దగ్గర మలుపు తిరిగేటప్పుడు ఈకుక్క పిల్ల అడ్డం వచ్చింది. ఆటో వాడు సడన్ గా ఆపినా అప్పటికే కుక్కపిల్లకి గాయం అయింది. అది కుంటుతూ ఉంటే జాలి వేసింది. నేను రత్నం సాయంతో కుక్కను ఇంటికి తెచ్చాను. రత్నం దాని కాలికంటిన మట్టినితుడిచి, కాలికికట్టుకట్టింది. దానికి ఇంట్లో ఉన్న పాత గిన్నె ఒక దాంట్లో పాలు పోసి ఇచ్చాను.  సాయంత్రానికి మా ఆయనచేత బ్రెడ్డు తెప్పించి వేశాను. అలా ఓ పదిహేను రోజులయింది. మాదగ్గిరే ఉంది అంది నందిని.

అది సరే ఇంట్లో తిరగనిస్తున్నావా అంది పార్వతి.

అమ్మో! అసలు రానివ్వను. అంతా బయటే, అదీ రత్న వచ్చాక దాని సంగతి చూస్తోంది. దాని దగ్గర కుక్క ఉందట, కుక్కకు ఏం పెట్టాలో దానికి తెలుసు. కాని అది చెప్పిన వన్నీ నేను పెట్టనివ్వను. అన్నం, పాలూ, గంజి లాంటివి మాత్రమే పెట్టమని ఇస్తాను. అంది నందిని.

ఓ నీ జాలి గుణం ఇంత పని చేసిందన్నమాట. అయినా కుక్కను పెంచుకోడం మంచిదేలే అంది పార్వతి.

అవునే ఏదో వేళ కింత పడేస్తే చాలు, తోకాడిస్తూ సంతోషంగా ఉంటుంది, అంది నందిని.

అది కాదే కుక్క క్కూడా చాలా చేయాలి. మీ పిల్లలతో కొద్దిసేపు ఆడుకోడానికి వాళ్ళకు బంతినిచ్చి, ఆడించమని చెప్పు అంది పార్వతి.

ఏమోనే అవన్నీ చేయడానికి సమయం కుదరటంలేదనుకో, అయినా, మా ఆయన సంగతి నీకు తెలుసు కదా! ఆయన కుక్క అంటేనే ఛీ ఛీ అంటూ దూరంగా ఉంటారు. అందుకనే దాన్ని గుమ్మం దగ్గిరే ఉంచుతాం. రాత్రి కూడా బయట అరుగు మీదే పడుకుంటుంది. అంది నందిని.

సరేలే! ఒక ప్రాణి మీద జాలిని చూపిస్తునన్నావు, సంతోషం. చాలారోజులయిందని చూద్దామని వచ్చాను. చలికాలం. తొందరగా చీకటి పడుతుంది. వెళ్ళొస్తాను. అంటూ బయలుదేరింది పార్వతి.

అవును aప్పటికే చీకటి పడింది. అరుగు మీద కుక్కపిల్ల ముడుచుకుని పడుకొంది. ఈ పదిహేను రోజులకే కాస్త పెరిగింది. వేళకు పెడుతుండడం వల్ల కొంత బలంగా కూడా తయారయింది. దాన్నిప్పుడు రాత్రి బెల్ట్ తో కట్టక పోయినా ఫరవాలేదు. ఎక్కడికీ వెళ్ళదు. దాని వేపొకసారి చూసి తలుపేసుకొని లోపలికి వెళ్ళింది నందిని.

త్వరగానే భొజనాలయ్యాయి. కొద్ది సేపు టి.వి. చూసి, పిల్లలు కూడా పుస్తకాలు మూసి నిద్రపోతున్నారు కనుక, దీపాలను ఆర్పేసి నిద్రకుపక్రమించింది నందిని.

దాదాపు రాత్రి పొద్దుపోయింది. కుక్క అరుపు కుయ్, కుయ్, మంటూ వినిపిస్తోంది. నందినికి  మనిషి ఎవరో వచ్చిన అలికిడి కూడా వినిపించింది. నందిని కప్పుకున్న దుప్పటిని తొలగించి, కళ్ళు నులుపుకుంటూ తలుపుదగ్గరకు వచ్చి కిటికీ బయటకు తొంగి చూసింది. అరుగుమీద కుక్క పిల్లను నిమురుతూ, ఒక ఆగంతకుడు కూచుని ఉన్నాడు. చూడ్డానికి పల్లెటూరు మనిషిలా ఉన్నాడు. పైన గొంగళిని కప్పుకున్నాడు. యెక్కడనుంచి వచ్చాడో, నందిని తలుపు తెరవకుండానే కిటికీ లోంచే అడిగింది. ఎవరూ అని, సమాధానం వచ్చింది.

అమ్మా! మాదీ పక్క నున్న పల్లెటూరమ్మా! అప్పుడప్పుడు ఇక్కడ ఇళ్ళళ్ళో కొబ్బరికాయలు దింపడానికి పిలుస్తే వస్తుంటాను. ఇవాళ రెండు మూడిళ్ళకు వెళ్ళేటప్పటికి, తిరిగి ఊరు వెళ్ళడం ఆలస్యమే కాకుండా చాలా అలసట అనిపించింది. ఇక్కడ మీ అరుగు విశాలంగా కనుపించింది. అడగకుండా లోపలికి వచ్చాను. మన్నించండి. మీ కుక్కపిల్ల చాలా మంచిదమ్మా, నాకూ చోటిచ్చింది, అంటూ కుక్కపిల్లను గుండెలకు హత్తుకుని, నిమురుతూ ముద్దులు కురిపించాడు. కొద్ది సేపట్లోనే అతడు కుక్కపిల్లను అంతగా ముద్దు చెయడం, మాలిమి చేసుకోవడం, తను చేయలేని పని అతడు చేసినట్టుగా అనిపించింది. పాపం ఏమైనా తిన్నాడో, లేడో నని వంటింట్లోకి వెళ్ళి, గిన్నెలో అన్నం పేపర్ ప్లేట్లో పెట్టి పచ్చడివేసి, తలుపు తీసి అతనికి తినమని ఇచ్చింది. అతడు ఎంతో సంతోషంగా తిన్నాడు. ఈఇల్లు మీరు ఇంకా కట్టడం పూర్తిచేయలేదనుకుంటా. వీధి గేటు పెట్టించుకోలేదు. అందుకనే లోపలికి రాగలిగా, ఓ కొబ్బరి చెట్టు ఈసారి ఇటు వచ్చినప్పుడు నాటి పెడతానమ్మా అంటూ నందిని ఇచ్చిన నీళ్ళను తాగి, ఇంక పడుకుంటానమ్మా, పొద్దున్నే లేచి వెళ్లిపోతాను. అన్నాడు, తన గొంగళిని తీసి కుక్కను దగ్గరగా కౌగలించుకుని దానికి కూడా కప్పి ఎంతో హాయి కలిగినట్టు నిద్రకుపక్రమించాడు. కుక్కకూడా కిక్కురుమనకుండా అతని ముఖం నాకుతూ తన సంతోషాన్ని తెలిపింది.

తెల్లారింది. రోజూలా నందిని పేపరు తీసుకోడానికి బయటకు వచ్చింది రత్న కూడా వచ్చేసింది. వాకిలి ఊడవడాన్ని మరచిపోయినట్టు చీపురును చేతిలో పట్టుకుని కొత్తమనిషి వంక చూస్తూ ఉండి పోయింది.

ఇంకా నిన్న వచ్చిన మనిషి వెళ్ళ లేదు. కుక్కపిల్ల కూడా ఆతని ఒళ్ళో కూచునేఉంది.

నందినిని చూడగానే ఆ మనిషి లేచి, మీతో చెప్పి వెళ్దామని ఉన్నానమ్మ అన్నాడు. కాఫీ తాగి వెళ్ళు అంది నందిని . లేదమ్మా వెళ్తాను అని చెప్పులేసుకుని సంచిలో గొంగళిని పెట్టుకుని బయలుదేరబోతుంటే కుక్కపిల్ల అతని కాళ్ళను చుట్టుకుని పోయింది. అతని మీద మీదకు ఎగిరింది. చూడండమ్మా నాతో వస్తానంటోంది. అని వదిలించుకొనే  ప్రయత్నం చేసి ముందుకు కదలబోతుంటే, కుక్కపిల్ల ఆతని వెంటనే నడచింది. నాతో తీసుకెళ్ళి తరువాత దింపనా అమ్మా అన్నాడతను.

ఒక్క రాత్రిలో కుక్కపిల్లకు అతనితో ఏర్పడిన బాంధవ్యానికి నందిని నిర్ఘాంతపోతూ ఉండగా రత్న ఆమె పక్కకు వచ్చి ఇలా అంది.

అమ్మా రాత్రంతా అతను కుక్కపిల్లను కన్నపిల్లలా లాలించాడనుకుంటా. మీరు దానికి కరుణ చూపించారు. అతడు ప్రేమ కురిపించాడు. ‘కరుణ కంటె ప్రేమ ముఖ్యం’ కదమ్మా. అంది. అమాయకంగా చెప్పిన దాని మాటల్లో ఎంతో సత్యం గోచరించింది. అలాంటి ప్రేమ నోరు లేని ఆ ప్రాణికి పద్ధతులను మార్చుకోలేని నాదగ్గర కంటే ఆ వ్యక్తి  దగ్గరే ఎక్కువగా దొరుకుతుందనిపించింది.

వెళ్ళబోతున్న అతన్ని పిలిచి కుక్కపిల్లను అతనితో తీసుకెళ్ళమని అప్పగించాను. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నాకు ఆత్మీయమైనదేదో దూరమవుతున్న బాధ కలిగింది.

సం “సారం” - అత్తలూరి విజయలక్ష్మి

నాలుగు రోజులు సెలవు పెట్టి ఎక్కడికన్నా వెళ్లి సరదాగా తిరిగి రావాలనిపించింది. జీవితం మరీ మొనాటనస్ గా తయారైంది. ఇంటికి వెళ్తే అమ్మ నస భరించడం కష్టం... నలభై ఏళ్ళు దాటాయి... ఇంక నీకు పెళ్లెలా అవుతుందే! పాతికేళ్ళు వచ్చిన దగ్గరనుంచీ పోరాను.. చేసుకున్నావు కాదు.. చదువు, ఉద్యోగం అంటూ ఇలా వృద్ధ కన్యగా మిగిలావు అని గుండెలు బాదుకుంటుంది. అందుకే ఆ ఆలోచన పక్కకి నేట్టేసాను. సడెన్ గా గుర్తొచ్చింది. శారదని చూసి చాలా కాలమైంది.. దాదాపు ఐదేళ్ళు అవుతోంది ఎప్పుడో నేను విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలిసేదాన్ని. నాకు హైదరాబాద్ బదిలీ అయాక అసలు కలవలేదు. అనుకోడమే తడవు విజయవాడ బస్ ఎక్కాను.

సత్యనారాయణపురంలో ఉన్న శారద ఇంటి ముందు టాక్సీ ఆగింది. పర్స్ తెరిచి డబ్బులిస్తూ కొద్దిగా తెరిచిఉన్న గేటులో నుంచి లోపలికి తొంగి చూశాను.

భుజాన పాపాయి, దోపిన చీర కుచ్చిళ్ళు... ద్వారం దగ్గర కు వచ్చి తల కొంచెం ఒంచి టాక్సీ లో వచ్చిన అతిధి ఎవరా అని కాబోలు తొంగిచూస్తోంది శారద.

శారద నాకన్నా నాలుగేళ్ళు పెద్ద.. అప్పుడే మనవరాలో, మనవడో ఎత్తుకుంది.

నన్ను చూసిన వెంటనే  సంతోషంతో గడప దాటి బయటకు వచ్చి రెండు మెట్లు దిగింది “స్వప్నా నువ్వేనా?” అంటూ.

“నేనే ...” నవ్వుతూ తన దగ్గరకు నడిచి చిన్నగా కౌగలించుకున్నా.

“ఇలా ఇవ్వు” అంది కుడిచేయి చాచి సూట్ కేసు కోసం ...

“ఎంతమందిని ఎత్తుకుంటావు?”  నవ్వి బాబా! అంటూ శారద చంకలో ఉన్న బాబు చెక్కిలి సున్నితంగా మీటాను. 

“నా మనవడే” అంది కొంచెం గర్వంగా జారిపోతున్న బాబుని సరిగా ఎత్తుకుంటూ.

“వేరే చెప్పాలా” అన్నాను వరండాలో సూట్ కేసు కింద పెట్టి బాత్రూం వైపు నడుస్తూ.

నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి బాబుకి పౌడర్ రాసి, బట్టలేసి గుడ్డ ఉయ్యాలలో పడుకోబెట్టింది. పనిమనిషి కాబోలు నెమ్మదిగా ఉయ్యాల ఊపుతోంది. శారద వేడి, వేడి ఇడ్లీలు ప్లేటులో తెచ్చి టేబుల్ మీద పెట్టి “రా, రా, చల్లరిపోతాయి” అంది తనొక కుర్చీలో కూర్చుని.

నేను తన పక్కన మరో కుర్చీలో కూర్చుని “ఇల్లంతా, సాంబ్రాణి, మంచి జాన్సన్ పౌడర్ సువాసనలతో నిండి కొత్తగా, గమ్మత్తుగా ఉంది” అన్నాను.

“పసిపిల్లలున్న ఇల్లు అని తెలియాలి గా” అంది ఇడ్లి తుంచి నోట్లో పెట్టుకుంటూ.

“అప్పుడే మనవడు, కోడలు, అల్లుడు ... ఏవిటే ఇది... యాభై ఏళ్లకే ముసలిదానివి అయ్యావా” అన్నాను.

“మనవడు పుట్టగానే నాన్నమ్మని అయిపోయాగా” అంది నవ్వుతూ.

“గొప్ప పని చేసావు. చెబితే విన్నావా... ముందు ఉద్యోగం చూసుకోవే తరవాత పెళ్లి చేసుకోవచ్చు అని చిలక్కి చెప్పినట్టు చెప్పానా! చూడు.. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళను చేశాక కూడా నిన్ను బాధ్యతలు వదలలేదు” అన్నాను.

శారద సమాధానం చెప్పకుండా నవ్వేసింది.

ఇల్లంతా చాలా నీటుగా ఉంది. ఎక్కడి వస్తువులు అక్కడ సర్ది ఉన్నాయి.

బాబు పడుకున్నట్టున్నాడు పని మనిషి పంపు దగ్గర బట్టలు ఉతుకుతోంది.

ఇంట్లో వాళ్ళంతా ఎవరి దారిన వాళ్ళు ఆఫీస్ లకి వెళ్లినట్టున్నారు. అందరివీ ప్రైవేటు ఉద్యోగాలు.. పాపం శారద! అందరికి వండి వార్చడం, ఇల్లు చక్కబెట్టుకోడం, బాబోయ్ ఎంత చాకిరీ! నిజంగా చెప్పాలంటే ఇంటి ఇల్లాలు చేసేది వెట్టి చాకిరి ... జీతం, బత్తెం లేని ఉద్యోగం, సెలవులు, విశ్రాంతి లేని గానుగెద్దు జీవితం.. ఈ జీవితం కోసమేనా పెళ్లి, పెళ్లి అని తపించి పోతారు ఆడవాళ్ళు.. ఈ శారదకి  జీవితంలో సుఖం, వినోదం అనేవి తెలుసా. తన కోసం తను ఒక్క రోజన్నా బతికిందా! ఉద్యోగాలు చేసేవాళ్ళకి అప్పుడప్పుడు సెలవులు ఉంటాయి. కానీ శారద లాంటి గృహిణికి ఏనాడూ సెలవు ఉండదు.

శారద మీద జాలితో నిండిపోయింది నా మనసు.

అయినా కోడలుకి చులకన కాకపొతే అత్తగారు ఎంత ఇంట్లో ఉండే మనిషి అయితే మాత్రం, పిల్లాడిని కూడా ఆవిడ నెత్తిన వదిలి వెళ్ళాలా? ఏ క్రచ్ లోనో పెట్టచ్చు కదా..పాపం శారద! భర్త, కొడుకు, కూతురు వీళ్ళందరికి చేసిన సేవలు సరిపోలేదనా మళ్ళీ మనవడి బాధ్యత తలకెత్తుకుంది.

“ఏంటే ఆలోచిస్తున్నావు? కబుర్లు చెప్పు. ఇంక తమరు ఇంతేనా ఇలా మిస్సమ్మగానే ఉండిపోతావా” హాస్యంగా అంది శారద నా పక్కకి వచ్చి కూర్చుని.

“ఇప్పుడు నన్నెవరు పెళ్లి చేసుకుంటారు నవ్వి అన్నాను.. అయినా నేను ఇప్పుడు చాలా హాయిగా ఉన్నాను.. అయాం ఏ ఫ్రీ బర్డ్ ...అమ్మో నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది.. ఈ చాకిరీ ఎలా చేస్తున్నావే బాబూ” అన్నాను. “ఎవరన్నా నువ్వు పడే కష్టం గుర్తిస్తున్నారా.. నీ పట్ల ఎవరన్నా జాలి చూపిస్తున్నారా.!” 

“జాలా!” విస్తుబోతూ చూసింది శారద.

“ఈ ఆత్మవంచనే స్త్రీని బానిసను చేస్తోంది. నా ఇల్లు, నా వాళ్ళు అన్న భావన నీ ఒక్కదానికేనా.. మీ ఆయనకీ లేదా... పిల్లలు ఆయనకీ పిల్లలు కాదా.. ఈ ఇంట్లో ఆయనకీ ఏమి భాగస్వామ్యం లేదా... ఇంటి పని కొంచెమన్నా చేస్తాడా... ఆడవాళ్ళు ఇంట్లో ఉండి సుఖపడుతున్నారు అని మగవాళ్ళు అనుకుంటారు... కానీ వాళ్ళ కన్నా ఇంట్లో ఉన్న వాళ్ళే ఎక్కువ చాకిరీ చేస్తారని రియలైజే అవరు.. నాకందుకే గృహిణి అనే పదం అంటేనే ఇష్టం ఉండదు.. అయినా నీ కోడలికి కొంచెమన్నా ఇంగితం ఉందా.. చదువుకున్న పిల్ల కూడా నీ బాధ అర్ధం చేసుకోకపోతే ఎలా? అవునులే ఈ రోజుల్లో అమ్మాయిలకి కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయి! వాళ్ళ సంపాదన దాచుకుని అత్తగార్లనీ, అమ్మలనీ బేబీ సిట్టింగ్ కి వాడుకుంటున్నారు.”

శారద నా వైపు విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది.

“ఏంటలా చూస్తున్నావు. నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం ఉందా? చూడు అద్దంలో ఎప్పుడన్నా మొహం చూసుకున్నావా.. అప్పుడే ముసలి రూపు వచ్చేసింది. జుట్టుకి కాస్త రంగేసుకుంటే ఏం? ఎప్పుడన్నా ఒకసారి పార్లర్ కి వెళ్లి  ఫేషియల్ చేయించుకోవచ్చుగా.. అమ్మో నిన్ను చూస్తుంటే నాకు జీవితం మీదే విరక్తి పుడుతోంది” అన్నాను మొహం అంతా వికారంగా పెట్టి.

“మా పిల్లల పెళ్ళికి పిలిస్తే రాలేదుగా నువ్వు. ఫొటోస్ చూద్దువు గాని రా” అంటూ లోపలికి తీసుకువెళ్లి పిల్లలిద్దరి పెళ్ళిళ్ళ ఆల్బమ్స్ చూపించింది.. కోడలు, అల్లుడు కూడా చూడ చక్కగా ఉన్నారు. చక్కటి జంటలు. శారద కూడా పెద్ద పట్టు చీర, మెడనిండా నగలతో నిండుగా ఉంది. శారద భర్త సూట్ లో దర్జాగా ఉన్నాడు. పోనీలే ఆర్ధికంగా బాగానే ఉన్నారు అనుకున్నా. కానీ ఎందుకో నాకు శారదని చూస్తుంటే మాత్రం మనసంతా జాలితో నిండిపోసాగింది.

మా భోజనాలు అయాక బాబు లేస్తే వాడిని ఎత్తుకుని అటూ, ఇటూ తిప్పుతూ బేబీ ఫుడ్ తినిపించడం, వాడి డైపర్స్ మార్చడం, వాడిని ఆడించడం, మళ్ళీ అందరూ వచ్చే వేళ అయింది స్నాక్స్ చేయాలి అని హడావుడి  పడడం చూస్తుంటే గానుగెద్దు బతుకు అంటే ఇదేగా అనిపించింది.

“రేపు మనిద్దరం అలా ఎటన్నా వెళ్లి తిరిగొద్దాం వీళ్ళమ్మని లీవు పెట్టి కొడుకుని చూసుకోమను అన్నాను.” అలా అంటున్నప్పుడు నా స్వరంలో ధ్వనించిన కోపం పసిగట్టి పల్చగా నవ్వింది.

“ఏం నీ కోడలు అమ్మో లీవులు లేవత్తయ్యా అంటుందా” వెటకారంగా అడిగాను.

ఈ లోగా గేటు చప్పుడవడం, శారద కోడలు శరణ్య లోపలికి రావడం జరిగింది.

వస్తూనే ఆడుకుంటున్న కొడుకుని ఎత్తుకుని ముద్దు చేస్తూ “బుజ్జి తండ్రి నానమ్మని బాదర్ చేసావా... అల్లరి చేశావా..” అంటూ కాసేపు కబుర్లు చెప్పి కింద కూర్చోబెట్టి, ఫ్రెష్ అయి వచ్చింది.

“నా ఫ్రెండ్ శరణ్యా... మేమిద్దరం చిన్నప్పటి నుంచి పక్క, పక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. తను పి.హెచ్.డి చేసి లెక్చరర్ గా చేస్తోంది” అని పరిచయం చేసింది కోడలికి మంచి నీళ్ళు అందిస్తూ.

“నమస్తే ఆంటీ” చిరునవ్వుతో చేతులు జోడించి “మీరు ఎందుకత్తయ్యా ఇవ్వడం నేను తీసుకుంటా కదా” అంది శరణ్య.

“అబ్బో బానే వలకబోస్తోంది ప్రేమ, టి వి సీరియల్ లో కోడలి లాగా” అనుకున్నా.

“నువ్వు కూడా అలసిపోయి వచ్చావుగా” అంది శారద నవ్వుతూ.

“చాల్లెండి ... ఫ్యాన్ కింద కూర్చుని, పిల్లలతో కాసేపు కబుర్లు, కాసేపు పాఠాలు చెప్పి రావడం అలసిపోవడమా ... మీరు ఇంట్లో చేసే చాకిరీలో పదోవంతు పనుండదు నాకు. మీ ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకోండి.. నేను చూసుకుంటా మిగతా పని” అంది శరణ్య.

శారద నావైపు చూసి నవ్వింది. ఆ నవ్వులో భావం నాకర్ధం కాలేదు.. నన్ను వెక్కిరిస్తోందా?  అని కూడా అనిపించింది.

ఇంతలో శారద భర్త, కొడుకు కూడా వచ్చేశారు. ఐదున్నర కొట్టేసరికి అందరూ ఇల్లు చేరడం కొంచెం చిత్రంగానే అనిపించింది నాకు.

నన్ను చూడగానే వాళ్ళిద్దరూ చాలా ఆప్యాయంగా పలకరించారు..

కాసేపు నా ఉద్యోగ విషయాలు, బాబు కబుర్లు చెప్తుండగా శరణ్య నూడుల్స్ చేసి తీసుకొచ్చింది..

అందరూ అలా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, మధ్య, మధ్య బాబుతో ఆడుతూ నూడుల్స్ తిని, టీలు తాగాక నేను, శారద  వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కి బయలుదేరాం.

నాకెందుకో ఉదయం నుంచీ ఉన్న చికాకు, కోపం ఇప్పుడు లేవు.. ఆ స్థానంలో ఏదో వెలితి, ఏదో వేదన గుండె నిండా నిండినట్టు అనిపించింది. నా ఉద్యోగం, నా స్వేఛ్చ, నా ఎంజాయ్ మెంట్  శారద పొందుతున్న ఈ ఆనందం ముందు ఏ పాటి అనిపించింది.

“ఇప్పుడు చెప్పు నాది బానిస బతుకా!” చిరునవ్వుతో అడిగింది శారద..

ఏం  చెప్పను!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *